ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒంగోలులో ముఖ్యమంత్రి పర్యటనలో కారు అవసరమై ఒక కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చలేపింది. అసలు సీఎం పర్యటనకు సామాన్యుల కార్లు ఎందుకు అనే ప్రశ్నతో పాటూ, సీఎంకు కార్లే లేని పరిస్థితి వచ్చిందా అనే విపక్షాల విమర్శల వరకూ చాలా చర్చ నడుస్తోంది.
ఇంతకీ ముఖ్యమంత్రీ, మంత్రుల పర్యటనలకు ప్రభుత్వం కార్లు ఇస్తుందా? ఇలా జనాల నుంచి కార్లు లాక్కుంటారా? అసలు ఈ ఖర్చు ఎవరు పెడతారు?
ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు వారి కోసం రాష్ట్ర రాజధానులు అంటే హైదరాబాద్, అమరావతి వంటి చోట్ల మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తరచూ తాకిడి ఉండే తిరుపతి వంటి చోట్ల కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తారు.
కానీ మిగిలిన చోట్ల అలాంటి శాశ్వత ఏర్పాట్లేమీ ఉండవు. దీంతో ఆయా పర్యటనల సమయంలో తాత్కాలికంగా వాహనాల ఏర్పాటు ఉంటుంది.

ఫొటో సోర్స్, facebook/ysjagan
90ల నుంచి మారింది..
ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన కారు రాజధానిలో ఎప్పుడూ ఉంటుంది. కానీ జిల్లా పర్యటనల్లో మాత్రం ఒకప్పుడు స్థానికంగా ఉండే నాయకులు, లేదా వ్యాపారవేత్తలు, ఇతర పెద్దల దగ్గర నుంచి తీసుకుని వాడేవారు. 90ల నుంచీ ఈ పరిస్థితి మారింది. ముఖ్యమంత్రికి హైదరాబాద్‌లో ఉండే కార్లకు అదనంగా మరో సెట్ కార్లను సిద్ధం చేయడం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లే ప్రాంతానికి ముందుగానే ఆ వాహనాలను పంపుతారు. సీఎం హెలికాప్టర్‌లో దిగగానే ఆ బండ్లు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యమంత్రి పర్యటన తరవాత వాటిని తిరిగి రాజధానికి తరలిస్తారు. ఈ బండ్లన్నీ ముఖ్యమంత్రి భద్రత చూసే పోలీసుల అదుపులో ఉంటాయి. వాటి ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుంది.
అయితే ఆ కార్లలో ముఖ్యమంత్రి, అనుమతి ఉన్న కొందరు తప్ప ఇతరులు ప్రయాణించే అవకాశం లేదు. కానీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆ జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాల నుంచి మంత్రులు, అధికారులు, రాజధాని నుంచి అధికారులు అందరూ వస్తారు. వారందరికీ కార్లు కావాలి. పర్యటన ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లా యంత్రాంగమే అక్కడ కార్లు సిద్ధం చేయాలి. సరిగ్గా ఇక్కడే వస్తోంది సమస్య.
‘‘ఒకప్పుడు ఈ కార్ల కోసం స్థానికంగా ఉండే పెద్దలను, వ్యాపారవేత్తలనూ, ఫాక్టరీల వాళ్లనూ అడిగి తీసుకునేవారు. ట్రావెల్స్ నుంచి కూడా తీసుకునేవారు. క్రమంగా అలా ఇచ్చే వారి సంఖ్య తగ్గే సరికి, కార్ల సేకరణ బాధ్యత రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు పోలీసులు, రెవెన్యూ వాళ్లు. ట్రావెల్స్ నుంచి తగినన్ని కార్లు దొరికితే సరే సరి. లేకపోతే రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చేసి, బండ్లను సీజ్ చేసి ముఖ్యమంత్రి పర్యటనకు వాడుకుని తరువాత వదిలేస్తారు’’ అని చెప్పారు రవాణా శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఒక సీనియర్ ఉద్యోగి.

ఫొటో సోర్స్, Getty Images
చాలా జరుగుతాయా?
ఒంగోలులో ఇప్పుడు జరిగిన ఘటనలు వంటివి అరుదుగా జరుగుతాయని కొందరు అభిప్రాయపడుతుంటే, ఆ ప్రాంతంలో అది మామూలే అన్న వారూ ఉన్నారు.
‘‘నిన్న ఒంగోలులో జరిగినవి చాలా జరుగుతాయి. పార్టీలతో సంబంధం లేదు. ఆ సమయానికి వెహికల్స్ ఎక్కడ బడితే అక్కడ ఆపి పాసింజర్లను దించి వెహికల్‌తోపాటు డ్రైవర్లను పట్టుకు వెళతారు. బయటి నుంచి వచ్చే సెక్యూరిటీ సిబ్బందికి వాహనాలు కావాలి. ఆఫీసర్లుకు కార్లు పెట్టాలి. వీటిని సమకూర్చే బాధ్యత ఆర్టీవో వాళ్లది. చిత్రం ఏంటంటే ఏదో ఒక బండితో సర్దుకుపోరు. ఫలానా మోడల్ కావాలని కూడా ఇండెంట్ పెడతారు కొందరు అధికారులు. నాలుగు సీటర్లు ఇన్ని కావాలి, ఆరు సీటర్లు ఇన్ని కావాలి అని చెబుతారు. ఐజీ, డీఐజీ స్థాయి వాళ్లు ఊళ్లో దిగుతారు. కాబట్టి వారికీ కార్లు అవసరమే. లోకల్ మంత్రుల పర్యటనలకు కాదు కానీ, బయటి మంత్రులు వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుంది’’ అని బీబీసీతో చెప్పారు ఒంగోలుకు చెందిన ఒక జర్నలిస్టు.
‘‘నేను 2017-18 ప్రాంతంలో మార్కాపురం నుంచి ఒంగోలు వస్తుంటే ఇలానే రవాణా శాఖ అధికారులు కార్లు ఆపారు. సీఎం పర్యటన కోసం బండి తీసుకుంటున్నాం. మీరు బస్‌లో వెళ్లండి అన్నారు. నేను అదేంటని ప్రశ్నించి రవాణా శాఖ ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడితే.. అవి సాధారణ తనిఖీలు తప్ప బండ్లు తీసుకోవడం లేదు అని చెప్పారు. నేను మీడియాలో పనిచేస్తా కాబట్టి ప్రశ్నించాను. ఆ క్షణం వాళ్లు తనిఖీలు ఆపేశారు. అది ముఖ్యమంత్రి పర్యటనకు సరిగ్గా మూడు రోజుల ముందు జరిగింది’’ అని తనకు జరిగిన అనుభవాన్ని వివరించారాయన.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త కార్లకు ప్రాధాన్యం..
అయితే ఈ విషయంలో ప్రాంతానికీ, ప్రాంతానికీ మధ్య తేడాలున్నాయి. తమ బండ్ల కూడా అలానే ఆపుతారని బీబీసీతో చెప్పిన ఒక ట్రావెల్ యజమాని, పాసింజర్లను దించేసి రావాల్సిందిగా సూచిస్తారని వివరించారు.
‘‘సీఎం కార్యక్రమాలు ఉంటే, మా బండ్లు రోడ్లపై తిరిగేప్పుడే రవాణా శాఖ వాళ్లు ఆపుతారు. ముఖ్యంగా ఇన్నోవా, క్రిస్టా వంటి బండ్లను ఆపుతారు. కష్టమర్లు ఉన్నప్పటికీ ఆపుతారు. అయితే కష్టమర్లను రోడ్లపై దించరు. కానీ మా బండ్ల రిజిస్ట్రేషన్లు, లైసెన్సు, ఇతర పత్రాలు తీసేసుకుంటారు. బండిలో ఉన్న కష్టమర్లను దించేసిన తరువాత తిరిగి ఫలానా చోటుకు రావాలని చెబుతారు. వీఐపీ ప్రోగ్రాములు ఉన్నాయి ఒకట్రెండు రోజులు తిరగాలని ముందే చెప్తారు. అలా తిరిగాకే మా బండి కాగితాలు మాకిస్తారు. ఆ రెండు రోజులకూ డ్రైవర్ భోజనాలకు రోజుకు రూ.300 ఇస్తారు. తిరిగే అవసరం బట్టి 50 లీటర్ల వరకూ డీజిల్ పోయిస్తారు. కూపన్ ఇచ్చి ఫలానా బంకులో పెట్రోల్ కొట్టించుకోండి అని చెబుతారు. మేం అలాగే చేసి, వారి చెప్పినచోటుకు తిరుగుతాం. మాకు అయితే వాళ్లు డబ్బులు ఇస్తారు. కాకపోతే కొందరు ఆలస్యం చేస్తారు. నిజానికి గతంలో ట్రావెల్స్ వాళ్లకు నేరుగా ఫోన్ చేసి బండ్లు అడిగేవాళ్లు పోలీసులు. బిల్లులు ఆలస్యం అవుతున్నాయని ట్రావెల్స్ వాళ్లు బండ్లు ఇవ్వకపోవడంతో, ఇలా రోడ్లపై కాపు కాసి బండ్లను తీసుకెళ్తున్నారు’’ అని వివరించారు విశాఖపట్నానికి చెందిన ఒక ట్రావెల్స్ వ్యాపారి.
ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా కాన్వాయ్‌లో వెళ్లడానికి అన్ని సౌకర్యాలూ ఉండి, ఏసీ పనిచేస్తోన్న, కొత్త కార్లు, హైఎండ్ కార్లనే తీసుకుంటారు. అయితే మిగతా వాహనాల అవసరం కూడా ఉంటుంది. కానిస్టేబుళ్లను రవాణా చేయడం కోసం టాటా ఏస్ పాసింజర్ల వాహనాల వంటివి కూడా సేకరిస్తారు.
‘‘ముఖ్యమంత్రి పర్యటనకు పెద్దయెత్తున పోలీసులు అవసరం. ఆ జిల్లాతో పాటూ, చుట్టు పక్క జిల్లాల నుంచీ కానిస్టేబుళ్లను పెద్ద సంఖ్యలో పిలిపిస్తారు. వారు తిరగడానికి రకరకాల బండ్లు కావాలి. సీఎం వెళ్లే దారి మొత్తం కాపలా కాయాలి. ఆ తరువాత సభ దగ్గర కాపలా ఉండాలి. ఈ పోలీసులందర్నీ తరలించడానికి, వారిపై సూపర్వైజ్ చేసే అధికారులకు కార్లు కావాలి. సరైన పద్ధతిలో సరిపడా కార్లు దొరకనప్పుడు చివరి మార్గంగా ఇలా రోడ్లపై బండ్లు ఆపి వాటిని తీసుకెళ్తారు. ఒంగోలులో జరిగింది మరీ దారుణం. అలా పాసింజర్లను రోడ్లపై దింపడం ఉండదు కానీ, బండ్లను ఆపి, కచ్చితంగా రావాలని వార్నింగ్ ఇవ్వడం లాంటిది ఉంటుంది. లేకపోతే పనులు జరగవు’’ అని బీబీసీతో చెప్పారు ఒక రిటైర్డ్ డీఎస్పీ.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. ఎక్కువగా అద్దె అడగకుండా ఉండే స్కూలు బస్సులు వంటివి తెప్పిస్తారు కూడా’’ అని వివరించారాయన.
‘‘పోలీసులు తమకు అవసరమైన బండ్లు కొన్నిసార్లు సొంతంగానూ, కొన్నిసార్లు ఆర్టీవో ద్వారానూ సమకూర్చుకుంటారు. చాలా సందర్భాల్లో డీజిల్ ఇచ్చి, కొంత డబ్బు ఇస్తారు. ప్రోటోకాల్ ఖర్చు కలెక్టరేట్ నుంచి వస్తుంది. వచ్చే వీఐపీని బట్టి అతనికి ఏ రకం వాహనాలు ఎన్ని వాడాలి అనే నిబంధనలు ఉంటాయి. ఇంటిలిజెన్స్ వారు చెప్పిన ప్రకారం ఏర్పాట్లు ఉంటాయి. ఆ బండ్లను ఆర్టీవో వారు సేకరించి, మళ్లీ వాటి ఫిట్‌నెస్ తనిఖీ చేసి అప్పుడు మాకు ఇస్తారు. గతంలో బాగా డబ్బున్న వాళ్లు, స్థానిక ఎమ్మెల్యేల వాహనాలు అడిగేవాళ్లం. తరువాత వాళ్లు ఇవ్వడం తగ్గించారు. ఇప్పడు ఆర్టీవో ద్వారానే ఎక్కువ సేకరిస్తున్నాం’’ అన్నారు రిటైర్డ్ ఎస్పీ శంకర రావు.
వీఐపీల పర్యటనల్లో అతి ముఖ్యమైన ఖర్చు, కార్యక్రమానికి ముందు జరిగే ఏర్పాట్లు. సీఎం సభ జరిగే రోజు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఆ సభకు మూడు రోజుల ముందు నుంచే వివిధ రకాల అధికారులు అక్కడ చేరతారు. సెక్యూరిటీ పర్యవేక్షణ చేస్తారు. వారందరికీ ఆ మూడు నాలుగు రోజులూ.. రూములూ, భోజనాలు, వసతి ఏర్పాటు చేయాలి. అదే పెద్ద ఖర్చు. ఈ ఖర్చుకు ప్రభుత్వం అధికారికంగా డబ్బు ఇవ్వదు. పోలీసు సిబ్బందికి టీఏ ఇచ్చినా అది చాలా నామమాత్రంగా ఉంటుంది. ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది. ఇక్కడే అవినీతి మొగ్గ తొడుగుతుంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చే డబ్బు వసతులు, ఖర్చులకు సరిపోక, వ్యాపారుల నుంచి వసూళ్లు చేస్తారు స్థానిక అధికారులు.
‘‘ముఖ్యమంత్రి పర్యటనల ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ల దగ్గర ఉండే ఫండ్‌లో నుంచి ఈ ఖర్చు తీస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయన పాల్గొనే పథకానికి సంబంధించిన శాఖ ఖర్చు పెడుతుంది. సీఎం ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి వస్తే ఆ ప్రైవేటు సంస్థ, లేదా రాజకీయంగా ఆసక్తి ఉన్న వ్యక్తులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా కలెక్టర్ ఫండ్‌తో అన్ని ఖర్చులూ పెట్టినా, ఆ భారం స్థానిక వ్యాపారుల మీద కూడా పడుతుంది. ఇది కాక కొందరు అధికారులు, పోలీసులు, చాలా సందర్భాల్లో ప్రభుత్వ డబ్బును తమ వద్ద ఉంచుకుని, స్థానిక వ్యాపారుల నుంచి ఉచిత సేవలు తీసుకుంటారు. ఇదంతా బహిరంగ రహస్యం. కొన్ని సందర్భాల్లో నిజాయితీపరులు కూడా అదనపు బిల్లులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే, చాలా సందర్భాల్లో కలెక్టర్లు ఇచ్చే ఫండ్ ఏ మూలకూ సరిపోదు. దీంతో అదనపు డబ్బు, వనరులు అవసరం పడతాయి. ఆ డబ్బును వాళ్లు వేరే చోట ఖర్చుపెడుతుంటారు’’ అని బీబీసీతో చెప్పారు రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన ఎం శ్రీనివాస్.
‘‘ముఖ్యమంత్రి సమావేశంలో టెంటుకు, బిల్లు ఇస్తారు. మంచినీళ్లు, మజ్జిగ, భోజనాల వంటి వాటి విషయంలో పెద్దయెత్తున అవినీతి జరుగుతుంది. దానికి లెక్క ఉండదు కదా. అలాగే రోడ్లు బాగు చేయడం, చెత్త శుభ్రం చేయడం, వంటివి హుటాహుటిన చేయిస్తారు. ఆ క్షణం పని అవగొడతారు. కానీ తరువాత బిల్లుల విషయంలో చాలా జరుగుతుంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి బండి అయినా తీసుకెళ్లొచ్చా?
నడి రోడ్డు మీద బండి ఆపి ఆ బండిని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకునే హక్కు రవాణా అధికారులకు ఉంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాకపోతే దానికి కొన్ని ప్రత్యేక సందర్భాలున్నాయి. ‘‘ప్రకృతి వైపరిత్యాలు, జాతీయ విపత్తులు, ఎన్నికలు - ఈ మూడు సందర్భాల్లో కమర్షియల్ బండ్లను ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవడానికి వీలుగా వాటి పర్మిట్లు ఇచ్చేప్పుడే నిబంధనలు పెడతారు. ఈ మూడు అవసరాలకూ కమర్షియల్ బండ్లు అందుబాటులో లేకపోతే అప్పుడు అవసరమైతే, వ్యక్తిగత వాహనాలు కూడా తీసుకోవచ్చు’’ అని బీబీసీతో చెప్పారు రవాణా శాఖలో డీటీసీగా పనిచేస్తోన్న ఒక వ్యక్తి.
అయితే ఈ నిబంధన వీఐపీ పర్యటనలకు వర్తించదు అని ఆయన అన్నారు. ‘‘ఒంగోలులో జరిగింది చాలా అరుదైన విషయం. మరి అక్కడ అలా ఎందుకు జరిగిందో మాకు తెలియదు’’ అన్నారాయన.
అయితే వీఐపీ పర్యటనల కోసం ప్రత్యేక సందర్భాల్లో తాము కూడా వ్యక్తిగత వాహనాలు తీసుకున్నట్టు ఆయన వివరించారు.
‘‘అరకు, పాడేరు, నల్లమల లాంటి ప్రాంతాల్లో ప్రముఖుల పర్యటనల్లో మామూలు కార్లు పనికిరావు. జీపులు కావాలి. డ్రైవర్లు కూడా అక్కడి ప్రాంతం తెలిసిన వారే ఉండాలి. అందుకే ఆయా సమయాల్లో నాన్ ట్రాన్స్‌పోర్ట్ వారిని కూడా తీసుకుంటాం. అక్కడ డ్యూటీకి వారే కరెక్టని అలా చేస్తాం. అయితే ప్రతీసారి వారికి కచ్చితంగా నిబంధనల ప్రకారం డబ్బు చెల్లిస్తారు కలెక్టరేట్ వారు. ఉచితంగా వాడుకోం’’ అన్నారు ఆ రవాణా శాఖ అధికారి.
‘‘మంత్రుల వాహనాలకు మేం బండ్లు సరఫరా చేయం. కానీ ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పర్యటనలకు వాహనాలు సేకరిస్తాం’’ అని రవాణా అధికారులు బీబీసీతో చెప్పారు. చాలా సందర్భాల్లో రోడ్లపై నుంచి కూడా వాహనాలు తీసుకెళ్లినట్టు వారు చెప్పారు.
‘‘హుద్ హుద్, తితిలీ వంటి తుఫాన్లు వచ్చినప్పుడు సిబ్బంది కోసం ఎంతో కష్టపడి బండ్లు సేకరించాం. ఉదాహరణకు వీఐపీల పర్యటనలు ఉన్పప్పుడే పెళ్లిళ్ల సీజన్ ఉంటే బండ్లు దొరకవు. 40 వాహనాలు కావాలంటే ముందుగా ట్రావెల్స్‌తో సంప్రదించి అవి దొరకనప్పుడు, ఇక రోడ్లపై నుంచే తీసుకుంటాం. కానీ మరీ పాసింజర్లను దించము. ఎమెర్జెన్సీలు వదిలేస్తాం. పాసింజర్లను దించేసి రమ్మని తరువాత తీసుకుంటాం. నేను పదేళ్లుగా ఈ శాఖలో ఉన్నాను. ఎప్పుడూ ఎవర్నీ రోడ్డుపై దించలేదు. సాధారణంగా అవసరం ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ బండ్లే సేకరించి పెడుతుంటాం’’ అని వివరించారాయన.

ఫొటో సోర్స్, Getty Images
‘‘శాశ్వత పరిష్కారం కావాలి’’
ఈ వ్యవస్థ పూర్వం నుంచీ ఉందనీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలనీ సూచించారు సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాస రావు.
‘‘ఇలా బయటి బండ్లను కాన్వాయిలో పెట్టుకోవడం పూర్వం నుంచీ ఉంది. 80లలో రాజీవ్ గాంధీ పర్యటన సందర్భంగా మీడియా వారు అదనపు వెహికల్ కావాలంటే అప్పటికప్పుడు ఏదో బండి తెచ్చి అప్పగించారు కలెక్టర్’’ అంటూ అప్పటి అనుభవాలు గుర్తు చేసుకున్నారు సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాస రావు.
‘‘నిజానికి పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ దగ్గర చాలా వాహనాలు ఉంటాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ చూస్తున్నాను. ప్రభుత్వం వాళ్లు ట్రాన్స్‌పోర్ట్ వాళ్లతో పాటూ స్కూలు బస్సులను కూడా తెప్పిస్తారు. ప్రముఖుల పర్యటనల్లో ప్రతీ వాడికీ ఒక కారు ఇస్తే తప్పా పని జరగదు. దీంతో ట్రావెల్స్ వారు మొదట వస్తారు. ఒంగోలు ఘటన పూర్తి వివరాలు నాకు తెలియవు కానీ అక్కడ జరిగింది అయితే చాలా తప్పు’’అని ఆయన అన్నారు.
అయితే అక్కడ ఏదో ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం కాకుండా, దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలని సూచిస్తున్నారు శ్రీనివాస రావు. ‘‘ఈ సిస్టమే సరికాదు. ప్రభుత్వానికి వాహనాల విషయంలో ఒక విధానం ఉండాలి. పనిష్మెంట్లు కాదు ఇవ్వాల్సింది. మళ్లీ ఇలా జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారనేది తెలియాలి’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
సారీ చెప్పడం తప్ప ఏమీ చేయలేమని అన్నారు: శ్రీనివాసరావు
ఘటన ఎలా జరిగిందో బాధితుడు శ్రీనివాసరావు బీబీసీకి వివరించారు.
''నేను వినుకొండ నుంచి తిరుపతికి బయల్దేరాను. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు మాతో. పిల్లలు ఆకలి అనడంతో ఒంగోలు టౌన్‌లోకి వెళ్లి, టిఫిన్ కోసం ఆగాము. మేం టిఫిన్ తింటూండగా ఆర్టీవో కానిస్టేబుల్ బండి తీసుకెళ్లడం కనిపించింది. రాంగ్ పార్కింగ్ వంటిదేమో అనుకున్నాను. పది నిమిషాల తరువాత కారుతో మళ్లీ వచ్చారు. లగేజ్ దించమన్నారు. ఎందుకు అని అడిగితే పేపర్లు లేవు అన్నారు. తరువాత కాసేపటికి సీఎం కాన్వాయిలోకి టెస్టుకు కావాలి అన్నారు''అని ఆయన చెప్పారు.
''సారీ చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. ఉన్నతాధికారుల నుంచి ప్రెజర్ ఉంది'' అని చెప్పి, లగేజ్ దించేసి వెళ్లిపోయారు. పోనీ అక్కడ ఇంకేదైనా వెహికల్ దొరుకుతుందా అని అడిగాను. క్యాష్ ఇస్తాను అని కూడా చెప్పాను. లేవు, అసలు దొరకవు అని ఆయన చెప్పారు. తిరిగి వినుకొండ ఫోన్ చేసి మరో బండి తెప్పించుకున్నాం. రాత్రి ఒంటి గంటకు తిరుపతి బయల్దేరాం'' అని బీబీసీతో చెప్పారు శ్రీనివాస రావు.
తనపై వస్తోన్న పార్టీ ఆరోపణలపై ఆయన మాట్లాడారు. ''నేనిదంతా కావాలనే చేశాననీ కొంతమంది రాజకీయం, కులం అంటగడుతున్నారు. నేను నెల క్రితమే తిరుపతి టికెట్లు తీసుకున్నాను. సీఎం ఈవాళ వస్తారని నాకు తెలియదుకదా. నేను ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపు నడుపుతాను. దాని ఓపెనింగ్‌కి తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, జనసేన మూడు పార్టీల వారూ వచ్చారు. అందులో టీడీపీ నాయకుడి ఫోటో మాత్రం తీశారు. నిజానికి నా కారు ఇలా ఆపేసిప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఆంజనేయులు గారే నాకు సాయం చేశారు. ఆడవాళ్లతో సహా రోడ్డుపై దించేశారని డిస్టర్బ్ అయ్యాను. తిరుపతిలో మెట్ల పూజ చేయాలనుకున్నాం. అది చేయలేకపోయానని బాధపడ్డాను. నాకేమీ ఆర్టీయే వాళ్లతో ఆస్తి తగాదాలు లేవు కదా? వాళ్లని సస్పెండ్ చేయించాలన్న కసేమీ లేదు నాకు. అసలు నిన్న మధ్యాహ్నం వరకూ నాతో ఎవరూ మాట్లాడలేదు. నిన్న మధ్యాహ్నం డీఎస్పీ గారు ఒకరు మాత్రం నాకు కాల్ చేశారు. ఈ ఘటన కూడా అక్కడ మీడియా చూసింది కాబట్టి బయటకు వచ్చింది.'' అన్నారు శ్రీనివాస రావు.
‘‘సీఎం సరే.. మంత్రుల పర్యటనలే అసలు తలనొప్పి’’
అయితే ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వం నుంచి అంతో ఇంతో లేదా మొత్తమో డబ్బు వస్తుంది కానీ, మంత్రులు పర్యటనలు మాత్రం చాలా సందర్భాల్లో రెవెన్యూ వారికి తలపోటుగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ నిధులు వస్తాయి. చాలా సందర్భాల్లో రావు. ప్రభుత్వ నిధులు వచ్చినా అవి చాలా పరిమితంగా ఉంటాయి. వాస్తవంగా మంత్రులు చేసే ఆర్భాటాలకూ, వారికి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలకూ సంబంధం ఉండదు.
‘‘ప్రోటోకాల్ ఖర్చులకు కూడా ప్రభుత్వం డబ్బు ఇవ్వాలని ఎప్పటి నుంచో వివిధ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఎప్పుడూ దాన్ని పట్టించుకోదు. ఏ శాఖ మంత్రి వచ్చినా, రెవెన్యూ వారి అవసరం తప్పనిసరి. ఉదయాన్నే వేదిక శుభ్రం చేయించడం మొదలు, మధ్యాహ్నం భోజనం వరకూ భారం వారిమీదే పడుతుంది. చాలా సందర్భాల్లో మంత్రులు భోజనాలు చాలా ప్రహసనంగా మారతాయి. మంత్రితో పాటూ, మంత్రికోసమూ వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీంతో వారందరికీ సరిపడా ఏర్పాట్లు ప్రభుత్వ ఖర్చుతో చేస్తే తడసిమోపెడవుతుంది. దీంతో రెవెన్యూ వారు ఆ ఖర్చులకు పక్కదారులు వెతుక్కుంటారు’’ అని చెప్పారు ఒక ఆర్డీవో.
సాధారణంగా మంత్రుల పర్యటనలకు కూడా కలెక్టర్ల ఫండ్ నుంచి కొంత డబ్బు ఇస్తారు. కానీ అది సరిపోదు. దీంతో ఆ గ్యాప్ ఫిల్ చేసే బాధ్యత ఇద్దరిపై పడుతుంది. ఒకటి స్థానిక రెవెన్యూ యంత్రాంగం, అంటే తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు. దాంతో పాటూ మునిసిపల్ సిబ్బంది. వీరికి అదనంగా ఆ మంత్రి ఏ శాఖ వారైతే, ఆ శాఖకు సంబంధించిన స్థానిక సిబ్బందీ – వీరందరూ ఆ ఖర్చులు భరించాలి. మంత్రులు పర్యటనలకు ప్రభుత్వ ఖర్చు వచ్చేది చాలా అరుదు. ఒకవేళ పర్యటనలో భాగంగా మంత్రులు ఏదైనా ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కువ భారం వారిపై వేస్తారు అధికారులు.
‘‘వాస్తవానికి ప్రోటోకాల్ అంటే భోజనాలు, టిఫిన్లు లేవు. కానీ అదొక అలవాటు అయిపోయింది. చాలా మంది మంత్రులు అది తమ హక్కుగా భావిస్తారు. తాము వస్తే రాచమర్యాదలు చేయాలని కోరుకుంటారు. దీంతో ఆ ఖర్చు అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులపై పడుతుంది’’ అని బీబీసీతో చెప్పారు మరో రెవెన్యూ శాఖ అధికారి.
‘‘మంత్రుల పర్యటనల్లో ఆ కాన్వాయిలోని వాహనల్లో డీజిల్ పోయించమని స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని మంత్రి గారి కార్యాలయం కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని గుర్తు చేసుకున్నారు ఆర్డీవో. ‘‘పెట్రోలు బంకుల వారు ఫ్రీగా ఇవ్వరు కదా. తహశీల్దారే ఆ డబ్బు ఏర్పాటు చేయాలి కదా? అదే మొదలు అవినీతికి’’అని అన్నారాయన.
‘‘దీనిపై మేం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇవాళే సీసీఎల్యేకు విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చాం. వీఐపీ పర్యటనల ఖర్చులు ప్రభుత్వం భరించాలని చెబుతున్నాం. మూడేసి రోజులు బయటి వారి భోజన ఖర్చులన్నీ రెవెన్యూ వారిపైనే పడుతున్నాయి. ఇది సరికాదు’’ అని బీబీసీతో చెప్పారు బొప్పరాజు వెంకటేశ్వరులు. ఆయన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.
అయితే ఈ ఖర్చులు జరిగే తీరు అక్కడున్న నాయకత్వం, అధికారగణం, వారి వ్యక్తిగత పద్ధతులను బట్టి మారిపోతుంది. ఉదాహరణకు బలవంతంగా వాహనాలు తెప్పించినా వాటికి డీజిల్ ప్రభుత్వ ఖర్చుతో పోయించేవారు ఉంటారు, అది కూడా వాహనాల యజమానులు చేత పెట్టించే వారూ ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













