CAB పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన ధోరణిలో మార్పు రాజ్యసభలో రాజకీయ సమీకరణలను ఆసక్తికరంగా మారుస్తోంది. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం ఎగువ సభలో బిల్లును గట్టెక్కించుకొనే ఆధిక్యం తమకు ఉందని చెబుతోంది.

ఈ బిల్లుకు శివసేనతోపాటు బీజేపీ ప్రధాన మిత్ర పక్షం జనతా దళ్ (యునైటెడ్)-జేడీయూ మద్దతుపై మొదట్నుంచీ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాలకు సరైన సమాధానం రాకపోతే తమ వైఖరిని పునరాలోచించుకుంటామని శివసేన పలుమార్లు స్పష్టంచేసింది.

లోక్‌సభలో బిల్లుపై శివసేన కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. అయితే చివరకు మద్దతు ప్రకటించింది. కానీ మహారాష్ట్రలో ఇటీవల రాజకీయ పరిణామాల అనంతరం రాజ్యసభలో బిల్లుకు శివసేన మద్దతును కూడ గట్టడం అంత తేలికేం కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

లోక్‌సభలో శివసేన తమవైపే నిలబడుతుందని కాంగ్రెస్ ఊహించింది. అయితే అలా జరగలేదు. బిల్లుపై మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టమైన సందేశాన్ని పంపించారు. దీనికి మద్దతు పలికేవారిని బిల్లుతో సంభవించే పరిణామాలపై ఆయన హెచ్చరించారు.

''పౌరసత్వ సవరణ బిల్లు.. రాజ్యాంగంపై దాడి లాంటింది. దానికి మద్దతు పలికితే.. దేశ పునాదులపై దాడులుచేస్తూ.. విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించినట్టే''అని ఆయన ట్వీట్ చేశారు.

లోక్‌సభలో చర్చ సమయంలోనూ కాంగ్రెస్ నాయకులు బిల్లును తీవ్రంగా విమర్శించారు. దీంతో ఇప్పుడు శివసేన వైఖరి ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

శివసేన వ్యూహం ఏమిటి?

తమ డిమాండ్లకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. వలసదారులకు 25 ఏళ్ల వరకూ పౌరసత్వ హక్కులు ఇవ్వొద్దన్నది వారి డిమాండ్లలో ఒకటి.

''ఈ బిల్లుకు మద్దతు పలికినవారే దేశ భక్తులు. వ్యతిరేకించినవారు దేశ ద్రోహులు అనే బీజేపీ ధోరణి మారాలని మేం కోరుకుంటున్నాం''అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

రాజ్యసభలో బిల్లును అడ్డుకునేందుకు కొన్ని చిన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. జేడీయూ మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు పాసవాన్ వర్మ లేవనెత్తిన అభ్యంతరాలూ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.

''రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుపై పునరాలోచించుకోవాలని నీతీశ్ కుమార్‌ను కోరుతున్నా. ఇది రాజ్యాంగ వ్యతిరేక, వివక్ష పూరిత బిల్లు. దేశ ఐక్యత, సామరస్య భావనలతో ఇది విభేదిస్తోంది. జేడీయూ లౌకిక సూత్రాలకూ ఈ బిల్లు విరుద్ధంగా ఉంది. గాంధీజీ ఉండుంటే.. ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించేవారు''అని పాసవాన్ వర్మ ట్వీట్ చేశారు.

మరోవైపు బీజేపీ తమవైపే ఉంటారని భావిస్తున్న.. కొన్ని పార్టీలు, కొందరు సీనియర్ నాయకులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బీజీపీ లెక్కలను ఈ సమీకరణాలు మార్చగలవా?

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. తమకు 125-130 మంది సభ్యుల మద్దతు వస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది. జేడీయూలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. పార్టీ నాయకత్వం మాత్రం బిల్లుకు మద్దతు పలుకుతోంది. నిరసనపై పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు.

బీజేపీకి రాజ్యసభలో 83 మంది ఎంపీలున్నారు. జేడీయూకు ఆరుగురు, అకాలీదళ్‌కు ముగ్గురు ఎంపీలున్నారు. లోక్‌సభ తరహాలోనే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేడీ, ఏఐఏడీఎంకేలతోపాటు మరికొంత మంది ఎంపీలు బిల్లుకు మద్దతు పలుకుతారని బీజేపీ భావిస్తోంది.

తమ ఎంపీలతో మంతనాలు జరపడంతోపాటు స్పెయిన్ పర్యటనలోనున్న పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను వెనక్కి రప్పించారు. పార్టీ నాయకుడు అనిల్ బలోని, అమర్ సింగ్ అనారోగ్యంతో ఉన్నారు. రాజ్యసభలో ఓటింగ్‌కు వీరిద్దరూ గైర్హాజరయ్యే అవకాశముంది.

రాజ్యసభ

ఫొటో సోర్స్, PTI

రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలు

కాగా, రాజ్యసభలో మొత్తం 240 స్థానాలుండగా ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి.

కొందరు ఎంపీలు వాక్‌అవుట్ చేస్తే.. బిల్లుకు అవసరమయ్యే ఆధిక్యం తగ్గుతుంది.

కాంగ్రెస్ నాయకులు మోతీ లాల్ వోరా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన రాజ్యసభ ఓటింగ్‌కు రాకపోవచ్చు.

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, EPA

ప్రతిపక్షాల విధానం ఏమిటి?

రాజ్యసభలో బలాబలాల ప్రకారం చూస్తే.. రెండు వర్గాలకూ సమానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓటింగ్ సమయంలో సమీకరణాలు ఎటైనా మారొచ్చు.

అన్ని పార్టీలు తమ సిద్ధాంతాలకు కట్టబడి ఓటింగ్ చేస్తాయా? లేదా బిల్లు నెగ్గేందుకు వీలు కల్పించేలా ఓటింగ్‌ను బహిష్కరిస్తాయా? లేదా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయా? అనే అంశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

రాజ్యసభలో 46 మంది ఎంపీలతో విపక్షాలను కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోంది. ఇప్పటివరకు బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ (13), సమాజ్‌వాదీ పార్టీ (9), వామపక్షాలు (6), టీఆర్‌ఎస్ (6). డీఎంకే (5), ఆర్జేడీ (4), ఆప్ (3), బీఎస్పీ (4), 21 మంది ఇతర ఎంపీలు స్పష్టంచేశారు.

దీంతో మొత్తంగా రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 110గా ఉంది.

పౌరసత్వ సవరణ బిల్లు

ఫొటో సోర్స్, EPA

పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది?

పౌరసత్వ సవరణ బిల్లునే సీఏబీ అని కూడా పిలుస్తున్నారు. మొదట్నుంచీ ఈ బిల్లును వివాదాలు చుట్టుముడుతున్నాయి.

బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లో ఆరు మైనారిటీ వర్గాల(హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు, సిక్కులు)కు పౌరసత్వ హక్కులు ఇచ్చేందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం.. వీరు 11ఏళ్లు భారత్‌లో ఉంటేనే పౌరసత్వం కల్పిస్తారు. తాజా బిల్లులో ఈ వ్యవధిని ఆరేళ్లకు తగ్గించారు.

దీని కోసం 1955నాటి పౌరసత్వ చట్టానికి సవరణగా తాజా బిల్లును తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)