యుక్రెయిన్: రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ.. వీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే..

విరా వీపుపై తల్లి రాసిన వివరాలు

ఫొటో సోర్స్, SASHA MAKOVIY

రెండేళ్ల తన కూతురి వీపుపై కాంటాక్ట్ డీటెయిల్స్ రాసిన యుక్రెయిన్ తల్లి ఒకరు ఏ పరిస్థితుల్లో అలా రాయాల్సి వచ్చిందో బీబీసీతో చెప్పారు.

యుద్ధం గుప్పిట చిక్కుకున్న సొంత దేశాన్ని కుటుంబం సహా వీడుతున్నప్పుడు కలిగిన బాధను, భయాన్ని ఆమె వివరించారు.

దేశం నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఒకవేళ తాము ఒకరి నుంచి ఒకరు విడిపోయినా, చనిపోయినా తమ వివరాలు తెలియాలనే ఇలా తన కూతురు విరా వీపుపై ఆమె పేరు, వయసు, కొన్ని ఫోన్ నంబర్లు రాసినట్లు తల్లి సాషా మకోవీయ్ చెప్పారు.

''ఒకవేళ మేమంతా చనిపోతే అప్పుడు ఆమె ఎవరో తెలుస్తుందనే ఇలా రాశాను'' అన్నారు సాషా.

ప్రస్తుతం సాషా కుటుంబం ఫ్రాన్స్‌లో ఉంది. ''ప్రేమాభిమానాల మధ్య సురక్షితంగా ఉన్నాం ఇప్పుడు'' అని చెప్పారు సాషా.

విరా, సాషా

ఫొటో సోర్స్, SASHA MAKOVIY

ఫొటో క్యాప్షన్, విరా, సాషా

దక్షిణ ఫ్రాన్స్‌కు చేరుకున్న తరువాత సాషా తన కుమార్తె వీపుపై రాసిన వివరాలను ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో వైరల్‌గా మారిపోయింది.

''యుద్ధం మొదలైన తొలి రోజు అది. కీయెవ్‌ను వదిలి వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాం. కీయెవ్ నుంచి వెళ్లడం ఎంతవరకు సురక్షితం అనేది కూడా అప్పటికి మాకు స్పష్టత లేదు'' అని బీబీసీ రేడియో 4 'ది వరల్డ్ టునైట్' కార్యక్రమంలో సాషా చెప్పారు.

బాంబులు పడుతున్న శబ్దాలు ఓ వైపు వినిపిస్తుండగానే తమతో తీసుకెళ్లాల్సిన కొంత సామగ్రిని ప్యాక్ చేసుకున్నామని... ఏం జరుగుతోంది.. యుద్ధ తీవ్రత ఎలా ఉంది వంటి వివరాలేమీ అప్పటికి పూర్తిగా తెలియదు.. మరోవైపు ఇంటి నుంచి బయటకు వస్తే రాకెట్లు పైన పడతాయేమోనన్న భయమూ ఉంది అని ఆమె ఆ రోజు పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.

''విరా మాకు దూరమవుతుందేమో.... మేం చనిపోయి ఆమె బతికి ఉంటే తాను ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో జీవితాంతం తెలుసుకోలేదేమో అనే భయం నన్ను చుట్టుముట్టింది'' అంటూ తాను అలా రాయడానికి గల కారణాన్ని సాషా వివరించారు.

వీడియో క్యాప్షన్, ఈ యుక్రెయిన్ సైనికులు 8 ఏళ్లుగా కందకాల్లోనే ఎందుకు ఉన్నారు?

ఒకవేళ తామంతా చనిపోయి విరా ఒక్కరే బతికి ఉంటే ఆమె పరిస్థితి ఏంటని సాషా ఆందోళన చెందారు. తాను(విరా) పెద్దయ్యాక తల్లి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవడానికి కనీసం తన(సాషా) సోషల్ మీడియా అకౌంట్లలోనైనా చూసుకునే వీలుంటందనే ఈ వివరాలు రాసినట్లు తెలిపారు.

''ఇంటర్నెట్ నుంచి కనీసం కొంత సమాచారం తెలుసుకోగలుగుతుంది. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూడగలుగుతుంది. తన తల్లిదండ్రులను చూసుకోగలుగుతుంది'' అని సాషా చెప్పారు.

అయితే, తాను భయపడినట్లుగా జరగలేదని... మోల్డోవా, రొమేనియా, బెల్జియం మీదుగా ఫ్రాన్స్‌కి సురక్షితంగా చేరుకున్నామని.. అయితే, ఈ క్రమంలో తాను మాత్రం మానసికంగా పూర్తిగా నలిగిపోయానని సాషా చెప్పుకొచ్చారు.

యుద్ధం చాలా బాధాకరమైనదని.. బయట అడుగు తీసి అడుగు వేయడం కూడా ప్రమాదకరమేనని.. రాళ్లు అనుకుని మందుపాతరలపై కాలు వేస్తే ప్రాణాలే పోతాయంటూ యుక్రెయిన్‌లో పరిస్థితులను ఆమె వివరించారు.

'విరా ఇప్పుడు హాయిగానే ఉంది. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే వయసు కాదు తనది. చాలా చిన్నపిల్ల. నా దగ్గర ఏదో తెలియని అనుభూతి పొందుతుంది ఆమె, కానీ, అదేమిటో అర్థం చేసుకోలేదు. ఆమె చిన్నపిల్లగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే ఇదంతా అర్థమైతే మనసుకు బాధ తప్ప మరేమీ ఉండదు'' అన్నారు సాషా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)