ప్రధాని నరేంద్ర మోదీతో రష్యా విదేశాంగ మంత్రి సమావేశం

భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉదయం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌‌ను కూడా ఆయన కలిశారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం సహా అనేక విషయాలపై వారు చర్చించారని రష్యా విదేశాంగశాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని..

    రష్యా చమురు డిపో

    ఫొటో సోర్స్, Reuters

    తమ భూభాగంలో ఉన్న ఒక చమురు డిపోపై యుక్రెయిన్ హెలికాప్టర్లు దాడి చేశాయని రష్యా చెబుతోంది.

    శాంతి చర్చలకు ఇలాంటి ఘటనలు సానుకూల వాతావరణం కల్పించబోవని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి చెప్పారు.

    అయితే, రష్యా ఆయిల్ డిపోపై దాడి చేసింది తమ సైన్యమో కాదో నిర్ధరించలేమని, అదే సమయంలో ఖండించడమూ లేదని యుక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.

    మరియుపూల్‌ నుంచి మరింత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుక్రెయిన్, రష్యా ఉన్నతాధికారులు అంగీకరించారని రెడ్ క్రాస్ వెల్లడించింది.

    భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రష్యా, భారత్ బంధం చెక్కు చెదరదు’ అని సెర్జీ లావ్రోవ్ అన్నారు.

    శ్రీలంకలో అధ్యక్ష భవనం వద్ద నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింస వెనుక తీవ్రవాదులు ఉన్నారని అధ్యక్ష కార్యాలయం ఆరోపించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్‌ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ పథకం కింద 500 కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

  2. పాకిస్తాన్ - ఇమ్రాన్‌ఖాన్: 75 ఏళ్లలో ఒక్క పాక్ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

    పాకిస్తాన్‌లో రాజకీయాల్లో అస్థిరత ఒక్కటే సుస్థిరంగా కొనసాగుతోందా?

    ఇప్పుడు పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది?

    అక్కడ పాలించేది ప్రజాస్వామ్యమా? ఆర్మీ ఆధిపత్యమా?

    ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో...

    వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?
  3. ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి సమావేశం

    నరేంద్ర మోదీ, రష్యా విదేశాంగ మంత్రి

    ఫొటో సోర్స్, Twitter/@mfa_russia

    భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

    యుక్రెయిన్‌లో ఉన్న తాజా పరిస్థితి, రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.

    ఈ సందర్భంగా ఘర్షణ ఆపేయాలని, శాంతి స్థాపనకు ప్రయత్నించాలని మోదీ రష్యాకు మరోసారి సూచించారు.

    2021లో డిసెంబర్‌లో జరిగిన ఇండియా-రష్యా ద్వైపాక్షిక సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు ఎంతవరకు వచ్చిందో కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రధాని మోదీకి వివరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఆపత్కాలంలోనూ పోలీసులను ఆశ్రయించేందుకు ప్రజలు భయపడుతున్నారు - సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ

    సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ

    ఫొటో సోర్స్, ANI

    అపత్కాలంలోనూ కొందరు ప్రజలు పోలీసులను ఆశ్రయించేందుకు వెనకడుగు వేస్తున్నారని, ప్రజల్లో పోలీసులపై ఉన్న భయం పోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు.

    దిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డీపీ కోహ్లి మెమోరియల్ కార్యక్రమంలో ఎన్‌వీ రమణ మాట్లాడారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఈ కార్యక్రమంలో ఆయన పతకాలు ప్రదానం చేశారు.

    ‘‘అవినీతి, రాజకీయ నాయకులతో సంబంధాల వల్ల పోలీసులపై ప్రజల్లో కొంత చెడ్డపేరు ఉంది. కొందరు ప్రజలు ఆపత్కాలంలోనూ పోలీసులను ఆశ్రయించేందుకు భయపడుతున్నారు. కొందరు పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి’’అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.

    ‘‘రాజకీయ నాయకుల నుంచి దూరం పాటిస్తూ పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించాలి. నైతిక విలువలు, నిబద్ధత కూడా పెరగాలి’’

    ‘‘మౌలిక సదుపాయాల కొరత, దిగువ స్థాయిల్లో అమానవీయ పరిస్థితులు, ఆధునిక పరికరాలు లేకపోవడం లాంటి అంశాలు పోలీసు వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి’’అని జస్టిస్ రమణ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. కర్ణాటక: హలాల్ మాంసం తినొద్దని కొన్ని సంస్థలు హిందువులను ఎందుకు కోరుతున్నాయి?

    హలాల్ మాంసం

    ఫొటో సోర్స్, PA MEDIA

    కర్నాటకలో మరో వివాదం రాజుకుంటోంది.

    కన్నడ కొత్త సంవత్సరమైన ఉగాదినాడు ‘‘హలాల్’’ మాంసం తినొద్దని ప్రజలను హిందూ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి.

    హిజాబ్ వివాదం తర్వాత ఆలయాల వెలుపల వ్యాపారాలు నిర్వహించే ముస్లింలపై నిషేధం విధించాలనే డిమాండ్ వచ్చింది.

    ఇప్పుడు తాజాగా ముస్లింలు విక్రయించే హలాల్ మాంసంపై వివాదం రాజుకుంది.

  6. రష్యా:‘మా చమురు డిపోపై యుక్రెయిన్ దాడి చేసింది, ఇలాగైతే శాంతి చర్చలు కష్టం’

    రష్యా ట్యాంకులు

    ఫొటో సోర్స్, Russian Ministry of Emergency Situation

    రష్యా భూభాగంలో ఉన్న ఒక ఆయిల్ డిపోపై యుక్రెయిన్ హెలికాప్టర్లు దాడి చేశాయని రష్యా చెబుతోంది.

    శాంతి చర్చలకు ఇలాంటి ఘటనలు సానుకూల వాతావరణం కల్పించబోవని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి చెప్పారు.

    అయితే, ఈ దాడి తామే చేశామని యుక్రెయిన్ అధికారులు నిర్ధరించలేదు. కానీ మంటల్లో చిక్కుకున్న చమురు ట్యాంకుల వీడియో బయటకు వచ్చింది.

  7. ‘ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రష్యా, భారత్ బంధం చెక్కు చెదరదు’

    రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్

    ఫొటో సోర్స్, ANI

    ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా భారత్‌తో తమ సంబంధాలు దెబ్బతినవని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.

    ‘తాను చేసే రాజకీయాలే ఇతరులు కూడా చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అది ఎంత ఒత్తిడి తెచ్చినా మా సంబంధాలు దెబ్బతినవనడంలో నాకు సందేహం లేదు.’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ సెర్జీ చెప్పుకొచ్చారు.

    తాము యుక్రెయిన్ మీద చేస్తున్నది యుద్ధం కాదని సైనిక స్థావరాల మీద దాడి మాత్రమేనని ఆయన అన్నారు. రష్యా ఉనికికి ముప్పు కలిగేలా యుక్రెయిన్ ఆయుధ సంపత్తిని పెంచుకోకుండా చూడటమే తమ లక్ష్యమని మరొకసారి చెప్పుకొచ్చారు.

    ‘మా నుంచి ఏమైనా భారత్ కొనాలనుకుంటే సరఫరా చేయడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. అందుకు సంబంధించి చర్చలకు మేం సిద్ధం. భారత్, రష్యాల మధ్య మంచి సంబంధాలున్నాయి.’ అని సెర్జీ వివరించారు.

    రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన సెర్జీ లావ్రోవ్ నేడు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు.

    యుక్రెయిన్ మీద రష్యా దాడులు ప్రారంభమైన తరువాత సెరజీ లావ్రోవ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

    అనేక అంశాల మీద సెర్జీ లావ్రోవ్, జైశంకర్ చర్చించినట్లు రష్యా విదేశాంగశాఖ ట్వీట్ చేసింది.

    భారత్ రావడానికి ముందు సెర్జీ లావ్రోవ్ రెండు రోజుల పాటు చైనాలో పర్యటించారు.

  8. మారుతీ సుజుకీ రికార్డు స్థాయి ఎగుమతులు

    మారుతీ సుజుకీ బాలెనో

    ఫొటో సోర్స్, Maruti Suzuki

    మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో వాహనాలను ఎగుమతులు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,38,376 వాహనాలను ఎగుమతి చేసినట్లు సంస్థ తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఇవి అత్యధిక ఎగుమతులని వెల్లడించింది.

    మారుతీ సుజుకీ మొత్తం మీద ఇప్పటి వరకు 22 లక్షలకుపైగా వాహనాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసింది.

    పోయిన ఆర్థిక సంవత్సరంలో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెసో, బ్రెజా మోడల్స్ అత్యధికంగా ఎగుమతి అయ్యాయి.

    లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏసియాన్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లకు ఎక్కువగా వాహనాలు ఎగుమతులు అవుతున్నాయని సంస్థ తెలిపింది.

  9. జైశంకర్‌తో భేటీ అయిన రష్యా విదేశాంగమంత్రి

    రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్

    ఫొటో సోర్స్, Dr. S Jaishankar/Twitter

    రష్యా విదేశాంగమంత్రి సెర్జీ లావ్రోవ్ శుక్రవారం భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో దిల్లీలో సమావేశమయ్యారు.

    యుక్రెయిన్ మీద రష్యా దాడులు ప్రారంభమైన తరువాత సెరజీ లావ్రోవ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

    అనేక అంశాల మీద సెర్జీ లావ్రోవ్, జైశంకర్ చర్చించినట్లు రష్యా విదేశాంగశాఖ ట్వీట్ చేసింది.

    భారత్ రావడానికి ముందు సెర్జీ లావ్రోవ్ రెండు రోజుల పాటు చైనాలో పర్యటించారు.

  10. పోలండ్ నుంచి యుక్రెయిన్ వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది, ఆడం ఈస్టన్, బీబీసీ వార్సా ప్రతినిధి

    రష్యా దాడి మొదలైన నాటి నుంచి సుమారు 24 లక్షల మంది యుక్రెయిన్ ప్రజలు పోలండ్‌కు పారిపోయారని పోలిష్ బార్డర్ గార్డ్ తెలిపారు.

    అయితే కొద్ది రోజులుగా సరిహద్దులు దాటుతున్న యుక్రెయిన్ ప్రజల సంఖ్య తగ్గుతోంది. గురువారం 23 వేల మంది పోలండ్‌కు వలస వెళ్లారు. బుధవారంతో పోలిస్తే ఇది 9.5శాతం తక్కువ.

    నేడు కూడా సరిహద్దులు దాటే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది.

    మరొకవైపు పోలండ్ నుంచి యుక్రెయిన్ వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు 4 లక్షల మంది యుక్రెయిన్‌కు వెళ్లారు. ఒక్క గురువారమే 15 వేల మంది సరిహద్దు దాటారు.

  11. ఆంధ్రప్రదేశ్: పెరిగిన విద్యుత్ చార్జీలు, పెట్రోలు ధరలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

    ఉత్తరాంధ్రలో పెరిగిన విద్యుత్ ధరలకు నిరసనగా టీడీపీ నిరసన

    ఫొటో సోర్స్, UGC

    ఉత్తరాంధ్రలో నేడు ధరల పెంపుకు నిరసనగా ప్రతి పక్షాలు, కార్మిక, వ్యవసాయ సంఘాలు నిరసనకు దిగాయి.

    పెరిగిన విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయూ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

    పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

    ఉత్తరాంధ్రలో పెట్రోలు, దీజిల్ ధరల పెంపుకు నిరసనగా కార్మిక సంఘాల నిరసన

    ఫొటో సోర్స్, UGC

  12. శ్రీలంక: ‘హింసాత్మక నిరసనల వెనుక తీవ్రవాదులు’

    శ్రీలంకలో నిరసనకు దిగిన ప్రజలు

    ఫొటో సోర్స్, Reuters

    కొలంబోలో జరిగిన హింసాత్మక నిరసన ప్రదర్శనల వెనుక తీవ్రవాద గ్రూపులున్నాయని శ్రీలంక అధ్యక్షుడు గోటాబట రాజపక్ష కార్యాలయం ఆరోపించింది.

    కొన్ని మూకలు కొడవళ్లు, గోల్ఫ్ స్టిక్స్‌తో అధ్యక్షుని నివాసం వద్దకు చేరుకుని నిరసనకారులను రెచ్చగొట్టారని అది తెలిపింది.

    పోలీసులు అరెస్టు చేసిన వారిలో చాలా మంది తీవ్రవాదులు ఉన్నట్లు రాజపక్ష కార్యాలయం వెల్లడించింది.

  13. ఆంధ్రప్రదేశ్‌లో 500 కొత్త తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు

    డాక్టర్ వైఎస్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, CMO

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవల్లో భాగంగా 500 కొత్త వాహనాలను ప్రారంభించింది. వీటిలో ఏసీతోపాటు ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

    ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ద్వారా గర్భవతులను ఆసుపత్రికి తరలించడంతోపాటు ప్రసవించిన తరువాత తల్లి, బిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తారు.

  14. ఈశాన్య భారత్‌లో కొన్ని ప్రాంతాల నుంచి ఆఫ్సా చట్టం తొలగింపు

    సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఆఫ్సా) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈశాన్య భారతదేశంలోని నాగాలాండ్, అస్సాం, మణిపుర్ రాష్ట్రాలలో ఆఫ్సా పరిధిని తగ్గించింది. ఈమేరకు కొన్ని ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాల పరిధి నుంచి తప్పించింది.

  15. శ్రీలంకలో ముదురుతున్న ఆర్థికసంక్షోభం... అధ్యక్షుడు భవనాన్ని చుట్టుముట్టిన ప్రజలు

    శ్రీలంక అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు

    ఫొటో సోర్స్, Reuters

    శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థికసంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు.

    రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష ఇంటిని నిరసనకారులు చుట్టుముట్టిన సందర్భంగా హింస చెలరేగింది. దీంతో నగరంలో చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు.

    ఆ కర్ఫ్యూను శుక్రవారం ఉదయం ఎత్తివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

    శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష ఇంటి వద్ద నిరసనకు దిగిన వారిలో సుమారు 45 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    నిరసనల సందర్భంగా చెలరేగిన హింసలో గాయపడిన సుమారు 50 మంది పోలీసులు, జర్నలిస్టులు, నిరసనకారులను ఆసుపత్రిలో చేర్చారు.

    ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సుమారు 10 గంటలపాటు రోజూ కరెంటు కోతలు విధిస్తున్నారు. వీధి లైట్లను సైతం ప్రభుత్వం ఆపి వేస్తోంది.

    అమెరికా డాలరుతో పోలిస్తే శ్రీలంక రూపాయి భారీగా క్షీణించింది. ప్రస్తుతం ఒక డాలరుకు సుమారు 294 శ్రీలంక రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.

  16. యుక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించిన ముఖ్యాంశాలు:

    • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మునుపటి మాదిరిగా ఇప్పుడు అంత బలంగా లేరని బ్రిటన్ రక్షణశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.
    • శుక్రవారం నుంచి రష్యా కరెన్సీ రూబుల్స్‌లో వాణిజ్యం చేయని యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని పుతిన్ హెచ్చరించారు.
    • రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్ నుంచి ప్రజలను బయటకు తరలించేందుకు అక్కడికి బస్సులను పంపుతున్నట్లు యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
    • అమెరికా చమురు నిల్వల నుంచి 180 మిలియన్ బారెల్స్ చమురును మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
    • రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ద్రోహానికి పాల్పడిన ఇద్దరు మిలిటరీ జనరల్స్‌ను పదవుల నుంచి తొలగించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ తెలిపారు.
  17. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ: ‘ద్రోహులను పదవుల నుంచి తీసేశా’

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, EPA

    రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ద్రోహానికి పాల్పడిన ఇద్దరు మిలిటరీ జనరల్స్‌ను తొలగించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ప్రకటించారు.

    యుక్రెయిన్ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటామని ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.

    ద్రోహానికి పాల్పడిన అందరిని క్రమంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.

  18. యుక్రెయిన్: ‘రష్యా సైన్యం బాగా అలసి పోయింది’

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా తన స్థాయిని తగ్గించుకుందని యుక్రెయిన్ రక్షణశాఖ మంత్రి బెన్ వాలెసీ అన్నారు.

    స్కై న్యూస్‌తో మాట్లాడిన ఆయన, ‘మునుపటి మాదిరిగా పుతిన్ అంత బలంగా లేరు. తాను నిర్మించుకున్న పంజరంలో ఆయన ఇప్పుడు చిక్కుకుని ఉన్నారు.’ అని బెన్ చెప్పుకొచ్చారు.

    రష్యా సైన్యం బాగా అలసి పోయిందని, పుతిన్ చాలా నష్టపోయారని ఆయన తెలిపారు.

    యుక్రెయిన్‌కు మరింత సైనిక సాయం చేసేందుకు నేటో దేశాలు అంగీకరించినట్లు బెన్ వెల్లడించారు.

  19. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.