బిల్లు చెల్లించడానికి చేయి ఉంటే చాలు... డెబిట్, క్రెడిట్ కార్డులు అక్కర్లేదు, ఎలాగో తెలుసుకోండి..

చేతిలో అమర్చిన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చిప్ సహాయంతో బిల్లు కడుతోన్న మహిళ

ఫొటో సోర్స్, PIOTR DEJNEKA

ఫొటో క్యాప్షన్, చేతిలో అమర్చిన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చిప్ సహాయంతో బిల్లు కడుతోన్న మహిళ
    • రచయిత, కేథరీన్ లాథమ్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

ప్యాట్రిక్ పామెన్ ఏదైనా షాపులో లేదా రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించినప్పుడల్లా అందరూ షాక్ అవుతారు.

ఎందుకంటే ఆయన బిల్లు చెల్లించడానికి బ్యాంకు కార్డులు లేదా మొబైల్ ఫోన్‌ను ఉపయోగించరు. వాటికి బదులుగా కేవలం చేతిని కాంటాక్ట్‌లెస్ కార్డ్ రీడర్‌కు దగ్గరగా ఉంచుతారు. వెంటనే చెల్లింపు జరిగిపోతుంది.

''అప్పుడు క్యాషియర్ల నుంచి వచ్చే స్పందన అమూల్యమైనది'' అని అంటారు 37 ఏళ్ల ప్యాట్రిక్ పామెన్. నెదర్లాండ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఆయన పనిచేస్తారు.

2019లో ప్యాట్రిక్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మైక్రోచిప్‌ను తన చేతిలో అమర్చుకున్నారు. దీని కారణంగానే ఆయన చేయి పెట్టగానే చెల్లింపులు జరిగిపోతున్నాయి.

''ఎవరైనా మనల్ని గిల్లితే ఎంత నొప్పి కలుగుతుందో ఈ మైక్రోచిప్ అమర్చే ప్రక్రియలో కూడా అంతే నొప్పి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

పామెన్ ఎడమ చేతిలో చిప్ అమర్చుకున్నారు. పేమెంట్ మెషీన్‌ దగ్గరకు రాగానే ఆయన చిప్‌లోని లైట్ వెలుగుతుంది

ఫొటో సోర్స్, PATRICK PAUMEN

ఫొటో క్యాప్షన్, పామెన్ ఎడమ చేతిలో చిప్ అమర్చుకున్నారు. పేమెంట్ మెషీన్‌ దగ్గరకు రాగానే ఆయన చిప్‌లోని లైట్ వెలుగుతుంది

మైక్రోచిప్‌ను తొలిసారిగా 1998లో మానవ శరీరంలో అమర్చారు. కానీ, గత దశాబ్ధంలోనే ఈ సాంకేతికత వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది.

ఇక శరీరంలో అమర్చే పేమెంట్స్ చిప్స్ విషయానికొస్తే... వీటిని విక్రయానికి అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా బ్రిటిష్-పోలిష్ సంస్థ వాలెట్‌మోర్ నిలిచింది. గత ఏడాదే ఈ ఘనత సాధించినట్లు ఆ కంపెనీ చెప్పింది.

''ఈ మైక్రోచిప్‌తో రియోలో డ్రింక్ తాగి బిల్లు కట్టొచ్చు. న్యూయార్క్‌లో కాఫీ తాగినందుకు, పారిస్‌లో హెయిర్ కట్ కోసం లేదా మీ స్థానిక పచారీ కొట్టులో వస్తువులు కొన్నందుకు కూడా డబ్బులు చెల్లించొచ్చు'' అని వాలెట్‌మోర్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వోజ్‌తెక్ పప్రోటా అన్నారు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ జరిగే ప్రతీచోటా దీన్ని ఉపయోగించవచ్చు అని ఆయన తెలిపారు.

వాలెట్‌మోర్ చిప్, ఒక గ్రామ్ కంటే తక్కువ బరువు ఉండి బియ్యం గింజ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇందులో ఒక చిన్న మైక్రోచిప్, బయో పాలిమర్‌లో నిక్షిప్తమైన యాంటెన్నా ఉంటాయి. బయోపాలిమర్ సహజ పదార్థం. ఇది ప్లాస్టిక్‌ను పోలి ఉంటుంది.

ఇది పూర్తిగా సురక్షితమైనదని, రెగ్యులేటరీ ఆమోదాన్ని పొందిందని, శరీరంలో అమర్చిన క్షణం నుంచే పనిచేస్తుందని, ఒక్కచోటే స్థిరంగా ఉండిపోతుందని పప్రోటా చెప్పారు. దీనికి బ్యాటరీ లేదా ఇతర శక్తి వనరుల అవసరం లేదు. ఇప్పటివరకు 500లకు పైగా చిప్‌లను విక్రయించినట్లు వాలెట్‌మోర్ తెలిపింది.

వాలెట్‌మోర్ కంపెనీ, ఈ చిప్ కోసం నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) అనే సాంకేతికతను వినియోగించింది. స్మార్ట్‌ఫోన్లలోని కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల కోసం కూడా ఇదే సాంకేతికత వాడతారు. ఇతర చెల్లింపు పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) అనే సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఉండే సాంకేతికతను ఇది పోలి ఉంటుంది.

చేతి ఎక్స్‌రే చిత్రంలో వాలెట్‌మోర్ ఇంప్లాంట్‌ను చూడొచ్చు

ఫొటో సోర్స్, WALLETMOR

ఫొటో క్యాప్షన్, చేతి ఎక్స్‌రే చిత్రంలో వాలెట్‌మోర్ ఇంప్లాంట్‌ను చూడొచ్చు

శరీరంలో చిప్‌లను అమర్చుకోవడం అనే ఆలోచన మనలో చాలామందికి భయంకరంగా అనిపిస్తుంది. కానీ, 2021లో యూకే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన 4000 మందికి పైగా ప్రజలపై చేసిన సర్వేలో 51శాతం మంది దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.

''గోప్యత, భద్రత సమస్యలను ప్రధాన అంశాలుగా చూపిస్తూ ప్రజలు దీనివైపు మొగ్గినట్లు'' ఆ నివేదిక ప్రకారం తెలుస్తోంది.

తనకు ఇలాంటి సమస్యలేవీ లేవని పామెన్ చెప్పారు.

''ఇంప్లాంట్‌లోని యాంటెన్నా కాయిల్, రీడింగ్ దూరాన్ని నియంత్రిస్తుంది. కార్డ్ రీడర్‌కు చెందిన విద్యుదయస్కాంత క్షేత్రంలో ఇంప్లాంట్ ఉన్నప్పుడు మాత్రమే బిల్లు చెల్లించడం సాధ్యం అవుతుంది'' అని ఆయన అన్నారు.

ఈ చిప్‌ ఆధారంగా తాను ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడ ఉంటున్నానో అనే వివరాలు ఇతరులకు తెలిసిపోతాయనే ఆందోళన తనకు లేదని పామెన్ చెప్పారు.

అయితే, వ్యక్తుల ప్రైవేటు సమాచారం మొత్తం ఉండే ఈ చిప్‌లు భవిష్యత్‌లో అభివృద్ధి చెందే సాంకేతికతను తట్టుకొని భద్రంగా, సురక్షితంగా ఉంటాయా? వీటిని ట్రాక్ చేయలేరా? అనేది ఆలోచించాల్సిన అంశం.

థియోడోరా లౌ

ఫొటో సోర్స్, THEODORA LAU

ఫొటో క్యాప్షన్, థియోడోరా లౌ

'బియాండ్ గుడ్: హౌ టెక్నాలజీ ఈజ్ లీడింగ్ ఎ బిజినెస్ డ్రివెన్ రివల్యూషన్' అనే పుస్తక సహరచయిత, ఫిన్‌టెక్ నిపుణులు థియోడోరా లౌ దీని గురించి మాట్లాడారు.

''ఇంప్లాంటెడ్ పేమెంట్ చిప్‌లు అనేవి ఇంటర్నెట్‌కు కొనసాగింపు వంటివి. అంటే డేటా మార్పిడికి, డేటా అనుసంధానానికి ఇవి కొత్త మార్గాలు'' అని ఆమె అన్నారు.

ఇలాంటి చిప్‌ల ద్వారా చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా జరుగుతుండటంతో ప్రజలు వీటి వినియోగానికి సంసిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. అయితే చిప్‌లను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను, దానితో ముడిపడి ఉన్న ప్రమాదాలతో బేరీజు వేసి చూడాలని చెప్పారు. మరీ ముఖ్యంగా, ఎంబెడెడ్ చిప్‌లు మరింత ఎక్కువగా మన వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయని అన్నారు.

రీడింగ్ యూనివర్సిటీకి చెందిన హెన్లీ బిజినెస్ స్కూల్‌లో నాడా కకాబడ్సే ఒక ప్రొఫెసర్. మరింత అధునాతన ఎంబెడెడ్ చిప్‌ల భవిష్యత్ పట్ల ఆమె అప్రమత్తంగా ఉన్నారు.

''సాంకేతికత దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛపై జాగ్రత్తగా లేని వారిని ఇది అణిచివేస్తుంది. కొంతమంది ప్రయోజనాల కోసం చాలామంది స్వేచ్ఛను నిర్వీర్యం చేసినట్లే'' అని ఆమె హెచ్చరించారు.

''చిప్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని'' వించెస్టర్ యూనివర్సిటీలోని ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీనియర్ లెక్చరర్ స్టీవెన్ నార్తమ్ అన్నారు. ఆయన యూకే చెందిన బయో టెక్ అనే కంపెనీ వ్యవస్థాపకుడు కూడా. ఈ కంపెనీ 2017 నుంచి కాంటాక్ట్‌లెస్ చిప్‌లను తయారు చేస్తుంది.

ప్రత్యేకించి వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ ఇంప్లాంట్లను తయారుచేస్తుంది. ఆటోమెటిక్‌గా తలుపులు తెరవడానికి ఈ చిప్‌లు ఉపయోగపడతాయి.

"ఈ సాంకేతికతను చాలా సంవత్సరాలుగా జంతువులపై ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా చిన్నవి, జడ వస్తువులు. వీటివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు'' అని ఆయన అన్నారు.

పామెన్ చేతుల్లో మాగ్నెట్స్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి

ఫొటో సోర్స్, PATRICK PAUMEN

ఫొటో క్యాప్షన్, పామెన్ చేతుల్లో మాగ్నెట్స్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి

పామెన్, తనను తాను 'బయోహ్యాకర్'గా అభివర్ణించుకున్నారు. పనితీరును మెరుగుపరుచుకోవడానికి శరీరంలో సాంకేతికతను జోడించుకునే వ్యక్తులను బయోహ్యాకర్ అంటారు. ఆయన శరీరంలో మొత్తం 32 ఇంప్లాంట్లు ఉన్నాయి.

''సాంకేతిక అభివృద్ధి చెందుతూనే ఉంది, కాబట్టి నేను మరింత టెక్నాలజీని నాలో ఇముడ్చుకుంటున్నా. ఇంప్లాంట్లు లేకుండా నేను ఉండాలనుకోవట్లేదు'' అని ఆయన చెప్పారు.

''తమ శరీరంలో మార్పులు చేసుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు ఉంటారు. వారిని గౌరవించాలి. అలాగే బయోహ్యాకర్లుగా మమ్మల్ని కూడా వారు గౌరవించాలి'' అని ఆయన అన్నారు.

ప్రత్యేకించి వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ ఇంప్లాంట్లను తయారుచేస్తుంది. ఆటోమెటిక్‌గా తలుపులు తెరవడానికి ఈ చిప్‌లు ఉపయోగపడతాయి.

వీడియో క్యాప్షన్, డిజిటల్ బెగ్గర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)