మోదీ, షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ కొత్త ప్రధాని భారత్‌తో సంబంధాలు పెంచుకుంటారా, లేదంటే సైన్యం చెప్పినట్లు నడుచుకుంటారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''పాకిస్తాన్ కశ్మీరీలకు చెందినది. కశ్మీరీలు పాకిస్తాన్‌కు చెందినవారు. నిన్న కశ్మీర్‌లో ఏం జరిగిందో చర్చించడానికి మనమంతా ఇక్కడ ఉన్నాం. ఆర్టికల్ 35ఎ ప్రకారం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం కశ్మీరీలను అణచివేస్తోంది. కశ్మీర్ లోయలో నిరాయుధులైన ముస్లింల రక్తం పారుతోంది''
ఇది 2019 ఆగస్టు 6న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో షాబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం సారాంశం. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన ఒక రోజు తర్వాత చేసిన ప్రసంగం ఇది.
ఆ సమయంలో షాబాజ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా. మూడేళ్ల తర్వాత కశ్మీర్‌పై ఆయన చేసిన కొత్త ప్రకటన మరోసారి వార్తల్లో నిలిచింది.
పాకిస్తాన్ టీవీ ఛానెల్ జియో న్యూస్‌లో చర్చ సందర్భంగా ''పాకిస్తాన్ భారత్‌తో శాంతిని కోరుకుంటుంది. అయితే కశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా శాంతి సాధ్యం కాదు'' అని అన్నారు.
ఇది మాత్రమే కాదు, మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించినప్పుడు, 'కశ్మీరీల పోరాటానికి ద్రోహం' అని షాబాజ్ తన ట్వీట్‌లో విమర్శించారు.
ఈ ట్వీట్‌ను ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 8 న చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కశ్మీర్ పై షాబాజ్ షరీఫ్ చేసిన ఈ ప్రకటనలు భారతదేశంలో తీవ్ర చర్చనీయమయ్యాయి.
ఆయన ఇప్పుడు భారత్ పొరుగుదేశపు ప్రధాన మంత్రి. ఈ సందర్భంలో కశ్మీర్‌పై ఆయన ఆలోచన ఏంటి ? రెండు దేశాల మధ్య సంబంధాల భవిష్యత్తు దీనిపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, PAKISTAN INFORMATION DEPARTMENT/ANADOLU AGENCY/GET
మోదీ-నవాజ్ ల స్నేహం
భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన అదే షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు అన్న విషయం కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 డిసెంబర్‌లో అకస్మాత్తుగా లాహోర్‌లో ప్రత్యక్షమయ్యారు. అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వస్తూ, హఠాత్తుగా పాకిస్తాన్ సందర్శన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
అప్పటికి పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ స్వయంగా మోదీని తన ఇంటికి తీసుకెళ్లడానికి మరో ఇద్దరు నాయకులను వెంటబెట్టుకుని వచ్చారు.
లాహోర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మోదీని తన ఇంటికి తీసుకెళ్లారు. నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
అంతకు కొన్నేళ్ల కిందటి వరకు భారత ప్రధాని ఒకరు పాకిస్తాన్‌లో పర్యటించింది లేదు. 2020లో నవాజ్ షరీఫ్ తల్లి బ్రిటన్‌లో మరణించినప్పుడు మోదీ ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు.
2015లో లాహోర్ పర్యటన సందర్భంగా నవాజ్ తల్లిని కలుసుకున్నానని, ఆమె ఎంతో నిరాడంబరంగా, స్వచ్ఛంగా ఉంటారని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
షరీఫ్ కుటుంబానికి భారత్‌తో ఉన్న సంబంధం
2013లో షాబాజ్ షరీఫ్ భారతదేశానికి వచ్చారు. ఇండియాలోని తన పూర్వీకుల గ్రామాన్ని కూడా సందర్శించారు. షాబాజ్ షరీఫ్ కశ్మీరీ మూలాలున్న పంజాబీ.
షరీఫ్ కుటుంబీకులు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో నివాసం ఉండేవారు. తర్వాత వ్యాపారం నిమిత్తం అమృత్‌సర్‌లోని జటి ఉమ్రా గ్రామానికి మారారు.
తరువాత అమృత్‌సర్ నుంచి ఆ కుటుంబం లాహోర్‌కు తరలివెళ్లింది. షాబాజ్ షరీఫ్ తల్లివైపు కుటుంబీకులు కశ్మీర్‌లోని పుల్వామాకు చెందినవారు.
కశ్మీర్ పై షాబాజ్ షరీఫ్ ప్రకటనలు, నవాజ్ షరీఫ్ కుటుంబంతో ప్రధాని మోదీ స్నేహం, భారతదేశంతో ఆయన పాత సంబంధాల మధ్య, పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని రాకతో భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయా అనే చర్చ రెండు దేశాల్లో జరుగుతోంది.

ఫొటో సోర్స్, @CMSHEHBAZ
భారతదేశానికి షాబాజ్ షరీఫ్ ఎంత అవసరం ?
''షాబాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ కంటే చాలా భిన్నంగా ఉంటారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, షాబాజ్ షరీఫ్ కొంచెం 'కఠినమైన' వైఖరిని తీసుకునేవారు'' అని ఇంద్రాణి బాగ్చి అన్నారు.
ఇంద్రాణీ బాగ్చి గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ఎడిటర్‌గా పని చేశారు.
''నవాజ్ షరీఫ్ లాగే షాబాజ్ కూడా వ్యాపారవేత్త. ఒక బిజినెస్‌మెన్ మనస్తత్వం, ప్రధానమంత్రిగా బాధ్యతల నిర్వహణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి'' అన్నారు ఇంద్రాణి.
షాబాజ్ షరీఫ్ రాజకీయ జీవితం ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్)లో కేంద్రీకృతమై ఉంది. పంజాబ్ పాకిస్తాన్‌లో అతి పెద్దదే కాక, ధనిక ప్రావిన్స్ కూడా. ఆయన ఇక్కడ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
2018 సార్వత్రిక ఎన్నికల్లో, పీఎంఎల్-ఎన్ పార్టీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా షాబాజ్ షరీఫ్‌ను ప్రకటించింది.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో షాబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నేతగా మారారు.
''షాబాజ్ సంప్రదాయ రాజకీయాలు చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ నిరసన రాజకీయాలకు సుప్రసిద్ధుడు. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నేపథ్యం నుంచి, షాబాజ్ బిజినెస్ కుటుంబం నుంచి రావడమే దీనికి కారణం'' అన్నారు ఇంద్రాణి.
''షాబాజ్ భారత్‌తో మంచి వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటారు. క్షీణిస్తున్న పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కూడా దీనికి కారణం కావచ్చు'' అన్నారు ఇంద్రాణి.
''పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం సహకారం చాలా ముఖ్యం. ప్రధానమంత్రిగా ఇమ్రాన్ పదవి నుంచి తప్పుకోవడానికి సైన్యానికి, ఆయనకు ఉన్న మనస్పర్థలే కారణం. షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కావడానికి సైన్యం సుముఖంగా ఉంది. దీని అర్థం షాబాజ్ షరీఫ్ భారత్‌తో ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకోవడం లేదు అన్నది ముఖ్యం కాదు. సైన్యం ఆలోచన ఏంటన్నది ముఖ్యం'' అని ఇంద్రాణి అన్నారు.
గత మూడు నెలల్లో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, ఆయన భారత దేశంతో మంచి వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించేంత వరకు భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించలేమని ఇమ్రాన్ కూడా ప్రధాని హోదాలో చెప్పారు.
అందువల్ల షాబాజ్ షరీఫ్ ప్రధాని అయిన తర్వాత, కశ్మీర్‌తో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి ?
పాకిస్తాన్ రాజకీయాలు, సైనిక వ్యవహారాలపై కథనాలు రాసే సీనియర్ జర్నలిస్ట్ అయేషా సిద్ధికా కూడా షాబాజ్ షరీఫ్ కంటే జనరల్ బజ్వా యే పెద్ద సమస్య అని అన్నారు. మరి పాకిస్తాన్ సైన్యం భారత్‌తో మెరుగైన సంబంధాలను కోరుకుంటుందా?
ఇటీవలే పాకిస్తాన్ కోర్టు హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష విధించడమే కాక, ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్‌తో సంబంధాలను మెరుగుపరిచేందుకు సైన్యం తీసుకున్న చర్యగా కూడా అయేషా భావిస్తున్నారు.
''భారత్‌తో సంబంధాలు మెరుగుపరిచేందుకు పాకిస్తాన్‌తో ఉగ్రవాదాన్ని అంతం చేస్తానన్న తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి జనరల్ బజ్వా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది'' అని అయేషా లండన్‌లో బీబీసీతో అన్నారు.
భారతదేశంతో సంబంధాలపై కొత్త ప్రభుత్వం కల్చర్, క్రికెట్, కామర్స్ (3C) ద్వారా కూడా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుందని, కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ వంటి పెద్ద సమస్యలను తరువాత పరిష్కరించడం మంచిదని ఆయేషా పేర్కొన్నారు.
భారత దేశంతో సంబంధాలపై ఏడాది కిందట బజ్వా ఒక ప్రకటన చేశారు.
''కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం లేనంతకాలం ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రమాదంలోనే ఉంటాయి. రాజకీయంగా తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు. ఏది ఏమైనా చరిత్రను మరిచిపోయి ముందుకు సాగాలని భావిస్తున్నాం'' అని ఆయన అన్నారు.
ఆయన ప్రకటన తర్వాత ఫిబ్రవరి 2021 నుంచి సరిహద్దుల్లో రెండు దేశాల వైపు నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరగలేదు.

ఫొటో సోర్స్, EPA
అయితే, భారత్‌తో సంబంధాలు ఎలా కొనసాగుతాయన్న అంశంలో రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలని అయేషా అన్నారు.
''మొదటిది, జనరల్ బజ్వాను ఆర్మీ చీఫ్‌గా కొనసాగిస్తారా లేక పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్ వస్తారా? కొత్త ఆర్మీ చీఫ్ వస్తే ఆయనకు కూడా భారతదేశం పట్ల అదే వైఖరి ఉంటుందా? ఇక రెండోది.. తెర వెనక చర్చలు. ఇవి గత కొంత కాలంగా జరుగుతున్నాయి. మరి ఆ చర్చల్లో ఏం జరుగుతోంది, అందులో ఏం సాధించారు? ఈ విషయంపై భారతదేశం ఏమనుకుంటుంది?''
భారత్‌లో 2024లో సాధారణ ఎన్నికలు, 2023లో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్ కొత్త ప్రభుత్వ జీవిత కాలం ఎంత అనే దాని పై కూడా ఊహాగానాలు జరుగుతున్నాయి.
అటువంటి పరిస్థితిలో, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు తీసుకురావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో ఇరుదేశాల నేతలు తమ తమ దేశ రాజకీయాల్లో బిజీ కానున్నారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రులు చాలామంది మొదట్లో భారత్ తో సంబంధాలను సమర్ధించినా, తర్వాత వారు కశ్మీర్ పాట అందుకున్నారని ఇంద్రాణీ అన్నారు.
2015లో మోదీ-నవాజ్ షరీఫ్ భేటీ తర్వాత 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి ఈ దాడికి పాల్పడిందని భారత్ ఆరోపించింది.
దీని తర్వాత ఉరి సెక్టార్‌లోని భారత ఆర్మీ క్యాంపుతో సహా ఒకదాని తర్వాత ఒకటి దాడులతో సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. భారతదేశం జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
ఇవి కూడా చదవండి:
- రెండేళ్ల చిన్నారి వీపుపై పేరు, ఊరు, కాంటాక్ట్ నంబర్లు రాసిన ఓ తల్లి కన్నీటి గాథ.. వీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే..
- బిల్లు చెల్లించడానికి చేయి ఉంటే చాలు... డెబిట్, క్రెడిట్ కార్డులు అక్కర్లేదు, ఎలాగో తెలుసుకోండి..
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్‌లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












