Skin: 53 ఏళ్ల వృద్ధురాలిని 23 ఏళ్ల యువతిగా మార్చే చర్మ చికిత్స - కేంబ్రిడ్జ్ పరిశోధకుల ప్రయోగం

సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి

53ఏళ్ల మహిళ చర్మ కణాలకు శాస్త్రవేత్తలు పునరుజ్జీవం పోశారు. దీంతో ఆ కణాలు 23 ఏళ్ల యువతి చర్మ కణాల్లా మారిపోయాయి.

శరీరంలోని మిగతా కణజాలానికి కూడా ఇలానే జీవం పోయొచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

వయసు పైబడటంతో చుట్టుముట్టే మధుమేహం, హృద్రోగాలు, నాడీ వ్యాధులకు కొత్త చికిత్సలు కనుగొనేందుకు ఈ పరిశోధన తోడ్పడే అవకాశముంది.

25 ఏళ్ల క్రితం తొలి క్లోనింగ్ గొర్రె డాలీని సృష్టించేందుకు ఉపయోగించిన పరిజ్ఞానాన్ని ప్రస్తుతం పరిశోధకులు ఉపయోగించారు.

సైన్స్

ఫొటో సోర్స్, Fátima Santos

కేంబ్రిడ్జ్‌లోని బాబర్హమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ ఉల్ఫ్ రీక్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించేందుకు తోడ్పడే విధానాలకు ఈ పరిశోధన బాటలు పరుస్తోందని ఆయన అన్నారు.

‘‘దీని గురించి మనం ఎప్పటినుంచో కలలు కంటున్నాం. వయసు పైబడటంతో చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ విషయంలో ప్రజలకు సాయం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది’’అని ఆయన వివరించారు.

జర్నల్ ఈ-లైఫ్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీన్ని మనుషులపై ఉపయోగించే ముందు, తాము పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయని రీక్ అన్నారు. అయితే, కణాలకు విజయవంతంగా పునరుజ్జీవం పోయడం కచ్చితంగా కీలక ముందడుగేనని ఆయన వివరించారు.

డాలీ

1990ల్లోనే

తాజా పరిశోధనకు బీజాలు 1990ల్లోనే పడ్డాయి. ఎడిన్‌బరాలోని రోస్లిన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు క్షీర గ్రంథుల నుంచి సేకరించిన కణాలతో ఒక పిండాన్ని అభివృద్ధి చేశారు. దీని నుంచి డాలీ అనే క్లోనింగ్ గొర్రె జన్మించింది.

రోస్లిన్ బృందం ఆ పరిశోధన ద్వారా క్లోనింగ్ గొర్రెలను లేదా మనుషులను అభివృద్ధి చేయాలని అనుకోలేదు. అయితే, వారు ఆ పరిశోధనతో కణజాలం, నాడీ కణాలు లాంటి భాగాలను సృష్టించాలని అనుకున్నారు.

డాలీ సాంకేతిక పరిజ్ఞానాన్ని 2006లో క్యోటో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షిన్యా యమనక బృందం కాస్త సరళం చేసింది.

ఈ కొత్త సాంకేతికత 50 రోజుల్లోనే ఫలితాలను చూపించింది. రసాయనాల సాయంతో ఈ విధానంలో సాధారణ కణాలను పరిశోధకులు మూలకణాలుగా మార్చగలిగారు. దీన్ని ఐపీఎస్ సాంకేతికతగా పిలుస్తున్నారు.

డాలీ, ఐపీఎస్ సాంకేతికతల్లో సృష్టించిన మూలకణాలను సదరు వ్యక్తి కణజాలంలోనే పెంచాల్సి ఉంటుంది. ఫలితంగా మూలకణాలతో వ్యాధులకు చికిత్సలు కనిపెట్టే మార్గం జటిలమైంది.

సైన్స్

ఫొటో సోర్స్, Science Photo Library

ప్రస్తుతం రీక్ బృందం కూడా ఐపీఎస్ సాంకేతికతనే ఉపయోగించింది. అయితే, రసాయనాల్లో చర్మ కణాలను ఉంచాల్సిన రోజులను 50 నుంచి 12 రోజులకు తగ్గించారు.

మూలకణాలుగా మారడానికి బదులుగా ఈ కణాలు యవ్వనత్వం పొందడాన్ని చూసి డాక్ట్ దిల్జీత్ గిల్ ఆశ్చర్యానికి గురయ్యారు.

‘‘ఆ ఫలితాలను చూసిన రోజు నాకు బాగా గుర్తుంది. నేనసలు నమ్మలేకపోయాను’’ అని ఆయన చెప్పారు.

అయితే, ఈ పరిశోధనను ఇప్పుడే మనుషులపై ప్రయోగించడానికి వీలుకాదు. ఎందుకంటే ఐపీఎస్ సాంకేతికతతో క్యాన్సర్ల ముప్పు పెరిగే అవకాశముంది.

అయితే, చర్మ కణాలకు యవ్వనాన్ని ఇవ్వడం ఈ సాంకేతికతతో సాధ్యపడుతుందని రీక్ బృందం చెబుతోంది. మరింత సురక్షితమైన విధానంతో ముందుకు వస్తామని వివరించింది.

‘‘మనుషుల ఆరోగ్య జీవిత కాలాన్ని పెంచడమే మా లక్ష్యం. కేవలం జీవిత కాలాన్ని పెంచడం కాకుండా.. ఆరోగ్యంగా ఉండే కాలాన్ని పెంచడంపై మేం దృష్టి సారిస్తున్నాం’’అని రీక్ చెప్పారు.

ఈ సాంకేతికతో చర్మం మరింత యవ్వనంతో ఉండేందుకు తోడ్పడే చికిత్సా విధానాలు అభివృద్ధి చేయొచ్చని ఆయన చెప్పారు. ఈ కొత్త కణాలు చాలా వేగంగా గాయాలను మాన్పగలవన కూడా వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, ‘నా తల్లి చనిపోయింది.. ఆమె మృతదేహం వందేళ్లు భద్రం చేస్తా.. మళ్లీ తిరిగొచ్చాక..’

ప్రస్తుతం కణజాలం, కాలేయం, రక్త కణాలు లాంటివాటికి అనుగుణంగా ఈ పరిజ్ఞానాన్ని మార్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు.

ఈ పరిశోధన ఫలితాలు మన చేతికి అందే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని డాలీ అధ్యయనానికి నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ అండ్ బయోలాజికల్ సైన్సెస్ రీసెర్చ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ మెలెనీ వాల్హెమ్ చెప్పారు.

‘‘ఇలాంటి విధానాలతో వ్యాధి నిరోధక కణాలకు జీవం పోస్తే, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మనకు పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే సంగతి తెలిసిందే.’’

శరీరం మొత్తానికి పునరుజ్జీవం పోస్తూ యవ్వనాన్ని ప్రసాదించే యాంటీ-ఏజింగ్ పిల్ అభివృద్ధికి ఈ పరిశోధన తోడ్పడుతుందా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే, ఆ రోజులు కూడా దగ్గర్లోనే ఉండొచ్చని రీక్ వివరించారు.

‘‘జన్యువుల్లో మార్పులు చేసిన ఎలుకలపై ఈ సాంకేతికతను ప్రయోగించారు. వాటిలో వయసు తగ్గిన సూచనలు కనిపించాయి. మరో పరిశోధనలో కాలేయంపై కూడా వయసు పైబడిన జాడలను తొలగించగలిగారు.’’

అయితే, ఈ పరిశోధనలను మనుషులపై చేపట్టేందుకు చాలా అవరోధాలు ఎదురవుతాయని లండన్‌లోని క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ రాబిల్ లోవెల్ బ్యాడ్జ్ అన్నారు.

ఇతర కణజాలానికి యవ్వనం ప్రసాదించడం లేదా యాంటీ-ఏజింగ్ పిల్ అభివృద్ధి అంత తేలిగ్గా సాధ్యమయ్యే పనికాదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

‘‘రసాయనాలతో యవ్వనాన్ని ఇవ్వొచ్చని గుర్తించడం మంచి సంగతే. అయితే, దీనిలో చెడు కోణాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ రసాయనాలు మనకు అంత తేలిగ్గా దొరకవు. రెండోది ఇవి అంత సురక్షితమైనవి కాదు.’’

‘‘ఇతర కణాలకు కాస్త భిన్నమైన సాంకేతికత అవసరం కూడా కావొచ్చు. వాటిని నియంత్రించడం కూడా కష్టం అవ్వొచ్చు. ప్రస్తుతానికి మనం చెప్పేవన్నీ అంచనాలు మాత్రమే’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)