శ్రీకాకుళం జిల్లా: ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసు: 'తల్లి, తండ్రి, పిల్లలు అంతా పోలీసులే.. కానీ, ఖాకీ ధరించే పోలీసులు లేరు'

మత్స్యలేశం
ఫొటో క్యాప్షన్, మత్స్యలేశం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"ఒరేయ్, ఒరేయ్...పోలీసూ.., ఇలా రారా..ఇది మీ ఇంట్లో ఇచ్చేయ్. ఓయ్ పొట్టి పోలీసా, నాలుగు రోజులుగా ఎక్కడికెళ్లిపోనావు?

ఇదిగో పోలీసమ్మ 50 మందికి వంటలొండాలి ఎంత ఇమ్మంటావు?"

ఇలా పోలీసు అని పిలుస్తూ, పలకరిస్తూ, మాట్లాడుకొంటున్నవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని మత్స్యలేశం అనే గ్రామంలోని ప్రజలు. ఈ గ్రామాన్ని కొవ్వాడ అని పిలుస్తారు. గ్రామం జనాభా దాదాపు 4,500. అందులో ఐదు వందల మంది 'పోలీసులే'. అయితే, వీరంతా పోలీసు ఉద్యోగం చేస్తున్నవారు కాదు.

కానీ వీళ్లను ఎవరైనా పోలీసు అనే పిలవాలి. ఆధార్ కార్డులో కూడా పోలీసు అని రాసుంటుంది. ఆసక్తికరంగా ఉంది కదూ!

ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే
ఫొటో క్యాప్షన్, ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే

ఈ పోలీసు కథ ఏంటి?

ఈ గ్రామంలో కొన్ని తరాల నుంచి కూడా పుట్టిన పిల్లలకు పోలీసు అనే పేరు పెట్టే ఆచారం ఉన్నట్లు స్థానికులు చెప్పారు.

"ఆడోళ్లకి పోలీసమ్మ అని, మగాళ్లకి పోలీసు అని పేరు పెట్టుకుంటాం. కుటుంబంలో ముందు పుట్టిన పిల్లలకు ఈ పేరు తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఈ పేరు పెట్టుకుంటేనే వారికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇంట్లో ఆ పేరుతో పిలిచినా, బయట మాత్రం వేరే పేర్లతోనే పిలిపించుకుంటారు" అని బర్రి పోలీసు అనే మహిళ బీబీసీకి తెలిపారు.

"ఆధార్ చూస్తే కానీ నమ్మరు"

కొవ్వాడ మత్స్యలేశం ఒక మత్స్యకార గ్రామం. గ్రామస్థుల్లో అత్యధికులు మత్స్యకారులే. వీరంతా వేట కోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు కూడా వెళ్తుంటారు. అలా వెళ్లే మత్స్యకారులను అక్కడి పోలీసులు, కోస్టు గార్డు, మెరైన్ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రశ్నిస్తూ ఉంటారు.

"అలా ప్రశ్నించేటప్పడు మా పేరు అడుగుతారు. పోలీసని చెబితే నమ్మరు. మరిన్ని ఎక్కువ ప్రశ్నలు వేసి అనుమానంగా చూస్తారు. మా ఆధార్ కార్డును ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు. మీ పేరు 'పోలీసా ' అని అడుగుతారు. అవును అని చెప్తాం. అదేంటి పోలీసు పేరు పెట్టుకోవడమేంటి...అందులోనూ, మీలో చాలా మందికి ఇదే పేరు ఉందేంటి..? అని ఆశ్చర్యంగా అడుగుతారు".

"పోలీసు అనే పేరుని అడ్డుపెట్టుకుని మీరేదైనా చట్ట వ్యతిరేక పనులు ప్లాన్ చేసుకుని వచ్చారా అని గుజరాత్‌లో పోలీసులు అనుమానంగా అడిగిన రోజులు ఉన్నాయి" అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కొవ్వాడ మత్స్యకారుడు మైలపల్లి పోలీసు.

ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే
ఫొటో క్యాప్షన్, ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే

'అణు విద్యుత్ కేంద్రం అధికారులకు అనుమానమొచ్చింది'

పోలీసు అనే పేరు ఊర్లో అందరికి ఉండటంతో ఊర్లోకి కొత్తగా వచ్చిన వారికి కొంత ఆశ్చర్యం, ఎంతో అయోమయం కలుగుతాయి.

కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం విషయాల్లోనూ చాలా మంది అధికారులకు ఇదే సమస్య ఎదురైందని స్థానికులు తెలిపారు.

"అణు విద్యుత్ కేంద్రం వాళ్లకు కూడా ఇదే అనుమానం వచ్చింది. అప్పుడు వాళ్లు పోలీసనే పేరేంటి? అని అడిగారు. పైగా, ఊళ్లో చాలా మందికి ఈ పేరు ఉందేంటని ప్రశ్నించారు. ఆ సమయంలో నిర్వాసితుల జాబితా రాసుకుంటున్నారు. దాంతో ఏం చెప్తే ఏమైపోతుందోనని ఊళ్లో చాలా మంది భయపడిపోయారు. మా ఊర్లో ఎక్కువ మందికి ఆ పేరు ఎందుకొచ్చిందో చెప్పాను. మా ఊరి కట్టుబాటేటో, పోలీసని ఎందుకు పేరు పెట్టుకుంటామో చెబితే అంతా ఆశ్చర్యంగా విన్నారు" అని 65 ఏళ్ల రాములమ్మ బీబీసీకి వివరించారు.

"మీ పోలీసు పేరు వలన మా పనికే కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ వెటకారమాడారు" అని రాములమ్మ చెప్పారు.

ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే
ఫొటో క్యాప్షన్, ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే

బడిలో వేరే పేరు

"పుట్టిన పిల్లలు కొందరు పాలు తాగడానికి ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పిల్లలకు ఉయ్యాల ఉత్సవం చేసి, చెవిలో పోలీసు అని పిలుస్తాం. అలా చేసిన తర్వాత పిల్లలు పాలు తాగడం మొదలు పెడతారు. ఇదంతా మీకు మూఢనమ్మకం అనిపించవచ్చు. కానీ మా ఊర్లో తరాలుగా జరుగుతున్నది అదే" అని ఉప్పాడ పోలీసు చెప్పారు.

"ఉయ్యాల్లో వేసినప్పుడు కనీసం రెండు సార్లు ఆ బిడ్డ చెవిలో పోలీసు అని పిలుస్తాం. తర్వాత బడిలో వేసినప్పుడు ఇప్పటి పేర్లు పెడతాం. పోలీసు అనే పేరుతో మా ఊరికి ఉన్న అనుబంధం అలాంటిది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ ఊళ్లో పిల్లలకు పేర్లు ఉండవు

ఇంటిపేరుతో పాటు అంటే మైలపల్లి పోలీసు, ఉప్పాడ పోలీసు, బర్రి పోలీసు ఇలా నేరుగా పోలీసు అనే పేరు ఎక్కువగా ఉంటుంది. అయితే పోలీసు అనే పేరుకు ముందు మరో పేరు తగిలించి అంటే కృష్ణ పోలీసు, రాంబాబు పోలీసు, ప్రసాద్ పోలీసు ఇలా కొందరికి ఉంటుంది.

అయితే, ఇప్పటి తరానికి చెందిన పిల్లలకు మాత్రం పోలీసు అనే పేరు పెట్టడం లేదు. వారికి సాధారణమైన పేర్లు పెడుతున్నారు.

కానీ వారిని ఇంట్లో మాత్రం అంతా పోలీసు అనే పిలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటి పేరు, అసలు పేరు, కొసరు పేరు ఏదైనా ఊర్లో అందరికి నిక్ నేమ్ మాత్రం పోలీసే.

కొయ్యలతో చేసిన పోలేరమ్మ
ఫొటో క్యాప్షన్, కొయ్యలతో చేసిన పోలేరమ్మ

'మా గ్రామ దేవతే మా ఊరి పోలీసు'

ఈ గ్రామంలో తాటిచెట్ల కింద కొయ్యలతో చేసిన పోలేరమ్మ అనే అమ్మవారిని గ్రామస్థులు కొలుస్తారు.

"పోలేరమ్మ పేరునే మేం మా పిల్లలకు పెడతాం. మా గ్రామదేవత పేరుని పెట్టుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. మొదట్లో ఆడ, మగ అని తేడా లేకుండా అందరికి పోలేరమ్మ అనే పేరు పెట్టేవారట. ఆ తరువాత అది కాస్త ఆడపిల్లలకైతే పోలేరమ్మ, మగపిల్లలకైతే పోలేసుగా పెట్టేవారు. ఆ పేర్లే ప్రస్తుతం, మగపిల్లలకైతే పోలీసు, ఆడపిల్లలకైతే పోలీసమ్మ అనే పేర్లుగా మారిపోయాయి. మా ఊరి దేవత పోలేరమ్మే...పోలీసుగా మాకు రక్షణ కల్పిస్తుందని మా నమ్మకం" అని ఉప్పాడ పోలీసు అనే వ్యక్తి చెప్పారు.

సుధాకుమారి
ఫొటో క్యాప్షన్, సుధాకుమారి

'తల్లి, తండ్రి, పిల్లలు అంతా పోలీసులే'

కొవ్వాడలో ఎక్కువ మందికి పోలీసు అనే పేరుతో పాటు కొంత మందికైతే ఇంటి పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ మైలపల్లి అనే ఇంటి పేరు ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మందికి పోలీసు అనే పేరు ఉంది. దీంతో ఊర్లో మైలపల్లి పోలీసు అనే పేరుతో చాలా మంది కనిపిస్తారు.

అంతా పోలీసులే కావడంతో గ్రామస్థుల సౌలభ్యం కోసం వారి రూపురేఖలు, వృత్తి ఆధారంగా పోలీసుకు ముందు ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఉదాహరణకు పొట్టి పోలీసు, ఆటో పోలీసు, నల్ల పోలీసు, వంటల పోలీసు అని పిలుస్తారు. లేదా ఇంటి పేరుతో కలిపి సురాడ పోలీసు, వారధి పోలీసు, మైలపల్లి పోలీసు, ఉప్పాడ పోలీసు, బర్రి పోలీసు- ఇలా పిలుచుకుంటారు.

"తల్లి, తండ్రి, మా స్కూల్లో చదివే పిల్లల పేర్లు కూడా పోలీసే. దాంతో రిజిస్టర్‌లో పేర్లు రాసేటప్పుడు ఆ పేరు పిల్లలదా, తల్లిదా, తండ్రిదా అనేది పెద్ద అయోమయంగా ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగయింది. కానీ నేను పదేళ్ల క్రితం ఈ స్కూల్‌కు వచ్చినప్పుడు పోలీసనే పేరుతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇన్సెస్పెక్షన్ జరిగినప్పుడైతే... అధికారులు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు" అని కొవ్వాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధాకుమారి బీబీసీతో చెప్పారు.

ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే
ఫొటో క్యాప్షన్, ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసే

'ఊరంతా పోలీసులే...ఖాకీ ధరించే పోలీసులు లేరు'

పోలీసు పేరుతో ఊరి నిండా మనుషులు ఉన్నా, నిజమైన పోలీసు ఒక్కరూ లేరు.

"ఖాకీ దుస్తులు ధరించపోయినా మా ఊర్లో అందరూ పోలీసులే. పోలీసు అని ఐడీ కార్డు అయితే చూపించలేం కానీ, పోలీసు అని పేరున్న ఆధారు కార్డులైతే చూపించగలం. ఒక్కరైనా నిజమైన పోలీసు ఉంటే బాగుంటుంది అని మేం కూడా అనుకుంటూ ఉంటాం" అని తీరంలో తన బోటును శుభ్రం చేసుకుంటూ నవ్వుతూ చెప్పారు మరో మైలపల్లి పోలీసు.

"మా పంచాయతీకి చెందిన రాము అనే వ్యక్తి మెరైన్ పోలీసుగా పని చేస్తున్నారు. మా కొవ్వాడలో మాత్రం పోలీసుగా విధులు నిర్వహిస్తున్నవారు ఒక్కరూ లేరు" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, శశి థరూర్ పార్లమెంటులో చూసిన చూపు ఎందుకు వైరల్ అయింది... దానికి ఆయన ఏమన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)