KGF 2-కోలార్ గోల్డ్ ఫీల్డ్స్: 121 ఏళ్లలో 900 టన్నుల బంగారం అందించిన కేజీఎఫ్ అసలు కథ

కేజీఎఫ్

ఫొటో సోర్స్, KGF FACEBOOK

ఫొటో క్యాప్షన్, కేజీఎఫ్-2లో యశ్
    • రచయిత, హర్షల్ అకుడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పుడు దేశంలో సినీ అభిమానులంతా మూడు.. కాదు కాదు నాలుగు అక్షరాల గురించే మాట్లాడుకుంటున్నారు.. అదే కేజీఎఫ్-2.

కన్నడ హీరో యష్ హీరోగా చేస్తున్న కేజీఎఫ్-2లో సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్ లాంటి వారు కీ రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇది ప్రధానంగా కన్నడ సినిమా. కేజీఎఫ్ మొదటి భాగం 2018లో కన్నడ, హిందీ, తెలుగుతోపాటూ ఇంకా చాలా భాషల్లో రిలీజై సూపర్ హిట్టయ్యింది. తర్వాత దీనికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు దానికోసం చాలా ఎదురుచూస్తున్నారు.

కేజీఎఫ్ అంటే... కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సినిమా విషయం పక్కన పెడితే, ఈ కేజీఎఫ్ వెనుక ఒక సుదీర్ఘ కథ ఉంది. ఆ అసలు కథను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది బీబీసీ.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్

కేజీఎఫ్ చరిత్ర

కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో ఉన్నాయి. దక్షిణ కోలార్ జిల్లా హెడ్ క్వార్టర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్‌ సన్‌ పేట తాలూకాలో ఈ గనులున్నాయి.

తూర్పు బెంగళూరులో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్-వేకు వంద కిలోమీటర్ల దూరంలో కేజీఎఫ్ టౌన్ షిప్ ఉంది. ద క్వింట్ న్యూస్ వెబ్‌సైట్ తన కథనంలో కేజీఎఫ్ చరిత్రను వివరించింది.

ఈ కథనం ప్రకారం 1871లో న్యూజీలాండ్ నుంచి భారత్ వచ్చిన మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ లావిల్ ఒక బ్రిటిష్ సైనికుడు బెంగళూరులో ఇల్లు కట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన ఎక్కువ సమయం పుస్తకాలు, పత్రికలు చదివేవారు.

అలా, ఒకసారి ఆయన 1804లో ఎసియాటిక్ జర్నల్‌లో ప్రచురించిన నాలుగు పేజీల ఆర్టికల్ చదివారు. అందులో కోలార్‌లో బంగారం దొరుకుతుందని చెప్పారు. అది చదివాక ఆయనకు కోలార్ గనుల మీద ఆసక్తి కలిగింది.

అది చదువుతున్నప్పుడే లావిల్‌కు బ్రిటిష్ ప్రభుత్వ లెఫ్టినెంట్ జనరల్ జాన్ వారెన్ రాసిన ఒక రిపోర్ట్ కూడా దొరికింది. అందులోని సమాచారం ప్రకారం 1799లో శ్రీరంగపట్టణం యుద్ధంలో ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్‌ను ఓడించి, అతడిని హత్య చేసిన తర్వాత కోలార్ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారనే విషయం తెలిసింది.

కానీ, కొంతకాలం తర్వాత ఆంగ్లేయులు తాము గెలిచుకున్న ప్రాంతాన్ని మైసూరు రాజ్యానికి అప్పగించారు. కానీ కోలార్ భూమిని మాత్రం సర్వే చేయడానికి తమ దగ్గరే ఉంచుకున్నారు.

బంగారం

ఫొటో సోర్స్, AFP/GETTY

బంగారం వెతుకులాట

చోళుల పాలనా కాలంలోనే ప్రజలు భూమిని చేతులతో తవ్వి బంగారం వెలికి తీసేవారన్న విషయం వినడంతో, కోలార్ ప్రాంతంలో బంగారం గురించి తనకు సమాచారం ఇచ్చినవారికి బహుమతులు ఇస్తానని వారెన్ ప్రకటించారు.

ఆ ప్రకటనకు కొన్ని రోజుల తర్వాత కొంతమంది గ్రామస్థులు ఒక ఎద్దుల బండిలో వారెన్ దగ్గరికొచ్చారు. ఆ ఎద్దుల బండికి కోలార్ మట్టి అంటుకుని ఉంది. గ్రామస్థులు వారెన్ ముందే ఆ మట్టిని కడిగి చూపించారు. అందులో బంగారం అణువులు కనిపించాయి.

దాంతో వారెన్ ఆ ప్రాంతంలో పరిశోధనలు ప్రారంభించారు. చేతులతో బంగారం తవ్వి తీసే స్థానికులు 56 కిలోల మట్టి నుంచి గురిగింజ అంత బంగారం ముద్ద తీసేవారని కనుగొన్నారు.

స్థానికుల నైపుణ్యానికి టెక్నాలజీ తోడైతే మనం మరింత బంగారం వెలికి తీయవచ్చని తన పై అధికారులకు చెప్పారు.

వారెన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1804 నుంచి 1860 మధ్యలో కోలార్ ప్రాంతంలో చాలా రీసెర్చ్, సర్వే చేశారు. కానీ ఆంగ్లేయులకు అక్కడ ఏం దొరకలేదు. ఏ లాభం లేకపోగా, ఆ తవ్వకాల సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో అక్కడ జరిగే తవ్వకాలపై నిషేధం విధించారు.

అయితే 1871లో వారెన్ రిపోర్ట్ చదివిన లావిల్ మనసులో కోలార్ బంగారం గనులపై ఆసక్తి కలిగింది.

ఒక ఎద్దులబండిలో లావిల్ బెంగళూరు నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని కోలార్ వెళ్లారు. అక్కడ దాదాపు రెండేళ్లపాటు పరిశోధనలు చేసిన తర్వాత ఆయన 1873లో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని మైసూర్ మహారాజును కోరారు.

కోలార్ ప్రాంతంలో 20 ఏళ్లపాటు తవ్వకాలకు లావిల్‌ లైసెన్స్ పొందారు. ఆ తర్వాత 1875లో ఆయన ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు.

లావిల్ మొదట కొన్నేళ్లపాటు ఎక్కువ సమయం డబ్బులు పోగుచేయడానికి, స్థానికులను పనికి సిద్ధం చేయడంలో గడిపారు. ఎన్నో సమస్యల తర్వాత చివరికి కేజీఎఫ్ నుంచి బంగారం తీయడం మొదలైంది.

కరెంట్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో విద్యుత్ వచ్చిన మొదటి టౌన్

కేజీఎఫ్ గనుల్లో మొదట వెలుగు కోసం కాగడాలు, కిరోసిన్ లాంతర్లు ఉపయోగించేవారు. కానీ, ఆ వెలుతురు సరిపోయేది కాదు. దాంతో అక్కడ కరెంట్ లైట్లు వేయాలని నిర్ణయించారు. అలా కేజీఎఫ్ భారత్‌లో విద్యుత్ పొందిన మొదటి ప్రాంతంగా నిలిచింది.

కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ దగ్గర విద్యుత్ అవసరాల కోసం, ఆ ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో కావేరీ విద్యుత్ కేంద్రం నిర్మించారు. జపాన్ తర్వాత ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద విద్యుత్ ప్లాంట్. దీనిని కర్ణాటకలోని ఇప్పటి మాండ్యా జిల్లాలోని శివనసముద్రంలో నిర్మించారు.

భారత్‌లో పూర్తిగా విద్యుత్ వెలుగులు నిండిన మొదటి ప్రాంతం కేజీఎఫ్. జల విద్యుత్ కేంద్రం నిర్మాణంతో అక్కడ 24 గంటలూ విద్యుత్ ఉండేది. బంగారు గనుల వల్ల బెంగళూరు, మైసూరు తర్వాత కేజీఎఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తూ వచ్చింది.

విద్యుత్ సరఫరా రాగానే, కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలు పెరిగాయి. మరింత వేగంగా తవ్వకాలు జరిపేందుకు వీలుగా రకరకాల యంత్రాలను కూడా గనుల్లోకి దింపారు.

ఫలితంగా, 1902 ప్రారంభానికే కేజీఎఫ్ భారత్‌లో 95 శాతం బంగారం వెలికితీయడం మొదలెట్టింది. 1905 నాటికి బంగారం తవ్వకాల విషయంలో భారత్ ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచింది.

కేజీఎఫ్-2

ఫొటో సోర్స్, KGF FACEBOOK

మినీ ఇగ్లండ్‌గా కేజీఎఫ్

కేజీఎఫ్‌లో బంగారం నిక్షేపాలు దొరికిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. అదే సమయంలో బ్రిటిష్ అధికారులు, ఇంజనీర్లందరూ అక్కడకు వచ్చి తమ ఇళ్లు కట్టుకోవడం మొదలుపెట్టారు.

ఆ ప్రాంతం చల్లగా కూడా ఉండడంతో అధికారులకు, సామాన్యులకు ఆ వాతావరణం బాగా నచ్చింది. అక్కడ కట్టిన బ్రిటిష్ వారి ఇళ్ల వరుసలను చూస్తుంటే అది ఇంగ్లండ్‌లాగే అనిపించేది. అందుకే, దానిని మినీ ఇంగ్లండ్ అని కూడా పిలుచుకునేవారని డెక్కన్ హెరాల్డ్ ఒక కథనంలో రాసింది.

కేజీఎఫ్ నీటి అవసరాలు తీర్చడానికి బ్రిటన్ ప్రభుత్వం దగ్గర్లో ఒక చెరువును కూడా తవ్వించింది. అక్కడ నుంచి కేజీఎఫ్ వరకూ పైప్ లైన్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. తర్వాత, ఈ చెరువు ఆ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ అధికారులు, స్థానికులు ఆహ్లాదం కోసం అక్కడికి వెళ్లేవారు.

మరోవైపు, బంగారు గనుల్లో పనిచేయడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్కడికి కూలీలు కూడా భారీగా చేరుకోవడం మొదలయ్యింది. 1930ల్లో ఈ ప్రాంతంలో 30 వేల మంది పనిచేసేవారు. కూలీల కుటుంబాలు కూడా గనుల చుట్టుపక్కలే నివసించేవి.

కేజీఎఫ్-2

ఫొటో సోర్స్, KGF FACEBOOK

స్వతంత్రం వచ్చాక కేజీఎఫ్ జాతీయం

దేశానికి స్వతంత్రం రాగానే భారత ప్రభుత్వం కేజీఎఫ్‌ను స్వాధీనం చేసుకుంది. దాదాపు దశాబ్దం తర్వాత అక్కడి బంగారం గనులను జాతీయం చేసింది.

1970లో భారత ప్రభుత్వానికి సంబంధించిన 'భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్' ఈ గనుల్లో బంగారం తీయడం ప్రారంభించింది.

మొదట్లో అంతా బాగానే జరిగినా, తర్వాత కంపెనీ లాభాలు రోజురోజుకూ తగ్గుతూవచ్చాయి. 1979 తర్వాత కంపెనీ తమ కార్మికులకు కనీసం వేతనాలు కూడా ఇవ్వలేనంత నష్టాల్లో కూరుకుపోయింది.

భారత్‌లో 90 శాతం బంగారం తవ్వకాలు జరిపిన కేజీఎఫ్ పరిస్థితి 80వ దశకం తర్వాత మరింత దిగజారింది. అదే సమయంలో కంపెనీ చాలా మంది కార్మికులను కూడా పనిలోంచి తొలగించింది.

ఒక సమయంలో అక్కడ తవ్వితీసే బంగారం విలువ కంటే, ఆ బంగారం తీయడానికి అయ్యే ఖర్చు భారీగా పెరిగిపోయింది.

దీంతో 2001లో కేజీఎఫ్‌లో బంగారం తవ్వకాలు ఆపేయాలని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా శిథిలమయ్యింది.

మోదీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ పనులు ప్రారంభించే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం

కేజీఎఫ్‌లో 121 ఏళ్లకు పైగా బంగారం తవ్వకాలు సాగాయి. 2001 వరకూ అక్కడ తవ్వకాలు జరుగుతూనే వచ్చాయి.

ఒక రిపోర్ట్ ప్రకారం ఈ 121 ఏళ్లలో ఆ గనుల నుంచి 900 టన్నులకు పైగా బంగారం తీశారు. అక్కడ తవ్వకాలు ఆగిపోయిన తర్వాత 15 ఏళ్ల వరకూ కేజీఎఫ్‌లో అన్నీ స్తంభించిపోయాయి.

అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో ఈ ప్రాంతంలో మళ్లీ పనులు మొదలుపెడతామనే సంకేతాలు ఇచ్చింది. కేజీఎఫ్‌లో ఇప్పటికీ బంగారం నిక్షేపాలు ఉన్నాయని చెబుతారు.

కేంద్రం 2016లో కేజీఎఫ్‌కు మళ్లీ ప్రాణం పోసేందుకు వేలం ప్రక్రియ మొదలు పెడతామని ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, అనేదానిపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)