మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారా, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె అందుకే అరెస్టయ్యారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపాలీ జగ్తప్, రోహన్ నామ్‌జోషి
- హోదా, బీబీసీ మరాఠీ
కేంద్ర మంత్రి నారాయణ్ రాణె గత సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, మంగళవారం నాడు అంటే 24 గంటలలోపే ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు.
ఠాక్రే కుటుంబంపై నారాయణ్ రాణె తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కాకపోతే, ఈసారి ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలకు దిగింది.
శివసేన అధినేతగా ఉన్న సమయంలో బాల్ ఠాక్రే మాటల్లోనూ, చేతల్లోనూ చాలా దూకుడుగా ఉండేవారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే చేతికి పగ్గాలు వచ్చాక శివసేనలో ఆ దూకుడు తగ్గిందనే మాట వినిపించింది.
ఉద్ధవ్ సీఎం అయినప్పుడు ఆయనకు పాలనా అనుభవం లేదని ఆయన వ్యతిరేకులు వ్యాఖ్యానించారు. అయితే, ఉద్ధవ్ పని చేసే విధానం విభిన్నంగా ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రత్యర్థులు ఊహించని విధంగా చర్యలు తీసుకోవడం ఆయన విధానమా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్ధవ్‌కు చిక్కులు తెచ్చిపెడతాయా? పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఉద్ధవ్ ఠాక్రే స్టైలా?
బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య, అర్నబ్ గోస్వామి, కంగనా రనౌత్ వివాదాల్లో కూడా ఉద్ధవ్ ఠాక్రే ఇలాగే వ్యవహరించారు.
ఉద్ధవ్ ఠాక్రే, నారాయణ్ రాణె మధ్య వైరం మహారాష్ట్ర ప్రజలకు కొత్తేం కాదు. 1990లో వీళ్లిద్దరూ కత్తులు దూసుకున్నారు. దాంతో 39 సంవత్సరాలుగా శివసేనలో ఉన్న రాణె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
వారిద్దరి మధ్య వైరం ఈ మధ్యకాలంలో వ్యక్తిగతంగా మారింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణమైనా, కరోనా సంక్షోభమైనా అవకాశం దొరికితే నారాయణ్ రాణె, ఆయన ఇద్దరు కుమారులు ఠాక్రే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అయితే, ఈ వ్యవహారాల్లో శివసేన పార్టీ జోక్యం చేసుకునేది కాదు. కానీ ఆగస్ట్ 24న శివసేన దూకుడుగా వ్యవహరించింది.
నారాయణ్ రాణెను అకస్మాత్తుగా అరెస్ట్ చేయించడానికి అసలు కారణం ఏమిటి? ఉద్ధవ్ ఠాక్రే ఎప్పటి నుంచో సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘ఉద్ధవ్ తొందర పడరు’
కొందరు దీన్ని ఉద్ధవ్ ఠాక్రే స్టైల్ అంటున్నారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరికొందరు చెబుతున్నారు.
''ఉద్ధవ్ ఠాక్రే ఏ విషయం పైనా తొందరపడి స్పందించరు. మౌనంగా ఉండి పరిస్థితులను ఓ కంట కనిపెడుతూ ఉంటారు. సమయం రాగానే ఒక్కసారిగా దెబ్బ కొడతారు'' అని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్‌పాండే అన్నారు.
''ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణె తీవ్రమైన పదజాలం ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఆయన వ్యాఖ్యలతో చాలాసార్లు శివసేన ఇబ్బందుల్లో పడినట్లు కనిపించేది. కానీ ఉద్ధవ్ తొందరపడి ప్రతి విమర్శ చేసేవారు కాదు. సరైన సమయం చూసి చేతలతో సమాధానం చెబుతారు'' అని అభయ్ వివరించారు.
నారాయణ్ రాణె కేవలం ఒక్క శివసేన పార్టీ మీదే కాదు, ఠాక్రే కుటుంబం పైనా విమర్శలు చేశారు. 2015 ఉప ఎన్నికలో ఆయన బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో కూడా నారాయణ్ రాణే, ఉద్ధవ్ ఠాక్రే పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
''ఉద్ధవ్ ఠాక్రే సరళి దూకుడుగా లేదని చెప్పడానికి లేదు. మాట్లాడేటప్పుడు కొందరు పరుష పదజాలం వాడరు. కానీ వారి చేతలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే స్టైల్ కూడా అదే'' అన్నారు అభయ్.
పార్టీలో కూడా ఉద్ధవ్ ఠాక్రే ఇలాగే పని చేస్తారని రాజకీయ విశ్లేషకులు, రచయిత ధవల్ కులకర్ణి చెప్పారు.
1995లో శివసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు, శివసేనలో రెండు క్యాంపులు ఉండేవి. ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే, మనోహర్ జోషి, సుభాష్ దేశాయ్ ఉండేవారు. మరోవైపు రాజ్ ఠాక్రే, నారాయణ్ రాణె, స్మితా ఠాక్రే ఉండేవారు.
రాజ్ ఠాక్రే అయినా, నారాయణ్ రాణె అయినా, వారి నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉద్ధవ్ చాలాసార్లు తనదైన శైలిలో వ్యవహరించారు.
''ఆయన తన ప్రత్యర్థుల గురించి పెద్దగా మాట్లాడరు. కానీ, వారికి వ్యతిరేకంగా చర్యలు మాత్రం తీసుకుంటారు. ఇదే ఆయన విధానం. నారాయణ్ రాణె లేదా రాజ్ ఠాక్రేలు పార్టీని వీడేలా ఆయన చాకచక్యంగా పావులు కదిపారు'' అని సీనియర్ జర్నలిస్ట్ సందీప్ ప్రధాన్ చెప్పారు.
శివసేన గతంలో ఉన్న తన దూకుడును కోల్పోయి, చల్లబడిందని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఆ ఇమేజ్‌ను తుడిచేయడానికి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని ధవల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు.
''క్షమించి మర్చిపోవడం ఉద్ధవ్ ఠాక్రే స్వభావం కాదు. కానీ, ఆయన చాలా విషయాలను బహిరంగంగా స్పష్టంగా చెప్పరు. మనసులో పెట్టుకుంటారు. వాటిని అంత సులువుగా మర్చిపోరు'' అని ధవల్ కులకర్ణి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బాలా సాహెబ్ ఇలా ఉండేవారు కాదు'
బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే...ఇద్దరినీ దగ్గరగా గమనించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ సందీప్ ప్రధాన్ ఒకరు.
''ఉద్ధవ్ ఠాక్రే పార్టీని నడిపించడం ప్రజలు చూశారు. ఆయనకు పార్టీని నడిపించే సామర్థ్యం ఉంది. ప్రత్యర్థులను ఆయన ఎలా దెబ్బకొట్టారు, అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులను ఎలా విమర్శించారో ప్రజలు చూశారు. కానీ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉద్ధవ్ ఠాక్రేను చూడడం ప్రజలకు ఇదే మొదటిసారి'' అని సందీప్ ప్రధాన్ చెప్పారు.
బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే వర్కింగ్ స్టైల్‌లో చాలా వ్యత్యాసం ఉందని ప్రధాన్ అన్నారు.
''బాల్ ఠాక్రే తన అభిప్రాయాలను అక్కడికక్కడే కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేవారు. ఇప్పుడు నారాయణ్ రాణెను అరెస్ట్ చేయించడానికి ఉద్ధవ్ ఠాక్రే వ్యవహరించిన మాదిరిగా బాల్ ఠాక్రే ఆనాడు తనను విమర్శించిన వారిపైకి పోలీసులను ప్రయోగించేవారా అనేది నాకు అనుమానమే. తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పిన వారిని బాల్ ఠాక్రే క్షమించి వదిలేసేవారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే అలా కాదు. ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తారు. టైం రాగానే చేతల్లో చూపిస్తారు'' అని సీనియర్ జర్నలిస్ట్ సందీప్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కక్ష సాధింపా?
ప్రతీకారం తీర్చుకునేందుకే ఉద్ధవ్ ఠాక్రే నారాయణ్ రాణెపై చర్యలు తీసుకున్నారన్న ఒక ఆరోపణ ఉంది. పోలీసులపై ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం అంటూ బీజేపీ కూడా ఠాక్రే సర్కార్‌ను విమర్శించింది.
''నారాయణ్ రాణె వ్యాఖ్యలను శివసేన తిప్పికొడుతుందని అనుకున్నాను. కానీ, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయిస్తారని అస్సలు ఊహించలేదు'' అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా తన ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించిందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవడం ఒక ట్రెండ్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని బెంగాల్ రాజకీయాలతో పోల్చి చూస్తున్నారు అభయ్ దేశ్‌పాండే.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీతో పోరాడినట్లుగానే, మహారాష్ట్రలో ఆ పార్టీతో పోరాడేందుకు శివసేన, ఇతర పార్టీలు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతుండటం, కేంద్రంలో బీజేపీ రాజకీయాల నేపథ్యంలో దీర్ఘకాలిక రాజకీయాల గురించి 'మహా వికాస్ అఘాడీ' ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదని సందీప్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు.
''ప్రత్యర్థులపై చర్యలు తీసుకుని స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చూస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వెంటనే పోరాటం చేయాలని అనుకుంటున్నారు. దాని ప్రకారమే నడుస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఇతర పార్టీలు ఇదే దారిలో వెళ్తున్నాయి'' అని సందీప్ ప్రధాన్ అన్నారు.
''అయిదేళ్ల తర్వాత ఏం జరుగుతుందన్న దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా, బీజేపీకి ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తే ఎలా అనే దాని గురించి ఇప్పుడు ఎవరూ ఆలోచించడం లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాలని మాత్రమే అనుకుంటున్నారు'' అని ప్రధాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ ఇలాగే...
2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత శివసేన నాయకులు, రిపబ్లిక్ టీవీ చానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ఒక దశలో ఈ వివాదంలోకి ఆదిత్య ఠాక్రే పేరు కూడా వచ్చింది. రిపబ్లిక్ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రేను కించపరిచేలా కామెంట్లు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
శివసేన ఎమ్మెల్యే ఒకరు రాష్ట్ర అసెంబ్లీలో అర్నబ్ గోస్వామిపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తన వ్యాఖ్యలకు అర్నబ్ గోస్వామి క్షమాపణ చెప్పాలని శివసేన, మహా వికాస్ అఘాడీ డిమాండ్ చేశాయి.
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే రిపబ్లిక్ టీవీ ఛానల్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, మరో అయిదుగురిపై టీఆర్‌పీ స్కామ్‌లో అభియోగాలు నమోదు చేశారు.
ఆ తర్వాత అన్వయ్ నాయక్ సూసైడ్ కేసు తెరపైకి వచ్చింది. అన్వయ్ ఆత్మహత్యకు అర్నబ్ గోస్వామే కారణమని నాయక్ కుటుంబం ఆరోపించింది. ఆ తర్వాత గోస్వామి అరెస్ట్ అయ్యారు.
ఇది పెద్ద దూమారం రేపింది. ఈ వివాదం సమయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఉద్ధవ్ ఠాక్రే మౌనంగానే ఉన్నారు. కానీ, కొంతకాలం తర్వాత ఆయన కఠిన చర్యలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కంగనా రనౌత్ విషయంలోనూ...
ఉద్ధవ్ ఠాక్రేపై గతంలో కంగనా రనౌత్ పదేపదే విమర్శలు చేశారు. వాటిని శివసేన తిప్పి కొడుతూ వచ్చింది. కానీ కంగనా.. ముంబైని పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్‌తో పోల్చడంతో ఈ వివాదం తార స్థాయికి చేరింది.
అంతకుముందు బీజేపీ కంగనాకు మద్దతు ఇచ్చింది. ఈ వ్యాఖ్యల తర్వాత బీజేపీ కూడా వెనక్కి తగ్గింది.
అక్రమంగా నిర్మించారంటూ ముంబైలోని కంగనా నివాసంలో కొంత భాగాన్ని హఠాత్తుగా బీఎంసీ కూల్చేసింది. ఆమె పై కేసులు కూడా పెట్టారు. బీజేపీ కూడా కంగనాకు మద్ధతివ్వడం ఆపేసింది. ఆమె ట్విటర్ అకౌంట్ సస్పెండ్ అయింది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- కరోనావైరస్: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధం అవుతోంది?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








