Online porn: ‘విద్యార్థులు పోర్న్ హింస గురించి నన్ను అడుగుతున్నారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హాజెల్ షీరింగ్
- హోదా, ఎడ్యుకేషన్ కరెస్పాండెంట్
విద్యార్థులతో చాలా సంక్లిష్టమైన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలను ఎమ్మా టీచర్‌గా శిక్షణ పొందేటపుడు నేర్చుకున్నారు. కానీ పోర్నోగ్రఫీలో పశుప్రవృత్తి, గొంతునులమటం వంటి హింసల గురించి విద్యార్థులు ప్రశ్నిస్తే ఎలా స్పందించాలనేది ఆమె నేర్చుకోలేదు.
ఎమ్మా పాఠాలు చెప్తున్న స్కూలులో.. పోర్నోగ్రఫీ గురించి విద్యార్థులు తమ ఆందోళనలను ఉత్తరాలు రాయటం ద్వారా పంచుకోవాలనే రాత కసరత్తును నిర్వహించారు.
ఆ ఎక్సర్‌సైజు గురించి ఆమె చెప్తూ.. ''ఆ హింసాత్మక దృశ్యాలను వారు ఆన్‌లైన్‌లో చూడటమో, వారికి ఎవరైనా పంపిస్తే చూడటమో జరిగి ఉండాలి'' అని పేర్కొన్నారు.
''చాలా వరకూ సోషల్ మీడియాలో దీనిని షేర్ చేస్తున్నట్లు నాకు అనిపించింది'' అని చెప్పారామె.
అసభ్యమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎలా ఎదుర్కోవాలి, పిల్లలపై దాని ప్రభావాన్ని ఎలా తగ్గించాలి అనే అంశంపై బ్రిటన్‌లోని బోర్న్‌మోత్‌లో బుధవారం నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ (ఎన్‌ఈయూ) సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొని చర్చించిన చాలా మంది టీచర్లలో ఎమ్మా - అది ఆమె అసలు పేరు కాదు - ఒకరు.
పోర్నోగ్రఫీ ప్రభావాల గురించి పిల్లలతో మాట్లాడేందుకు దోహదపడటానికి మరింత శిక్షణ, వనరులు లభించేలా చూడటానికి.. స్కూళ్లలో ''లైంగిక వేధింపుల సంఘటనలను నిరంతరం నమోదు చేయటం, ఫిర్యాదు చేయటం జరిగేలా చూడటానికి ఈ యూనియన్ కృషి చేస్తోంది.
విద్యార్థులు స్కూలులో ఉపయోగించే లైంగిక పరమైన భాషకు, వారికి ఆన్‌లైన్‌లో కనిపించే పోర్నోగ్రఫీకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఎమ్మా భావిస్తున్నారు.
''నన్ను బిచ్ అని తిట్టాడు ఓ విద్యార్థి. ఒక్కసారే. కానీ అది చాలా కష్టంగా అనిపించింది'' అని ఆమె చెప్పారు.
పోర్నోగ్రఫీ గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా, అది చూపగల ప్రభావం గురించి చర్చించేలా.. తన క్లాసులోని 14, 15 ఏళ్ల విద్యార్థులను ప్రోత్సహించటానికి ఎమ్మా ప్రయత్నిస్తున్నారు.
ఈ అంశంపై బృంద చర్చల్లో మగ పిల్లలకన్నా ఆడపిల్లలు చాలా మౌనంగా ఉంటారని.. అయితే కొంత మంది ఆడపిల్లలు పోర్నగ్రఫీ చేసే చేటు గురించి మరింత బలంగా మాట్లాడతారని ఆమె తెలిపారు.
తనకు 11 ఏళ్ల వయసు నుంచే ''హింసాత్మక'' పోర్నోగ్రఫీని చూపించారని, దానివల్ల తను పీడకలలతో ఎంతగానో బాధపడేదానినని గాయని బిల్లీ ఈలీష్ ఇటీవల వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేయాలని, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని తమపై వస్తున్న ఒత్తిడి గురించి ఆడపిల్లలు చెప్తుంటారని ఎమ్మా తెలిపారు.
మరోవైపు మగపిల్లలు మాత్రం పోర్నోగ్రఫీలో కనిపిస్తున్నట్లుగా, సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్లుగా సెక్సువలైజ్డ్ చిత్రాల్లోని వారిలాగా తమ శరీరాలు కనిపించటం లేదనే అంశం గురించి ఆందోళనలు వ్యక్తంచేశారు.
''మేం విస్తృతంగా చర్చించిన అంశాల్లో.. పోర్న్‌ను - అందులో మగతనాన్ని చూపించే తీరు ఒకటి. కండలు తిరిగిన పురుషుడిగా, ఆధిపత్యం చలాయించే పురుషుడిగా చూపిస్తున్న తీరు'' అని ఎమ్మా చెప్పారు.
''పిల్లలందరూ పోర్న్ చూసి ఉండరు. పోర్న్ కోసం సెర్చ్ చేసి ఉండరు. కానీ స్కూలులో ఫోన్ల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నా కూడా.. పిల్లల మధ్య పోర్నోగ్రఫీని పంపించుకోవటం జరుగుతోందని నేను భావిస్తున్నా'' అని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. 'సంబంధాలు - లైంగిక విద్య'కు సంబంధించిన ప్రస్తుత పాఠ్యప్రణాళిక.. మనం చర్చించగల సంబంధాలు, అంశాలను పరిమితం చేస్తోందని హాకెనీకి చెందిన టీచర్ సారా బైర్న్ ఎన్‌ఈయూ సభ్యులతో చెప్పారు.
''ఆ పత్రాల్లో పెళ్లిని ఒకసారికన్నా ఎక్కువగానే ప్రమోట్ చేశారు. సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాల నుంచి పిల్లలను ఉపసంహరించుకోవటానికి తల్లిదండ్రులకు అనుమతి ఉంది. ఈ లైంగిక విద్యకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు విశ్వాస బృందాలకు అనుమతి ఉంది. ఫన్ అనే మాటను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు'' అని ఆమె పేర్కొన్నారు.
సెక్స్ ఎడ్యుకేషన్ అందించే టీచర్లు స్థానిక సమాజం గురించి తెలుసుకుని ఉండాలని, ఈ విద్య ప్రాధాన్యం గురించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడటానికి అది వీలుకల్పిస్తుందని ఈ యూనియన్ సూచిస్తోంది.
తాము చూడటానికి ఇష్టపడని ఫొటోలు, వీడియోలు తమకు చాలా తరచుగా కానీ, అప్పుడప్పుడూ తమకు కానీ, తమ తోటి వారికి కానీ వస్తున్నాయని దాదాపు 90 శాతం మంది బాలికలు, 50 శాతం మంది బాలురు చెప్పినట్లు ఆఫ్‌స్టెడ్ గత ఏడాది నివేదికలో వెల్లడించింది.
టీచర్లకు ఎదురవుతున్న స్త్రీ వివక్ష గురించి కూడా టీచర్ల సంఘాలు చర్చిస్తున్నాయి.
ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ బారినపడకుండా పిల్లలను రక్షించటానికి ఉద్దేశించిన 'ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లు'.. తగినంత బలంగా లేదని సెంటర్ టు ఎండ్ ఆల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ (సీజ్) సారథ్యంలోని పలు స్వచ్ఛంద సంస్థల సంకీర్ణం గత వారంలో పేర్కొంది. ఆ బిల్లు ప్రకారం.. వెబ్‌సైట్లు తమ యూజర్ల వయసును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ సంకీర్ణంలోని స్వచ్ఛంద సంస్థలు.. టీనేజీ వయసు నుంచి పోర్నోగ్రఫీ వ్యసనం బారినపడిన జేక్ (అసలు పేరు కాదు) వంటి బాధితుల కోసం పని కృషి చేస్తున్నాయి.
తాను పెళ్లి చేసుకున్న తర్వాత, తనకు పోర్నోగ్రఫీ అవసరం ఉండబోదని అనుకున్నానని.. కానీ పెళ్లయ్యాక తన వ్యసనం మరింతగా ముదిరిందని, ఆ విషయాన్ని తన కుటుంబానికి తెలియకుండా దాచానని అతడు చెప్తున్నారు.
''కొన్నిసార్లు పోర్నోగ్రఫీ చూడాలనే కోరికతో నాకు రాత్రిళ్లు మెలకువ వస్తుంది'' అని అతడు తెలిపాడు. ఈ వ్యసనం అంతకంతకూ ముదిరి తన కుటుంబం మీద మరింత ఎక్కువగా ప్రభావం చూపిందని చెప్పాడు.
థెరపిస్టులు, కోచ్‌లు, స్నేహితులు, తన భార్య సాయంతో జేక్ ఆ వ్యసనం నుంచి బయటపడ్డాడు.
జేక్ స్కూలులో చదువుకుంటున్నపుడు ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ అందుబాటులో ఉండి ఉండవచ్చు. కానీ సాంకేతిక పురోగతి కారణంగా ఇప్పుడు అది మరింత సులభంగా అందుబాటులోకి వస్తోంది.
పోర్నోగ్రఫీ ప్రభావాల్లో.. స్కూలు పిల్లల మధ్య లైంగిక వేధింపులు, దాడులు మరింత ఎక్కువవటం ఒకటని, ఇతరులను సెక్సువల్ వస్తువులుగా పరిగణించటం సాధారణమేనని టీనేజీ పిల్లలు భావిస్తున్నారని సీజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెనెస్సా మోర్స్ చెప్తున్నారు.
''ఒక బాలిక మీద తమ ఆసక్తిని వ్యక్తీకరించటానికి ఇదే ప్రధాన మార్గమని మగపిల్లలు చెప్తున్నారు. అలాగే తమను ట్రీట్ చేస్తున్న తీరును ఆమోదించాలనే ఒత్తిడి తమ మీద చాలా తీవ్రంగా ఉంటోందని బాలికలు చెప్తున్నారు'' అని తెలిపారు.
''దీనికి అభ్యంతరం చెప్పేవారు బెదిరింపులకు, తిట్లకు గురయ్యే ప్రమాదం ఉంది'' అన్నారామె.
ఇదిలావుంటే.. పోర్నోగ్రఫీ నుంచి పిల్లలను కాపాడటం కోసం తీసుకువచ్చిన ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లు ఒక ముందడుగు అని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్‌లో యాక్సెస్ ఉన్న ఏ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ అయినా సరే పిల్లలకు అది అందుబాటులోకి లేకుండా నివారించాల్సి ఉంటుందని, లేదంటే తీవ్ర ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- KGF 2: 121 ఏళ్లలో 900 టన్నుల బంగారం అందించిన కేజీఎఫ్ అసలు కథ ఇది
- భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు?
- 1500 అడుగుల ఎత్తున రెండు రోజుల పాటు కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన పర్యటకులను ఎలా కాపాడారు
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











