పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉంటే ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి

చిన్నారులలో గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవజాత శిశు మరణాలకు మూడో అతి పెద్ద కారణం పుట్టుకతో వచ్చే గుండె జబ్బులే
    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

రోజూ సాయంత్రం పిల్లల్ని ఇంటిదగ్గర పార్కులో ఆడించడానికి తీసుకెళ్తాను నేను. ఈమధ్య గమనించిందేమిటంటే, ఒకావిడ తన కొడుకును తీసుకొని రోజూ నేను వచ్చే టైం లోనే పార్కుకొస్తుంది. ఉన్నంతసేపు బాబును ఒళ్లోనే పెట్టుకుని సిమెంట్ బెంచీపై కూర్చుని ఉంటుంది.

మిగతా పిల్లల్ని చూసి కేరింతలు కొడతాడు కానీ కిందికి మాత్రం దిగడు ఆ బాబు. దిగాలన్న ఉత్సాహం కూడా కనిపించదు.

పిల్లలు ఆడుకున్నంత సేపూ నేను వాకింగ్ చేస్తుంటా. పది రోజుల తర్వాత మెల్లగా పలకరింపు నవ్వులు మొదలయ్యాయి ఆవిడతో. ఓ రోజు పక్కన కూర్చున్నా మాట కలుపుదామని. చేతులు చాపగానే వచ్చాడు బాబు. ఏడాది వయసు పిల్లాడిలా లేడు, తేలికగా ఉన్నాడు అనుకున్నా. పేరు అయాన్.

ఈ నెలలో రెండో పుట్టిన రోజు కూడా అని తెలిసి ఆశ్చర్యపోయా. నేనలా విస్తుపోయానని గమనించి, ఆవిడ అంది "కొంచెం వీక్ గా ఉంటాడండీ"

"కొంచెం ఏంటీ! ఉండాల్సిన దాంట్లో సగం బరువైనా లేడు. ఎందుకలా ఉన్నాడో మరి డాక్టరుకు చూపించారా?!" మనసులో అనుమానాన్ని మాటల్లోకి రానివ్వకుండా అడిగాను. నేను డాక్టర్నని చెప్పలేదు కూడా.

"గుండెలో రంధ్రం ఉందని చెప్పారండీ, పైగా తరచూ నెమ్ము చేస్తుంది బాబుకి. ఎక్కువ తిన్నా ఆయాస పడతాడు, నడక కూడా వచ్చింది కానీ తొందరగా అలిసిపోతాడు. అందుకే వాడే నడవడానికి, ఆడుకోవడానికి ఆసక్తి చూపడు" అన్నది అయాన్ తల్లి.

"ఈ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసి రంధ్రం పూడ్చవచ్చు కదండీ, ఇప్పుడు కాదు అప్పుడు కుదరదు అని కాలయాపన చేస్తున్నారు. వాడి తోటి పిల్లల్లా వాడేమీ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు" అని బాధ పడిపోయారామె.

‘‘ఎనిమిది కిలోలన్నా లేకుండా ఆపరేషన్ చేయడం ఎక్కువ రిస్క్ అనీ, న్యూమోనియా తగ్గితే చేసేయ్యొచ్చు అనీ...ఒక్కోసారి ఒక్కోలా చెప్తారు. మొదట్లో భయంతో మేమూ వెనుకడుగు వేసిన మాట నిజమేననుకోండి" అంది.

నిజమే, కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవడం అంటే రిస్క్ తీసుకోవడమే. అందునా పిల్లల ఆరోగ్యం విషయానికొస్తే అనుమానాలు భయాలు రెట్టింపవుతాయి మనకు.

'అసలీ సమస్య ఎందుకొచ్చింది, నా బిడ్డకే ఎందుకు రావాలి!' అనే దుఃఖమే మొదట కలుగుతుంది. డాక్టరు ఒక్కోసారి ఒక్కోలా చెబుతున్నట్లు, భరోసా ఇవ్వనట్లు అనిపిస్తుంది. మందులతో తగ్గే మార్గాలు వెతకాలనిపిస్తుంది.

గుండె

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్, తల్లుల్లో తీవ్ర మానసిక వత్తిడి, అధిక వయస్సు వల్ల కూడా పిల్లలకు గుండె జబ్బులు రావచ్చు

అసలెందుకు, ఎవరికి వస్తుంది పుట్టుకతో గుండెలో రంధ్రం?

ప్రపంచవ్యాప్తంగా, పుట్టే ప్రతి వెయ్యి మందిలో 8-10 మంది పిల్లల్లో ఏదో ఒక రకమైన గుండె సంబంధిత వ్యాధులుంటాయి. ఇందులో అధికశాతం గర్భస్థ దశలో ఉన్నప్పుడే తల్లికి చేసే వివిధ రకాల (TIFFA, Fetal Echo) స్కానింగ్ పరీక్షల వల్ల బయట పడతాయి.

నవజాత శిశు మరణాలకు మూడో అతి పెద్ద కారణం పుట్టుకతో వచ్చే గుండె జబ్బులే(Congenital heart diseases).

పిండదశలో అవయవాలు ఏర్పడే క్రమంలో వివిధ కారణాల వల్ల ఈ గుండె జబ్బులు వస్తాయి. అందుకే ఇవి పెద్దవాళ్ల గుండె జబ్బులకు పూర్తిగా భిన్నమైనవి. గుండె, సంబంధిత రక్తనాళాల పరిణామ క్రమంలో అవకరాలు ఉండటం వల్ల, గుండె పనితీరు అస్తవ్యస్తమవుతుంది.

వీడియో క్యాప్షన్, కృత్రిమ గుండేతో చిన్నారిని కాపాడిన చెన్నై డాక్టర్లు

ఆ కారణాలు ఏమిటంటే…

1. మేనరిక వివాహాలు, తద్వారా జన్యు సంబంధిత సమస్యలు

2. క్రోమోజోమ్ సంబంధిత సిండ్రోమ్‌లు

3. కొన్ని రకాల మందులు గర్భిణులు వాడటం.

4. ధూమపానం, మద్యపానం చేసే తల్లులు

5. గర్భంతో ఉండగా అయానిక్ రేడియేషన్‌కు గురవడం

6. తల్లుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, అధిక వయస్సు

7. గర్భస్థ సమయంలో హార్మోన్ సమస్యలు

8. గర్భిణిగా ఉండగా మధుమేహం(Gestational diabetes)

9. గర్భం దాల్చిన తొలినాళ్లలో సోకే ఇన్ఫెక్షన్లు

10. ఏ కారణమూ లేకుండా కూడా (Idiopathic)

చిన్నారులలో గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గర్భం దాల్చిన తొలినాళ్లలో సోకే ఇన్ఫెక్షన్లు కారణంగా కూడా పిల్లలకు గుండె జబ్బులు వస్తాయి

ఇవి కాకుండా పుట్టిన సమయంలో జరిగే ప్రమాదాల వల్ల గుండె దెబ్బతినే అవకాశముంది.

అవేమిటంటే...

1. ప్రీమెచ్యూరిటీ

2. పుట్టగానే ఏడవకపోవడం

3. ఊపిరితిత్తుల పనితీరు ఏదైనా కారణాల వల్ల సరిగ్గా లేకపోవడం(RDS, Meconium aspiration)

4. రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోవటం

5. రక్తంలో పొటాషియం హెచ్చుతగ్గులు

6. ఇన్ఫెక్షన్లు

పైన చెప్పిన పరిస్థితుల్లో గుండె అవయవ పరిణామ క్రమం బాగానే ఉన్నా, పనితీరులో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఇక్కడ మందులు మాత్రమే వైద్యం.

ఎటొచ్చీ గుండె ఆకారంలో ఉన్న లోపాలే ప్రధానంగా, ఔషధ చికిత్స - శస్త్ర చికిత్స మధ్య మనకు సంశయాలు కలిగిస్తాయి. లేదా రెండూ అవసరం అవుతాయి. ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని స్థితిలోకి నెట్టేస్తాయి. ఒక ప్రక్క జబ్బుతో బాధపడే బిడ్డను చూస్తే మరింత భయాందోళనలు.

పుట్టుకతో కలిగే అవకరాల్లో సైతం(birth defects) మొదటిది హృద్రోగాలే.

గుండెకు చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిడ్డ గుండెకు ఆపరేషన్ చేయడానికి, చేయలేకపోవడానికి ఎన్నో రకాల పరిమితులు, పరిస్థితుల అనుకూలతలు చూసుకోవాలి

గుండెలో రంధ్రమంటే

సాధారణంగా గుండెలో రెండు జఠరికల మధ్య గోడలో లోపం ఉండటాన్ని హార్టులో హోల్ అంటుంటారు. ఇలాంటి లోపాలు రెండు కర్ణికల మధ్యలో ఉండొచ్చు లేదా రెండు పెద్ద రక్త నాళాల మధ్య లింక్‌లా ఉండొచ్చు (PDA)

గుండె ఊపిరితిత్తులకు చేరవేసే రక్తం శాతాన్ని బట్టి , వైద్యులు ప్రధానంగా వీటిని రెండు రకాలుగా విభజిస్తారు.

(A) ఎసైనోటిక్ CAD, ASD, VSD, PDA, PS, PAPVC మున్నగునవి.

(B) సైనోటిక్ CHD - TOF, TGA, TAPVC వంటివి.

ఎసైనోటిక్ అంటే ఇక్కడ గుండెనుండి రక్తం ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ, మిగతా శరీరానికి తక్కువగాను వెళ్తుంది. అందువల్ల ఉన్న రక్తమంతా గుండె ఊపిరితిత్తుల మధ్యనే ప్రసరిస్తూ ఉంటుంది. దీనితో తరచూ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, ఆయాసం, గుండె ఉబ్బడం లాంటివి జరుగుతాయి.

శరీరానికి, జీర్ణకోశ వ్యవస్థకు తగినంత రక్త సరఫరా ఉండదు. అందువల్ల తిన్నది వంటికి పట్టదు. శరీరం ఎదుగుదల ఉండదు. బలహీనంగా-బరువు తక్కువగా ఉంటారీ పిల్లలు.

న్యూమోనియా వచ్చినా, జ్వరం వచ్చినా‌, రక్తహీనత ఉన్నా గుండె మీద భారం మరింత పెరుగుతుంది. గుండె పని చేయకుండా మొరాయిస్తుంది. ప్రాణాంతకమవుతుంది.

వీడియో క్యాప్షన్, గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

సైనోటిక్ అంటే ఏంటి?

దీన్నే బ్లూ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. గుండె నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేసే దారి సరిగ్గా ఉండదు.

అందువల్ల ఊపిరితిత్తులు తగినంత ఆక్సిజన్‌ను శరీరానికి అందించలేవు. దానితో పిల్లలు నలుపు (నీలిగా) రంగు పెదవులు, శరీర ఛాయతో కనిపిస్తారు. ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు.

ఏడ్చినప్పుడు, శరీరంలో నీరు శాతం తక్కువైనప్పుడు మరింత నీలి రంగులోకి మారడం, ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్లడం, రక్తంలో యాసిడ్ శాతం పెరగడం వంటివి జరుగుతాయి.

హిమోగ్లోబిన్ కూడా అధికంగా ఉంటుంది (Polycythemia). అందువల్ల రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టడం, స్ట్రోక్ రావడం, మెదడులో చీము గడ్డలు రావడం వంటివి జరుగుతాయి.

అప్పుడే పుట్టిన బిడ్డలో..

  • ఊపిరి తీసుకోవడానికి కష్టపడటం
  • పుట్టిన 5 - 10 నిముషాల తర్వాత కూడా బిడ్డ గులాబీ రంగులోకి మారకుండా నీలి రంగులో ఉండడం.
  • నాడి తెలియకుండా పాలిపోయినట్లు ఉండటం.
  • ఆక్సిజన్ అందించినా ఆక్సీమీటర్లో శాచురేషన్ పెరగకపోవడం వంటివి ఉంటే బిడ్డ గుండెజబ్బుతో ఉందేమోనని అనుమానించాలి.
  • వెంటనే 2డి ఎకో చేసి నిర్ధారణ చేసుకోవాలి. ప్రతీ గుండె జబ్బునూ స్టెతస్కోపుతో చూసి గుర్తించలేము.
  • అప్పుడే పుట్టిన బిడ్డల్లో అయితే స్టెతస్కోపుతో ఎసైనోటిక్ గుండె జబ్బులను గుర్తించటం మరీ కష్టం.

తొలి నెలల వయసులో గుండె జబ్బు లక్షణాలు...

  • బిడ్డ సాధారణ స్థాయికి మించి ఊపిరి తీసుకోవడానికి ఆరాటపడటం
  • పాలు తాగే మధ్య మధ్యలో రొమ్ము వదిలేసి ఊపిరి బలంగా తీసుకోవడం
  • తలపై ఎక్కువగా చెమటలు పట్టడం
  • అరిచేతులు, అరికాళ్ళు ఎప్పుడూ చల్లగా, చమట పట్టినట్లు ఉండటం
  • బరువు పెరగకపోవడం
  • ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు రావడం - నలుపు లేదా నీలి రంగులో ఉండటం, ఏడ్చినప్పుడు మరింత నీలి రంగులోకి మారడం, ఫిట్స్ రావడం.

ఇలాంటి లక్షణాలు కనబడిన పిల్లలను వీలైనంత త్వరగా వైద్యులకు చూపించాలి.

గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్, గుండె జబ్బు లక్షణాలు ఉన్న అన్ని పరిస్థితుల్లో కూడా వెంటనే సర్జరీలు చేయలేరు

గుండె జబ్బు ఉన్నట్లు ఎలా నిర్ధారించాలి

  • ముందుగా బిడ్డను పరీక్షించడం
  • బి.పి, నాడి వేగం, ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం
  • ఎక్స్ రే
  • 2డి ఎకో, ఇ.సి.జి
  • కార్డియాక్ సిటీ స్కాన్
  • కరోనరీ యాంజియో...మొదలైనవి.

నిర్ధరించిన తర్వాత ఏం చేయాలి?

ఎలాంటి లక్షణాలు లేకుండా యాదృచ్ఛికంగా గుండెలో రంధ్రముందని తెలిస్తే, అంత హైరానా పడాల్సిందేమీ లేదు.

చిన్న సైజు V.S.D రంధ్రాలైతే ఎదిగేకొద్దీ చాలావరకూ తగ్గుతాయి.

చిన్న A.S.D రకం రంధ్రాలు కూడా పెద్ద హానికరమైనవి కావు.

వ్యాధి లక్షణాలు ఉన్న అన్ని పరిస్థితుల్లో కూడా వెంటనే సర్జరీలు చేయలేరు. కొంతకాలం మందులతో వ్యాధి తీవ్రతను తగ్గించి బిడ్డ ఎదిగే వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు.

ఉదాహరణకు-

  • ASD+ రోగ లక్షణాలు - వెంటనే సర్జరీ రోగలక్షణాలు లేదంటే 2-4 సం౹౹లకు
  • పెద్ద VSD+హార్ట్ ఫెయిల్యూర్ - వీలైనంత త్వరగా
  • మధ్యరకం VSD+రోగ లక్షణాలు - 1-2 సం||లకు
  • మధ్యరకం VSD+ లక్షణాలు లేకపోతే - 2-5 సం||లకు
  • పెద్ద PDA - వీలైనంత త్వరగా (3 నెలల లోపు)
  • మధ్యరకం PDA+ రోగ లక్షణాలు - 3 నెలలలోపు
  • మధ్యరకం PDA+ రోగ లక్షణాలు లేకపోతే - 6 - 12 నెలల్లోపు
  • చిన్న PDA - 12 - 18 నెలల్లోపు
  • TOF - మొదటి 4 నెలల్లో - కేవలం పాలిటియేటివ్ షంట్
  • TOF - 4 -6 నెలల్లో - రిపేర్ సర్జరీ

ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక బిడ్డకు గుండె ఆపరేషన్ చేయడానికి - చేయలేకపోవడానికి ఎన్నో రకాల పరిమితులు, పరిస్థితుల అనుకూలత చూసుకుని ముందుకెళ్లాలి.

చిన్నారులలో గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుండె జబ్బులున్న పిల్లలను నిర్ణీత సమయాల్లో క్రమం తప్పక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి

ఇప్పుడైతే మందులకూ, ఓపెన్ హార్ట్ సర్జరీలకు మధ్య, మినిమల్ ఇంటర్వెన్షనల్ సర్జరీలెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు, నైపుణ్యం, అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడంలాంటి పరిమితులున్నా, ఇటువంటి సర్జరీలు చిట్టి గుండెలకెంతో క్షేమం.

సర్జరీల తర్వాత కూడా సగానికి పైగా పిల్లల్లో జీవితకాలం పాటు మందులు వాడుతూ ఉండాల్సి ఉంటుంది.

1) మొదటి కొన్ని నెలలు - యాంటీ ప్లేట్ లెట్ మందులు తరచుగా గుండె ఎకోగ్రఫీలు, ఇసీజీ

2) కొన్ని నెలలపాటు - గుండెకు ఇన్ఫెక్షన్ రాకుండా మందులు

3) నోటి, దంత పరిశుభ్రత

కొన్ని సందర్భాల్లో ఈ మందులు జీవితకాలం వాడాల్సి రావచ్చు కూడా.

శస్త్రచికిత్స కోసం వేచి ఉన్న కాలంలో లేదా శస్త్రచికిత్స చేయలేని పరిస్థితుల్లో తీసుకోవలసిన పది జాగ్రత్తలు

1. బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా వీలైన వ్యాక్సిన్స్ వేయించాలి

2. రక్తహీనత లేకుండా చూసుకోవడం

3. నీరు, ఆహారం, నోటి శుభ్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం

4. తక్కువ మోతాదులో ఎక్కువ బలం చేకూరే ఆహారం

5. జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యాలతో కాలయాపన చేయకూడదు

6. ప్రయాణాలు, యాత్రలు వంటివి వీలైనంతవరకూ నివారించడం

7. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి దూరంగా ఉంచటం

8. ప్రమాద చిహ్నాలను సత్వరమే గుర్తించగలగడం

9. మందులు తు.చ తప్పకుండా వాడటం

10. నిర్ణీత సమయాల్లో క్రమం తప్పక వైద్య సంప్రదింపులు.

ఈ పిల్లల భవిష్యత్తు, ఎదుగుదల, ఆయుష్షు?

1) ఎంత త్వరగా గుండె జబ్బులు గుర్తించబడితే అంత మంచిది

2) ఎంత త్వరగా, ఎంత ఖచ్చితంగా మందులు వాడటం మొదలు పెడితే అంత మంచిది

3) శస్త్రచికిత్స అవసరమైన చోట ఆలస్యం కూడదు

4) గుండెతో పాటు ఇతర అవయవ లోపాలు ఉండటం వల్ల వేరే అనారోగ్యాలు కలగొచ్చు

5) జన్యుపరమైన లోపాలుంటే పరిస్థితి కొంచెం క్లిష్టమే

6) తరచూ న్యుమోనియా వస్తే ప్రాణాంతకమవ్వొచ్చు

7)పోషణ లోపం, రక్తహీనత ఉంటే చిన్న జబ్బు సైతం పెద్ద ముప్పు కలిగిస్తుంది.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

మంచి మందులు, మినిమల్ ఇన్ వేసివ్ సర్జరీలు, పట్టణాల్లో సైతం కార్డియాలజిస్టులు అందుబాటులో ఉండటం, గర్భస్థ దశలోనే అవయవ లోపాల్ని గుర్తించే స్కానింగులు.... వీటన్నింటితో ఇప్పటి రోజుల్లో గుండె జబ్బులున్న పిల్లల జీవన విధానం మెరుగుగా ఉంది.

సర్జరీ తర్వాత కూడా ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఎక్కువ కాలం బ్రతకగలుగుతున్నారు. దాదాపు నాణ్యమైన జీవితం గడుపుతున్నారు.

కాబట్టి ఇటువంటి గుండె సంబంధిత వ్యాధులున్న పిల్లలను మరింత పదిలంగా చూసుకోవడం, సత్వర చికిత్స, ఎక్కువ ఓపిక, మంచి పోషణతో ఆసరా ఇవ్వడం చేస్తే చిట్టి గుండెలు గట్టి గుండెలవుతాయి. బాల్యంలో పూసే నవ్వుల పువ్వులు వాడకుండా ఉంటాయి.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)