Kpop: కొరియన్ పాప్‌ సింగర్లు భారతీయ సంగీతాన్ని ఎందుకు కోరుకుంటున్నారు?

అశ్విన్ భాస్కర్ - కే-పాప్ స్టార్ అలెక్సా

ఫొటో సోర్స్, Ashwin Bhaskar

ఫొటో క్యాప్షన్, అశ్విన్ భాస్కర్ - కే-పాప్ స్టార్ అలెక్సా
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

90లలో బాలీవుడ్ పాటలు తెలిసిన వారెవరికైనా షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన 'దిల్ తో పాగల్ హై' సినిమాలో 'అరె రే అరె' ట్యూన్ గుర్తుండిపోతుంది. ఇది అప్పట్లో చాలా హిట్ అయిన ట్యూన్.

మరి ఇదే ట్యూన్‌ని పాప్ బాయ్ బాండ్స్ సృష్టించిన పాటలో వినిపిస్తే సంగీతాభిమానులు దానిని వినకుండా ఎలా ఉండగలరు.

గత సంవత్సరం ఎన్‌సీటీ-127 కే-పాప్ బాయ్ బాండ్ 'ఫేవరెట్' అనే పాటకు టీజర్ విడుదల చేశారు. ఎన్‌సీటీ 127 ప్రపంచంలోనే పేరుపొందిన కే-పాప్ బాయ్ బ్యాండ్‌లలో ఒకటి.

ఎన్‌సీటీ-127 బృందం హిందీ పాటలో వినిపించే విజిల్ శబ్దాన్ని ఎలక్ట్రానిక్ విజిల్‌గా మార్చి తమ పాటలో కొంత శాంపిల్‌గా చేర్చారు.

"అరె రే నుంచి కాస్త భిన్నంగా ఉండేందుకు మెలొడీని కూడా కొంతవరకు మార్చారు. హిప్ హాప్ కళాకారులు ఇదే రీతిలో తమ బాణీలను మార్చి రూపొందిస్తూ ఉంటారు" అని కొరియా సంగీత పరిశ్రమను అనుసరిస్తున్న అన్షుమాన్ శర్మ చెప్పారు.

ర్యాప్, హిప్ హాప్, ఆర్ & బి, ట్రాప్ కే-పాప్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పరిశ్రమలో ఎప్పటి నుంచో నల్ల జాతి మ్యూజిక్ కళాకారులు భాగంగా ఉన్నారు. కానీ, ఎన్‌సీటీ 127 రూపొందించిన 'ఫేవరెట్' ఆల్బమ్ అమ్మకాల కోసం మార్కెట్‌లోకి విడుదలవ్వక ముందే 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయింది. కొరియా పాప్ సంగీతం పై భారతీయ సంగీత ప్రభావానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ఎన్‌సీటీ-127 బృందం

ఫొటో సోర్స్, SM Entertainment

ఫొటో క్యాప్షన్, ఎన్‌సీటీ-127 బృందం

గత కొన్నేళ్లుగా కే-పాప్ సంగీతానికి బాలీవుడ్ సంగీతానికి మధ్య సారూప్యతను భారతీయ సంగీత అభిమానులు గుర్తించడం మొదలుపెట్టారు. ఒకే రకమైన ట్యూన్లతో ఉన్న పాటలను ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ అభిమానం ఒకరికొకరు సహకారం అందించుకునే స్థాయి వరకూ వెళ్ళింది.

కొన్నేళ్ల క్రితం చాలా మంది భారతీయ సంగీత నిర్మాతలు, డైరెక్టర్లు నేరుగా కే-పాప్ పాటలను కాపీ కొట్టేవారు. కానీ, రానురాను ఈ కాపీ కొట్టే పంథా నుంచి కాస్త పక్కకు తప్పుకున్నారు" అని రోలింగ్ స్టోన్ ఇండియాలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్న రిద్ధి చక్రవర్తి అన్నారు.

భారతీయ కనెక్షన్

కే-పాప్‌కి తొలి అభిమానులు తూర్పు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మొదలయ్యారు. ఆ ప్రాంతంలో తిరుగుబాటు దారులు బాలీవుడ్ సినిమాల పై నిషేధం విధించడంతో కొరియా డ్రామాలు, కే-పాప్‌కు ఆదరణ లభించడం మొదలయింది.

అప్పటి నుంచి ఈ తరహా సంగీతం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం మొదలయింది. ఇది మొదలయిన తొలినాళ్లలో ఒక దశాబ్దం క్రితం 100 మంది కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఈ సంగీతానికి కొన్ని వేల మంది ఆకర్షితులవుతున్నారు.

స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ల పై పాటలను కొన్ని లక్షల మంది వింటున్నారు. 2020లో సూపర్ స్టార్ బ్యాండ్ బీటీఎస్ కొరియోగ్రాఫ్ చేసిన బాయ్ విత్ లవ్ బాలీవుడ్ హిట్ పాట చునరి, చునరీ పాటను మేళవించి చేసిన మాష్ అప్ వైరల్‌గా మారింది.

అప్పు కృష్ణన్

ఫొటో సోర్స్, Appu Krishnan

ఫొటో క్యాప్షన్, అప్పు కృష్ణన్

అప్పు కృష్ణన్, తుషార్ ఆప్టే లాంటి భారతీయ సంగీత నిర్మాతలు కూడా కొన్ని పెద్ద కే-పాప్ బ్యాండ్‌లతో కోలాబొరేట్ అయ్యారు.

"ఇరు దేశాల్లోనూ ఉన్న సంగీత శ్రేణిని కళాకారులు కనుగొంటున్నారు" అని కే-పాప్ గురించి రాసిన తొలి జర్నలిస్టులలో ఒకరైన చక్రవర్తి అన్నారు.

ఆమె 2019లో రోలింగ్ స్టోన్ ఇండియాలో ఒక సిరీస్ మొదలుపెట్టారు. ఆ సిరీస్‌లో భారతదేశంలో స్వతంత్ర సంగీత కళాకారులు పాడిన పాటలకు కే-పాప్ స్టార్స్ స్పందించారు.

"వారు ఒకరి గురించొకరు తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది" అని ఆమె అన్నారు. "ఓహ్! భారతదేశంలో ఇలా కూడా ఉంటుందని తెలియదు అని కే-పాప్ స్టార్ అన్నప్పుడు, భారతీయ కళాకారులు తమ సంగీతానికి స్పందించిన కే-పాప్ స్టార్ ఎవరో తెలుసుకోవాలని ఉత్సాహం చూపించారు" అని చెప్పారు.

భారతీయ పాటల రచయత, గాయకుడు అర్మాన్ మల్లిక్ కూడా కొరియన్-అమెరికన్ కళాకారుడు ఎరిక్ నామ్ ను 2021లో కలుసుకున్నారు. వారు స్వరపరిచిన ఇకో పాటలో ఇండియన్ అమెరికన్ సంగీతకారుడు కేఎస్ హెచ్ ఎమ్ ఆర్ కనిపించనున్నారు. ఇది మల్లిక్ ఇంగ్లీష్ లో చేసిన తొలి సింగిల్ పాట. ఇండియన్ కే-పాప్ కళాకారుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి కోలాబొరేషన్ లో ఇదే మొదటిది. గత సంవత్సరం వర్చువల్ గా జరిగిన కే-పాప్ కాన్సర్ట్ లో కూడా ఆయన పాల్గొన్నారు.

ఇండియా, కొరియాలలో పాటలు రాసే పరిశ్రమ మధ్య పోలికలు ఉన్నాయని నామ్ మల్లిక్ తో మాట్లాడుతూ అన్నారు.

"ఇరు దేశాల్లోనూ, సంగీతం స్వరపర్చడం, పాటలు రాయడం నిపుణులు చేసే పని" అని అన్నారు.

అమెరికాలో ఇది చాలా తేలికగా జరిగిపోతూ ఉంటుందని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

స్ఫూర్తి నుంచి సహకారం వరకూ

ఫిబ్రవరిలో కే-పాప్ స్టార్ అలెక్సా లేబెల్ భారతదేశంలో స్వతంత్ర సంగీతకారుడు అశ్విన్ భాస్కర్ ను సంప్రదించారు. ఆమె పాట టాటూ కి ఆయన సహకరిస్తారేమోనని అడిగారు.

ఆయన అందుకు అంగీకరించారు. కానీ, ఈ ఇద్దరు కళాకారులు ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. కానీ, వారిద్దరూ పాటను ప్రొడ్యూస్ చేసేందుకు ఒక నెల రోజుల పాటు మ్యూజిక్ ఫైల్స్‌ను ఈ-మెయిల్ చేసుకున్నారు.

భారత్‌లో కే-పాప్ అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో కే-పాప్ అభిమానులు

"ఇదంతా ఇంటర్నెట్ పైనే చేశాం. భవిష్యత్తులో మ్యూజిక్ కోలాబొరేషన్లు జరుగుతాయనే స్థితిలో మనం ఇప్పటికే గడుపుతున్నాం" అని భాస్కర్ అన్నారు.

2020లో కే-ప్ స్టార్ వెంగీ భారతీయ కళాకారులు షల్మలీ, ఇకాతో కలిసి పని చేశారు. ఆమె పాట 'సింగిల్ థింగ్ యూ వాంట్' అనే ట్రాక్ లో పంజాబీ బాంగ్రాను మేళవించారు.

"భారతీయ మెలడీ పాటల మాదిరిగా కే-పాప్ మెలడీలు కూడా సంగీతపరంగా సంక్లిష్టంగా ఉంటాయి" అని శర్మ చెప్పారు.

"కే-పాప్‌లో చాలా వరకూ భారతీయ సంగీత వాద్యాలైన తబలా లాంటివి వినిపిస్తూ ఉంటాయి" అని చెప్పారు.

మృదువుగా సాగే వేణుగానం. తబలా ధ్వని కే-పాప్ సాంగ్ లో వినిపిస్తుందా? "అవును. మేము వాడే పాటకు అది పొంతన కుదిరితే వాడతాం" అని కే-పాప్ బ్యాండ్ లతో పని చేసిన కృష్ణన్ చెప్పారు.

"కానీ, ఈ స్ఫూర్తి పాటను సేకరిస్తున్న మూలానికి గౌరవం ఇవ్వాలి" అని చక్రవర్తి అంటారు.

కే-పాప్ బ్యాండ్ బ్లాక్ పింక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కే-పాప్ బ్యాండ్ బ్లాక్ పింక్

2016లో జాత్యహంకారంతో కూడిన లిరిక్స్ ఉన్నాయని అంటూ భారతీయ సంగీత అభిమానులు కే-పాప్ బ్యాండ్ ఓహ్ మై గర్ల్ ను విమర్శించారు.

"పాట మూలాలకు గౌరవాన్నిస్తూ, మీరేమి చేస్తున్నారో అవగాహన ఉంటే మీ అధ్యయనం పూర్తయినట్లే" అని ఆమె అంటారు.

ఉదాహరణకు అలెక్సా డెబ్యూ మ్యూజిక్ వీడియోలో ఆమె భారతీయ అభిమానుల కోసం హిందీ పదం సంసార్‌ను (విశ్వం) చేర్చారు.

ప్రస్తుతం కే-పాప్ పరిశ్రమ కూడా విమర్శలకు స్పందిస్తోందని అంటున్నారు.

ఉదాహరణకు బ్లాక్ పింక్ అనే గ్రూప్ 2020లో చేసిన 'హౌ యూ లైక్ థట్' అనే వీడియోలో ప్రాప్‌గా వాడిన హిందూ దేముడు గణపతిని తొలగించారు.

"రకరకాల బాణీల మేళవింపుతో, సంగీత నిర్మాతలు ఒక మెలడీని కాపీ కొట్టడానికి మాత్రమే కాకుండా, ఆ పాటలో ఉన్న మూడ్‌ని, శక్తిని పట్టుకునేందుకు చూస్తున్నారు" అని కృష్ణన్ చెప్పారు.

ఉదాహరణకు, మనం పంజాబీ డాన్స్ పాటను విని ఆ పాట భావాన్ని అర్ధం చేసుకోగలం. దాని ఆధారంగా మన కళాకారులకు, బాణీకి సరిపోయే పాటను రాయగలం. అలా పుట్టిన పాట కాపీ కొట్టిన పాటలా కాకుండా ఒరిజినల్ మాదిరిగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.