నేపాల్: ఫారిన్ కరెన్సీ నిల్వలు తగ్గడంతో దిగుమతులపై కోత... శ్రీలంకతో పోల్చవద్దంటున్న ఆర్థిక మంత్రి

నేపాల్ కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అన్నబెల్లె లియాంగ్, సంజయ ధకాల్
    • హోదా, బీబీసీ న్యూస్

నిత్యవసరాలు కాని వస్తువుల దిగుమతులను నేపాల్ నియంత్రించింది. కార్లు, కాస్మొటిక్స్, బంగారం వంటివన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.

పర్యటక వ్యయం తగ్గడం, ప్రవాస నేపాలీలు సొంత దేశానికి పంపించే డబ్బు తగ్గడంతో ప్రభుత్వ రుణాలు పెరిగాయి.

మరోవైపు గతవారం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను కూడా తొలగించారు.

అయితే, ప్రస్తుత తమ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడంపై నేపాల్ ఆర్థిక మంత్రి తప్పుపడుతున్నారు. ఇలా పోల్చడం 'ఆశ్చర్యకరంగా ఉంది'' అంటూ వ్యాఖ్యానించారు.

నేపాల్ సెంట్రల్ బ్యాంక్, నేపాల్ జాతీయ బ్యాంక్ లెక్కల ప్రకారం 2021 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య వరకు విదేశీ కరెన్సీ నిల్వల్లో తగ్గుదల 16 శాతానికిపైగా నమోదైంది.

ఇదే సమయంలో ప్రవాస నేపాలీలు సొంత దేశానికి పంపించే డబ్బులో 5 శాతం తగ్గుదల నమోదైంది.

నేపాల్ విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గాయని సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ నారాయణ ప్రసాద్ పొఖారెల్ రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.

నిత్యావసరాల సరఫరాకే ఆటంకం రాకుండా ఉంటూ కొన్ని వస్తువుల దిగుమతిని నియంత్రించేలా ఏదైనా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

పూర్తి చెల్లింపులు చేస్తే 50 రకాల విలాస వస్తువులు తెచ్చుకునేందుకు దిగుమతిదారులకు అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు.

వీటన్నిటి అర్థం దిగుమతులను నిషేధించినట్లు కాదని, దిగుమతులను నియంత్రించడం మాత్రమేనని ఆయన అన్నారు.

నేపాల్ సెంట్రల్ బ్యాంక్ గవర్నరు మహా ప్రసాద్ అధికారిని గతవారం తొలగించారు. ఆయన్ను తొలగించడానికి కారణాలను కూడా చెప్పలేదు.

నేపాల్ అప్పులు ఆ దేశ జీడీపీలో 43 శాతాన్ని దాటిపోయాయి.

అయితే, దేశ ఆర్థిక పరిస్థితిని సూచించే సూచీలు సాధారణంగానే ఉన్నాయని అక్కడి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చితే నేపాల్ అప్పులు తక్కువగానే ఉన్నాయని ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మ చెప్పారు.

'నేపాల్‌ను శ్రీలంకతో ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. 1948లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కూడా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంది' అని ఆయన అన్నారు.

మరోవైపు నేపాల్ పరిస్థితి శ్రీలంక కంటే చాలా మెరుగ్గా ఉందని 'కేపిటల్ ఎకనమిక్స్' సంస్థ మార్కెట్ ఎకనమిస్ట్ అలెక్స్ హోమ్స్ అన్నారు.

'సౌకర్యవంతమైన కనీస నిల్వల'తో పోల్చినప్పుడు నేపాల్ విదేశీ కరెన్సీ నిల్వలు రెట్టింపు మొత్తంలో ఉన్నాయని హోమ్స్ చెప్పారు.

అయితే, ప్రస్తుత ద్రవ్య లోటును పూరించుకోలేకపోతే పరిస్థితులు దిగజారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ధరల పెరుగుదల, నిత్యవసరాల కొరతను నియంత్రించే చర్యలలో భాగంగా కీలక వడ్డీ రేట్లను కొన్నిటిని శ్రీలంక గత వారమే రెట్టింపు చేసింది. దాంతో పాటు సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌ను కూడా మార్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)