కొంప ముంచిన ‘కోతి బొమ్మ’.. రెప్పపాటులో రూ. 2.25 కోట్ల నష్టం

బోర్డ్ ఏప్

ఫొటో సోర్స్, REUTERS / NEXO

ఫొటో క్యాప్షన్, బోర్డ్ ఏప్ 4418
    • రచయిత, డ్రాఫ్టింగ్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

ఒక టైపింగ్ పొరపాటు కారణంగా ఏకంగా రూ. 2.25 కోట్ల నష్టం వాటిల్లింది. ఇదంతా రెప్పపాటులోనే జరిగిపోయింది.

డిజిటల్ రూపంలో ఉండే ఒక ఆర్ట్ వర్క్‌ను దాని యజమాని 3,00,000 డాలర్ల (రూ. 2,27,67,202)కు బదులుగా 3,000 డాలర్ల (రూ. 2,27,672)కు విక్రయించారు. ఈ అర్ట్ వర్క్ భౌతిక రూపంలో లభించదు.

నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) రూపంలోని కళాకృతికి చెందిన ''బోర్డ్ ఏప్ # 3,547'' అనే పీస్ విక్రయంలో ఈ పొరపాటు జరిగింది.

ఈ కళాకృతిని అమ్మాలని నిర్ణయించుకున్న యజమాని, దాని అసలు విలువ 3 లక్షల డాలర్లకు బదులుగా 3 వేల డాలర్లుగా ఆన్‌లైన్‌లో రాశారు.

క్షణాల్లోనే ఆటోమేటెడ్ అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి ఈ పీస్‌ను కొనుగోలు చేశారు. వెంటనే దాన్ని 2,50,000 డాలర్లకు (రూ. 1,89,71,923) అమ్మకానికి ఉంచారు.

బోర్డ్ ఏప్ # 3,547 అనేది ఎన్‌ఎఫ్‌టీకి చెందిన ''ది బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్'' కలెక్షన్‌. ఇందులో స్వల్ప తేడాలతో ఉన్న 10 వేల కోతుల ఫొటోలు ఉంటాయి.

''3547 నంబర్ బోర్డ్ ఏప్‌ను 75 ఇథేరియం (ఈటీహెచ్)లకు అమ్మాలని అనుకున్నట్లు'' మ్యాక్స్‌నట్ అనే విక్రేత ఆన్‌లైన్ అవుట్‌లెట్ సీనెట్‌తో చెప్పారు. అనేక ఎన్ఎఫ్‌టీ క్రయవిక్రయాలకు ఇథేరియం అనే క్రిప్టోకరెన్సీని ఉపయోగిస్తారు.

మ్యాక్స్‌నట్ ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అనేక వ్యాపారాలు చేస్తారు. కానీ, శ్రద్ధ లోపించడం మూలానా ఆయన 0.75 ఇథేరియం-ఈటీహెచ్ (2,989 డాలర్లు) అని టైప్ చేయాల్సి వచ్చింది.

''మౌస్‌పై క్లిక్ చేసిన తక్షణమే నేను జరిగిన పొరపాటును గుర్తించాను. కానీ నేను 'క్యాన్సిల్' బటన్ నొక్కేలోపే అది మరొకరి వశమైంది. దీంతో లక్షల డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది'' అని ఆయన చెప్పారు.

బోర్డ్ ఏప్

ఫొటో సోర్స్, OPENSEA

సంప్రదాయక బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లు జరిగితే, బ్యాంక్ సహాయంతో వాటిని వెంటనే సరిదిద్దుకోవచ్చు.

కానీ, ఇలా క్రమబద్దీకరించని ట్రేడింగ్ మార్కెట్‌లో సాధారణంగా పొరపాటును సరిదిద్దుకునే మార్గాలు ఉండవు.

బోర్డ్ మంకీస్

2021 ఏప్రిల్‌లో కంప్యూటర్ ప్రోగ్రామ్‌ ద్వారా 'బోర్డ్ ఏప్స్'ను విడుదల చేశారు. కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా రంగులు, డిజైన్లు, అలంకరణలు జోడించి ప్రతీ రూపాన్ని విభిన్నంగా, ప్రత్యేకంగా తయారు చేశారు.

తొలుత వీటిని 0.08ఈటీహెచ్ (320 డాలర్లు)కు అమ్మేవారు. కానీ వాటిని ఇప్పుడు కనీసం 50 ఈటీహెచ్‌ (20,000 డాలర్లు)లకు అమ్ముతున్నారు.

వీటిని కొనుగోలు చేసిన ఎన్‌ఎఫ్‌టీ అభిమానులు లేదా సెలెబ్రిటీలు, తమ ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోలుగా ఈ బోర్డ్ ఏప్‌లను ఉపయోగిస్తారు.

వీడియో క్యాప్షన్, క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? నగదు, క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు మధ్య తేడా ఏంటి?

దానితో పాటు యాచ్ క్లబ్‌లో భాగంగా మారడం వల్ల కమ్యూనిటీ ఈవెంట్లకు ఆహ్వానాలతో పాటు ప్రత్యేకమైన డిజిటల్ కంటెంట్‌కు యాక్సెస్ ఇవ్వడం వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.

''భౌతికంగా అందుబాటులో లేని కళాకృతిని, డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలుదారులకు ఏం లాభం చేకూరుతోంది? దాని సర్టిఫికెట్ కూడా బ్లాక్ చెయిన్ మార్కెట్‌లోనే ఉంటుంది. ఎన్‌ఎఫ్‌టీల కోసం అంత మొత్తాలు చెల్లించడం సరైనదేనా?'' అని ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రయవిక్రయాల్లో అధిక శక్తిని వినియోగించే కంప్యూటింగ్ వ్యవస్థను వాడతారు. దీంతో ఈ సాంకేతికత పర్యావరణానికి కూడా ప్రమాదం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)