బాసా: క్యాట్ ఫిష్ వర్గానికి చెందిన ఈ చేప ఆరోగ్యానికి ప్రమాదమా, అన్ని రెస్టారెంట్లలో ఇదే ఎందుకు ఉంటోంది

చేపలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు చేపల ప్రాసెసింగ్ ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాలకు ఎగుమతి చేసేందుకు చేపల ప్రాసెసింగ్ ప్రక్రియ
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాసా ఇప్పుడు భారతదేశాన్ని కమ్మేసింది.. ఆ ఊరు ఈ ఊరు కాదు.. ఎక్కడో చేపలు దొరకని చోట ఇలాంటి దిగుమతి చేసుకున్న చేపలు పెడతారు అనుకోవద్దు.. కృష్ణ పక్కన ఉన్న విజయవాడ, గోదారి పక్కన రాజమండ్రి, సముద్రం పక్కన నెల్లూరు.. హైదరాబాద్ సరేసరి. అన్ని చోటా ఇదే చేప.దేశంలోని ఏ నదీ తీర, సముద్ర తీర ప్రాంతానికి వెళ్లినా అక్కడ హోటెళ్లలో స్థానికంగా దొరికే చేపలు కాకుండా బాసానే వడ్డిస్తున్నారు.

మీరు ఏ చేప వెరైటీ ఆర్డరిచ్చినా, పైన రంగు రుచి మారుతుంది తప్ప మీరు తినేది బాసా చేప మాత్రమే.. ఇంతకీ బాసా మిగతా చేపల్ని పక్కకు నెట్టేసి, అదొక్కటే దొరికేలా ఎలా మారిపోయింది?

వివిధ రకాల చేపల డిష్ లకు పెట్టే పేరు ఏదైనా తయారు చేసేది మాత్రం బాసా చేపతోనే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివిధ రకాల చేపల డిష్ లకు పెట్టే పేరు ఏదైనా తయారు చేసేది మాత్రం బాసా చేపతోనే

'బాసా'

అసలు దాని పేరేంటో, జాతేంటో తెలియకుండానే రెష్టారెంట్లకు వెళ్లి నాన్ వెజ్ తినే అలవాటున్న భారతీయులందరూ రుచి చూసిన చేప అది. వచ్చిన పదేళ్లలో భారతీయ మార్కెట్ ను ముంచెత్తిన చేప. దేశాల మధ్య గొడవలు పెట్టిన చేప. పర్యావరణవేత్తలు గగ్గోలుపెడుతోన్న చేప.

భోజనానికి ముందు స్టార్టర్ గా ఫిష్ తినాలకునే చాలా మందికి తాము ఏ ఫిష్ తింటున్నామన్న క్లారిటీ ఉండదు. ఎక్కడో నూటికొకరు అదే రకం చేప? ఏ ఊరి నుంచి వచ్చిన చేప అని వంద ఆరాలు తీస్తారు.

ఈసారి మీరు ఏదైనా హోటెల్ లో చేపలతో వండే స్టార్టర్ లేదా మరేదైనా డిఫరెంట్ ఫిష్ వంటకం ఆర్డరిచ్చినప్పుడు అది ఏ జాతి చేప అని అడిగి చూడండి. ఠక్కున వచ్చే సమాధానం బాసా అని.

చేపల పులుసు, చేపల కూర, వేపుడు వంటి తెలుగు వంటకాలు కాకుండా, మరే చేప సంబంధిత పదార్థమైనా బాసా అనే చేపతోనే చేస్తున్నాయి ప్రస్తుత హోటెళ్లు. కొరమీను, చందువా, మెత్తళ్లు, పండుగొప్ప, శీలావతి, బొచ్చె.. ఇలా తెలుగువాళ్లకు చాలా చేపలు తెలుసు. కానీ, తెలుగునాట ప్రతీ రెష్టారెంట్లో కనిపించే బాసా చేప గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

వీడియో క్యాప్షన్, భారత్ ఆక్వా ఎగుమతుల్లో మూడో వంతు ఆంధ్రప్రదేశ్‌ నుంచే..

ఏమిటీ చేప?

బాసా ఒకరకమైన క్యాట్ ఫిష్. పంగాసిస్ బకోర్టి (Pangasius bocourti) దీని శాస్త్రీయ నామం. వియత్నాం, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతంగా పెంచుతారు. ఒకప్పుడు అక్కడ నదుల్లో దొరికేది, తరువాత క్రమంగా ఎగుమతుల కోసం పెంచే వారి సంఖ్య పెరిగింది.

ఆ దేశాల నుంచి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, భారత్.. ఓ రకంగా ప్రపంచమంతా ఎగుమతి అవుతోన్న చేప ఇది.

పంగాసిస్ కుటుంబంలో చాలా చేపల రకాలున్నాయి. దేశవిదేశాల్లో రకరకాల పేర్లతో ఈ చేపను అమ్ముతారు. స్వాయి, బకోర్టి, రివర్ కాబ్లర్, పంగాసిస్, క్యాట్ ఫిష్ వంటి పేర్లతో దీన్ని అమ్ముతారు. వాటిలో బాసా ఫేమస్. ఎక్కువ కండ, అదే మాంసంతో.. చాలా పెద్దగా, చాలా వేగంగా పెరిగే ఈ చేప వడ్డించని నాన్ వెజ్ రెష్టారెంట్లు లేవంటే అతిశయోక్తి కాదు.

గల్లీ హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకూ ఎవరూ మినహాయింపు కాదు.

వియాత్నాం, థాయ్‌లాండ్ లాంటి దేశాల నుంచి ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియాత్నాం, థాయ్‌లాండ్ లాంటి దేశాల నుంచి ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి

వియత్నాం నంబర్ వన్

బాసా చేప ఆగ్నేయాసియాలోని మెకాంగ్, ఛావో ప్రాయా అనే నదుల్లో సహజంగా ఉంటుంది. ఆ నదులు ప్రవహించే వియత్నాం, చైనా, కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది.

అయితే భారత్ కు వచ్చేవి నదిలో సహజంగా దొరికేవి కాదు, పెంచినవి.

ఈ చేపకున్న అనుకూలతల వల్ల ఎగుమతులు పెరిగే సరికి, నదిలో సహజంగా దొరికేవి ఎలానూ సరిపోవు కాబట్టి, పెద్ద ఎత్తున పెంచడం ప్రారంభం అయింది.

కేజ్ కల్చర్, అంటే నదిలోనే వలలు కట్టి వాటిలో చేపలను పెంచడం బాగా పెరిగింది. ఈ చేప సహజంగా చాలా వేగంగా పెరగడం మరింత లాభదాయకం అయింది.

బాసా చేప

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం మెకాంగ్ నది డెల్టాలో దీన్ని విస్తృతంగా సాగు చేస్తున్నారు. ప్రపంచమంతా, ఏడాది పొడవునా డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది.

2022 జనవరిలో వియత్నాం సీఫుడ్ ఎగుమతులు 2021 జనవరి కంటే 44 శాతం పెరిగాయి. ఈ ఒక్క నెలలో ఆ దేశం నుంచి 6 వేల 500 కోట్ల రూపాయల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయినట్టు వియత్నాం అసోసియేషన్ ఆఫ్ సీఫుడ్ ఎక్స్‌పోర్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ సంస్థ చెబుతోంది.

భారత్ 2020-21 ఏడాది మొత్తం ఎగుమతి చేసిన సీఫుడ్ లో ఆరో వంతును వియత్నాం ఒక్క నెలలో ఎగుమతి చేయగలిగింది. వియత్నాం సీఫుడ్ ఎగుమతుల్లో పంగాసిస్ అంటే బాసా దే సింహ భాగం. గత 30-40 ఏళ్లుగా బాసా సాగు వియత్నాంలో విపరీతంగా పెరిగింది.

బాసా చేప ఒకరకమైన క్యాట్ ఫిష్ వర్గానికి చెందినది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాసా చేప ఒకరకమైన క్యాట్ ఫిష్ వర్గానికి చెందినది

భారత్ ను కమ్మేసింది

భారతదేశంలో 2007-08 ప్రాంతంలో బాసా వాడకం విస్తృతంగా పెరిగింది. యోగేశ్ గ్రోవర్ అనే వ్యాపారి మొట్టమొదట భారత్ లో ఈ చేపల దిగుమతి ప్రారంభించినట్టు ఫోర్బ్స్ పత్రిక కథనంలో ఉంది. ఎవరు మొదలుపెట్టినా, ఎలా మొదలుపెట్టినా ఇప్పుడు లక్షల టన్నుల చేప భారత్ కు దిగుమతి అవుతోంది.

ఈ చేప వండిన తరువాత తెల్లగా, ప్లెయిన్ గా ఉంటుంది. చేపలో ఒకటే ముల్లు ఉంటుంది. పెద్దగా వాసన రాదు. మామూలుగా చేపలు తినడం ఇష్టం లేని వారికి వాసన పెద్ద సమస్య. రెండోది ముళ్లు. ఈ రెండు సమస్యలూ ఈ చేపతో లేవు.

అంతేనా? ఈ లక్షణాలున్నంత మాత్రాన ఈ చేప అంత సూపర్ హిట్ అయిందా? కాదు..

భారీ వ్యాపారం

దాని వెనుక అతి పెద్ద వ్యాపారం సూత్రం ఉంది. ''ఇది చాలా చవక. వియత్నాం దేశంలో ఈ చేపను విస్తృతంగా పెంచుతారు. లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటుంది. దీంతో అంతే చవగ్గా ఈ చేపను వారు ఎగుమతి చేయగలుగుతారు.

మామూలుగా భారతదేశంలో చెరువుల్లో పెంచిన, సముద్రంలో, నదుల్లో వేటాడిన చేపల ధరలో సగం ధరకే ఇది వియత్నాం నుంచి, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి భారత్ కు వస్తుంది.'' అని హైదరాబాద్లో ఒక రెష్టారెంట్ నిర్వహిస్తోన్న రవి బీబీసీకి చెప్పారు .

ఈ కారణం వల్లే హోటళ్ల వారికి ఈ చేపంటే మక్కువ. అందుకే ఆ చేప పేరు కూడా చెప్పకుండా, అదే చేపను రకరకాల పేర్లున్న వంటకాల్లో వండి వడ్డిస్తారు. వంటకం పేరేదైనా వాడిన చేప ఒకటే.

రీటెయిల్ గా ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన బాసా ప్రస్తుతం 250-300 రూపాయలకు దొరకుతోంది. రెస్టారెంట్లకు, ఇంత కంటే చవగ్గా దొరుకుతుంది. ప్రాసెస్ చేసిన చేప కాబట్టి ఇందులో వేస్టేజి ఉండదు.

వీడియో క్యాప్షన్, చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

కేవలం వ్యాపారమే కాదు, వండే విషయంలో కూడా ఈ చేప వల్ల ఒక లాభం ఉంది. ''సాధారణంగా స్టార్టర్స్, గ్రిల్స్,కొన్ని రకాల కర్రీలకు ఎక్కువ మాంసం ఉండే వెరైటీలు కావాలి. అంటే ముళ్లు లేకుండా మొత్తం ఫ్లెష్ మాత్రమే ఉంటే వండడం, తినడం రెండూ సులువు. సరిగ్గా ఈ పాయింట్ లో హిట్ అయింది బాసా'' అని బీబీసీతో అన్నారు రిజ్వాన్.

ఆయన పలు స్టార్ హోటళ్ల రెస్టారెంట్లలో షెఫ్‌ గా పనిచేశారు.

ఈ చేపలో పైనుంచి కింద వరకూ ఒకటే ముల్లు ఉంటుంది. పంగాసిస్ కుటుంబానికి చెందిన క్యాట్ ఫిష్ లకు పొలుసులు ఉండవు. కొరమీను, సొర చేప తరహలో చర్మం ఉంటుంది. దాన్ని తొలగించడం సులువు. లోపల ముల్లు తీయడం క్షణాల్లో అయిపోతుంది. కట్ చేస్తే రెడీ టు కుక్ చేపల్ని అందంగా ప్యాక్ చేసి ఎగుమతి చేస్తారు.

సంప్రదాయ చేపలను తోమి, పొలుసు తీసి, ముళ్లు ఏరి - ఈ శ్రమంతా పడే బదులు.. అలా పాకెట్ ఓపెన్ చేసి ఇలా బాణీలో వేస్తే వంట రెడీ.. అందుకే అపోలో ఫిష్ లేదా ఇతర స్టార్టర్లో బాసా చేపను రెస్టార్టెంట్లో విస్తృతంగా వాడుతుంటారు.

ఖర్చు తక్కువ కావడంతో మామూలు చేపలకన్నా బాసా చేపలు కొనేందుకు రెస్టారెంట్లు ఆసక్తి చూపిస్తున్నాయి (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, OQBA/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఖర్చు తక్కువ కావడంతో మామూలు చేపలకన్నా బాసా చేపలు కొనేందుకు రెస్టారెంట్లు ఆసక్తి చూపిస్తున్నాయి (ఫైల్ ఫొటో)

అంత దూరం ఎగుమతి చేసినా ఎలా తాజా ఉంటాయి?

బాసా చేపను చెరువులు, నదిలో నుంచి తీసిన తరువాత ప్రాసెసింగ్ ప్లాంట్ కి వెళ్లే వరకూ నీటిలోనే ఉంచుతారు. అంటే బతికి ఉండగానే ప్లాంట్ కు వెళతాయి. అక్క చర్మం, తల, తోక, ముల్లు తీసేసి అప్పుడు ప్యాక్ చేసి అత్యంత శీతల ఉష్ణోగ్రతలో ఉంచుతారు.

అవి ఖండాంతరాలు దాటి వెళ్లినా అలా ఫ్రీజ్ అయ్యే వెళ్తాయి. నెలల తరువాత రెస్టారెంట్ల వారు ఫ్రిజ్ లో నుంచి తీసినప్పుడు అంతే ఫ్రెష్ గా ఉంటాయి.

మంచిదే కదా..అందరికీ అనుకూలం అయినప్పుడు ఇంకేం సమస్య అనుకోకండి..దీనిపై అదే స్థాయిలో వివాదాలు ఉన్నాయి.

ఈ చేపకు ఉన్న భారీ డిమాండ్ వల్ల పెంపకం కూడా అంతే భారీగా పెరిగిపోయింది. వియత్నాంలో మెకాంగ్ నది డెల్టాలో వీటిని విస్తృతంగా పెంచుతారు. ఆ క్రమంలో వారు మందులు ఎక్కువగా వాడతారు. నిబంధనలు పాటించడం అరుదు. దీనివల్ల అక్కడ పర్యావరణానికి బాగా నష్టం జరుగుతోందని సీ ఫుడ్ వాచ్ అనే సంస్థ చెబుతోంది.

బాసా చేపను తినడం తగ్గించాలని ఆ సంస్థ కోరుతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో కేజ్ కల్చర్ వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వారిది.

పెద్ద ఎత్తున సాగు చేసే క్రమంలో పెద్ద ఎత్తున రసాయనాలు వాడుతున్నారు. బాసా చేపలో పాదరసం (మెర్క్యూరీ) అవశేషాలు ఉంటున్నట్టు స్వయంగా భారత ప్రభుత్వ ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎఎస్ఎస్ఏ తెలిపింది. అయితే అన్ని శాంపిళ్ల లోనూ మెర్క్యూరీ అవశేషాలు ఉన్నట్టు నిర్ధారణ కాలేదని కూడా అదే సంస్థ చెప్పింది.

చేపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేపలు

విదేశాల్లో వివాదాలు

2008లో ఈ చేపల్లో కాలుష్య కారకాలు, యాంటీ బయాటిక్స్ ఉన్నాయని ఫ్రెంచ్ మీడియా సంస్థలు వార్తలు వేస్తే, వియత్నాం దేశ సముద్ర ఉత్పత్తుల సంఘం ఆ వార్తలను ఖండించింది. ఆస్ట్రేలియాలో ఈ చేప పేరు చెప్పకుండా వివిధ వంటకాల్లో వాడడంపై స్థానిక వినియోగదారులు ఆందోళన చేశారు.

ఈ చేప విషయంలో 2002లో అమెరికా వియత్నాం మధ్య వివాదం రేగింది. వియత్నాం దేశం ఈ చేపను పెద్ద మొత్తంలో ఎగుమతి చేసి అమెరికన్ మార్కెట్లను ముంచెత్తుతోందని ఆరోపించింది అమెరికా.

చివరకు అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు) ఈ చేప దిగుమతిపై 2003లో నియంత్రణలు విధించింది. అలాగే చేప పేరు స్పష్టంగా ప్యాకింగ్ పై రాయాలని ఆదేశాలిచ్చింది.

చూడటానికి ఒకేలా ఉండే పంగాసిస్ కుటుంబానికి చెందిన వేరే చేపలకు బాసా పేరు పెట్టి అమ్మేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వచ్చింది. 2010లో బ్రిటన్ లో ఒక రెష్టారెంట్లో వేరే చేప బదులు బాసా ఇచ్చారన్న ఆరోపణలపై ఆ రెష్టారెంటుకు జరిమానా విధించింది అక్కడి స్థానిక ప్రభుత్వం.

బ్రిటన్ ‌లో చవగ్గా దొరకే సీఫుడ్ గా బాసాకు చాలా క్రేజ్ ఉంది.

బాసా వివాదం నేపథ్యంలో, సముద్ర ఉత్పత్తులపై వాటి అసలు పేర్లు రాయాలని డిమాండ్ చేస్తూ, పర్యావరణ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ పీస్ 2015లో ఒక ఆందోళన కూడా చేసింది.

చేపలకు భారత్ పెద్ద మార్కెట్ (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేపలకు భారత్ పెద్ద మార్కెట్ (ఫైల్ ఫొటో)

ఇంతకీ బాసా తినొచ్చా లేదా?

''ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవరి దగ్గరా లేదు. దాదాపు పదిహేనేళ్లుగా భారతీయులు విపరీతంగా తింటోన్న చేపల జాబితాలో బాసా ఉంది. దానివల్ల తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని కొన్ని సంస్థలు చెప్పడం తప్ప ఏ విధమైన ఆధారాలూ లేవు. నిల్వ చేసిన చేపలు తినడం ఇష్టం లేని వారికి మినహా మిగతా వారికి బాసాపై అభ్యంతరాలూ లేవు. అసలు ఈ రోజుల్లో చాలా మందికి చేప అనే తెలుసు తప్ప తాము ఏం చేప తింటున్నామో పేరు తెలుసుకునే ఆసక్తీ లేదు. అలాంటప్పుడు ఈ చేప తినడం వల్ల నష్టం లేదు'' అంటారు రవి.

ఇంటర్నెట్‌లో కూడా ఈ చేపలో ఉండే పోషకాల వివరాలు, ఈ చేప తినవచ్చా లేదా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.

మొత్తానికి భారతీయ చేపలన్నింటినీ పక్కకు నెట్టి, ఇండియాన్ మార్కెట్ ను ఆక్రమించేసింది బాసా.. ఒక్క భారతే కాదు...చాలా దేశాలలో ఈ పరిస్థితి ఉంది.

ఈ చేపకు డిమాండ్ ఉంది, సప్లై ఉంది...శుభ్రం చేయడం, సిద్ధం చేయడంలో సులువు ఉంది. అన్నిటికీ మించి ఆయా దేశాల్లో దొరికే స్థానిక చేప కంటే చవగ్గా దొరుకుతుంది. నిల్వ ఉంటుంది. ఇవే బాసాను ప్రపంచ మార్కెట్లో నంబర్ వన్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)