కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్ గాంధీ వాదనలో నిజమెంత? - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేధావి అరోరా
- హోదా, బీబీసీ డిసిన్ఫర్మేషన్ యూనిట్
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం బెంగళూరులో జరిగిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భారతదేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.
''మొన్నటి ఎన్నికల్లో మోదీ అవినీతిపై పోరాటం గురించి మాట్లాడారు. ఈ రోజు మోదీజీ కర్ణాటకకు వచ్చి అవినీతిపై పోరాటం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఆయన అవినీతి గురించి మాట్లాడితే కర్ణాటక మొత్తం నవ్వుతుంది'' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని 40 పర్సెంట్ ప్రభుత్వంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో మంత్రులు... కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లను డిమాండ్ చేస్తున్నారని రాహుల్ అన్నారు.
ఆ తర్వాత ట్విటర్, ఫేస్‌బుక్‌లో కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలే చేశారు. సోషల్ మీడియాలో రాహుల్‌గాంధీ చేసిన పోస్ట్‌లో ''40% కమీషన్ చెల్లించండి, లేకుంటే తప్పుకోండి'' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏది నిజం?
'భారతదేశంలో కర్ణాటక ప్రభుత్వమే అత్యంత అవినీతి ప్రభుత్వం' అంటూ రాహుల్ గాంధీ చేసిన వాదనపై బీబీసీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆయన వాదనకు ప్రభుత్వ డేటా నుంచి మద్దతు లేదని తేలింది.
భారతదేశంలో ప్రభుత్వ అవినీతికి సంబంధించిన డేటాను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సేకరిస్తుంది. ఈ డేటాను అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద సేకరిస్తుంది.
2020 సంవత్సరానికి సంబంధించిన ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, భారతదేశంలో అత్యధిక అవినీతి కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. శివసేన నేతృత్వంలోని మహారాష్ట్రలో 2020 సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టం కింద 618 కేసులు నమోదు అయ్యాయి.
అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు తేలింది. 2020 సంవత్సరంలో కర్ణాటకలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదు.

ఫొటో సోర్స్, TWITTER/INC
అవినీతిలో మహారాష్ట్ర ముందంజ
పాత ఎన్సీఆర్బీ డేటా కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. 2019లో 828 కేసులతో అవినీతిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అవినీతి కేసులు, అవినీతి రేటు రెండింటిలోనూ మహారాష్ట్ర ముందంజలో ఉంది. మరోవైపు కర్ణాటకలో 2019లో ఒకే ఒక్క అవినీతి కేసు నమోదైంది.
అయితే, అనధికారిక డేటాను పరిశీలిస్తే, భారతదేశంలోని అత్యంత అవినీతి రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. కాకపోతే అది జాబితాలో మొదటి స్థానంలో లేదు.
2019లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా, లోకల్ సర్కిల్స్ ద్వారా ఇండియా కరప్షన్ సర్వే నిర్వహించారు. ఇందులో 20 రాష్ట్రాలను చేర్చారు. అవినీతి ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఆరో స్థానంలో ఉందని సర్వేలో తేలింది.
కర్ణాటకలో 63 శాతం మంది పౌరులు తమ పని పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి సిద్ధమైనట్లు సర్వే వెల్లడించింది. రాజస్థాన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 78 శాతం మంది పౌరులు లంచం ఇచ్చినట్లు అంగీకరించారు.
కర్ణాటకలో అవినీతి అనేది ప్రధానమైన అంశంగా మారింది. రణదీప్ సింగ్ సూర్జేవాలా వంటి కాంగ్రెస్ నాయకులు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. పంజాబ్ విజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకపై కూడా కన్నేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కర్ణాటకలో అవినీతి గురించి ఆరోపణలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- ‘ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.759.. గుర్రపు బగ్గీలే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్.. మాంసం తినడం లగ్జరీ’
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- ‘ఇక్కడ కోర్సు చేస్తే ఏదో ఒక ఉపాధి దొరకడం ఖాయం.. పెద్దగా చదువుకోని గ్రామీణ యువతకు ఇది మంచి అవకాశం’
- హైదరాబాద్ డ్రగ్స్ కేసులు: ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, డ్రగ్స్ తీసుకున్న వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










