Tour of duty: ఇండియన్ ఆర్మీ నియామకాలు ఎందుకు జరగట్లేదు? భారత సైన్యాన్ని తగ్గిస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రభుత్వం, సాయుధ బలగాల నియామకాన్ని తిరిగి చేపట్టాలని డిమాండ్ చేసే నిరసనలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని తన ఇంటి నుంచి దేశ రాజధానికి ఢిల్లీకి చేరుకునేందుకు 50 గంటల పాటు పరుగెత్తానని గతవారం 23 ఏళ్ల ఒక వ్యక్తి చెప్పారు.
సురేశ్ భిచర్, జాతీయ జెండాను పట్టుకొని 350 కి.మీ దూరం పరుగెత్తి ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్మీలో చేరడం తనకు ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. కానీ, రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు నిలిచిపోవడంతో ఆశావహులంతా వయస్సు రీత్యా అనర్హులుగా మారిపోతున్నారని అన్నారు. ఆర్మీలో సైనికునిగా చేరడానికి గరిష్ట వయస్సు 21.
14 లక్షల మంది సభ్యులున్న భారత ఆర్మీ... దేశంలో, ప్రపంచంలోనే ఒక అగ్రస్థాయి నియామక సంస్థగా ఉంది. భారత్‌లోని చాలామంది యువకులకు సైన్యంలో చేరడం ఒక గౌరవపూర్వకమైన, భద్రతతో కూడిన ఉద్యోగం. ప్రతీ ఏడాది ఆర్మీ నుంచి దాదాపు 60 వేల మంది సైనికులు రిటైర్ అవుతుంటారు. వారిని భర్తీ చేయడానికి 100 నియామక ర్యాలీలను నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నియామక ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఇది పూర్తిగా నిజం కాదని విశ్లేషకులు నమ్ముతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఆర్మీ బలగాలను కుదించే మార్గాల వైపు దృష్టి సారించిందని వారు అంటున్నారు.
ఆర్మీకి ఇచ్చే వేతనాలు, పెన్షన్స్ బిల్‌ను దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5.3 లక్షల కోట్ల) ఆర్మీ బడ్జెట్‌లో సగానికి పైగా వీటి వినియోగానికే సరిపోతుంది. దీనివల్ల బలగాలను, సైనిక సామగ్రిని ఆధునీకరించడానికి బడ్జెట్ కొరత ఏర్పడుతుంది.
ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మిలిటరీపై ఎక్కువగా ఖర్చు చేసే మూడో దేశం భారత్. ఆయుధాల దిగుమతిలో భారత్ రెండో స్థానంలో ఉంది. రక్షణ పరికరాలను దేశీయంగా తయారు చేయడం కోసం మోదీ ప్రభుత్వం బిలియన్ డాలర్ల ఖర్చు చేస్తోంది. భారత్ వద్ద కావాల్సినంత న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో పాటు బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
'త్రీ ఇయర్ టూర్ ఆఫ్ డ్యూటీ' పేరిట నిర్ణీత కాలవ్యవధికి సైనికులను నియమించే ప్రతిపాదనపై భారత ప్రభుత్వం ఆలోచిస్తోందని రక్షణ శాఖలోని అనేక వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.
ప్రధాని మోదీ, స్వయంగా సంస్కరణల వాది. ఆయన గతంలో కేవలం సైనికుల పరాక్రమాల గురించే కాకుండా... లాఘవంగా, వేగంగా, సాంకేతికతతో నడిచే బలగాల ఆవశ్యకత గురించి మాట్లాడారు. వేగవంతమైన యుద్ధాలను గెలిచే సామర్థ్యాలు భారత్‌కు అవసరం అని అన్నారు.
అత్యంత గౌరవనీయమైన పదవిలో రిటైర్ అయిన ఒక అధికారి నుంచి ఆర్మీ కుదింపు వ్యాఖ్యలకు ఊతమిచ్చే ఒక మాట వినిపించింది. ''లక్షకు పైగా సిబ్బంది కొరత ఉన్న ఈ సమయమే ఆర్మీలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక మంచి అవకాశం'' అని లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ ఇటీవలే అన్నారు.
''సంప్రదాయ యుద్ధాలపై అణ్వాయుధాలు ఆధిపత్యం ప్రదర్శించే ప్రస్తుత పరిస్థితుల్లో... 21వ శతాబ్ధపు బలగాలకు మిలిటరీ టెక్నాలజీ అండతో వేగంగా ప్రతిస్పందించే చురుకైన ఆయుధాలు ఉండటం చాలా అవసరం'' అని ఆయన అన్నారు.
''భారత్‌కు పెద్ద మిలిటరీ దళం ఉంది. ఇక్కడ ఎక్కువ మందిని వినియోగించడం ద్వారా నాణ్యమైన ఫలితాలను రాబట్టుకోవాలని అనుకుంటాం. అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్, రక్షణ వ్యవస్థ వ్యయాన్ని గణనీయంగా పెంచే వీల్లేదు. అందుకే సంఖ్యను తగ్గించి నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది'' అని ఆయన వివరించారు.
''ఇప్పుడున్న సంఖ్య కంటే చాలా తక్కువ సిబ్బందితో రాణించగల సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది. అవసరం లేని సంఖ్యను తగ్గించాలి'' అని మాజీ అధికారి అజయ్ శుక్లా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఉదాహరణకు చైనా, తన రక్షణ బడ్జెట్‌లో మూడోవంతు కంటే తక్కువ భాగం సిబ్బందిపై వెచ్చిస్తుంది. భారత్ 60 శాతాన్ని కేటాయిస్తుంది'' అని ఢిల్లీ జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సటీలోని సెక్యూరిటీ స్టడీస్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ బెహరా అన్నారు. చైనాను అడ్డుకోవడానికి ఒక మార్గం, సాంకేతికతో కూడిన ఆధునీకరణపై ఎక్కువగా దృష్టి పెట్టడం. ఇది, బలగాల కుదింపును డిమాండ్ చేస్తుందని ఆయన వివరించారు.
బలగాల కుదింపును ప్రారంభించడానికి ఇది సరైన సమయమా అనే విషయంపై బాగా ఆలోచించాలి.
భారతదేశ సరిహద్దులో శత్రువులు పొంచి ఉన్నారు. అణ్వాయుధాలను కలిగి ఉన్న ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఏకకాలంలో రెండు యుద్ధాలు చేసేందుకు భారత సైనికులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలి.
చైనాతో వివాదాస్పద హిమాలయ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది భారత సైనికులు అక్కడ పహారా కాస్తున్నారు. భారత్ పాలనలో ఉన్న కశ్మీర్‌లో దాదాపు 5 లక్షల మంది సైనికులను కేటాయించారు. ఆ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉంది.
''సరిహద్దుల్లో అస్థిరత ఉన్న సమయంలో నియామక ప్రక్రియను నిలిపివేస్తే, తక్షణంగా మానవ శక్తి కావాల్సి వచ్చినప్పుడు ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది'' అని సింగపూర్‌లోని ఎస్ రాజారత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన అంకిత్ ముఖర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''టూర్ ఆఫ్ డ్యూటీ'' ప్రతిపాదన గురించి మరిన్ని తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. ప్రొఫెషనల్ సైనికులను తాత్కాలిక, స్వల్పకాలిక సైనికులతో భర్తీ చేయడం వల్ల ఆర్మీ బలహీనపడే ప్రమాదం ఉందని అంకిత్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
తాజా ప్రతిపాదనతో తాను అసౌకర్యంగా ఉన్నానని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన సీనియర్ ఫెలో సుశాంత్ సింగ్ అన్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 20లలోనే ఆర్మీ నుంచి బయటకు వచ్చే యువ సైనికుల సంఖ్య పెరిగిపోతుందని, అసలే నిరుద్యోగం పెచ్చరిల్లుతోన్న దేశంలో ఇది మరింత సమస్యగా మారుతుందని ఆయన అన్నారు.
''ఆయుధాలను వాడటంలో సుశిక్షితులైన చాలామందిని ఉద్యోగాల కోసం బయటకు పంపాలి అనుకుంటున్నారా? ఈ మాజీ సైనికులను సెక్యూరిటీ గార్డులుగా చూడాలి అనుకుంటున్నారా? చివరకు ఆయుధాల శిక్షణ పొందిన వ్యక్తులతో మిలీషియా ఏర్పడుతుందేమోనని నాకు భయంగా ఉంది'' అని సుశాంత్ ముఖర్జీ తెలిపారు.
చురుకైన, తేలికైన సైన్యం ఎవరిపైనా ఓడిపోదు. 'మోదీ ప్రభుత్వం సంస్కరణలను చేపట్టాలి. కానీ, సంప్రదాయ మిలిటరీకి కట్టుబడి వాటిని వదిలివేసినట్లుగా అనిపిస్తోంది'' అని లెఫ్టినెంట్ జనరల్ పనాగ్ వాదించారు. కానీ, సింగ్ లాంటి విమర్శకులు దీనిపై కీలక ప్రశ్నలను లేవనెత్తారు.
''ఏళ్ల తరబడి భర్తీ చేయని ఖాళీల సంగతేంటి? తాత్కాలిక ప్రాతిపదికగా నియమితులయ్యేవారికి మీరు ఎంత వేగంగా శిక్షణ ఇవ్వగలరు? ఆర్మీ నియామకాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రజా నిరసనలు కొనసాగుతున్నందున అనివార్యంగా వచ్చే రాజకీయ ఒత్తిడి సంగతి ఏంటి? మరీ ముఖ్యంగా, సైన్యంలోని ఏ పాత్రలను మీరు కుదించాలి అనుకుంటున్నారు? గన్‌లను పట్టే సైనికులనా లేక రేషన్ తదితర విషయాలు చూసే సైనికులనా?''
''అందరి ఆమోదంతో తయారు చేసిన ప్రణాళిక, వ్యూహంలా ఇది అనిపించడం లేదు. ఇదో దొంగ సంస్కరణ'' అని సింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఆ నాలుగు కులాలకూ ప్రాతినిధ్యం లేని తొలి క్యాబినెట్ ఇదే.. వైఎస్ జగన్ 2.0 మంత్రివర్గంలో 5 ముఖ్యమైన అంశాలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం: ఈ సామాజిక న్యాయానికి ఉన్న అధికారం ఎంత?
- శ్రీకాకుళం జిల్లా: ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసు: 'తల్లి, తండ్రి, పిల్లలు అంతా పోలీసులే.. కానీ, ఖాకీ ధరించే పోలీసులు లేరు'
- బ్రిడ్జ్‌ని దొంగలు ఎత్తుకుపోయారు
- షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్న ఈయనకూ, కశ్మీర్‌కూ ఏంటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













