ఆంధ్రప్రదేశ్: ఆ నాలుగు కులాలకూ ప్రాతినిధ్యం లేని తొలి క్యాబినెట్ ఇదే.. వైఎస్ జగన్ 2.0 మంత్రివర్గంలో 5 ముఖ్యమైన అంశాలు

మోకాళ్లపై కూర్చుని సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేస్తున్న మంత్రి జోగి రమేశ్
ఫొటో క్యాప్షన్, మోకాళ్లపై కూర్చుని సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేస్తున్న మంత్రి జోగి రమేశ్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సోమవారం (11.04.22) ఉదయం 11.31 నిముషాలకు ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

ఈ మంత్రి వర్గాన్ని జగన్ ఎన్నికల టీంగా చెబుతున్నారు. దీనికి జగన్ టీం 2.0 అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈ టీంలో దాదాపు అందరూ కొత్త మంత్రులే ఉంటారని తొలుత ప్రచారం జరిగినా...11 మంది పాతవాళ్లు ఉండగా...14మంది కొత్తవారికి అవకాశం దక్కింది.

ఈ నేపథ్యంలో జగన్ 2.0 మంత్రివర్గంలో 5 ముఖ్యమైన అంశాలు:

1. మంత్రిపదవులు లేని కొత్త జిల్లాలు

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన జరిగింది. మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 25 మంది మంత్రులకు అవకాశం ఉండగా... జిల్లా నుంచి ఒకరి చొప్పున మంత్రిగా కచ్చితంగా అవకాశం వస్తుందని అయా జిల్లాల్లోని ఎమ్మేల్యేలు లెక్కలు వేసుకున్నారు.

అయితే, 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యమే దక్కలేదు. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి.

మరోవైపు కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులూ దక్కాయి.

శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు; కోనసీమ జిల్లా నుంచి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపే విశ్వరూప్ మంత్రిపదవులు దక్కించుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు, విడదల రజని మంత్రి పదవులు పొందారు.

చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రోజా ముగ్గురికీ మంత్రి పదవులు దక్కాయి.

సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్న మంత్రి రోజా
ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్న మంత్రి రోజా

2. పదవి, జిల్లా రెండూ కొత్తవే..

కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. ఇవి మినహాయిస్తే కానీ, మొత్తంగా కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 10 మంది ఉన్నారు. వీరిని కొత్తగా ఏర్పడిన అయా జిల్లాల నుంచి తొలి మంత్రులుగా చెప్పుకొవచ్చు. అలాగే, కొత్తజిల్లాలైన పార్వతీపురం మన్యం-1, అనకాపల్లి-2, కాకినాడ-1, కోనసీమ-2, బాపట్ల-1, పల్నాడు2, నంద్యాల-1 మంత్రి పదవులు దక్కాయి. ఈ జిల్లాల నుంచి మంత్రులుగా అవకాశం పొందిన బుగ్గన, చెల్లుబోయిన, పినిపే విశ్వరూప్ వంటి వారు మంత్రులుగా పాతవారే అయినా, జిల్లా మాత్రం కొత్తగా ఏర్పడింది. అలాగే మిగిలిన వారికి జిల్లా, మంత్రి పదవి రెండూ కొత్తే.

జగన్ మంత్రివర్గం

3. ఈ కులాలకు క్యాబినెట్ 2.0లో నో ఛాన్స్..

సామాజిక సమీకరణలు లెక్కలు వేసుకుని సామాజికి సమతుల్యత పాటిస్తూ ఈ మంత్రి వర్గం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్ లోని 25 మంత్రి పదవుల్లో బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.

జగన్ 2.0 క్యాబినెట్ లో కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలకు చోటు దక్కలేదు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ నాలుగు సామాజిక వర్గాలకు స్థానం దక్కకపోవడం ఇదే తొలిసారి కావొచ్చు.

ఇటీవలి చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి కావొచ్చు. అయితే ఆయా సామాజిక వర్గాలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

తొలి మంత్రి వర్గంలో గుడివాడ ఎమ్మేల్యే కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు.

ముందుగా దాదాపు అంతా కొత్తవారితోనే నూతన మంత్రివర్గం ఏర్పాటవుతుందని ప్రచారం జరిగినా.. రాజకీయ, సామాజిక సమీకరణాల నేపధ్యంలో పాత, కొత్త కలయిలో మంత్రివర్గం ఏర్పాటైంది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పినిపే విశ్వరూప్, తానేటి పనిత, నారాయణస్వామి, అంజాబ్ బాషా, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ కు రెండోసారి కూడా అవకాశం దక్కింది. మరో 14 మంది కొత్తవారికి అవకాశం దక్కింది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విడదల రజిని
ఫొటో క్యాప్షన్, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విడదల రజిని

4. మహిళా మంత్రుల సంఖ్య పెరిగింది

జగన్ గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. అందులో ఇందురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వారిలో ఒకరైన మేకతోటి సుచరిత (ఎస్సీ) రాష్ట్ర హోంమంత్రిగా పని చేశారు. డిప్యూటీ సీఎంగా మరో మహిళ మంత్రి పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ) చేశారు. మరో ఎస్సీ మహిళ మంత్రి తానేటి వనిత శిశు, మహిళ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

తాజా క్యాబినెట్ 2.0లో నలుగురు మహిళ మంత్రులున్నారు. వారిలో తానేటి వనిత మళ్లీ అవకాశం దక్కించుకోగా...పుష్సశ్రీవాణి, సుచరితలకు తిరిగి ఛాన్స్ దక్కలేదు. తానేటి వనితతో పాటు చిత్తూరు నుంచి ఆర్కే రోజా, అనంతపురం నుంచి ఉషశ్రీ చరణ్, పల్నాడు నుంచి విడుదల రజని అవకాశం పొందారు.

వీరిలో రోజా ఓసీకాగా, ఉషశ్రీ చరణ్, విడదల రజని బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు. దీంతో మొత్తంగా ఓసీ-1, ఎస్సీ1, బీసీ-2 సామాజిక వర్గాలకు చెందిన మహిళలు ఈ క్యాబినెట్లో అవకాశం పొందారు. వీరిలో తానేటి వనిత పాత మంత్రిలో పని చేయగా...మిగతా ముగ్గురు కొత్తవారే.

5. అప్పు్దలాడు డిప్యూటీ సీఎంలు, ఇప్పుడు...

జగన్ 1.0 క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంలు ఐదుగురు ఉన్నారు. వారు పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ), దర్మాన కృష్ణాదాస్ (వెలమ), ఆళ్ల నాని (కాపు), అంజాద్ బాష షేక్ (మైనారిటీ) కె. నారాయణస్వామి (ఎస్సీ). వీరు తొలి క్యాబినెట్ లో వరుసగా గిరిజన సంక్షేమం, రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, మైనార్టీ, ఎక్సైజ్ శాఖలు నిర్వహించారు. వీరు కూడా సీఎం జగన్ ఆదేశాల రాజీనామాలు చేసిన మంత్రుల్లో ఉన్నారు. అయితే వీరిలో అంజాద్ బాష షేక్, నారాయణ స్వామి తిరిగి మంత్రి వర్గంలో చోటు దక్కిచుకోగా...మిగతా ముగ్గురు డిప్యూటీ సీఎంలైన పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణాదాస్, ఆళ్లనానిలకు కొత్త క్యాబినెట్ లో చోటు దక్కలేదు. ఈ కొత్త క్యాబినెట్ లో కూడా ఐదురుగు డిప్యూటీ సీఎంలు ఉంటారని సజ్జల రామకృష్ణరెడ్డి చెప్పారు. అయితే ఆ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.

వీడియో క్యాప్షన్, వైఎస్ జగన్: ‘మూడు రాజధానులపై ముందుకే.. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం’

మరికొన్ని...

పాత కేబినెట్ మంత్రులుగా పనిచేసిన వారిలో మంత్రి పదవులు తిరిగి దక్కని వారు, కొత్తగా మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన వారు కూడా నిరసనలు తెలుపుతున్నారు. అయితే, వారిని బుజ్జగించేందుకు, అలాగే పార్టీ అవసరాలకు ఉపయోగపడే వారి కోసం వివిధ పోస్టులు కల్పించాలని సీఎం నిర్ణయించారని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా కొడాలి నాని(కమ్మ) ని, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు(బ్రాహ్మణ)కు అవకాశం కల్పించనున్నారని సమాచారం. వీరికి క్యాబినెట్ హోదా కల్పించనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు(క్షత్రియ) ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు. ప్రస్తుత కేబినెట్లో ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం లేకపోవడంతో కొలగట్లకు డిప్యూటీ స్పీకర్‌‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖకు కొత్త క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. జిల్లాల పునర్విభజనలో రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా విశాఖ మిగిలిపోయింది. ఇప్పుడు మంత్రి వర్గంలో కూడా విశాఖ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం లభించలేదు. తొలి క్యాబినెట్లో అవంతి శ్రీనివాస్‌కు కాపు సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కింది.

  • ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం, వెలమ, బీసీ)
  • సీదిరి అప్పలరాజు (శ్రీకాకుళం, మత్స్యకార, బీసీ)
  • బొత్స సత్యనారాయణ (విజయనగరం, తూర్పుకాపు, బీసీ)
  • రాజన్నదొర (పార్వతీపురం, జాతాపు, ఎస్టీ)
  • గుడివాడ అమర్నాథ్‌ (అనకాపల్లి, కాపు, ఓసీ)
  • బూడి ముత్యాలనాయుడు (అనకాపల్లి, కొప్పుల వెలమ, బీసీ)
  • దాడిశెట్టి రాజా (కాకినాడ, కాపు, ఓసీ)
  • చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (కోనసీమ, శెట్టిబలిజ, బీసీ)
  • పినిపె విశ్వరూప్‌ (కోనసీమ, మాల, ఎస్సీ)
  • తానేటి వనిత (తూర్పుగోదావరి, మాదిగ, ఎస్సీ)
  • కారుమూరి నాగేశ్వరరావు (పశ్చిమ గోదావరి, యాదవ, బీసీ)
  • కొట్టు సత్యనారాయణ (పశ్చిమగోదావరి, కాపు)
  • జోగి రమేష్‌ (కృష్ణా జిల్లా, గౌడ, బీసీ)
  • విడదల రజని (పల్నాడు, ముదిరాజ్‌, బీసీ)
  • అంబటి రాంబాబు (పల్నాడు, కాపు)
  • మేరుగ నాగార్జున (బాపట్ల, మాల, ఎస్సీ)
  • ఆదిమూలపు సురేష్‌ (ప్రకాశం జిల్లా, ఎస్సీ)
  • కాకాణి గోవర్ధన్‌రెడ్డి (నెల్లూరు, రెడ్డి, ఓసీ)
  • ఆర్కే రోజా (చిత్తూరు, రెడ్డి, ఓసీ)
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, (చిత్తూరు, ఓసీ, రెడ్డి)
  • కె. నారాయణస్వామి (చిత్తూరు, మాల, ఎస్సీ)
  • అంజాద్ బాషా (కడప, మైనార్టీ)
  • బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (నంద్యాల, రెడ్డి, ఓసీ)
  • గుమ్మనూరు జయరాం (కర్నూలు, బోయ, బీసీ)
  • ఉషశ్రీ చరణ్‌ (అనంతపురం, కురబ, బీసీ)

మొత్తం: బీసీలు: 10, ఎస్సీలు: 5, రెడ్డి: 4, కాపు: 4, ఎస్టీ: 1, మైనార్టీ: 1

వీడియో క్యాప్షన్, ‘మండలి రద్దు’ను వైఎస్ జగన్ ఎందుకు రద్దు చేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)