బోరిస్ జాన్సన్- నరేంద్ర మోదీ చర్చలు: స్కాచ్ విస్కీ ధర తగ్గుతుందా? స్చేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఏముంటాయి

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, దర్శిని డేవిడ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఈ ఏడాది డిసెంబరు కల్లా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఆయన చర్చలు జరపనున్నారు. ఎప్పటినుంచో కొలిక్కిరాని క్లిష్టమైన అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశముంది.

భారత్‌లో విక్రయించే స్థాయిలో మరే దేశంలోనూ విస్కీ విక్రయాలు జరగవు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత స్కాచ్ విస్కీకి ఇది తీపి వార్తే. అయితే, భారత్‌లో తాగే స్కాచ్ విస్కీ ధర చాలా ఎక్కువ. భారత్ విధించే 150 శాతం దిగుమతి సుంకాలే దీనికి కారణం. ప్రస్తుతం భారత్‌లో విక్రయించే విస్కీలో చాలావరకు స్థానికంగా తయారుచేస్తుంటారు. ఇక్కడి మార్కెట్‌లో స్కాచ్ పరిమాణం కేవలం రెండు శాతం మాత్రమే.

ఈ సుంకాలను తగ్గిస్తే కేవలం ఐదేళ్లలోనే స్కాచ్ విస్కీ ఎగుమతులు ఒక బిలియన్ పౌండ్లకు (రూ. 9930 కోట్లు) పెరుగుతాయని స్కాచ్ విస్కీ అసోసియేషన్ వెల్లడించింది.

కేవలం విస్కీ మాత్రమే కాదు. బ్రిటన్ నుంచి వచ్చే చాలా దిగుమతులపై భారత్ భారీగా సుంకాలు, కోటాలు, ఆంక్షలు విధిస్తోంది.

విస్కీ

ఫొటో సోర్స్, Newscast

ఉదాహరణకు బ్రిటన్ నుంచి వచ్చే విదేశీ కార్లపై వంద శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. ఫలితంగా భారత్‌లాంటి పెద్ద దేశానికి కేవలం బెల్జియంలాంటి చిన్న దేశంతో సమానమైన పరిమాణంలో మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.

అయితే, ఈ పరిస్థితి మారనుంది. ఈ ఏడాది ప్రారంభంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా బ్రిటన్, భారత్ చర్చలు మొదలుపెట్టాయి. డిసెంబరునాటికి ఈ ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి మూడో దఫా చర్చలు వచ్చే వారం మొదలుకాబోతున్నాయి.

ఈ ఒప్పందాన్ని ‘‘బంగారు అవకాశం’’గా బ్రిటన్ వాణిజ్య మంత్రి అన్నె మేరీ ట్రెవెలియన్ అభివర్ణించారు. తాజా ఒప్పందంతో 2035నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపై దాదాపు 28 బిలియన్ పౌండ్లు (రూ. 2,78,015 కోట్లు)కు పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, PA Media

ఇటీవల ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. దీంతో బ్రిటన్-భారత్ ఒప్పందంపై అంచనాలు పెరిగాయి.

చర్చల విషయానికి వస్తే, ఈ ఒప్పందంలో చేర్చే అంశాలపై రెండు దేశాల దగ్గరా ప్రత్యేకమైన జాబితాలు ఉన్నాయి. అయితే, వీటిపై ఏకాభిప్రాయం కుదరడమే కాస్త కష్టంగా అనిపిస్తోంది.

తయారీ, సేవల రంగాల్లో తమ పరిశ్రమలకు మరింత అవకాశాలు కల్పించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత్ సుముఖంగా లేదు.

ప్రస్తుతం ఈ రంగాల్లో భారత్ ఆంక్షలను తొలగించే అవకాశం ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఆంక్షలు భారత్ దేశీయ పరిశ్రమలను కాపాడటానికి చాలా ముఖ్యమని వారు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో తయారుచేసే విస్కీ పరిశ్రమలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని, ఆంక్షలను తగ్గించకపోవచ్చని వారు వెల్లడించారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ కూడా..

ఒకవేళ భారత్ ఈ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, బ్రిటన్‌ కూడా ప్రతిగా అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే ఔషధాలు సహా ఇతర ఉత్పత్తుల కోసం బ్రిటన్ మార్కెట్‌ను మరింత తెరవాల్సి ఉంటుంది. మరోవైపు భారత కార్మికులకు మరిన్ని వీసాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది.

బ్రెగ్జిట్ అనంతర వలసల విధానంలో భాగంగా గతేడాది 60,000 మంది భారతీయులకు నైపుణ్య కార్మికులకు ఇచ్చే వీసాలు ఇచ్చారు. మొత్తం నైపుణ్య వీసాల్లో ఇవి ఐదింట రెండొంతులు.

అయితే, ఈ దిశగా బ్రిటన్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సింగపూర్‌ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అమితేందు పాలిత్ చెప్పారు. ఇదివరకు ఆయన భారత ఆర్థిక శాఖలో పనిచేశారు.

మరోవైపు బ్రిటన్‌లో నైపుణ్య కార్మికుల కొరతను తగ్గించేందుకు మరిన్ని వీసాలు జారీచేసే అవకాశముందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా వెల్లడించారు. అయితే, దీన్ని అక్కడ ఓటర్లు ఎలా చూస్తారో వేచి చూడాలి. ఇక్కడి ఎన్నికల్లో వలసలు కూడా ప్రధాన అంశం. ముఖ్యంగా బ్రెగ్జిట్ తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది.

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2: ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకున్న తొలి సామ్రాజ్ఞి

ఎంతవరకు ప్రయోజనం?

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది. భారత్‌తో కుదర్చుకునే ఒప్పందంతో దశాబ్ద కాలంలో బ్రిటన్ స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 0.2 శాతం మాత్రమే పెరిగే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. అయితే, దీని కోసం భారీగా ఆంక్షలను ఎత్తివేయాల్సి ఉంటుంది.

మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో మోదీ స్పందనలను చూస్తుంటే భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనవసరమని కూడా కొందరు విశ్లేషించారు.

కానీ భారత్‌తో కుదుర్చుకునే ఈ ఒప్పందం భవిష్యత్‌లో చాలా మేలుచేసే అవకాశముంది. 2050నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ముఖ్యంగా ఇక్కడ మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరిగే అవకాశముంది.

వీడియో క్యాప్షన్, అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమె చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు?

మరోవైపు అమెరికాతో బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కూడా చర్చల దశల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో కుదిరే ఈ ఒప్పందం ప్రధాన పాత్ర పోషించొచ్చు.

ఇలాంటి ఒప్పందాలపై చర్చలను ప్రారంభించడం తేలికే. అయితే, వీటిపై రెండు వైపులా ఏకాభిప్రాయానికి రావడం మాత్రం కొంచెం కష్టమే.

రెండు వైపులా కొన్ని సర్దుబాట్లకు అంగీకరిస్తే ఈ ఏడాది డిసెంబరు నాటికి తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, పూర్తి స్థాయి ఒప్పందం క్రిస్మస్ నాటికి కుదురుతుందని చెప్పడం కాస్త కష్టమే.

ఈ క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఒప్పందం త్వరగా కుదిరితే మేలని స్కాచ్ విస్కీ అసోసియేషన్ ఆకాంక్షించింది. విస్కీపై దిగుమతి సుంకాలను కూడా తగ్గించాలని కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)