నవనీత్ కౌర్ రానా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతున్న తెలుగు మాజీ హీరోయిన్

నవనీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మయూరేశ్ కొన్నూర్
    • హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా మరోసారి వార్తల్లో నిలిచారు.

ముంబయిలోని ఠాక్రే నివాసమైన ‘మాతోశ్రీ’కి వచ్చి హనుమాన్ చాలీసా చదువుతానని, ధైర్యముంటే తనను అడ్డుకోవాలని తాజాగా నవనీత్ కౌర్ రానా వ్యాఖ్యానించారు.

వారి ప్రకటన నేపథ్యంలో శివసేన నాయకులు కూడా తమను రెచ్చగొట్టొద్దంటూ ప్రకటనలు చేస్తున్నారు.

కాగా నవనీత్, రవి రానాలు శుక్రవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. శనివారం ఉదయం 9 గంటలకు మాతోశ్రీకి చేరుకుని అక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తామని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విధానాలను కూడా వీరు విమర్శించారు.

‘‘ఉద్ధవ్ ఠాక్రే హిందూత్వను మరిచిపోయారు. ఆయన వేరే మార్గంలో వెళ్తూ మహారాష్ట్రను ధ్వంసం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకే మేం తొమ్మిది గంటలకు వచ్చి మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా చదువుతాం’’అని వారు అన్నారు.

అనంతరం శాంతి, భద్రతలకు భంగం కలిగించొద్దని ముంబయి పోలీసులు వీరికి నోటీసులు జారీచేశారు.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి రావడానికి ముందు అనేక తెలుగు సినిమాలలో కథానాయికగా నటించారు.

ఆమె ఎంపీగా ఎన్నికైన తరువాత లోక్‌సభలో పలుమార్లు తెలుగులో మాట్లాడారు. తాను సభలో ప్రసంగిస్తున్నప్పుడు తెలుగు ఎంపీలు అడ్డుకున్నప్పుడు... సభాధ్యక్ష స్థానంలో తెలుగు ఎంపీలు ఉన్నప్పుడు ఆమె వారితో తెలుగులోనే సంభాషించి తన తెలుగు నేపథ్యాన్ని చాటుకున్నారు.

తాజాగా ఆమె మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతుండడంతో ఆ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ వ్యవహారంపై ఆసక్తి ఏర్పడింది.

నవనీత్

ఫొటో సోర్స్, FACEBOOK/NAVNEETRAVIRANA

ఇదే తొలిసారా?

మాతోశ్రీకి వచ్చి నిరసన చేపడతానని నవనీత్ చెప్పడం ఇదేమీ తొలిసారి కాదు.

2020 దీపావళి సమయంలో విదర్భకు చెందిన రైతులతో కలిసి మాతోశ్రీ ఎదుట నిరసన చేపడతానని ఆమె చెప్పారు. అయితే, అమరావతికి వెళ్లకముందే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

తాజాగా ధైర్యముంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన నివాసం నుంచి బయటకు వచ్చి హనుమాన్ చాలీసా చదవాలని ఆమె వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నాయకుడు రాజ్ ఠాక్రేను కలిసిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగింది. అందుకే హనుమాన్ జయంతి రోజున మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయలేరు. ఎందుకంటే అలాచేస్తే ఆయన కూటమిలోని కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతాయని ఆయనకు భయం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో మహారాష్ట్ర రాజకీయ వార్తల్లో రానా దంపతుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరు బీజేపీకి మద్దతుగా హిందూ అజెండాను ఎత్తుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఎమ్మెల్యే రవి రానా.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌కు సన్నిహితులు. ఆయన భార్య నవనీత్ 2019లో అమరావతి(మహారాష్ట్ర) నుంచి స్వతంత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆమెకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ప్రకటించాయి.

అమరావతిలో ఇటీవల కాలంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. గత ఏడాది నవంబరులో త్రిపురలో మొదలైన ఘర్షణల ప్రభావం అమరావతిలోనూ కనిపించింది. రానా దంపతులు ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆ మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. ఈ విషయాన్ని ఆమె లోక్‌సభ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

నవనీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ మెకువలు

‘‘రాజకీయాల్లో ఎలా ఎదగాలో రానా దంపతులకు బాగా తెలుసు. ఒకవైపు కుల ధ్రువపత్రానికి సంబంధించిన వివాదం వారిని వెంటాడుతోంది. మరోవైపు ప్రజల్లో ఆదరణను పెంచుకునేందుకు వారు చాలా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి’’అని మహారాష్ట్ర టైమ్స్ నాగ్‌పుర్ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీపాద్ అపరాజిత్ వ్యాఖ్యానించారు.

‘‘కుల, మత సమీకరణాలు తమకు అనుకూలంగా లేనప్పుడు కూడా ఎలా ముందుకు వెళ్లాలో వీరికి బాగా తెలుసు”అని ఆయన అన్నారు. ‘‘శివాజీ విగ్రహం ఏర్పాటు సమయంలో మున్సిపల్ అధికారుల చర్యలను వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు’’అని ఆయన చెప్పారు.

నవనీత్ కౌర్

ఫొటో సోర్స్, FACEBOOK/Navneet Ravi Rana

రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు

రవి రానాకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. దీంతో అమరావతిలోని తన నియోజకవర్గమైన బడ్నేరాలో ప్రజా కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. యువ స్వాభిమాన్ సంఘటన అనే సంస్థ సాయంతో ఆయన ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇవే రాజకీయాల్లో ఆయనకు బాటలు పరిచాయి.

ఆయన ఎలాంటి ప్రధాన రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అయితే, అవసరమైనప్పుడు ప్రధాన పార్టీల నాయకులతో వేదికలపై కనిపిస్తారు.

2009లో బడ్నేరా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి స్వతంత్ర ఎమ్మెల్యే ఆయనే. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన అక్కడి నుంచి గెలిచారు. ఒకప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతున్న రవి రానా.. ఇప్పుడు దేవేంద్ర ఫడణవీస్, బీజేపీలకు దగ్గరగా కనిపిస్తున్నారు.

తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారిగా నవనీత్‌ను రవి రానా కలిశారు. యోగా గురు రామ్‌దేవ్ కార్యక్రమాల్లో రవి రానా చురుగ్గా పాల్గొనేవారు. ముంబయిలోని రామ్‌దేవ్ నిర్వహించిన ఓ యోగా కార్యక్రమానికి రవి వచ్చారు. అక్కడే తొలిసారి నవనీత్‌ను ఆయన కలిశారు.

నవనీత్ కౌర్

ఫొటో సోర్స్, Getty Images

నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడారు.

తమ పెళ్లి ఎలా జరిగిందో జీ-24 వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవనీత్ చెప్పారు.

‘‘మా కుటుంబాలు ఒప్పుకున్న తర్వాతే మేం పెళ్లి చేసుకున్నాం. మేం రామ్‌దేవ్ బాబా యోగా శిబిరంలో తొలిసారి కలిసాం. మా ఇద్దరికీ యోగా అంటే ఇష్టమే’’అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు.

హీరోయిన్‌తో ఎమ్మెల్యే రవి పెళ్లి జరగబోతోందని పెళ్లికిముందు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. వీరు పెళ్లి చేసుకున్న విధానం కూడా వార్తల్లో నిలిచింది.

మూడున్నర వేల మంది అతిథుల నడుమ, పెద్దల సమక్షంలో 2011లో వీరు పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లిని నిర్వహించింది కూడా రామ్‌దేవ్ బాబా సంస్థే. అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మంత్రి నారాయణ్ రానే, సినీనటుడు వివేక్ ఒబేరాయ్, సహారా చీఫ్ సుబ్రతో రాయ్ లాంటి ప్రముఖులు ఈ పెళ్లికి వచ్చారు.

వీడియో క్యాప్షన్, స్వతంత్రం వచ్చిన 1947లో వినాయక ఉత్సవాలు ఇలా జరిగాయి

నవనీత్ రాజకీయ జీవితం ఇలా మొదలైంది..

రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు.

అయితే, శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు ఈ నియోజవర్గం కంచుకోట లాంటిది. దీంతో తొలి ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.

‘‘కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. కొంతమంది ఇంటికి వెళ్లి రోటీలు కూడా చేశారు’’అని అపరాజిత్ అన్నారు.

‘‘విదర్భకు చెందిన చాలా మంది మరాఠీలో మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ మేం అలా కాదు. నేర్చుకుని మరీ మాట్లాడతాం అని ఆమె చెప్పారు. అలా నెమ్మదిగా ఆమె ప్రజల మద్దతును కూడగట్టారు’’అని ఆయన వివరించారు.

2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అమరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం.

అయితే, 2014లో ఆనంద్‌రావ్ తనను వేధించారని నవనీత్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఆనంద్‌రావ్ ఖండించారు.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత, నవనీత్ కులధ్రువ పత్రం నకిలీదని ఆనంద్‌రావ్ కోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

వీడియో క్యాప్షన్, జుగాడ్ జీప్: దీనిని ఆనంద్ మహీంద్రాకు ఇవ్వలేం. కావాలంటే మరొకటి తయారు చేసిస్తాం

ముందు కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతు.. ఇప్పుడు బీజేపీ

కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతు సాయంతో నవనీత్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయి.

‘‘కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో నవనీత్ ఎంపీగా ఎన్నికయ్యారని అందరికీ తెలుసు. అయితే, ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె బీజేపీ తరహా రాజకీయాలు చేస్తున్నారు. తర్వాత ఏ జరుగుతుందో ఎవరికీ తెలియదు’’అని అపరాజిత్ వ్యాఖ్యానించారు.

‘‘రవి రానా ఎప్పుడూ అధికార పార్టీతోనే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారంలోని శివసేనకు దూరంగా, బీజేపీకి దగ్గరగా కనిపిస్తున్నారు’’అని అపరాజిత్ అన్నారు.

‘‘రవి రానాకు ఒక శైలి రాజకీయాలు అంటూ ఏమీ లేవు. అధికారంలోనున్న పార్టీ పక్కన ఉండటానికే ఆయన చూస్తుంటారు. ఆయన్ను అవకాశవాది రాజకీయ నాయకుడు అని కూడా అనొచ్చు’’అని మీడియా వాచ్ ఎడిటర్ అవినాశ్ దూధే వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శివసే, ఉద్ధవ్ ఠాక్రేలు లక్ష్యంగా రానా దంపతులు విమర్శలు చేస్తున్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి ఇల్లు వదిలి బయటకు రాలేదని వీరు వ్యాఖ్యానించారు. రైతుల నిరసనలు, హనుమాన్ చాలీసా వివాదాల సమయంలో మాతోశ్రీకి వచ్చి నిరసనలు చేపడతామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)