వైఎస్ జగన్: ఏపీ మంత్రుల రాజీనామా, కొత్త క్యాబినెట్‌లో కుల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?

ఫొటో సోర్స్, I&PR
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైంది. పలు అంశాలపై చర్చ జరిగింది. ఆ తరువాత రాజకీయ పరిణామాలను కూడా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలోనే తీసుకున్న నిర్ణయంలో భాగంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నట్టు తెలిపారు. దానికి అనుగుణంగా మొత్తం మంత్రులంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుందని కోరారు.
దాంతో ఇప్పటికే అందుకు సిద్ధమైన మంత్రులు తమ రాజీనామా పత్రాలు సీఎంకి అందించారు. మంత్రివర్గంలోని వారంతా రాజీనామాలు సమర్పించారు.
11వ తేదీన కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. 10వ తేదీన అధికారికంగా కొత్త మంత్రుల పేర్లు వెల్లడించబోతున్నారు.
మంత్రుల రాజీనామా పత్రాలను జేఏడీ అధికారులు రాజ్ భవన్‌కు తరలించారు. ప్రత్యేక వాహనాల్లో వాటిని తీసుకెళ్లారు. రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర పడిన తర్వాత ఏపీ క్యాబినెట్ మంత్రులంతా మాజీలవుతారు.
ఇప్పటికే పలువురు మంత్రులు తమ అధికారిక వాహనాలను సమావేశం తర్వాత సెక్రటేరియేట్‌లోనే వదిలి వెళ్లారు.
'క్యాబినెట్ మంత్రులందరి నుంచి రాజీనామాలు తీసుకున్నారు. మేమంతా సంతోషంగా రాజీనామాలు చేశాం. మాకు ముందే రెండున్నరేళ్లని చెప్పారు. కాబట్టి ఎవరికీ బాధ లేదు. కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం 11న ఉంటుంది. కొత్త మంత్రుల గురించి మాకు చెప్పలేదు. కొంతమందిని కొనసాగిస్తానని మాత్రం అన్నారు. అందులో ఎవరుంటారో తెలియదు. మంత్రివర్గం రాజీనామా గురించి ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు' అంటూ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరామ్ అన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన బీసీ బోయ కులానికి చెందిన జయరామ్ ని కొనసాగించేందుకు అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన కూడా బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, I & PR
'కొత్త క్యాబినెట్‌లో కుల సమీకరణాలకు ప్రాధాన్యత'
సచివాలయం వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం కొత్త క్యాబినెట్‌లో కుల సమీకరణాలకు ప్రాధాన్యత ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు.
ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో నలుగురు చొప్పున రెడ్లు, కాపులు ఉన్నారు. ఈ రెండు కులాలకు ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నారు. ఒక్కోటి తగ్గించి, మూడేసి బెర్తులు వారికి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీసీలు ప్రస్తుతం ఆరుగురు ఉండగా వారి సంఖ్య 8కి పెరిగే సంకేతాలు వెలువడ్డాయి.
ఎస్సీలు కూడా ప్రస్తుతం ఐదుగురు మంత్రివర్గంలో ఉంటే కొత్త క్యాబినెట్‌లో ఆ సంఖ్య అరుకి పెంచబోతున్నారు. మాల, మాదిగ కులాలకు మూడేసి బెర్తులు దక్కబోతున్నాయి.
రాజీనామా చేసిన వారిలో ముగ్గురు మహిళలు మంత్రులుగా ఉన్నారు. వారి స్థానంలో కొత్తగా ముగ్గురికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల మహిళలకు చోటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఎస్టీ తెగల నుంచి ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. కొత్త క్యాబినెట్‌లో వారి సంఖ్య రెండుకి పెంచే అవకాశం కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు క్యాబినెట్ బెర్తులు అదనంగా కేటాయించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా కొనసాగించబోతున్నారు. కొత్త మంత్రివర్గంలో కమ్మ, వైశ్య క్షత్రియ వంటి కులాలకు చోటు దక్కే అవకాశం లేదనే అభిప్రాయం కూడా ఉంది.
ప్రస్తుత క్యాబినెట్ ఆయా కులాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. రాబోయే టీమ్‌లో ఆ కులాల వారు ఉండరనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా కమ్మ కులస్తులకు చోటు లేకుండా మంత్రివర్గం లేదు. కాబట్టి కొత్త క్యాబినెట్‌లో కమ్మ కులస్తులకు చోటు దక్కకపోతే దాన్ని కీలక పరిణామంగా భావించాలి.

ఫొటో సోర్స్, I & PR
ఈసారి క్యాబినెట్ సమావేశం భిన్నమైన వాతావరణంలో జరిగింది. అందరూ రాజీనామాలు సమర్పించాల్సిన తరుణంలో కొందరు మంత్రులు సంబంధిత శాఖ సిబ్బందితో గెట్ టు గెదర్ ఏర్పాటుచేశారు.
సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని తన శాఖ అధికారులు, సిబ్బందితో పాటుగా విలేఖరులకు విందు ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రస్తుత క్యాబినెట్‌లో ఉన్న సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు వంటి నేతలను ఇతర మంత్రులు అభినందించారు. పూర్తికాలం పదవీ అవకాశం దక్కించుకున్నారంటూ శుభాకాంక్షలు చెప్పారు.

ఫొటో సోర్స్, I & PR
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
మరోవైపు, ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ మిల్లెట్ మిషన్ ప్రాజెక్ట్‌కి ఆమోదం
ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణలకు ఆమోదం
ఐదు జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణానికి భూముల కేటాయింపునకు ఆమోదం
కొత్త రెవెన్యూ డివిజన్లకి ఆమోదం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- 'ఈ మనిషితో నేను ఎందుకు ఉండలేకపోయానంటే...' - ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్
- యుక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకు ఎంత ఖర్చవుతోంది?
- ఒక అనాథ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








