ఏలియన్స్ తరహా జీవ వ్యవస్థ ఆర్కిటిక్ సముద్ర గర్భంలో ఉందా?

ఫొటో సోర్స్, ALFRED-WEGENER-INSTITUT
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ఎన్విరాన్మెంట్ కరెస్పాండెంట్
ఆర్కిటిక్ మహాసముద్ర గర్భంలోని అతి శీతల జలాల్లో భారీ స్పాంజీలు (నీటిని పీల్చుకునే ఒక రకమైన నాచు) కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.వేల ఏళ్ల కిందట అంతరించిపోయిన జంతువులు, క్రిమి కీటకాల అవశేషాలను తింటూ సముద్రపు స్పాంజీలు మనుగడను సాగిస్తున్నాయి. ఈ స్పాంజీలు తేలికైన ప్రాచీన జీవాలు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర గర్భంలో ఇవి కనిపిస్తాయి.
పెద్ద పరిమాణంలో కనిపించిన ఈ స్పాంజీలను ఆర్కిటిక్ మహా సముద్రం లోతుల్లో భారీ సంఖ్యలో గుర్తించారు.
ఉత్తర ధ్రువం సమీపంలో మంచు ఫలకల ఉపరితలంతో ఉన్న సముద్రం అడుగున ఈ స్పాంజీలు భారీ తోటల్లా విస్తరించాయని, అవి ఒక ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థను కలిగి ఉన్నాయని జర్మనీలోని బ్రెమెన్‌లో ఉన్న మేక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెరైన్ మైక్రోబయాలజీ పరిశోధకులు డాక్టర్ థెరెసా మోర్గాంటీ వివరించారు. భారీ సంఖ్యలో స్పాంజీలను గుర్తించామని, ఒక మీటరు డయామీటర్ ప్రాంతంలో వాటి ఎదుగుదల కనిపిస్తుందని డాక్టర్ థెరెసా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మంచుఫలకల అడుగున వేలాడదీసిన కెమెరాల సాయంతో పరిశోధకులు సముద్రతలంలో ఒక తోటలా వ్యాపించిన ఈ స్పాంజీల ఫోటోలను సేకరించగలిగారు. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతంలో, సముద్రజీవులకు సాధారణంగా ఆహారం దొరికే లేయర్లను దాటుకుని మరింత లోతుల్లో సముద్రపు చీకటి ప్రపంచంలో ఈ ఆదిమ జీవాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆర్కిటిక్ సముద్రంలోంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన తర్వాత, ఈ స్పాంజీలు 300 ఏళ్ల క్రితం నాటివని వారు గుర్తించారు.ఇవి అంతరించిపోయిన జంతువుల అవశేషాలను తింటూ బతుకుతున్నాయి. వాటి ఆకలిని తీర్చుకునే ప్రక్రియలో ఆంటీబయోటిక్స్ తయారీలో ఉపయోగించే బ్యాక్టీరియా సాయం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్పాంజీలు జీవించే ప్రాంతంలో జీవం లేని పదార్ధంతో ఒక పొర ఏర్పడుతుందని ఆర్కిటిక్ సముద్రంలో జరిగిన పరిశోధనలను లీడ్ చేసిన ప్రొఫెసర్ ఆంట్జే బోటియస్ చెబుతున్నారు. ఆమె బ్రెమెర్‌హేవన్‌లోని ది ఆల్ఫ్రెడ్ వెజెనర్ ఇన్స్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు. "ఈ స్పాంజీలు అత్యధిక సంఖ్యలో ఉండటానికి, బహుశా సేంద్రీయ పదార్ధంలా మారిన పొరను, అవి తోటి సహజీవాల సాయంతో తాకి వాటి ఆవాసాన్ని సుస్థిరం చేసుకుకోవడమే కారణం కావచ్చు" అని ఆమె చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ALFRED-WEGENER-INSTITUT
భూమి గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని, మంచు ఫలకల అడుగున సముద్రం లోతుల్లో మరెన్నో జీవావరణ వ్యవస్థలను ఇంకా గుర్తించాల్సి ఉందని ఈ పరిశోధన చెబుతోందని ఆంట్జె చెప్పారు.మంచు ఫలకలతో కప్పిన సముద్రంలో ఏలియన్ వంటి జీవం ఉందని, వాటిని గుర్తించి సరైన మ్యాప్‌ను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో లేదని ఆమె అన్నారు. కానీ, అర్కిటిక్ సముద్రం మంచు ఊహించని స్థాయిలో కరుగుతుండడం వల్ల ప్రత్యేకమైన ఈ బూజు లాంటి జీవం మనుగడ ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ మార్పులతో స్పాంజీలపైన ఒత్తిడి పడుతోందని వారంటున్నారు.వేసవి కాలంలో సముద్రం మంచు మందం, వైశాల్యం గత 30 ఏళ్లలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తల కొలతల ఆధారంగా తెలుస్తోంది. అర్కిటిక్ వేడెక్కుతున్నట్లు చెప్పే పరిశీలనలకు ఇవి అనుకూలంగా ఉన్నాయి.
సముద్రాన్ని కప్పేసిన మంచు ఫలకలు కరిగిపోతూ ఉండటంతో, మహాసముద్రాల వాతావరణం వేగంగా మారిపోతోంది. ఈ సముద్ర గర్భంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలంటే, ఇలాంటి జీవావరణ వ్యవస్థల గురించి మనకు మరింత మెరుగైన సమాచారం, అవగాహన అవసరం అని ప్రొఫెసర్ బోటియస్ చెబుతున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో అచ్చయ్యాయి.

ఇవి కూడా చదవండి:
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన వారంతా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
- చరిత్రలోనే ‘అత్యంత సుదీర్ఘ యుద్ధం’: మొదలై 70 ఏళ్లు దాటినా ఇంకా ఎందుకు సమాప్తం కాలేదు?
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







