నైజీరియా: 8 ఏళ్లు బోకో హరాం తీవ్రవాదుల చెరలో గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అమ్మాయి కథ..

హస్సానా అదాము

ఫొటో సోర్స్, Rebecca Galang

    • రచయిత, అడావ్‌బీ ట్రిషియా న్వాబని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నైజీరియాలోని చిబాక్‌లో బోకో హరాం తీవ్రవాదుల చేతిలో స్కూలు పిల్లలు అపహరణకు గురై 8 సంవత్సరాలు అయింది. బోకో హరాం బందీ నుంచి విడుదల అయిన ఒక అమ్మాయితో నైజీరియా విలేఖరి, నవలా రచయత అడావ్‌బీ ట్రిషియా న్వాబని మాట్లాడారు. ఈ అమ్మాయి కంటే ముందు మరి కొంత మంది విద్యార్థినులు విడుదల అయ్యారు. అయితే, ప్రభుత్వం ఆమె కంటే ముందు విడుదల అయిన అమ్మాయిలతో పోలిస్తే తన పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని చెప్పారు.

నైజీరియాలోని చిబాక్‌లోని ఒక స్కూలు నుంచి బోకో హరాం తీవ్రవాదులు స్కూలు పిల్లలను అపహరించిన 8 సంవత్సరాల తర్వాత హస్సానా అదాము ఇంటికి తిరిగొచ్చారు. ఇంటికొచ్చి కుటుంబంతో కలవడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది.

అయితే, ఆమె కంటే ముందు బందీ నుంచి విడుదలయిన తన తోటి విద్యార్థులను ప్రత్యేకంగా చూస్తున్న మాదిరిగా తనను చూడటం లేదని ఆమె దిగులు చెందుతున్నారు.

"ప్రభుత్వం నా పట్ల కూడా మేలు జరిగేలా ప్రవర్తిస్తే బాగుంటుంది" అని ఆమె నాతో చెప్పారు

"నాకు స్కూలుకు తిరిగి వెళ్లి మంచి జీవితాన్ని సాగించాలని ఉంది" అని అన్నారు.

అదాము అపహరణకు గురయ్యేటప్పటికి ఆమెకు 18 సంవత్సరాలు. 2014, ఏప్రిల్ 14 అర్ధరాత్రి స్కూలు డార్మిటరీ నుంచి బోకో హరాం అపహరించిన 200 మంది విద్యార్థుల్లో ఈమె ఒకరు.

ఆమె సహవిద్యార్థులు ఇద్దరు ఈ ఏడాది జనవరిలో తమ కుటుంబాలను కలిసారని చెప్పారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా అమ్మాయిలను విడుదల చేశారు.

2016-2018 మధ్యలో ముగ్గురు చిబాక్ అమ్మాయిలను బోకో హరాం స్థావరం సంబీసా అడవి నుంచి నైజీరియా సైన్యం రక్షించింది. నైజీరియా ప్రభుత్వం, మిలిటెంట్ల మధ్య జరిగిన చర్చల తర్వాత మరో 103 మందిని విడుదల చేశారు.

ఈ విద్యార్థులు వెనక్కి తిరిగి రావడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వాళ్ళ కథలను, అనుభవాలను ప్రచురించేందుకు అంతర్జాతీయ మీడియా పరుగులు పెట్టింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆ పిల్లలను రాజధానికి ఆహ్వానించి రాష్ట్రాల గవర్నర్లు, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులతో పాటుగా వారిని కలిశారు.

బోకో హరాం చెర నుంచి విడుదలైన అమ్మాయిలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బోకో హరాం చెర నుంచి విడుదలైన అమ్మాయిలు

కొన్ని నెలల పాటు ఆ అమ్మాయిలను అబూజాలోని మహిళా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రభుత్వ వసతిలో ఉంచారు. ప్రభుత్వ పునరావాస పథకం కింద వారికి వైద్య, మానసిక సహాయం అందించారు.

వారికి మూడు పూట్లా భోజనం పెట్టి ఉచితంగా దుస్తులు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు కూడా ఇచ్చారు.

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయీ లాంటి వారు కూడా ఈ అమ్మాయిలను సందర్శించారు. స్కూలుకు వెళ్లినందుకు తాలిబాన్ మిలిటెంట్లు 2012లో మలాలా తల పై తుపాకీ పేల్చారు.

ఇక్కడ పునరావాసం కల్పించిన తర్వాత వారిని నైజీరియాలోని యోలాలో ఉన్న అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ నైజీరియా (ఏయూఎన్)లో ప్రత్యేక కోర్సు చేసేందుకు పంపించారు. దీని కోసం ప్రభుత్వం వారి చదువు కోసం స్కాలర్ షిప్ లను కూడా ఇచ్చింది.

4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే యూనివర్సిటీలో చదువును కొనసాగించాలన్న చిబాక్ అమ్మాయిలకు ప్రభుత్వమే ఇప్పటికీ స్పాన్సర్ చేస్తోంది.

Zainabu Mala, mother of Kabu, one of the abducted girls, holds a picture of her daughter on April 12, 2019 in Chibok
AFP
Chibok Girls

  • 276kidnapped

  • 57escaped

  • 7found

  • 103released

  • 109still missing

Source: Bring Back Our Girls/ EnoughIsEnough

'నాకు వివాహం కావడం వల్ల ఇలా జరుగుతోందా?

"ప్రభుత్వం అమ్మాయిలను ఎలా చూసుకుంటుందో ఆ అమ్మాయిలే నాకొకసారి చెప్పారు" అని అదాము అన్నారు.

ఆమె విడుదల అయిన తర్వాత మిగిలిన విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడారు. "వాళ్ళను తిరిగి స్కూలుకు పంపే ముందు అబూజాలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నాకు వివరించారు" అని చెప్పారు.

"మేము చాలా రోజుల పాటు బందీలుగా ఉండిపోవడమో లేదా ముందుగానే పెళ్లి అవ్వడం వల్లో తెలియటం లేదు.

అందుకే ప్రభుత్వం మా గురించి శ్రద్ధ తీసుకోవాలని అనుకోవడం లేదేమో" అని అన్నారు.

అదామును బందీగా తీసుకెళ్లిన రెండు సంవత్సరాల తర్వాత ఒక బోకో హరాం సభ్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. అక్కడ బందీలుగా ఉన్న అమ్మాయిలకు మరో మార్గం లేదు. ఆమె భర్త కూడా గత సంవత్సరం నైజీరియా ప్రభుత్వానికి లొంగిపోయారు.

ఒక మార్చి నెలలోనే ఒక వారంలో 7000 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయినట్లు నైజీరియా సైన్యం చెబుతోంది.

వీడియో క్యాప్షన్, మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి.

అదాము, ఆమె భర్త బోర్నో రాజధాని మైదుగురిలో 5 నెలల పాటు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు శిబిరాల్లో ఉన్నారు.

ఆ తర్వాత ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను చిబాక్‌లో ఉన్న ఆమె పుట్టింటికి పంపేశారు. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను వదిలిపెట్టి తన కుటుంబం దగ్గరకు వెళ్లిపోయారు.

"నాకు జరిగింది పెళ్లి అని అనలేం. నాకు, నా పిల్లలకు మెరుగైన జీవితం కావాలి. నేను తిరిగి ఆయన దగ్గరకు వెళ్లాలని అనుకోవడం లేదు" అని ఆమె అన్నారు.

మరో ఇద్దరు చిబాక్ అమ్మాయిలు కూడా వారిని పెళ్లి చేసుకున్న వ్యక్తుల నుంచి విడిపోయారు.

"ఆ అమ్మాయిలను కూడా పిల్లలతో సహా ఇంటికి పంపించారు" అని మిస్సింగ్ గర్ల్స్ పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ యాకుబు కేకి చెప్పారు. ఈ ముగ్గురు అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

"చిబాక్ అమ్మాయిల పై ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడాన్ని చూస్తుంటే, అపహరణకు గురైన మిగిలిన 109 మంది అమ్మాయిలు తిరిగి కుటుంబాలతో ఎప్పటికీ కలవకపోవచ్చు అని అనిపిస్తోంది" అని ఆమె అన్నారు. "వాళ్ళను కనీసం రక్షించగలరో లేదో కూడా తెలియడం లేదు" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

"ఇటీవల విడుదల అయిన ముగ్గురు చిబాక్ అమ్మాయిలకు అధ్యక్షుడు బుహారీని కలిసే అవకాశం రాలేదు" అని మహిళా వ్యవహారాల మంత్రి డేమ్ పాలీన్ టాలెన్ చెప్పారు. కానీ, అవకాశం రాగానే, ఆయన వారందరినీ సంతోషంగా కలుస్తారని చెప్పారు.

కొంత మంది విద్యార్థులు వాళ్ళ తల్లితండ్రులను సంప్రదించి మైదుగురి ప్రభుత్వ శిబిరాల్లో ఉన్నట్లు తెలియచేసారు అని చెప్పారు. కొంత మంది కొన్ని మారుమూల గ్రామాల నుంచి కూడా కుటుంబాలను సంప్రదించారు.

గతంలో అయితే, అలాంటి సమాచారం అందిన వెంటనే వారిని కనిపెట్టేందుకు ప్రభుత్వం విపరీతంగా గాలింపు చర్యలు చేపట్టి ఉండేది.

"సంబీసా అడవి నుంచి కూడా సుమారు ఐదు మంది అమ్మాయిలు తమ తల్లి తండ్రులకు కాల్ చేస్తున్నారు. వాళ్లంతా గోజా పర్వతం పై ఉన్నట్లు చెబుతున్నారు" అని కేకి చెప్పారు.

"ఐదుగురు అమ్మాయిలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా మాకు కాల్ చేస్తున్నారు. ఒక అమ్మాయి మా ఎదురుగానే ఆమె తల్లితండ్రులకు కాల్ చేసింది. ఆ సమయంలో ఫోన్ స్పీకర్‌లో పెట్టాం. వాళ్ళు చిబాక్ అమ్మాయిలని ప్రభుత్వానికి తెలుసో తెలియదో మాకు తెలియదు" అని అన్నారు.

Photo of Adaobi Tricia Nwaubani
A T Nwaubani
Once upon a time, the Chibok girls were victims of a most shocking and unusual incident - children stolen from inside the four walls of their school.
Adaobi Tricia Nwaubani
Nigerian writer

పెరిగిన స్కూల్ విద్యార్థుల అపహరణాలు

ఈ అమ్మాయిల మూలాల గురించి ప్రభుత్వానికి అవగాహన ఉండటం వల్ల జరిగే తేడా ఏమి ఉండదు. ఒకప్పుడు చిబాక్ అమ్మాయిలు చాలా దిగ్భ్రాంతి కలిగించే అసాధారణమైన సంఘటనలకు బాధితులు. తమ స్కూలు నాలుగు గోడల నుంచి అపహరణకు గురయ్యేవారు. కానీ, గత రెండేళ్లుగా నైజీరియాలో స్థానిక ముఠాలు చేసే అపహరణలు పెరిగాయి.

మార్చి 2020 నుంచి సెప్టెంబరు 2021 మధ్యలో ఉత్తర నైజీరియాలో స్కూళ్ల నుంచి కనీసం 1409 మంది విద్యార్థులు కిడ్నాప్ కు గురయ్యారని నైజీరియా ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ ఎస్ బీ ఎమ్ చెబుతోంది. ఈ అమ్మాయిల విడుదల కోసం తీవ్రవాదులు కనీసం 530,000 డాలర్లను (సుమారు రూ. 4.04 కోట్లు) బెదిరించి వసూలు చేసినట్లు చెప్పారు.

చిబాక్ అమ్మాయిలను విడిచిపెట్టేందుకు బోకో హరాం తీవ్రవాదులకు నైజీరియా ప్రభుత్వం 3.3 మిలియన్ డాలర్లను చెల్లించింది.

అయితే, ఇటీవల చోటు చేసుకున్న కిడ్నాప్ ల విషయంలో ప్రభుత్వ జోక్యం పెద్దగా కనిపించటం లేదు.

పిల్లలను విడుదల చేసేందుకు పిల్లల తల్లితండ్రులు, బంధువులే బందిపోట్లు డిమాండు చేసే సొమ్మును చెల్లించాలని చెబుతోంది.

అయితే, అదాము కూడా గతంలో విడుదల అయిన మిగిలిన అమ్మాయిల మాదిరిగానే ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హురాలని భావిస్తున్నారు. కనీసం ఏ యూ ఎన్ లో స్కాలర్ షిప్ పథకంలో అయినా తనను భాగస్థురాలిని చేయాలని కోరుతున్నారు.

"మేమంతా ఈ వేదనలో ఒకేసారి మునిగాం. కానీ, మిగిలిన అమ్మాయిలు అమెరికన్ అమ్మాయిల్లా తయారైతే, నేను మాత్రం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండాల్సి వస్తోంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, బ్యాలె డ్యాన్స్‌లో మూస పద్ధతులను సవాలు చేస్తున్న బాలుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)