యుక్రెయిన్: రష్యాకు చైనా ఎలాంటి సాయం చేస్తోంది, దీంతో ఆంక్షల ప్రభావం తగ్గుతుందా? -BBC Reality Check

పుతిన్, షీ జింగ్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కాయ్ వాంగ్, వాన్ యువాన్ సాంగ్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

తమపై విధించిన ఆర్ధిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం రష్యా మిత్రదేశాల సహకారాన్ని కోరేందుకు ప్రయత్నిస్తోంది.

తమ ఇంధన ఎగుమతులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.

యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం విషయంలో చైనా ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. రెండు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా పిలుపునిచ్చింది. పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలను విమర్శించినప్పటికీ రష్యా చేస్తున్న దాడిని మాత్రం ఖండించలేదు.

రష్యా

రష్యాతో పెరుగుతున్న చైనా వాణిజ్యం

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రష్యాతో చైనా ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగింది. గత ఏడాది కంటే 28% వాణిజ్యం పెరిగినట్లు చైనా కస్టమ్స్ డేటా వెల్లడించింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి గత ఏడాదితో పోలిస్తే రెండు దేశాల మధ్య వాణిజ్యం 12% పెరిగింది.

2021లో రష్యా మొత్తం వాణిజ్యంలో చైనా వాటా 18 శాతం. గత ఏడాది ఈ వాణిజ్యం విలువ సుమారు 147 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు).

2024 నాటికి రెండు దేశాల వాణిజ్యాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచేందుకు కృషి చేస్తామని గత ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా చైనాలో పర్యటించినప్పుడు పుతిన్ చెప్పారు.

అయితే, రష్యాతో అత్యధిక మొత్తంలో వాణిజ్య సంబంధాలున్న దేశాల్లో యూరోపియన్ యూనియన్ అత్యంత పెద్ద బ్లాక్‌గా ఉంది.

2021లో యూరోపియన్ యూనియన్, రష్యాల మధ్య జరిగిన వాణిజ్యం.. చైనా వాణిజ్య విలువ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది.

"రష్యాపై విధించిన ఆంక్షలతో యూరోపియన్ యూనియన్, రష్యాల మధ్య జరిగే వాణిజ్యం తగ్గుముఖం పడుతోంది" అని ట్రేడ్ ఎకనామిస్ట్ రెబెక్కా హార్డింగ్ చెప్పారు. "ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ తమ దిగుమతుల కోసం వేరే దేశాలను ఆశ్రయిచడంపై దృష్టి పెట్టింది" అని అన్నారు.

చైనా

చైనా కొనుగోలు చేయగలదా?

రష్యా ఇంధనం, చమురు, బొగ్గుకు చైనా అత్యంత పెద్ద మార్కెట్‌గా ఉంది.

యుక్రెయిన్‌పై దాడికి ఒక్క వారం ముందే, 20 బిలియన్ డాలర్లకుపైగా విలువైన బొగ్గు ఒప్పందంపై చైనా, రష్యా అంగీకారం కుదుర్చుకున్నాయి.

చైనాతో కొత్తగా సుమారు 117.5 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, చమురు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పుతిన్ ప్రకటించారు.

రెండు దేశాలు కలిసి పవర్ ఆఫ్ సైబీరియా2 అనే కొత్త గ్యాస్ పైపులైన్‌ను నిర్మించాయి . 2019లో ఈ పైప్‌లైన్ కార్యకలాపాలు ప్రారంభించింది. 400 బిలియన్ డాలర్ల విలువున్న ఈ పైపులైన్‌కు 30 ఏళ్ల కాంట్రాక్ట్ ఉంది.

ఎల్‌ఎన్‌జీ టెర్మినల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్

కానీ, ఇప్పటివరకు రష్యాకు అతి పెద్ద ఇంధన మార్కెట్ అంటే యూరోపియన్ యూనియనే. యూరోపియన్ యూనియన్‌కు రష్యా 40 శాతం గ్యాస్‌ను 26% చమురును సరఫరా చేస్తోంది.

"గత ఐదేళ్లుగా చైనాకు వెళ్తున్న ఇంధనం, చమురు ఎగుమతులు ఏటా 9% పెరుగుతున్నాయి" అని డాక్టర్ హార్డింగ్ చెప్పారు.

"ఈ వృద్ధి వేగంగా పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్‌తో రష్యా చేస్తున్న వ్యాపారంతో పోలిస్తే, చైనాతో జరుగుతున్న వ్యాపారం ఆ మార్కెట్‌లో సగం ఉంటుంది’’అని ఆయన అన్నారు.

రష్యా నుంచి సరఫరా అయ్యే ఇంధన దిగుమతులను మూడింట రెండు వంతులు తగ్గించడం ద్వారా రష్యా పై ఆధారపడటాన్ని యూరోపియన్ యూనియన్ తగ్గిస్తోంది.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

రష్యా సహజ వాయువుకు ప్రధాన ఎగుమతి దేశమైన జర్మనీ కూడా నోర్డ్ స్ట్రీమ్-2 గ్యాస్ పైపులైన్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది.

ఈ కొత్త పైపు లైనులో ఐదో వంతు మాత్రమే చైనాకు సరఫరా అయ్యేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఒక విశ్లేషణ చెబుతోంది.

అయితే, ఈ కొత్త పైపులైను పూర్తిగా ఎప్పటికి సిద్ధమవుతుందో స్పష్టంగా తెలియదు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా

చైనా దీర్ఘ కాలంలో బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించుకుని రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను పెంచుకునే ఆలోచనలో ఉండొచ్చు.

గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ను తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకునేందుకు దీనినొక మార్గంగా ఎంచుకోవచ్చు.

2022 తొలి రెండు నెలల్లో రష్యా నుంచి చైనా ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు డేటా చెబుతోంది.

ప్రభుత్వ సంస్థలు కూడా కొత్తగా రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదు.

రష్యాకు చైనా మిలిటరీ సహాయం అందిస్తుందా?

చైనాను రష్యా సైనిక సామగ్రి సరఫరా చేయాలని కోరిందని ఒక అమెరికా అధికారి మీడియాతో చెప్పారు. అయితే, చైనా ఈ వాదనలను తప్పుడు సమాచారం అని ఖండించింది.

ఇటీవల కాలంలో ఆయుధ సరఫరా కొత్త మార్గంలో సాగుతోంది.

చైనా తన సైనిక దళాలను ఆధునికీకరించేందుకు ఎక్కువగా రష్యా మిలిటరీ హార్డ్‌వేర్‌పై ఆధారపడుతోంది.

2017- 2021 మధ్యలో చైనా చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో 80% రష్యా నుంచే జరిగాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

చైనా డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా డ్రోన్లు

ఇవి రష్యా మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 21% ఉన్నాయి. దీని ప్రకారం రష్యాకు రెండవ పెద్ద ఆయుధ దిగుమతిదారు చైనా అని తెలుస్తోంది.

చైనా కూడా క్రమంగా సొంతంగా ఆయుధాలను సమకూర్చుకునే సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది.

ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే నాలుగవ పెద్ద ఆయుధ ఎగుమతుదారుగా ఉంది.

"చైనా ఆయుధాలు అత్యంత అధునాతనంగా తయారవుతున్నాయి. ఉదాహరణకు చైనాలో తయారయ్యే డ్రోన్‌లపై రష్యా ఆసక్తి చూపించవచ్చు" అని ఎస్‌ఐపీఆర్‌ఐకు చెందిన సీమన్ వీజ్‌మ్యాన్ చెప్పారు.

"కానీ, ఇప్పటి వరకు చైనా డ్రోన్లను రష్యా కొనుగోలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు కనిపించలేదు" అని ఆయన అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆర్ధికంగా కూడా సహాయం చేస్తుందా?

కొన్ని రష్యన్ ఆర్థిక సంస్థలను స్విఫ్ట్ చెల్లింపులు చేసేందుకు వీలు లేకుండా నిషేధించారు.

దీంతో, చైనాలో ఉన్న సంస్థలు రష్యాతో చేసే కొనుగోళ్లను తగ్గించాల్సి వచ్చింది.

ఇటీవల కాలంలో రెండు దేశాలు ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించే దిశగా వెళ్తున్నాయి.

ఆర్ధిక చెల్లింపుల కోసం సిస్టం ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మెసేజెస్ విధానం కోసం రష్యా ప్రయత్నిస్తోంది.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

చైనాకు క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టం (సీఐపీఎస్) ఉంది. దీని ద్వారా రెండు దేశాలు తమ సొంత కరెన్సీలతో లావాదేవీలు నిర్వహిస్తాయి.

కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో స్విఫ్ట్ చెల్లింపులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 17% మాత్రమే చైనీస్ యువాన్ ద్వారా జరుగుతోందని (ఇది 2014తో పోలిస్తే 3.1% ఎక్కువ) రష్యన్ అధికారిక అంచనాలు చెబుతున్నాయి.

రెండు దేశాల మధ్య ఇంధన వాణిజ్యం మాత్రం ఎక్కువ మొత్తం అమెరికన్ డాలర్లలోనే జరుగుతోంది. కానీ, చైనా సంస్థలు మార్చిలో రష్యా చమురు, బొగ్గు కొనుగోలు చేసేందుకు యువాన్ వాడారని నివేదికలు చెబుతున్నాయి.

చైనా రష్యాతో ఆహార వాణిజ్యాన్ని పెంచుతుందా?

రష్యాలో ఉత్పత్తయ్యే గోధుమ, బార్లీలకు చైనా అతి పెద్ద దిగుమతిదారుగా ఉంది.

ఈ మధ్య కాలం వరకు రష్యా నుంచి దిగుమతి అయ్యే గోధుమ, బార్లీ దిగుమతులపై చైనా నిబంధనలు విధించింది. కానీ, యుక్రెయిన్‌పై దాడి మొదలైన వెంటనే ఈ నిబంధనలన్నిటినీ ఒక్కసారిగా సడలించింది.

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)