శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని సులభంగా అర్థం చేసుకోండిలా....

శ్రీలంక చిన్న ద్వీప దేశం. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.
విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి.

ద్రవ్యోల్బణం
శ్రీలంక సెంట్రల్ బ్యాంకు ప్రకారం, కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో శ్రీలంక ద్రవ్యోల్బణ రేటు కేవలం 5 శాతం కంటే కాస్త ఎక్కువ. కానీ 2022 ఫిబ్రవరి నాటికి ఇది 18 శాతానికి ఎగబాకింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికంగా పెరిగింది. సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో అక్కడ పరిమితంగా అందుబాటులో ఉన్న సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

వినియోగదారుల జేబుకు చిల్లులు
రోజూ చేసుకునే వంటల్లో ఉపయోగించే ఎండు మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే 190 శాతం పెరిగింది. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు ప్రకారం, 2021 ఏప్రిల్‌లో 55 రూపాయలుగా ఉన్న కేజీ ఆపిల్ పండ్ల ధరలు ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. లీటర్ కొబ్బరి నూనె గతంలో రూ. 520 ఉండగా, ఇప్పుడు రూ. 820 చెల్లించాల్సి వస్తోంది.
శ్రీలంక ప్రజలు అత్యవసరమైన సామగ్రిని నిల్వ చేసుకోవడం ప్రారంభించారని వార్తా నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల సూపర్ మార్కెట్‌లలోని అరలన్నీ ఖాళీగా మారిపోతున్నాయి. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పుడు కొంతమంది ప్రజలు బలవంతంగా భోజనాన్ని మానుకుంటున్నారు.
దిగుమతుల దేశం
శ్రీలంక అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఓఈసీడీ ప్రకారం, 2020లో శ్రీలంక 1.2 మిలియన్ డాలర్ల విలువ చేసే రిఫైన్డ్ పెట్రోలియంను దిగుమతి చేసుకుంది. ఫ్యాబ్రిక్స్, ఔషధాల కోసం వినియోగించే ముడి పదార్థాలు, గోదుమ నుంచి చక్కెర వరకు ఇలా అన్నింటినీ శ్రీలంక దిగుమతి చేసుకుంటంది.

2020లో శ్రీలంక 214 మిలియన్ డాలర్ల విలువైన కార్లను దిగుమతి చేసుకుంది. అంటే శ్రీలంక దిగుమతుల్లో కార్లదే అగ్రస్థానం అనుకుంటే పొరపాటే. కేవలం కాన్సట్రేటెడ్ పాలు దిగుమతి కోసమే లంక 305 మిలియన్ డాలర్లను వెచ్చించింది.
చైనా, భారతదేశాలు శ్రీలంకకు అతిపెద్ద ఎగుమతిదారులు. ఇప్పుడు విదేశీ సహాయం అవసరం ఉండటంతో శ్రీలంక, సంక్షోభంపై పోరాడటానికి ఆర్థిక సహాయం అందించాలంటూ భారత్, చైనాలను సంప్రదించింది.

కరెన్సీ విలువ పతనం
ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకను సందర్శించిన వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది యూరోపియన్లే. ప్రభుత్వం నెల నెలా విడుదల చేసే పర్యాటక నివేదిక ప్రకారం, రష్యా నుంచి 15,340 మంది పర్యాటకులు శ్రీలంకకు వచ్చారు. ఫిబ్రవరిలో శ్రీలంకకు వచ్చిన వారిలో రష్యన్లదే అగ్రస్థానం. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఈ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. అంతకుముందు, కరోనా కారణంగా సందర్శకులు రాకపోవడంతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలైంది.
యుద్ధం తర్వాత గోదుమలు, పెట్రోలియంతో సహా ఇతర వస్తువుల ధరలు కూడా ప్రభావితం అయ్యాయి. వాణిజ్య లోటులో అసమతుల్యత కారణంగా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ మరింత పతనమైంది.

అప్పుల కుప్పలు
శ్రీలంక, అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్ ప్రకారం, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల తర్వాత శ్రీలంకకు, చైనా అతిపెద్ద రుణదాత. శ్రీలంక వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల కంటే కూడా అప్పులే ఎక్కువ. అప్పులు పెరిగిపోతుండటంతో దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితి దిశగా పయనిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలో అనేక పంటలను నాశనం చేయబోతోందా?
- ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి పతనానికి కారణం ఏమిటి
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- 53 ఏళ్ల వృద్ధురాలిని 23 ఏళ్ల యువతిగా మార్చే చర్మ చికిత్స
- పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











