హైదరాబాద్: ‘‘బంగారం కోసం భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపేసిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’’

సిద్ధి వినాయక ఆలయం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో బంగారం కోసం భక్తురాలిని హత్య చేసినట్లు ఒక పూజారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, "మల్కాజ్‌గిరికి చెందిన 42 ఏళ్ల అనుముల మురళీ కృష్ణ మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని స్వయంభు సిద్ధి వినాయక గుడిలో పూజారిగా ఉన్నారు.

అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి 60 ఏళ్ళ గొర్తి నారాయణ మూర్తి భార్య 57 ఏళ్ల గొర్తి ఉమా దేవి గృహిణి. ఆమె ప్రతీరోజూ సిద్ధి వినాయక గుడికి వెళ్తూ ఉంటారు. ఎప్పట్లాగే 18వ తేదీ సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో గుడికి వెళ్లారు. కానీ ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో ఏడున్నర ప్రాంతంలో భర్త నారాయణ మూర్తి గుడికి వెళ్లి తన భార్య అక్కడకు వచ్చిందా అని పూజారిని ఆరా తీయగా, అప్పటికే ఆవిడ వచ్చి వెళ్లిపోయారని చెప్పారు పూజారి.

కానీ ఆమె చెప్పులు గుడి దగ్గర కనిపించడంతో, దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లిందేమోనని అక్కడే నారాయణ మూర్తి ఎదురుచూశారు. చాలా సేపటి వరకూ రాకపోవడంతో గుడి చుట్టుపక్కల వెతికారు కానీ ఆమె కనిపించలేదు. ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. దీంతో తన భార్య కనపడడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు.

ఉమా దేవి, మురళీ కృష్ణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఉమా దేవి, మురళీ కృష్ణ

ఇలా బయటపడింది..

ఆమె గుడికి వచ్చినప్పడు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అక్కడ ఎవరూ లేరు. ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్టుగా చేసి, తలపై ఎక్కువసార్లు ఇనుప రాడ్‌తో మోది పూజారి ఆమెను చంపాడని పోలీసులు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం, ఉమా దేవి చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమె మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి దానిపై మూత పెట్టేసి, ముందే తెచ్చుకున్న నీటితో నేల శుభ్రం చేశాడు పూజారి. ఆమె బాడీ నుంచి తీసుకున్న బంగారాన్ని అదే కాలనీలో బంగారం షాపు నడుపుతోన్న నందకిషోర్ జోషికి అమ్మారు.

ఆమె శవాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి ఒక ట్రాలీలో తీసుకెళ్లాలని పూజారి అనుకున్నారు. కానీ, పోలీసులు, స్థానికులు చుట్టుపక్కల వెతుకుతూండడంతో ఆ పని చేయలేకపోయారు. రెండు రోజులుగా శవం అక్కడే ఉండడంతో, దుర్వాసన రావడం మొదలైంది.

21వ తేదీ తెల్లవారుజామున పూజారి గుడికి వెళ్లి, ఆ డ్రమ్మును దొర్లించుకుంటూ గుడి వెనుకకు తోసి, బాడీని తీసి రైల్వే ట్రాక్ దగ్గర ముళ్ల పొదల్లో వేసి, గుడికి వచ్చేశారు. తరువాత డ్రమ్మును లైజాల్‌తో కడిగేసి మామూలుగా ఉండే చోట పెట్టేశారు. ఇంకా వాసన వస్తూండడంతో మళ్లీ ఆ చోటు శుభ్రం చేసి అగరబత్తుల/కడ్డీల పొగ వేశారు’’అని పోలీసులు వివరించారు.

వీడియో క్యాప్షన్, అవకాడో: ఇవి పండ్లు కాదు.. పచ్చ బంగారం..

అనుమానంతో..

పోలీసులు అనుమానం వచ్చి పూజారిని ప్రశ్నించారు. విచారణలో ఆయన తన నేరం ఒప్పుకున్నారు. అతనితో పాటూ బంగారం షాపు యజమానినీ పోలీసులు అరెస్టు చేశారు.

తనకున్న ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడం కోసం ఆమెను చంపి పూజారి బంగారం దొంగిలించారని పోలీసులు చెప్పారు.

నిందితుడు ఉపయోగించిన రెండు ఇనుప రాడ్లు, ప్లాస్టిక్ డ్రమ్ము, నిందితుడు ఆ సమయంలో వేసుకున్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు.

‘‘పది తులాలను దగ్గరలోని బంగారం షాపులో అమ్మేశాడు నిందితుడు. ఆ షాపు యజమాని నంద కిషోర్ జోషిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసేప్పటికే తాను కొన్న ఆరు గాజులను ముక్కలు చేశారు. మొత్తం 35 బంగారు గాజు ముక్కలను, బంగారు తాడు, బంగారు నల్లపూసలు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడి దగ్గర నుంచి రెండు బంగారు గాజులు, లక్ష రూపాయల నగదు, బంగారం షాపు ఓనర్ ఇచ్చిన కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)