వర్జినిటీ: కన్నెపొర అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? మొదటిసారి సెక్స్ తర్వాత దానికి ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

కన్నెపొరపై అపోహలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్న ఎల్లెన్ స్టోకెన్ డాల్, డోల్విక్ బ్రోచ్‌మాన్

ఫొటో సోర్స్, TED TALK

ఫొటో క్యాప్షన్, కన్నెపొరపై అపోహలను ప్రయోగాత్మకంగా వివరిస్తున్న ఎల్లెన్ స్టోకెన్ డాల్, డోల్విక్ బ్రోచ్‌మాన్
    • రచయిత, లారా ప్లిట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వర్జినిటీ అనేది ఒక ప్రహసనమని, మిథ్య అని ఎల్లెన్ స్టోకెన్ డాల్, నినా డోల్విక్ బ్రోచ్‌మాన్ అంటున్నారు. దీన్ని నిరూపించడానికి వారిద్దరు ఒక ప్లాస్టిక్ ఫిల్మ్‌ను చుట్టిన హులాహూప్‌( నడుం చుట్టూ తిప్పుకునే పెద్ద రింగ్) పట్టుకుని ప్రేక్షకులకు వివరించేందుకు బయలుదేరారు.

బ్రోచ్‌మాన్ తన చేతులుతో హులాహూప్ పట్టుకుంటారు. డాల్ తన శక్తివంతమైన పంచ్‌తో దానికి ఉన్న ప్లాస్టిక్ ఫిల్మ్‌ను చించేస్తారు.

నార్వేకి చెందిన ఈ ఇద్దరు మహిళలు వైద్యులు, రచయితలు కూడా. ఓస్లోలో జరిగిన టెడ్ కాన్ఫరెన్స్‌లో వీరు నిర్వహించిన ప్రదర్శన, మనలో చాలామందిలో నాటుకుపోయిన ఒక శక్తివంతమైన అభిప్రాయాన్ని బద్ధలు కొడుతుంది.

మనలో ఉన్న ఆ అభిప్రాయం: ఒక మహిళ మొదటిసారి సంభోగంలో పాల్గొన్నప్పుడు హైమెన్(కన్నెపొర) విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల రక్తస్రావం అవుతుంది. అలా రక్తస్త్రావం అయిందంటే ఆ మహిళ కన్యత్వాన్ని కోల్పోయినట్లు.

"ది బుక్ ఆఫ్ ది వెజీనా: ఎవ్రీ థింగ్ యు నీడ్ టు నో అండ్ దట్ యు హావ్ నెవర్ డేర్‌డ్ టు ఆస్క్'' అనే పుస్తకాన్ని వీరిద్దరూ రచించారు. అయితే, వీరి టెడ్ టాక్ 2017లో జరిగింది.

వాస్తవం ఏంటంటే సంభోగం తర్వాత హైమెన్(కన్నెపొర) మార్పుకు గురికాదు అనే వాస్తవాన్ని వంద సంవత్సరాల కిందటి నుంచే ఆధునిక వైద్య శాస్త్రం గుర్తించినా, సమాజంలో ఇప్పటికీ ఈ కన్నెపొర అనే స్త్రీ శరీర భాగం ఆమె లైంగిక చరిత్రను చెబుతుంది అన్న భావన ఇప్పటికీ ప్రబలంగా ఉంది.

స్త్రీ యోని

ఫొటో సోర్స్, Getty Images

''నేటికి కూడా టీవీలు, పుస్తకాలలో మహిళ తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు రక్తస్త్రావం అవుతుందని, ఒక స్త్రీ కన్యా కాదా అన్న విషయాన్ని ఈ కన్నెపొర చెబుతుందని చాలామంది చెబుతుంటారు'' అని డాల్ బీబీసీతో అన్నారు.

"స్త్రీ శరీరంలో కన్యత్వానికి సంబంధించిన ఒక రకమైన రుజువును ప్రకృతి మనకు అందించిందని నమ్మడం చాలా ప్రాక్టికల్ వ్యవహారం. దీని ద్వారా చాలామంది కోరుకునేది మహిళల లైంగికతను నియంత్రించడం" అని డాల్ అన్నారు.

కన్యాత్వాన్ని పరీక్షించడం అనేది (కన్నెపొర ఉందో తెలుసుకోవడానికి నిర్వహించే యోనొ పరీక్ష) మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వీటి నిషేధాన్ని సమర్ధించినప్పటికీ, ఇంకా ఇరవై దేశాలో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఈ జాబితాలో అమెరికా, ఇంగ్లండ్ దేశాలు కూడా ఉన్నాయి. కన్నెపొరను పునరుద్ధరించేందుకు చేసే హైమనో ప్లాస్టీ శస్త్రచికిత్స కూడా చాలా దేశాలలో జరుగుతోంది.

యోని ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొరనే హైమెన్ అంటారు.

ఫొటో సోర్స్, Prashanti Aswani

ఫొటో క్యాప్షన్, యోని ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొరనే హైమెన్ అంటారు

రంధ్రం ఉన్న సాగే రబ్బరు

నిజంగానే కన్నెపొర అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? మొదటిసారి సంభోగం తర్వాత దానికి ఏమవుతుంది?

యోని ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొరనే హైమెన్ (కన్నెపొర) అంటారు. ఈ కన్నెపొర రబ్బర్ హెయిర్ బ్యాండ్ లాగా ఉంటుంది'' అని బ్రోచ్‌మాన్ తన వీడియోలో చెప్పారు. ఈ టెడ్ వీడయోకు లక్షల కొద్దీ వ్యూస్ ఉన్నాయి.

దీని ఆకారం సాధారణంగా డోనట్ లేదా నెలవంక లాగా ఉంటుంది. మధ్యలో పెద్ద రంధ్రం ఉంటుంది. ఇది ఒక హైపర్‌లాస్టిక్ నిర్మాణం. ఇది పురుషాంగం దెబ్బతినకుండా కాపాడగలదు.

''చాలా కన్నెపొరలు చిన్న మాంసపు ముక్కల్లాంటివి. వీటినే హైమెనియల్ కార్న్‌కిల్స్ అంటారు. ఇవి ఒక్కో స్త్రీలో ఒక్కోరకంగా ఉంటాయి. రెండు, మూడు పెద్ద ముక్కలుగా లేదా నాలుగు, ఐదు చిన్న ముక్కలుగా ఉంటాయి. చూడటానికి చిన్న నాలుకలా కనిపిస్తాయి'' అని పెల్విక్ ఫ్లోర్ సైకియాట్రిస్ట్ మార్టా టోరాన్ అన్నారు.

ఈ కన్నెపొర అనేది మూసి ఉన్న పొరకాదు. అది అవసరమైనప్పుడు విడిపోతుంది, అదృశ్యమవుతుంది ( పురుషాంగం ప్రవేశించిన తర్వాత). 99% కేసుల్లో ఈ కన్నెపొర సెక్స్ సమయంలో ఓపెన్‌గా ఉంటుంది. ఇది చాలా సర్వసాధారణం'' అని మార్టా టోరాన్ చెప్పారు.

''ఒకవేళ ఇది అసాధారణంగా ఉంటే, అప్పుడు రుతుస్రావం జరగదు. అంగప్రవేశం కూడా జరగదు. అలాంటి సందర్భాలలో చికిత్స అవసరమవుతుంది'' అన్నారు టోరాన్.

స్త్రీ శరీరంలోని క్లిటోరిస్, వల్వా లేదా ఇతర భాగాల లాగే దాని స్వరూపం వైవిధ్యంగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, సెక్స్‌లో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే ఈమె మహిళలకు ఏం చెబుతున్నారంటే..

ప్రాథమికంగా కన్నెపొర సెక్సుకు ముందు, సెక్స్‌కు తర్వాత ఎలాంటి మార్పులకు లోను కాదు. ఇలా ఎన్నిసార్లు చేసిన మార్పు అనేది ఉండదు. కాబట్టి, ఒక మహిళ సెక్స్ లో పాల్గొన్నదా లేదా అన్న విషయాన్ని తేల్చడానికి కన్నెపొర మార్పుల ద్వారా చెప్పడం, గుర్తించడం శాస్త్రీయం కాదు.

''నా వృత్తిలో భాగంగా నేను కొన్ని వేలమంది మహిళల యోనీలను పరిశీలించాను. చాలా కేసుల్లో నేను ఒక మహిళ సెక్స్ లో పాల్గొన్న అనుభవం ఉందా లేదా అన్నదాన్ని నేను గుర్తించలేకపోయాను'' అని టోరాన్ వెల్లడించారు.

ఉదాహరణకు, 1906 నాటి ఒక అధ్యయనం ప్రకారం, సెక్స్ వర్కర్ల హైమెన్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదని తేలింది. లైంగిక సంబంధం లేని యువతిలోని కన్నెపొర ఏ రూపంలో ఉందో , అదే తీరుగా లైంగిక సంబంధం ఉన్న మహిళల్లోనూ కనిపించింది.

2004లో నిర్వహించిన మరొక పరిశోధనలో, 36 మంది గర్భిణుల్లో 34 మందికి వారి కన్నెపొర చెక్కు చెదరకుండా ఉందని గుర్తించారు. దీన్నిబట్టి తెలిసిందేంటంటే, సెక్స్ చేసిన తర్వాతనే కాదు, గర్భం ఉన్న మహిళల్లోనూ కన్నెపొరలో ఎలాంటి మార్పు లేదు.

కన్నెపొర జడకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుందని డాల్ అన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కన్నెపొర జడకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుందని డాల్ అన్నారు

కన్యత్వానికి చిహ్నంగా హైమెన్

ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా, కన్యత్వ నిరూపణకు కన్నెపొర ను ఒక చిహ్నం అన్న భావన సమాజంలో పాతుకుపోయింది. ఇది అనేక సంస్కృతులలో శతాబ్దాలుగా మహిళల ఆనందం, లైంగికతలను నియంత్రించడానికి ఉపయోగపడిందని నిపుణులు అంగీకరిస్తున్నారు.

''కన్యాత్వానికి, కన్నెపొరకు మధ్య ఉన్న సంబంధం 16 శతాబ్ధంలో ప్రసిద్ధ అనాటమిస్ట్ ఆండ్రియాస్ వెసాలియస్ ఇద్దరు కన్యల శవాలను పరీక్ష చేసే వరకు అనేక ఊహాగానాలు, అపోహలతోనే సాగింది. ఆ ఇద్దరు కన్యల శరీరాలను పరీక్ష చేస్తూ, యోనీ చుట్టూ కొన్ని మాంసపు అవశేషాలను వెసాలియస్ గుర్తించారు'' అని ఇటలీలోని సస్సరి విశ్వవిద్యాలయంలో హిస్టరీ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ యూజీనియా టోగ్నోట్టి వివరించారు.

"వెసాలియస్ తన హ్యూమన్ అనాటమీ పుస్తకంలో ( హైమెన్ గురించి దాదాపు సరైన అనాటమీ వర్ణనలు చేసిన పుస్తకాలలో ఇది ఒకటి) కన్యలందరికీ కన్నెపొర ఉండదని పేర్కొన్నారు'' అని ప్రొఫెసర్ టోగ్నోట్టి బీబీసీతో అన్నారు.

అయితే, ఆ తర్వాత కాలంలో చెడిపోని కన్నెపొర 'కన్యత్వానికి రుజువు'గా మారిందని అని టోగ్నోట్టి అన్నారు.

కన్యలందరికీ కన్నెపొర ఉండాలని నియమమేమీ లేదని 16 శతాబ్ధికి చెందిన శాస్త్రవేత్త వెసాలియస్ అన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కన్యలందరికీ కన్నెపొర ఉండాలని నియమమేమీ లేదని 16 శతాబ్ధికి చెందిన శాస్త్రవేత్త వెసాలియస్ అన్నారు

బెడ్‌షీట్లపై రక్తం ఎందుకు?

చాలామందిలో ఉన్న ఒక నమ్మకం మొదటి కలయికలో రక్తస్రావం ఉంటుందని. శోభనపు తొలిరాత్రి రక్తపు చుక్కలతో కూడిన బెడ్ షీట్, కొన్ని సంస్కృతులలో ఎరుపు రంగు కర్చీఫ్ అనేది స్త్రీ కన్యత్వానికి నిదర్శనంగా భావిస్తారు.

కానీ, చాలామంది స్త్రీలకు మొదటి సంభోగం తర్వాత రక్తస్రావం జరగదు.దీన్ని చాలామంది గిల్టీగా, అవమానంగా భావిస్తారు.

"సంభోగం వల్ల ఒక్కోసారి శ్లేష్మం (యోని లోపలి చర్మం) దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తస్రావం అవుతుంది. అంతే తప్ప కన్నెపొర చిరిగిపోవడం వల్ల కాదు. సెక్స్ చేసే సమయంలో ఎగ్జైట్‌మెంట్ వల్ల యోని పొడవుగా, వెడల్పుగా సాగుతుంది'' అని నిపుణులు చెబుతున్నారు.

''హైమెన్ అనేది తక్కువ వాస్కులరైజేషన్ ఉన్న కణజాలం. ఒకవేళ గాయమైనా అది శరీరంలోని ఇతర భాగాలలాగే త్వరగా కోలుకుంటుంది'' అని డాల్ వివరించారు.

సైకిల్ తొక్కడం, కష్టతరమైన ఆటల్లో పాల్గొనడం లేదా టాంపోన్( రుతుస్రావం వల్ల విడుదలయ్యే ద్రవాలను పీల్చుకునే స్పాంజిలాంటి వస్తువు) చొప్పించడం ద్వారా కన్నెపొరలు చిరిగిపోతాయనే వాదనల్లో నిజమేంటి ?

''సైకిల్ తొక్కడం వల్ల అస్సలు జరగదు. ఎందుకంటే కన్నెపొర అనేది యోని లోపల ఉండే నిర్మాణం. యోని లోపలి వరకు వెళ్లే సీటున్న సైకిల్ తొక్కితే తప్ప అలాంటి ఇబ్బంది ఏర్పడదు'' అని డాల్ చమత్కరించారు.

''సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, గుర్రపు స్వారీలాంటివి మీ అంతర్గత శరీర నిర్మాణ శాస్త్రాన్ని మార్చగలదనే ఆలోచన నాకు అసంబద్ధంగా అనిపిస్తుంది" అని ఆమె అన్నారు.

శోభనం తొలిరాత్రి రక్తస్త్రావం కాకపోతే ఆ మహిళ కన్యకాదని నమ్మేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శోభనం తొలిరాత్రి రక్తస్త్రావం కాకపోతే ఆ మహిళ కన్యకాదని నమ్మేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు

అపోహలకు ముగింపు

''కేవలం మత విశ్వాసాలున్న ప్రజల నుంచే కాక, కన్నెపొర గురించి అందరిలోనూ అపోహలను తొలగించడం చాలా ముఖ్యం'' అన్నారు టోరాన్. కన్నాత్వ పరీక్షలు మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నా, చాలా దేశాలలో ఈ పరీక్షలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

మహిళల లైంగిక ఆరోగ్యం, శ్రేయస్సుపై చూపే దుష్ర్పభావాలతోపాటు, ఫోరెన్సిక్ మెడిసిన్ రంగంలో కొనసాగుతున్న తప్పుడు భావనలను తొలగించడం చాలా ముఖ్యమని టోరాన్ అన్నారు.

'' తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, తనకు బలవంతంగా సెక్స్ జరిగిందని ఒక మహిళ వస్తే, ముందు ఆమె యోనీని పరీక్షిస్తారు. కన్నెపొర చెక్కుచెదరకుండా ఉంటే, ఎలాంటి గాయాలు కనిపించకపోతే, వారు ఆమెనే అనుమానిస్తారు" అని టోరాన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, పర్యావరణానికి హాని లేకుండా సెక్స్ చేయడం సాధ్యమేనా?

ఇదంతా పక్కనబెడితే, అసలు ఒక మహిళ కన్యా కాదా అన్నదానిని గురించి ఆలోచించడం మానేయాలని డాల్ అభిప్రాయపడ్డారు.

''స్త్రీలు కచ్చితంగా కన్యలుగా ఉండాలని వాదించడమే కాక, ఇందుకోసం జీవసంబంధమైన ఒక తప్పుడు విధానంతో తమ వాదనను బలంగా మార్చుకుంటున్నారు'' అని డాల్ అన్నారు.

"అందుకే మన ముందున్న ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, స్త్రీలు కన్యలుగా ఉండాలని ఆలోచించడం మానేయడం" అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)