విశాఖ గ్యాస్ లీకేజ్: ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో సహా 12 మంది అరెస్ట్ - ప్రెస్ రివ్యూ

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజ్‌కు బాధ్యులైన 12మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు ‘ఈనాడు’ వార్తాకథనం తెలిపింది.
స్టైరీన్ గ్యాస్ లీకై 15మృతికి కారణమైన ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత అరెస్టులు మొదలైనట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
అరెస్టయిన 12మందిలో సంస్థ సీఈవో, టెక్నికల్ డైరక్టర్‌లుగా పని చేస్తున్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనపై నమోదైన కేసుతోపాటు, హైపవర్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ అరెస్టులు చేసినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా వెల్లడించారు.
ఈ 12మంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయన్న విషయం కూడా వారికి తెలుసని ఆయన అన్నారు. మరికొన్ని విభాగాల నుంచి నివేదికలు వచ్చాక మరికొన్ని అరెస్టు ఉండొచ్చని కమిషనర్ వెల్లడించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.

ఫొటో సోర్స్, http://hc.ts.nic.in/
జీవోలు పట్టించుకోకుంటే చర్యలు తీసుకోవాల్సిందే: తెలంగాణ హైకోర్టు
కోవిడ్ వైద్యానికి ప్రైవేటు,కార్పొరేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
వైద్యం ఖర్చుల వసూలుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలున్నా, ప్రైవేటు ఆసుపత్రులు వాటిని పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు, భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, ఒకవేళ చర్యలు తీసుకోలేకపోతే ఎందుకు తీసుకోలేకపోయారో కూడా చెప్పాలని తన ఆదేశాలలో పేర్కొన్నట్లు సాక్షి కథనం వెల్లడించింది.

రహస్యంగా రాజధాని తరలింపు
కోర్టులు, చట్టాలకు చిక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని తరలింపును రహస్యంగా కొనసాగిస్తోందని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఇచ్చింది.
అమరావతిని రాజధానిగా ఉంచుతూనే, క్రియాశీల రాజధాని తరలింపు ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందని ఈ కథనంలో పేర్కొంది.
అవసరమైతే ఒక్కరోజులోనే సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఈ కథనం పేర్కొంది.
విశాఖపట్నంలో అధికారుల హడావుడి మొదలైందని, ఇటీవలి కాలంలో ఓ ఉన్నతాధికారి విశాఖ పర్యటించి వచ్చారని, సీఎం కార్యాలయం కోసం సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసే పని మీదే ఆయనకు అక్కడ వచ్చారని కథనంలో రాసింది.
కాపులుప్పాడ ప్రాంతంలోని గ్రేహౌండ్స్‌కు చెందిన భవనంలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అంబేద్కర్ స్మృతివనం మార్పుతో రాజధాని విషయంలో ప్రభుత్వం తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పిందని, ఒకపక్క రాజధాని మార్పు వద్దని రైతుల ఆందోళన, న్యాయవివాదాలు, శాసన సంబంధ సమస్యలు ఉన్నా, తాను అనుకున్న విధంగా రాజధాని తరలింపును ప్రభుత్వం కొనసాగిస్తోందని ఈ కథనంలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
పత్తికి తెలంగాణ బ్రాండ్
గుజరాత్‌లో మాదిరిగా తెలంగాణలో పండే పత్తిపంటకు ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ భావిస్తున్నట్లు ఈనాడు పత్రిక రాసింది.
గుజరాత్‌లో శంకర్-6 పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన బ్రాండ్‌కు దేశవిదేశాలలో మంచి డిమాండ్ ఉందని, అదే తరహాలో తెలంగాణలో కూడా బ్రాండ్ నేమ్‌ను సృష్టించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొంది.
బ్రాండ్ నేమ్ సృష్టించడం ద్వారా డిమాండ్ పెరుగుతుందని పలు కంపెనీలు చేసిన సూచనల మేరకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించినట్లు వెల్లడించింది.
నాణ్యమైన విత్తనాల వల్ల పత్తి దిగుబడి పెంచడానికి అవకాశం ఉంటుందని, ఇందుకు పరిశోధనలను ప్రోత్సహిస్తామన్న ప్రభుత్వం మేలు రకం విత్తనాల కోసం ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది.
రూ. 5లక్షలు కడితేనే శవం -హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రి దందా
కరోనా బాధితుడి వైద్యానికి రూ.12లక్షలు బిల్లు వేసిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి, రూ.5లక్షలను చెల్లించేదాకా శవాన్ని తీసుకెళ్లనివ్వబోమని తేల్చి చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం రాసింది.
‘‘అప్పటికే రూ.7లక్షల బిల్లును వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం, తీరా బాధితుడు మృతి చెందడంతో, శవాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేసింది.
మిగిలిన బిల్లును చెల్లిస్తే తప్ప శవాన్ని ఇవ్వబోమని ఆసుపత్రి సిబ్బంది చెప్పార’’ని ఈ కథనంలో పేర్కొంది.
మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో రూ.20వేలు కట్టించుకుని చివరకు మృతదేహాన్ని అప్పజెప్పినట్లు ఈ కథనంలో పేర్కొంది. మరోవైపు సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా చికిత్సకు రూ.13లక్షల బిల్లు వేసిందని, ఇప్పటికే రూ.5లక్షలు చెల్లించగా, మిగిలిన రూ.8లక్షలు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని, రోగిని చూడటానికి కూడా అనుమతించడం లేదని ఈ కథనంలో వెల్లడించింది. కనీసం రోగి బతికి ఉన్నాడో లేదో కూడా చెప్పడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఈ కథనం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వైజాగ్ గ్యాస్ లీక్: తెల్లవారుజామున 3.25 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎప్పుడేం జరిగింది?
- విశాఖ గ్యాస్ లీకేజీ: "పాలిమర్స్ పేలిపోతోంది, వెళ్లిపోండి బాబూ..." - బీబీసీ ప్రతినిధి విజయ్ అనుభవం
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








