ఆంధ్రప్రదేశ్: పోరస్ కంపెనీకి ఉన్న పర్మిషన్‌లేంటి, అది చేస్తున్న పనులేంటి... పారిశ్రామిక ప్రమాదాలను నివారించలేమా?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నం పరిధిలోని ఎల్జీపాలిమర్స్ ప్లాంటులో 2020 మే 7 తెల్లవారుజామున సంభవించిన ప్రమాదం పెనువిషాదాన్నినింపింది. గ్యాస్ లీక్ కారణంగా 12 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో 2021 జూలై 30వ తేదీన రసాయనాలు నిల్వ ఉంచిన చోట జరిగిన ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు చనిపోయారు. మృతులంతా ఉపాధి కోసం వచ్చిన ఒడిశాకి చెందిన కూలీలు.
2022 ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు బీహారీలు.
ఎల్జీపాలిమర్స్ ప్రమాదం తర్వాత ఆ పరిశ్రమ కొంతకాలం మూతపడింది. నివాస ప్రాంతాల నుంచి ప్రమాదకర పరిశ్రమలను తొలగించే విషయం కూడా పరిశీలించాలని ఎల్జీ పాలిమర్స్ ఘటన సందర్భంగా సీఎం నియమించిన కమిటీ ప్రతిపాదించింది. అయినా బల్క్ డ్రగ్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉన్న పోరస్ కంపెనీ అక్కిరెడ్డిగూడెం గ్రామానికి ఆనుకుని కొనసాగుతుండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో జరిగిన ప్రమాదంతో స్థానికులు ఆందోళనలకు దిగారు. పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. చివరకు ప్రభుత్వం తాత్కాలికంగా ఫ్యాక్టరీ సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

నివాసప్రాంతాల్లో రసాయన పరిశ్రమలు
ఎల్జీపాలిమర్స్, పోరస్ సహా వివిధ కంపెనీలు నివాసాలకు అతి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు కంపెనీల్లో సంభవించిన పెద్ద ప్రమాదాల్లోనూ సమీప ప్రాంతవాసులు భీతిల్లిపోయారు. చీకట్లో కొందరు పరుగులుపెట్టారు.
గ్యాస్ లీక్ అయ్యి, వెంటనే సమీపప్రాంతాలకు వ్యాపించడంతో ఎల్జీపాలిమర్స్ ఘటనలో ఎక్కువమంది నష్టపోయారు.
పోరస్ కంపెనీలో మాత్రం ప్రమాదం ఒక్క రియాక్టర్ కేపరిమితం కావడంతో పరిశ్రమలోపల ఉన్న వారు మినహా స్థానికులు గట్టెక్కారు. ప్రమాదం తీవ్రత పెరిగి ఉంటే ముప్పు మరింత ఎక్కువగా ఉండేదనడంలో సందేహం లేదు.
ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్ని పరిశ్రమల్లోనూ తీసుకుంటామని 2020 మే 7న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులనుద్దేశించి మాట్లాడిన సీఎం ప్రకటించారు. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే వాదనలను తాజాప్రమాదాలు తేటతెల్లంచేస్తున్నాయి.

పరిశ్రమల్లో కార్మికుల భద్రతగానీ, తగిన రక్షణ చర్యలకుగానీ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనేవాదనలకు వరుస ప్రమాదాలు, ప్రాణనష్టం బలం చేకూరుస్తున్నాయి.
"రాష్ట్రవ్యాప్తంగా పోరస్‌తో పాటుగా అనేక రసాయన, ఫార్మా పరిశ్రమలను గ్రామాలకు అతి చేరువలో నడుపుతూనే ఉన్నారు. దివీస్ ఫార్మా వంటి కంపెనీలను కాకినాడ జిల్లా తొండంగిలో కొత్తగా నిర్మిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు గానీ, సీఎంగా ఎల్జీపాలిమర్స్ ఘటన తర్వాతగానీ జగన్ చెప్పిన మాటలకు భిన్నంగా ఆచరణ ఉంది. నివాసాలకు సమీపంలో రసాయన పరిశ్రమల వల్ల అనేక ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలే స్థానికంగా పెద్ద అలజడి సృష్టించేందుకు దారితీస్తుంది. ప్రమాదకర రసాయన నిల్వలు పరిమితికి మించి కూడా నిల్వ చేస్తున్న తరుణంలో అలాంటి వాటిమీద దృష్టిపెట్టాలి. లేదంటే భవిష్యత్తులోఎల్జీపాలిమర్స్, పోరస్ వంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. ప్రమాదాలతో పాటు పర్యావరణం మీద అవి కలిగించే ప్రభావం అపారంగా ఉంటుంది. నీటికాలుష్యం, వాయు కాలుష్యం స్థాయి తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ కనిపించడం లేదంటూ" పర్యావరణవేత్త కేసరి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక కాలుష్యంతో పాటుగా ప్రాణాపాయం ఉన్న పరిశ్రమలను తక్షణం దూరంగా తరలించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఉండగా అందుకు భిన్నంగా గ్రామాల మధ్య కొనసాగించడం శ్రేయస్కరం కాదంటూ బీబీసీతో అన్నారు.

పర్యవేక్షణ ఎవరు చేయాలి?
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను వాటినుంచి వెలువడే కాలుష్యం ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు. రెడ్, ఎల్లో, వైట్, గ్రీన్ కేటగిరీలుగా పేర్కొంటారు. ఎక్కువ కాలుష్యం, ప్రమాదకర రసాయనాలతో ముడిపడిన పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఉంటాయి. ఇలాంటి పరిశ్రమలు నివాసాలకు దూరంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఉన్నట్టు క్షేత్రస్థాయిలోని వాస్తవం చెబుతోంది.
పరిశ్రమల్లో సిబ్బంది రక్షణకు పలు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఫైర్ సహా పలు ప్రమాదాల నుంచి వారికి తగిన భద్రత కల్పించాలి. ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్నిజాగ్రత్తలు పాటించాలి. అందుకు అనుగుణంగా పారిశ్రామిక, కార్మికచట్టాల్లో నిబంధనలున్నాయి. కానీ ఆచరణలో అవి అమలుకావడంలేదన్నది పోరస్ ప్రమాదాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
" సిబ్బందికి ఫైర్ సేఫ్టీ జాకెట్ లుఉండాలి. ఒక్కరికీ రక్షణగా తమ ఒంటి మీదున్నబట్టలు తప్ప మరోటి కనిపించడం లేదు. చేతులకు గ్లౌజులు కూడా లేవు. సేఫ్టీ జాకెట్లు ఉంటే 70,80 శాతం శరీరాలు కాలిపోయే ముప్పు వచ్చేది కాదు. ప్రమాదకరమైన రసాయనాలు లీకయినప్పుడు మాస్కులు అందుబాటులో ఉంచాలి. కానీ ఆ పరిశ్రమలో ఎక్కడా అలాంటివి ఉన్నట్టు ఆనవాళ్లు కూడా లేవు. అలారం మోగించాలి. కానీ, పక్కనే ఇళ్లల్లో ఉన్న వారికి కూడా ఎటువంటి హెచ్చరికలు లేవు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వాటిని పర్యవేక్షించాల్సిన కార్మిక, పరిశ్రమలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల తనిఖీలు తరచుగా జరగాలి. పరిశ్రమల్లోవర్కర్ట కమిటీలుండాలి. అవి తరచుగా సమావేశం కావాలి. కానీ వాటిని పట్టించుకుంటున్న దాఖలాలే లేవు. చట్టాలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. యధేచ్ఛగా యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి" అంటూ సీఐటీయూ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ ఆందోళన వ్యక్తంచేశారు.
పోరస్ ప్రమాదానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణమని గఫూర్ విమర్శించారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలకు అధికారులను కూడా బాధ్యులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయఒత్తిళ్లు, ఇతర కారణాలతో యంత్రాంగం నిర్వీర్యం అయిపోవడం వల్ల నిఘా కరువయ్యిందని, పలు ప్రమాదాలకు ఇదే కారణమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"పోరస్ నిబంధనలను పాటించడంలేదు"
అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కంపెనీకి పోరస్ ల్యాబరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్, యూనిట్-4పేరుతో పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి ఉంది. కంపెనీ ఆవరణలో ఉన్న బోర్డు మాత్రం పోరస్ మాలిక్యూల్స్ అండ్ బియాండ్ అనే పేరుతో కనిపిస్తోంది.
హైదరాబాద్ కావూరిహిల్స్‌లోని కెకెఆర్‌స్క్వేర్ అడ్రస్‌తో ఈ కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. నామాల శ్రీనివాస్ సీఈవోగా ఉన్నారు. నామాల అనంతలక్ష్మి కుమారి, శ్వేతహాసిని, పురుషోత్తమరావులను డైరెక్టర్లుగా పేర్కొన్నారు. కోదాడ, బీబీనగర్, జీడిమెట్ల, పరవాడ, అచ్యుతాపురం సెజ్‌తో పాటుగా అక్కిరెడ్డిగూడెంతో కలిపి ఆరు చోట్ల ప్లాంట్లు ఉన్నాయి.
ప్రమాదానికి గురయిన అక్కిరెడ్డిగూడెం యూనిట్లో 18 రకాల ఉత్పత్తుల కోసం విజయవాడ పొల్యూషన్ కంట్రోలు బోర్డు అధికారుల నుంచి అనుమతులున్నాయి. వాటిలో లో ఫినైల్, తాలిమైడ్, పెంటాపినాలాక్సయిడ్, టెట్రా మిథయిల్ బిస్పనోల్ అసిటోన్, ఈథేన్, హైడ్రాక్సో బెంజో నైట్రైల్, నైట్రో ఎన్‌మిథైల్ తాలిమైడ్, సిఫ్రో ప్లాక్సిన్ హైడ్రోక్లోరైడ్, హెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు తయారీచేసేందుకు అనుమతులు ఇచ్చినట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బీబీసీకి తెలిపారు.
2018లో ఈ పరిశ్రమ విస్తరణ కోసం ప్రయత్నాలు చేసింది. 2019 జనవరి 2న దానికి అనుమతి లభించింది. పరిశ్రమ అవసరాల కోసం రోజుకి 15.87 లక్షల లీటర్ల నీటిని వినయోగిస్తామని, 8.29 లక్షల లీటర్ల నీటిని ట్రీట్ చేసి వదులుతామని అనుమతి కోసం దాఖలు చేసిన పత్రాల్లో కంపెనీ చెప్పింది. పరిశ్రమలో మొత్తం 300 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని కూడా తెలిపింది.
"నలుగురి పనిని ఒక్కరితో చేయిస్తున్నారని చెప్పేవారు. ఆయనకు చాలా ఒత్తిడి ఉండేది. అయినా తప్పదు కాబట్టి ఓపికతో చేస్తూ వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. మాతో వీడియో కాల్ మాట్లాడుతుండగా సడెన్ గా కట్ అయ్యింది. ఆయన బిజీగా ఉంటారులే అని అనుకున్నాం. తీరా ఇలా జరిగింది. సేఫ్టీ కోసం ఏం జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే ఎక్కువ మంది చనిపోయారంటూ" ఈ పరిశ్రమలో కెమిస్ట్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన యూ. కృష్ణయ్య భార్య విజయక్రాంతి వాపోయారు.
నెలల వయసులో ఉన్న బిడ్డని తనకు వదిలేసి భర్త చనిపోయారని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. కంపెనీ అనుమతులకు, నిర్వహణకుపొంతన లేదనే వాదనను పలువురు అక్కిరెడ్డిగూడెం వాసులు కూడా బీబీసీ వద్ద ప్రస్తావించారు. దీనిపై కంపెనీ యాజమాన్యం స్పందించేందుకు సిద్ధం కాలేదు.

కాలుష్యం గురించి ఫిర్యాదు చేస్తే బెదిరించారు...
"పోరస్ కంపెనీ వల్ల మా పొలాలు నాశనమవుతున్నాయి. ఇళ్లల్లో పడుకుంటే బూడిద మాశరీరాలను కమ్మేస్తుంది. తాగునీరు కూడా కలుషితమయి పోయింది. ఎముకలు బలహీనపడడం, ఊపిరితిత్తుల సమస్యలతో ఊరంతా ఇబ్బందులుపడుతున్నాం. మా ఊరిని కాపాడాలని పొల్యూషన్ అధికారులను చాలాసార్లు కలిశాం. మా వినతులు పక్కనపెట్టేశారు. మళ్లీ కంప్లైంట్ ఇవ్వకూడదని బెదిరించారు. మా నీటిని టెస్ట్ చేయించాం. రిపోర్టులు రాకుండా అడ్డుకున్నారు. మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పోరస్ వల్ల చాలా నష్టం జరుగుతోంది" అంటూ అక్కిరెడ్డిగూడెం వాసి ఏరవికుమార్ తెలిపారు.
పోరస్ కంపెనీలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా, వాటిని కప్పిపుచ్చేశారని ఆయన బీబీసీతో అన్నారు.
కార్మికుల రక్షణ విషయంలో నిబంధనలు అమలుచేయాల్సిన కార్మికశాఖ, పరిశ్రమలో భద్రత గురించి తనిఖీలు చేయాల్సిన ఫరిశ్రమల శాఖతో పాటుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పోరస్ విషయంలో శ్రద్ధ పెట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అక్కిరెడ్డిగూడెం గ్రామ పరిసరాలు, ప్యాక్టరీలో ప్రమాదం జరిగిన తీరు అందుకు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. హైడ్రోక్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటివి వాడుతున్న చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉదాహరణకు సేఫ్టీ జాకెట్లు వంటివి కనిపించకపోవడం దానికి ఊతమిస్తోంది.
200 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది...
"మినోమిథైల్ అమీన్ అనే గ్యాస్ ని వాడుతున్నారు. దానికి బాగా మండే స్వభావం ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ రియాక్టర్లలో దానిని నిల్వ ఉంచారు. నాలుగు రియాక్లర్లున్నాయి. అందులో నాలుగో రియాక్టర్‌కు ప్రమాదం జరిగింది. 200 డిగ్రీల వరకూ అది సురక్షితంగా ఉంటుంది. కానీ 13వ తేదీ రాత్రి ఆ టెంపరేచర్ దాటిపోయింది. దాంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. సకాలంలో దానిని గుర్తించలేదు. ఇందులో పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. అందుకే కేసు నమోదు చేశాము. పూర్తి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఫ్యాక్టరీస్ డైరెక్టర్ తో పాటుగా పోలీస్ శాఖ కూడా విచారణ చేస్తోంది" అంటూ డీఎస్పీ బీ శ్రీనివాసులు బీబీసీకి తెలిపారు.
ప్రమాదానికి అసలు కారణం పేలుడా లేక మినోమిథైల్ అమీన్ లీక్ కావడమా అనేది నిర్ధారణ కాలేదు. మొత్తం 5 బ్లాకుల్లో ప్రస్తుతం 3 మాత్రమే పనిచేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. డి బ్లాక్ లోని రెండో ఫ్లోర్లో ఈ ప్రమదం జరిగింది. ఘటనా స్థలంలో కొందరు కార్మికులు ప్రాణభయంతో పరుగులు పెట్టినప్పటికీ మంటల తాకిడికి గురయ్యారు. 70 శాతం పైగా శరీరం కాలిపోయినవారే 9 మంది ఉన్నారు. వారంతా వెంటిలేటర్ పై ఉండడంతో మృతులతో పాటుగా తీవ్రగాయాలుపాలయిన వారి కుటుంబాలు కూడా కలత చెందుతున్నాయి.

అన్నీ పరిశీలిస్తున్నాం.. .నిబంధనల ప్రకారం చర్యలు
పోరస్ పరిశ్రమలో ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు రంగంలో దిగారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలను సేకరించారు. వాటిని పరిశీలించి మూడు, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామని చెబుతున్నారు.
"ఫ్యాక్టరీ వద్ద వాల్వ్ లీక్ అయినట్టు గుర్తించాము. దానిని సకాలంలో సరిజేయలేదు. దాంతోగ్యాస్ లీకేజ్ జరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అందుకే రియాక్టర్ పేలి ఉంటుందని ప్రాధమిక అంచనా. పలు ఆధారాలు సేకరించాము. ల్యాబ్ కి పంపించాము. రిపోర్ట్ రావాల్సి ఉంది. పాలిమర్స్ గ్యాన్యూల్స్ తయారీలో ఉపయోగించే 4ఎంపీఐ పౌడర్ ఇక్కడ తయారవుతోంది. దానికి తగ్గట్టుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నాం." అంటూ ఏపీ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ వెల్లడించారు.
మరోవైపు ఈ పరిశ్రమను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు పాటించకపోవడంతో సమీప ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నట్టు గుర్తించామని పీసీబీ చైర్మన్ ఏకే ఫరీదా తెలిపారు.
పరిశ్రమ నిర్వహణ మీద వస్తున్న అన్ని ఆరోపణలను పరిశీలిస్తున్నామని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆయన బీబీసీతో అన్నారు.
పరిశ్రమ యాజమాన్యం మాత్రం మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు. వివరాల కోసం బీబీసీ సంప్రదించగా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- ఇండియన్ స్టాండర్డ్ టైమ్: ఈశాన్య రాష్ట్రాలు రెండో టైమ్ జోన్ కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














