‘శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం

శ్రీలంక వెడ్డా ఆదివాసీలు

ఫొటో సోర్స్, Zinara Rathnayake

    • రచయిత, జినారా రథ్నాయకే
    • హోదా, .

''ఇది మా గుహ'' అని చెప్పారాయన. పొడవుగా ఉన్న ఆ మనిషి ఉంగరాల జుత్తు భుజాల వరకూ జారివుంది. వక్కపొడి నములుతుండటంతో అతడి కింది పెదవి ఎర్రగా ఉంది. నడుముకు నారింజ రంగు లుంగీ కట్టుకున్నాడు. ఎడమ భుజం మీద ఒక చిన్న గొడ్డలి వేలాడుతోంది.

పొడవాటి చెట్ల వెనుక పలుచటి వెలుతురులోని రాతి నివాసాన్ని చూపించారాయన.

''మా పిల్లలు ఇక్కడే నివసించారు'' అంటూ ఒక చీకటి మూలను చూపించారు.

''ఆడవాళ్లు, మగవాళ్లు ఇక్కడ ఉండేవాళ్లు. ఆపైన చూశారా'' అంటూ సూర్యుడి వెలుతురులో కనిపిస్తున్న రాళ్లు పేర్చివున్న ఒక వేదికను చూపిస్తూ.. ''అక్కడ మా నాయకుడు పడుకునేవాడు'' అని చెప్పారు. ''మేం అడవి పందులు, జింకలు, కుందేళ్లను కాల్చుకుని తినేవాళ్లం'' అని వివరించారు.

ఆయన పేరు గునబందిలాత్తో. వారిది వెడ్డా సమాజం. శ్రీలంకలో ఇప్పటివరకూ తెలిసిన తొట్టతొలి ఆదివాసీ సముదాయమిది. అనేక శతాబ్దాల పాటు వీరు శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో నివసించారు. వేటాడుతూ, ఆహారం సేకరిస్తూ సన్నిహిత కుటుంబాల బృందాల్లో జీవించారు. తమ బృందంలో ఎవరైనా చనిపోతే ఆ గుహను విడిచి మరో గుహకు మకాం మార్చేవారు.

ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని ఆ గుహ నేల మీద పడుకోబెట్టి చెట్ల ఆకులతో కప్పేస్తారు. ఓ పెద్ద చెట్టు దగ్గరకు చేరి చనిపోయిన వారికోసం ప్రార్థిస్తారు. తమ పూర్వీకులకు, చెట్ల దేవతలు, నదుల దేవతలు, అడవి దేవతలకు అడవి మాంసం, తేనె, అడవి దుంపలు నైవేథ్యంగా పెడతారు.

''వారి ఆత్మలు దేవతలకు చేరాలని మేం ప్రార్థిస్తాం. వారు మమ్మల్ని కాపాడతారు'' అని చెప్పారాయన.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?

ఇప్పుడు ఈ వెడ్డా జనం చెల్లాచెదురై మధ్య శ్రీలంక నుంచి తూర్పు దిశగా ఉన్న తీరపు పల్లం వరకూ గల హున్నాస్గిరియా పర్వతాల్లో చిన్నపాటి ఆవాస ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

"ఇండో-ఆర్యన్లు - అంటే ఇప్పుడు శ్రీలంకలో ఆధిక్యంగా ఉన్న సింహళ-బౌద్ధ ప్రజలు - క్రీస్తుపూర్వం 543లో శ్రీలంకకు రావటానికి చాలా ముందు వెడ్డా ప్రజలు ఈ దీవి అంతటా నివసించేవారు"

"వీరు శ్రీలంక తొట్టతొలి ఆదిమవాసులు అయినప్పటికీ వీరి గురించి చాలా మందికి ఏమీ తెలీదు. వెడ్డా సముదాయం చాలా శతాబ్దాల పాటు సింహళుల పాలనలో వెలివేతకు, అణచివేతకు గురైంది".

పర్యాటకుల ఆసక్తికి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు శ్రీలంక మొత్తం జనాభాలో వెడ్డాలు 1 శాతం కన్నా తక్కువే ఉన్నట్లు అంచనా.

గునబండిలాత్తో పర్యాటకులకు గైడ్‌గా వ్యవహరిస్తూ వెడ్డాల వేట నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు

ఫొటో సోర్స్, Zinara Rathnayake

ఫొటో క్యాప్షన్, గునబండిలాత్తో పర్యాటకులకు గైడ్‌గా వ్యవహరిస్తూ వెడ్డాల వేట నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు

చాలా ఆదివాసీ ప్రజా సమూహాల విషయంలో లాగానే వీరి మూలాలను సూచించే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీరి జన్యు బృందం 'బాలన్‌గోడా మనిషి' అనే చరిత్రపూర్వపు మానవుడికి అనుసంధానమై ఉన్నట్లు పురాతత్వవేత్తలు నిర్ధరించారు.

కొలంబో నగరానికి 160 కిలోమీటర్ల దూరంలోని బాలన్‌గోడా పట్టణం వద్ద చారిత్రక ప్రాంతాల్లో ఈ మానవుడి అస్తిపంజరం లభ్యమవటంతో ఆ ఊరి పేరుతో అతడిని పిలుస్తున్నారు. ఆ బాలన్‌గోడా మనిషి 48,000 సంవత్సరాల నుంచి 3,800 సంవత్సరాల కిందట అక్కడ నివసించినట్లు ఆర్కియాలజిస్టులు అంచనా వేశారు.

వెడ్డాలలోని దనిగల మహా బండారలాగే వంశానికి చెందిన వారు గునబండిలాత్తో. కాండ్యన్ రాజ్యపు (1476 - 1818) రాజులు వీరికి ఇచ్చిన సింహళ బిరుదు అది.

వీరు వాస్తవంగా తూర్పు శ్రీలంకలోని దనిగల పర్వతం, దాని చుట్టుపక్కల అడవుల్లో నివసించేవారు. అయితే.. 1949లో 'సేనానాయక సముద్ర' చెరువు నిర్మాణంతో ఈ వెడ్డా సముదాయం నిర్వాసితులయ్యారు. శ్రీలంకలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు అది.

''ఆ రిజర్వాయర్ కారణంగా మా అసలైన అడవి ఇళ్లను మేం కోల్పోయాం'' అని కిరిబండిలాత్తో చెప్పారు. ఆయన కూడా దనిగల మహా బండారలాగే వంశానికే చెందినవారు.

ఆ సరస్సు నిర్మాణ కాలంలో దనిగలకు చెందిన ఏడు కుటుంబాలు తూర్పు శ్రీలంకలోని రతుగల గ్రామంలోని ఒక గుహలో నివసించటానికి వచ్చాయి. ఆ గుహనే గునబండిలాత్తో తొలుత మాకు చూపించారు. ''ఆ బృందంలో నా అమ్మిలాత్తో, అప్పిలాత్తో (అమ్మా, నాన్నలు) కూడా ఉన్నారు'' అని చెప్పారాయన.

''వరి అన్నం తింటారా అని మమ్మల్ని (ప్రభుత్వం) అడిగింది'' అని గునబండిలాత్తో తెలిపారు. వరి సాగు చేయటానికి తమని సింహళ గ్రామాలకు నివాసం మారాలని ప్రభుత్వం తమను ప్రోత్సహించినట్లు ఆయన వివరించారు. చాలామంది వెడ్డాలు అంగీకరించారు. అందుకు అంగీకరించని వారికి ప్రభుత్వం నుంచి పరిహారమేమీ అందలేదు. వారిలో ఏడు రతుగల కుటుంబాలు కూడా ఉన్నాయి.

1900 దశకం తొలినాళ్లలో రిచర్డ్ లయోనెల్ స్పిటెల్ వెడ్డా సముదాయాన్ని సందర్శించి వారి ఫొటోలు తీశారు

ఫొటో సోర్స్, Zinara Rathnayake

ఫొటో క్యాప్షన్, 1900 దశకం తొలినాళ్లలో రిచర్డ్ లయోనెల్ స్పిటెల్ వెడ్డా సముదాయాన్ని సందర్శించి వారి ఫొటోలు తీశారు

అలా సింహళ గ్రామాలకు నివాసం మారిన వారికి సింహళ సంస్కృతిలో కలిసిపోవటం, సంహళులతో వివాహ సంబంధాలు కలుపుకోవటం తప్ప మరో దారిలేకపోయింది.

అత్యధిక సింహళ ప్రజలు వీరిని వెనుకబడిన వారిగా, అనాగరికులుగా పరిగణించటం వల్ల వీరిలో చాలా మంది తమ వెడ్డా వారసత్వాన్ని దాచిపెట్టటానికి పేర్లు మార్చుకున్నారని గునబండిలాత్తో చెప్పారు. వారి భాషలో కూడా సింహళ పదాలు చేరి రూపాంతరం చెందింది.

రతుగల గుహలో నివసించిన ఏడు కుటుంబాలు ఇంకొంత కాలం పాటు తమ సంప్రదాయాలను అంటిపెట్టుకుని ఉంటూ అడవుల్లో వేటాడుతూ, ఆహార సేకరణ చేస్తూ జీవించినప్పటికీ.. వారు క్రమంగా సింహళ కుటుంబాలతో, సమీప పట్టణాల నుంచి వచ్చే ముస్లిం వ్యాపారులతో కలిశారు. అడవిలో ఆహారం కొరవడినప్పుడు గునబండిలాత్తో తల్లిదండ్రులు మొక్కజొన్న, రాగులు, పెసర్లు, అలసందలు సాగుచేశారు.

''మేం నెమ్మదిగా మా జీవనవిధానం కోల్పోవటం మొదలైంది'' అన్నారాయన.

ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. వెడ్డా సముదాయం తమ వారసత్వాన్ని మళ్లీ సొంతం చేసుకుంటోంది. శ్రీలంక తొలి ఆదివాసీల మీద ఆసక్తి పెరిగింది.

''సింహళులు మమ్మల్ని తక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనం మరింతగా చదువుకున్నారు. మా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో ఉంది'' అని చెప్పారు గునబండిలాత్తో.

పురాతత్వశాఖ, పురావారసత్వ సంపద మంత్రిత్వశాఖలు.. కరోనా మహమ్మారి విజృంభించటానికి ముందు రతుగల వద్ద 'వెడ్డాస్ హెరిటేజ్ సెంటర్'ను ఏర్పాటు చేశాయి. ఈ ఏప్రిల్ నుంచి వచ్చే సందర్శకులకు గునబండిలాత్తో గైడ్‌గా వ్యవహరిస్తారు.

ఒకప్పుడు శ్రీలంక భూభాగమంతటా నివసించిన వెడ్డాలు ఇప్పుడు మధ్య, తీర ప్రాంతాలకు పరిమితమయ్యారు

ఫొటో సోర్స్, Oskanov/Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు శ్రీలంక భూభాగమంతటా నివసించిన వెడ్డాలు ఇప్పుడు మధ్య, తీర ప్రాంతాలకు పరిమితమయ్యారు

హెరిటేజ్ సెంటర్‌లో భాగంగా ఆయన పూర్వీకులు నివసించిన గుహ పక్కనే ఉన్న చిన్నపాటి మట్టి కాటేజీల దగ్గరకు గునబండిలాత్తో నన్ను తీసుకెళ్లారు.

1900 దశకం ఆరంభంలో వెడ్డా ఆవాసాలను సందర్శించిన వైద్యుడు రిచర్డ్ లయొనెల్ స్పిటెల్ తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో ఒక కాటేజీని అలంకరించారు. మరొక కాటేజీలో వీరి గుహల ఫొటోలు, వీరి అసలు నివాసాల మ్యాప్, వెడ్డాల విగ్రహాలు ఉన్నాయి. సందర్శకుల కోరిక మీద వీరి సంప్రదాయ నృత్యాలను, వీరి సంగీతాన్ని, ప్రార్థనలను కూడా ప్రదర్శిస్తారు.

''మా సంస్కృతీ సంప్రదాయాలను మా తర్వాతి తరాలకు అందించాలన్నది మా కోరిక'' అని కిరిబండిలాత్తో చెప్పారు. ఈ హెరిటేజ్ సెంటర్ ఏర్పాటు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ 22 మంది వెడ్డా పిల్లలకు ప్రతి వారాంతంలో ఆదివాసీ తరగతులను నిర్వహిస్తున్నారాయన. తమ జీవన విధానాన్ని, తమ భాషా సంప్రదాయాలను వారికి బోధిస్తున్నారు.

''మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని అడవికి తీసుకెళ్లేవారు. అక్కడి గుహలను చూపించేవారు. ఎక్కడి నుంచి నీళ్లు తాగాలో, ఆహారం ఎలా వెదికి తెచ్చుకోవాలో చూపించేవారు. ఎప్పుడూ ఎండిపోని నీటి ప్రవాహాలను మాకు చూపారు. ఇప్పుడు మేం అడవిలోకి వెళితే ఏదైనా ఏనుగు కానీ, ఎలుగుబంటి కానీ దగ్గర్లో ఉందేమో మేం చెప్పేయగలం. వాటి వాసన మాకు తెలిసిపోతుంది'' అని గునబండిలాత్తో వివరించారు.

ఇప్పుడు వెడ్డా ప్రజల్లో ఎక్కువ మంది బౌద్ధులు. కానీ వారి జంతు విశ్వాసాలు ఇంకా వారిలో లోతుగా పాతుకునే ఉన్నాయి.

''ఒక చెట్టు నుంచి లేదా మొక్క నుంచి పువ్వు కానీ, ఆకు కానీ అనవసరంగా ఎప్పుడూ తెంపవద్దని మేం మా పిల్లలకు నేర్పిస్తాం. నదీ ప్రవాహం సమీపంలోని చెట్లను ఎన్నడూ నరకవద్దని, అలా నరికితే ఆ నది ఎండిపోతుందని బోధిస్తాం'' అని చెప్పారు గునబండిలాత్తో.

కిరిబండిలాత్తో వెడ్డా పిల్లలకు తమ భాష, సంప్రదాయాలను బోధిస్తున్నారు

ఫొటో సోర్స్, Zinara Rathnayake

ఫొటో క్యాప్షన్, కిరిబండిలాత్తో వెడ్డా పిల్లలకు తమ భాష, సంప్రదాయాలను బోధిస్తున్నారు

''అడవులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు అమలులోకి వచ్చాక వీరు అడవుల్లో వేటాడటానికి వీలు లేకుండా పోయింది. పర్యావరణం పట్ల సచేతనంగా ఉండే సంప్రదాయ జీవనశైలిని, ఆహార పద్ధతులను వీరు కోల్పోయారు. అందువల్ల వారు మనుగడ సాగించటానికి ఒక దారి కావాలి'' అని చెప్పారు ఆదివాసీ ఆహార పరిశోధకుడు ఉమయాంగన పుజాని గుణశేఖర. ఆయన వెడి జనాయగే సంప్రదాయిక ఆహార తక్షణాయ (శ్రీలంక వెడ్డాల సంప్రదాయ ఆహార నైపుణ్యం) అనే పుస్తకం రాశారు.

ప్రస్తుతం వెడ్డాలు.. తమ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకు తమ హస్తకళలను విక్రయించటానికి బేరాలాడుతూ తంటాలు పడుతున్నారు.

పర్యాటక రంగం తమ సముదాయానికి సానుకూల మార్పును అందిస్తుందని గునబండిలాత్తో, కిరిబండిలాత్తో ఆశిస్తున్నారు.

రతుగుల పరిసరాల్లోని అడవుల్లో విలాసవంతమైన టెంట్లలో సందర్శకులు మకాం వేయటానికి వీలుగా 'వైల్డ్ గ్లాంపింగ్ గాల్ ఓయా'ను కొత్తగా ప్రారంభించారు. ఇందులో హోటల్ చెఫ్ సహా 13 మంది సిబ్బంది రతుగల ప్రాంతానికి చెందిన వెడ్డా ప్రజలే. ఈ హోటల్ సమీపంలోని సేంద్రియ పొలంలో మరికొందరు వెడ్డాలు ఉపాధి పొందుతున్నారు.

''ఈ యువతలో కొంతమంది ఉద్యోగాల కోసం వేరే చోటుకు వెళ్లిపోతుండేవాళ్లు. కానీ ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు'' అని గునబండిలాత్తో తెలిపారు. హోటల్‌కు వచ్చే అతిథులను అడవిలో నడకకు, తమ ప్రాచీన నివాసం దనిగల దగ్గరకు తీసుకెళుతుంటారాయన.

''కొలంబో నుంచి జనం వస్తుంటారు. మా సంస్కృతి గురించి తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటారు. మా పర్వతాల మీదకు మాతో పాటు కలిసి నడుస్తుంటారు'' అని వివరించారు.

వెడ్డాస్ హెరిటేజ్ సెంటర్ వద్ద పురాతన రాతి మీద సూర్యుడు, చంద్రుడు, వారి వేట ప్రాంతాల చిహ్నాలు

ఫొటో సోర్స్, Zinara Rathnayake

ఫొటో క్యాప్షన్, వెడ్డాస్ హెరిటేజ్ సెంటర్ వద్ద పురాతన రాతి మీద సూర్యుడు, చంద్రుడు, వారి వేట ప్రాంతాల చిహ్నాలు

వెడ్డాల్లో చాలా మంది యువతకు తమ వారసత్వం, సంప్రదాయాల గురించి తెలిసింది తక్కువే అయినప్పటికీ.. చాలా మందికి తమ ఆహార అలవాట్లను చాలా ఇష్టపడతారు. అందుకే చాలా మంది వెడ్డా యువత ఇప్పటికీ ఆహార సేకరణ కోసం రోజుల తరబడి అడవుల్లోకి వెళుతుంటారు. గుహల్లో నివసిస్తూ చేపలు పడుతూ, అడవి జంతువులను వేటాడి మంటల్లో కాల్చుకుని తింటూ గడుపుతుంటారు. వచ్చేటపుడు అడవి మాంసాన్ని, తేనెను, అడవి దుంపలను తమ వెంట తీసుకొస్తారు.

''నా పిల్లలకు, మనవళ్లూమనవరాళ్లకు నేనే ఇంకా వండి పెడుతుంటాను'' అని చెప్పారు దయావతి.

ఆమె తల్లి వెడ్డా సముదాయానికి చెందిన మహిళ కాగా, తండ్రి సింహళ జాతీయుడు.

''నేను ఎక్కువగా ఆవిరి మీద వండిన పనసపండు, అడవి మాంసం తింటుంటాను. ఇంతవరకూ నేనెప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు'' అని చెప్పారు గునబండిలాత్తో.

ఈ ఆదివాసీ ప్రజలకు రక్షణ కల్పించటానికి శ్రీలంకలో నిర్దిష్ట చట్టాలు లేకపోగా.. వీరి సంప్రదాయ వేట ప్రాంతాలు వీరికి అందుబాటులో లేకుండా ప్రభుత్వ చట్టాలు నిరోధిస్తున్నాయి. శ్రీలంకలో వెడ్డాలు ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నివేదిక 2017లో స్పష్టంచేసింది.

''ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. మమ్మల్ని, మా మనుగడను గుర్తిస్తే.. మా సంస్కృతిని మెరుగ్గా కాపాడుకోగలం'' అని చెప్పారు గునబండిలాత్తో. తమ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరాలపై చర్చించటానికి తమ సముదాయం నెల వారీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు.

''విజయ రాజు (తొలి ఆర్య రాజు) రావటానికి ముందే మేం ఇక్కడున్నాం. దేశంలో అతి పురాతన కాలం నుంచీ జీవిస్తున్న నివాసులం మేం. మేం ఇక్కడున్నామని అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నా. మాకు మా భాష ఉందని, దానిని ముందుకు కొనసాగించాలని అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఆర్థిక ప్రమాణాల్లో ముందున్న శ్రీలంక ఎందుకిలా కుదేలైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)