ఫిన్‌సెన్ ఫైల్స్‌లో కేవీపీ రామచంద్రరావు పేరు ఎందుకుంది? అమెరికాలో ఆయనపై నమోదైన కేసు ఏమిటి?

ఫొటో సోర్స్, fb/KVP Ramachandra Rao
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతర్జాతీయంగా నేరస్థులు మనీ లాండరింగ్‌కు ఎలా పాల్పడ్డారన్న వివరాలు తాజాగా లీకైన 'ఫిన్‌సెన్ ఫైల్స్'లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పేరు కూడా ఈ ఫైల్స్‌లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోకముందు కేవీపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.
నిజానికి మనీ లాండరింగ్ వ్యవహారమై కేవీపీపై 2014లోనే కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఖనిజం తవ్వకాలకు అనుమతుల కోసం అప్పట్లో ఓ విదేశీ సంస్థ ప్రయత్నించింది. అనుమతుల కోసం ఆ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని పలువురు అధికారులకు లంచంగా ఇవ్వచూపిన సొమ్మును అమెరికాలోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి వ్యాపార అవసరాల కోసం అని చెప్పి అక్రమంగా తరలించారని అమెరికా న్యాయ శాఖ కేసు నమోదు చేసింది.
మొత్తం ఒక కోటీ 85 లక్షల డాలర్ల సొమ్ము కోసం ఒప్పందాలు జరిగాయని అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఆరోపించింది.
టైటానియం తవ్వకాల అనుమతుల కోసం 2006-10ల మధ్య ఒక కోటీ 5లక్షల డాలర్లకు సంబంధించి 57 లావాదేవీలు జరిగాయని అమెరికా కోర్టు సమాచారంలో ఉంది. ఈ కేసులో కేవీపీ రామచంద్రరావుతో పాటూ, ఉక్రెయిన్ దేశానికి చెందిన దిమిత్రీ, శ్రీలంకకు చెందిన పెరియసామి అనే వ్యక్తులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఎలా బయటపడింది?
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో 2014 మార్చిలో దిమిత్రీ ఫిర్తాష్ అనే ఒక ఉక్రెయిన్ వ్యాపారిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యాడు. దిమిత్రీకి గ్రూప్ డీఎఫ్ పేరుతో కంపెనీలు ఉన్నాయి.
2006 ఏప్రిల్‌లో డీఎఫ్ గ్రూపుకు చెందిన కంపెనీల్లో ఒకటైన బొతిల్ ట్రేడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ సంస్థ కలసి ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఇల్మినైట్ ఖనిజాన్ని తవ్వాలనేది ప్రతిపాదన. ఈ ఇల్మినైట్ ఖనిజం ద్వారా టైటానియం ఉత్పత్తులు తయారు చేస్తారు. ముఖ్యంగా టైటానియం ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే సమయంలో టైటానియం స్పాంజ్ వస్తుంది.

2007 ఫిబ్రవరిలో డీఎఫ్ గ్రూపు షికాగో నగరానికి చెందిన ఒక సంస్థతో ఈ ఖనిజం సరఫరా చేసే ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఆ ఒప్పందం ఖరారైతే, ఏడాదికి 50 లక్షల నుంచి కోటీ 20 లక్షల పౌండ్ల వరకూ విలువైన టైటానియం స్పాంజ్‌ను భారత్ నుంచి సరఫరా చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయి.
అయితే, ఈ ఖనిజం తవ్వాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాలి. ఈ అనుమతుల కోసం లంచాలు ఇవ్వడానికి లక్షలాది డాలర్లను అమెరికా ఆర్థిక సంస్థల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారన్నది ఆరోపణ.
దిమిత్రీ అనే వ్యక్తి పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర రెడ్డిని కూడా కలిసినట్టు అమెరికా అధికారుల ఆరోపణల్లో ఉంది. మొత్తం పనికి దిమిత్రీ కీలక సూత్రధారి. పెరియసామి కీలకవ్యక్తి. పెరియసామి, కేవీపీ కలిసి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో, ఏయే అకౌంట్ల ద్వారా చేరవేయాలో నిర్ణయించారని అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
భారత్‌లో లంచంగా ఇవ్వాల్సిన డబ్బును వ్యాపారం నిమిత్తం పంపుతున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని దిమిత్రీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 మే - 2009 ఫిబ్రవరి మధ్య సిప్రస్‌లోని ఒక బ్యాంకు ద్వారా దిమిత్రీకి చెందిన బొతిల్ ట్రేడ్ సంస్థ, కేవీపీ రామచంద్రరావు, రోమ్ టెక్స్ కంపెనీ లిమిటెడ్‌ల మధ్య లావాదేవీలు జరిగాయన్నది అమెరికా అధికారుల ఆరోపణ. అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకి ఈ కేసు వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడెలా బయటకు వచ్చింది?
ఈ కేసు గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2014లోనే విషయం బయటకు వచ్చింది. కానీ తాజాగా మరోసారి ఈ విషయం చర్చనీయమైంది.
వికీ లీక్స్ తరహాలో తాజాగా ఆర్థిక కుంభకోణాలకు సంబంధించి ఫిన్‌సెన్ ఫైల్స్ బయటకురావడం సంచలనమైంది.
భారత్‌లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నట్లు అమెరికాలో ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్సుమెంట్ నెట్‌వర్క్ (ఫిన్‌సెన్) ఉంటుంది. ఇది మనీలాండరింగ్ కార్యకాలపాలపై విచారణ జరుపుతుంది.
అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు ఇదివరకు ఫిన్‌సెన్‌కు సమర్పించిన రహస్య పత్రాలు తాజాగా లీక్ అయ్యాయి. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ వీటిని బయటపెట్టింది. ఐసీఐజేతో బీబీసీ కూడా కలిసి పనిచేస్తోంది.
ఫిన్‌సెన్ ఫైల్స్‌లో దాదాపు రెండున్నర వేల పత్రాలు ఉన్నాయి. నేరస్థులను పెద్ద బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలను ఎలా చేసుకోనిచ్చాయన్న వివరాలు వాటిలో వెలుగుచూశాయి.
ఆ పత్రాల్లో దిమిత్రీ ఫిర్తాష్ గురించిన పత్రాల్లో కేవీపీ రామచంద్రరావు పేరుతో పాటూ కొన్ని భారతీయ సంస్థలు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి.
కేవీపీపై చర్యలు లేవా?
ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు అమెరికా దేశస్థులు కాకపోవడంతో, అక్కడి నేర విచారణ సంస్థ భారత్‌లోని సీబీఐని సంప్రదించింది.
ఈ కేసు సంగతి చూడాలని సీబీఐ ఆంధ్రప్రదేశ్ సీఐడీకి చెప్పింది. అయితే, కేవీపీని విచారణకు తమ దేశం పంపాలని మాత్రం అమెరికా కోరలేదు. మరోవైపు, కేవీపీపై ఇంటర్ పోల్‌లో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.
దీంతో 2014 ఏప్రిల్ 28న కేవీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లి తనపై ఎటువంటి చర్యా తీసుకోకుండా స్టే తెచ్చుకున్నారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా వెనక్కు తీసుకుంది. ఆ తరువాత ఇక కేసులో ఎలాంటి పురోగతీ లేదు, విచారణా జరగలేదు.
తరువాత దిమిత్రీకి కూడా అమెరికాలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదు.
టైటానియం అనుమతుల విషయం ముందుకు వెళ్లలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బొతిల్ కంపెనీతో 2006లో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, అన్ని అనుమతులు వెనక్కి తీసుకుంది.

కేవీపీ బీబీసీతో ఏమన్నారు?
ఈ ఆరోపణలపై కేవీపీ రామచంద్ర రావు బీబీసీతో మాట్లాడారు. అవి పూర్తిగా అసత్యాలని అన్నారు:
"అమెరికా న్యాయ విభాగం ఒక కేసులో కొందరితో పాటూ నా పేరు కూడా ప్రస్తావించింది. ఆ తరువాతే, టైటానియం లైసెన్సుల వివాదం గురించి నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. అయితే ఆ లైసెన్సుల మంజూరువిషయంలో కానీ ఆ లావాదేవీల్లో కానీ నా పాత్ర ఏమీలేదు. అందులో నా పేరు వాడడం పూర్తిగా, వాస్తవాలను తెలుసుకోకుండా చేస్తున్న పని. అసత్య ఆరోపణలు, తప్పుదోవ పట్టించే నివేదికల ఆధారంగా నాపై అభియోగాలు మోపారని కచ్చితంగా చెప్పగలను.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు ఎందరో నన్ను కలుస్తారు. అందర్నీ గుర్తుంచుకోలేం. కానీ, ఈ వ్యవహారం తెలిసిన తరువాత, నాకై నేను అందులో పేర్కొన్న వ్యక్తులను కలుసుకున్నానా అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను కానీ, విఫలం అయ్యాను. అయితే నేనొకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను ఎన్నడూ ఏపీ ప్రభుత్వంలో మైనింగు లైసెన్సుల వ్యవహారాలు చూడలేదు. మైనిగు లైసెన్సుల గురించి నాతో ఎవరూ మాట్లాడలేదు.
నాకు బొతిల్ ట్రేడ్ అనే సంస్థ నుంచి ఎప్పూడ డబ్బు అందలేదు. ఆ మాటకొస్తే నాకు ఏ విదేశీ బ్యాంకులో కానీ, విదేశాల్లోని బ్యాంకుల్లో కానీ నా జీవితంలో ఎప్పుడూ ఖాతా లేదు.
ఇది తప్పుడు ఆరోపణలతో వచ్చిన కేసు కావడంతో నేను హైకోర్టుకు వెళ్లక తప్పలేదు. దీంతో హైకోర్టు వారు కేసులో తదుపరి చర్యలపై స్టే ఇచ్చి, సంబంధిత పార్టీలకు నోటీసులు ఇచ్చారు.
అసలు ఈ విషయం తెలిశాక, నేను ఆశ్చర్యపోయాను. దాంతో పాటూ అసలు ఆ బొతిల్ ట్రేడ్ ఏజీ అనే కంపెనీకి ఏపీ ప్రభుత్వానికీ మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగాయా అని నేనే ఆరా తీశాను. తరువాత తెలిసింది ఏమంటే, ఆ సంస్థకు ఏపీ మినరల్ డవలెప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదిరిందనీ, తరువాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకందనీ నాకు తెలిసింది."
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








