రష్యా-యుక్రెయిన్: సముద్రంలో మునిగిన రష్యా భారీ యుద్ధ నౌక 'మాస్క్వా' గురించి మనకేం తెలుసు?

ఫొటో సోర్స్, Reuters
రష్యా నౌకాదళ శ్రేణిని ముందుండి నడిపించే భారీ క్షిపణి ప్రయోగ నౌక 'మాస్క్వా' నల్ల సముద్రంలో మునిగిపోయిందని రష్యా అధికారిక మీడియా పేర్కొంది.
మాస్క్వాలోని మందుగుండు సామగ్రి పేలిపోవడం వల్ల అది తీవ్రంగా దెబ్బతిన్నదని, ఓడరేవుకు తరలిస్తుండగా నల్ల సముద్రంలో బోల్తా కొట్టిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, పేలుడు పదార్థాల వద్దకు మంటలు ఎలా వ్యాపించాయన్నది తెలియలేదని ప్రకటించింది.
అయితే, మాస్క్వా నౌకను తమ నెప్ట్యూన్ మిసైల్స్‌తో కూల్చివేశామని యుక్రెయిన్ చెబుతోంది.
510 మంది సిబ్బందితో కూడిన ఈ యుద్ధ నౌక, యుక్రెయిన్‌పై రష్యా నౌకాదళ దాడికి నాయకత్వం వహించింది.
అగ్ని ప్రమాదమా? క్షిపణి దాడి జరిగిందా?
యుద్ధ నౌక మునిగిపోవడానికి ముందు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ''నౌక తీవ్రంగా దెబ్బతింది. సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
యుద్ధనౌకలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని, దీంతో నౌకను తిరిగి ఓడరేవుకు తీసుకొస్తామని గురువారం మధ్యాహ్నం తెలిపింది. కానీ, ఆ తర్వాత జారీ చేసిన ప్రకటనలో మాత్రం... ''అడుగు భాగం తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా ఓడరేవుకు తరలిస్తుండగా నౌక అదుపు కోల్పోయింది. అస్థిరమైన సముద్ర జలాల కారణంగా నౌక మునిగిపోయింది'' అని పేర్కొంది.
ఏదో పేలుడు కారణంగానే నౌకలో అగ్నిప్రమాదం జరిగిందన్న రష్యా వర్గాలు... క్షిపణి దాడి గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
మరోవైపు, క్రూయిజర్‌పై తామే దాడి చేశామని యుక్రెయిన్ చెబుతోంది. ఇటీవలే యుక్రెయిన్‌లో తయారు చేసిన క్షిపణులతో నౌకను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది.
''నౌకలో మందుగుండు పేలిపోవడం, ప్రతికూల వాతావరణం కారణంగా రష్యా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని'' మాస్క్వా మునిగిపోవడానికి ముందు చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
దీన్ని బీబీసీ నిర్ధరించలేకపోయింది.

ఫొటో సోర్స్, MAXAR TECHNOLOGIES
మాస్క్వా క్రూయిజర్ చరిత్ర
నిజానికి సోవియట్ కాలంలో యుక్రెయిన్‌లో నిర్మితమైన మాస్క్వా నౌక, 1980 దశకం ప్రారంభంలో సర్వీస్‌లోకి చేరిందని రష్యా మీడియా తెలిపింది.
గతంలో సిరియా సంక్షోభ సమయంలోనూ ఈ నౌక విధులు నిర్వహించింది.
ఈ నౌకలో డజనుకు పైగా వల్కన్ యాంటీ షిప్ మిసైల్స్, యాంటీ సబ్‌మెరైన్‌లు, మైన్-టోర్పడో ఆయుధాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధ్వంసమైన రష్యాకు చెందిన రెండో కీలక నౌక మాస్క్వా.
మాస్క్వా యుద్ధ నౌకలో 510 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. దీని పొడవు 186.4 మీ. ఇది గంటకు 59 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 19 వేల కిలోమీటర్ల పరిధిలోకి లక్ష్యాలను చేధించగలదు. ఇందులో ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది.

మాస్క్వాకు ఎలాంటి రక్షణ ఉంది?
''రష్యా ఆక్టివ్ ఫ్లీట్‌లో ఉన్న మూడో అతిపెద్ద నౌక ఈ స్లావా క్లాస్ క్రూయిజర్ మాస్క్వా'' అని బీబీసీతో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన నౌకాదళ నిపుణుడు జొనాథన్ బెంథమ్ అన్నారు.
ఇందులో మూడు అంచెల వైమానిక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే నెప్ట్యూన్ మిసైల్ దాడి నుంచి తప్పించుకునేందుకు ఇది మూడు అవకాశాలను సృష్టించి ఉండేది.
మధ్య రకం, స్వల్ప శ్రేణి రక్షణ వ్యవస్థలతో పాటుగా చివరి ప్రయత్నంగా ఆరు షార్ట్ రేంజ్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ (సీఐడబ్ల్యూఎస్) వ్యవస్థలను కూడా ఈ నౌక ఉపయోగించుకోగలదు.
మాస్క్వాకు 360 డిగ్రీల యాంటీ ఎయిర్ డిఫెన్స్ కవరేజీ ఉండాల్సింది అని బెంథమ్ అన్నారు.
''సీఐడబ్ల్యూఎస్ వ్యవస్థ ఒకే నిమిషంలో 5000 రౌండ్ల కాల్పులు జరుపుతూ, క్రూయిజర్ చుట్టూ రక్షణ గోడను సృష్టిస్తుంది. ఈ వ్యవస్థను ఆఖరి ఆయుధంగా వాడుకుంటారు'' అని ఆయన వివరించారు.
ఒకవేళ ఇది నిజంగా క్షిపణి దాడిగా రుజువైతే మాత్రం రష్యా ఉపరితల దళాల ఆధునీకరణ సామర్థ్యాలపై ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
''మరీ ముఖ్యంగా, నౌకలో మూడంచెల యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పుడు క్షిపణి దాడి జరగడం చాలా కష్టం'' ఆయన అన్నారు.

నెప్ట్యూన్ క్షిపణులు
యుక్రెయిన్‌లో తయారు చేసిన నెప్ట్యూన్ క్షిపణులతో మాస్క్వా నౌకపై దాడి చేశామని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న తర్వాత, నల్ల సముద్రం ప్రాంతంలో రష్యా నుంచి పెరుగుతోన్న ముప్పును ఎదుర్కోవడానికి యుక్రెయిన్ మిలిటరీ ఇంజినీర్లు క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను రూపొందించారు.
కీయెవ్ పోస్ట్ ప్రకారం, యుక్రెయిన్ నావికా దళం గత ఏడాది మార్చిలో 300 కి.మీ శ్రేణి నెప్ట్యూన్ క్షిపణుల మొదటి డెలివరీని అందుకుంది.
దాడి ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమ దేశాలు, యుక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి. 100 మిలియన్ పౌండ్ల విలువైన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ క్షిపణులను యుక్రెయిన్‌కు పంపిస్తామని గత వారమే యూకే ప్రకటించింది.
నెప్ట్యూన్ క్షిపణి ప్రత్యేకతలు
టైప్: యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్
వార్‌హెడ్: హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్
బరువు: 870 కేజీలు
పొడవు: 5.05 మీటర్లు
రేంజ్: 170 మైళ్లు

ఫొటో సోర్స్, MAX DELANY/AFP
నల్ల సముద్రం ఆధిపత్యం
''నల్లసముద్రంలో రష్యా నావికా దళ శక్తికి చిహ్నం ఈ యుద్ధ నౌక'' అని బీబీసీతో రష్యా మారిటైమ్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మైఖేల్ పీటర్సన్ అన్నారు.
''యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌కు మాస్క్వా నౌక ఒక ముళ్ల కంపలా ఉంది. ఇప్పుడు దీన్ని నాశనం చేయడం అంటే యుక్రెయిన్ల నైతిక సామర్థ్యాన్ని కచ్చితంగా పెంచుతుంది'' అని ఆయన అన్నారు.
క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి నల్ల సముద్రంలో రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీన్ని ఉపయోగించుకునే యుక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించింది.
యుక్రెయిన్‌లో ఎక్కడైనా క్రూయిజ్ మిసైల్స్‌ను ప్రయోగించే సామర్థ్యం నల్ల సముద్రంలోని రష్యా నౌకాదళం సొంతం. ఈ సామర్థ్యమే యుద్ధంలో రష్యాకు మద్దతుగా నిలిచింది. మరియుపూల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చేస్తోన్న ప్రయత్నాలకు అండగా నిలవడంలో కూడా ఇక్కడి నౌకా దళమే ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
- రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











