తెలంగాణ: సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేయించిన మామ.. కారణం ఏంటి? కులాంతర వివాహమా, ఆస్తి తగాదాలా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఇంకో మూడు నెలల తర్వాత పాప పుట్టు వెంట్రుకలు తీయించడానికి శ్రీశైలం వెళ్దాం అన్నావు. కానీ, నిన్నుఒక్కడినే పంపించేశారు వాళ్లు.. మా పరిస్థితి ఏంటి ఆర్‌కే? నా ఆర్‌కే (రామకృష్ణ) కాళ్లు విరగ్గొట్టారు. కనీసం కొన ఊపిరితోనైనా వదిలేయలేదు. అంత బాధ ఒక్కడివే ఎలా భరించావు ఆర్‌కే" అంటూ భార్గవి విలపిస్తున్నారు.
ఎలుకల రామకృష్ణ గౌడ్, భార్గవి ముదిరాజ్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేక తన భర్త రామకృష్ణను తన తండ్రి సుపారి ఇచ్చి హత్య చేయించారు అని భార్గవి రోదిస్తున్నారు. తన తండ్రికి రామకృష్ణ నచ్చేవారు కాదని ఆమె చెబుతున్నారు.
32 ఏళ్ల రామకృష్ణ, తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో ఏప్రిల్ 15న హత్యకు గురయ్యారు. లతీఫ్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి భార్గవి తండ్రి ఈ హత్య చేయించారని పోలీసులు, భార్గవి చెబుతున్నారు.
భార్గవి తండ్రి వెంకటేశ్, గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)గా పని చేస్తున్నారు.
ఇది కుల హత్య మాత్రమే కాదని, ఇందులో ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని పోలీసులు అంటున్నారు.
వలిగొండ మండల కేంద్రం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ యాదగిరి గుట్టలో హోంగార్డ్‌గా పని చేసేవారు. ఆ సమయంలో వెంకటేశ్ ఇంట్లో రామకృష్ణ అద్దెకు ఉండేవారు. అప్పుడే భార్గవితో ప్రేమలో పడ్డారు.

ఫొటో సోర్స్, UGC
కులాలు వేరు కావడం, రామకృష్ణ ఆర్థికంగా బలహీనంగా ఉండటం వంటి కారణాలతో తమ ప్రేమను తన తండ్రి వెంకటేశ్ ఒప్పుకోలేదని బీబీసీతో భార్గవి చెప్పారు.
భార్గవి చెబుతున్న కారణాలకు భిన్నమైన కారణాలను పోలీసులు చెబుతున్నారు.
ఏసీపీ వెంకట్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది. వెంకటేశ్ తన వాంగ్మూలంలో రామకృష్ణ తనను మోసం చేసినట్లు చెప్పారని ఆయన తెలిపారు.
'' అన్నా అని పిలుస్తూ తన చుట్టూ తిరిగే రామకృష్ణ, తన కూతురిపై కన్నువేశాడని, అది తనకు నచ్చలేదని వెంకటేశ్ వాంగ్మూలంలో చెప్పారు. కొన్ని నెలలుగా రామకృష్ణ తరచూ ఫోన్ చేసి ఆస్తిలో వాటా కావాలని బెదిరించారని అన్నారు. కూతురిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు తన కొడుకులకు ఏదైనా హాని కలిగిస్తాడేమో అనే భయంతో రామకృష్ణను చంపేయాలని నిర్ణయించుకున్నట్టు వెంకటేశ్ చెప్పారు" అని ఏసీపీ తెలిపారు.
తెలిసినవారితో, లతీఫ్‌తో సంప్రదింపులు జరిపి రామకృష్ణ హత్య కోసం 10 లక్షల రూపాయలకు వెంకటేశ్ సుపారీ కుదుర్చుకున్నారని పోలీసులు చెప్పారు.

పథకం ప్రకారం రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలతో రామకృష్ణకు ఫోన్ చేయించారని బీబీసీతో భార్గవి చెప్పారు. ''హైదరాబాద్‌లో భూమి కొంటామని, మధ్యవర్తిగా భూమి చూపించాలని వారు అడగడంతో రామకృష్ణ హైదరాబాద్ వెళ్లారు. రెండు రోజులు అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని ఆమె వివరించారు.
రామకృష్ణ, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మధ్యవర్తిగా పనిచేస్తున్నారు.
రామకృష్ణను లతీఫ్ పిలిపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సిద్దిపేట జిల్లా కుకునూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లకుడారం గ్రామం వద్ద రామకృష్ణను చంపి అక్కడే మృతదేహాన్ని పడేసినట్లు లతీఫ్, ఆయనకు సహకరించిన మిగతా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. భువనగిరి పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి రామకృష్ణ హత్యను నిర్ధరించారు.
తనకు దగ్గరగా ఉంటూ తన కూతురును ప్రేమించడమే కాకుండా రామకృష్ణ, భార్గవి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటం, ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం వంటి కారణాలే భార్గవి తండ్రి ఈ నేరం చేసేలా ఉసిగొల్పాయని పోలీసులు చెబుతున్నారు.
అయితే, ఆస్తి గురించి ఎప్పుడూ రామకృష్ణ తనతో మాట్లాడలేదని భార్గవి చెబుతున్నారు.
"మేం ప్రేమించుకున్నాం. మా ప్రేమ గురించి ఇంట్లోవారికి తెలిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నన్ను కిడ్నాప్ చేశారు. ఈ విషయం పోలీసులు వరకు వెళ్లింది. తర్వాత నేను నా భర్తతో ఉండవచ్చని పోలీసులు చెప్పారు. నాకు ఆస్తి కూడా వద్దు అని నేను రాసి ఇచ్చేశాను. పెళ్లి తర్వాత, పుట్టింటి నుంచి తీసుకురా అని ఆర్‌కే ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఉన్న దాంట్లోనే సర్దుకున్నాం'' అని భార్గవి చెప్పారు.

లతీఫ్, కొన్ని రోజులుగా రామకృష్ణను కలుస్తున్నారని, రోజూ ఇంటికి వచ్చేవారని భార్గవి తెలిపారు. లతీఫ్‌తోపాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా వచ్చేవారని రామకృష్ణ తనతో అనేవారని ఆమె చెప్పారు.
"మేం అద్దె ఇంట్లో సుఖంగానే ఉన్నాం. మా తల్లిదండ్రులతో మాకు మాటలు లేవు. మూడు నెలల క్రితం మా పాప మోక్షశ్రీ పుట్టాక అమ్మ ఫోన్ చేసి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. అంతే, ఇప్పుడు ఇలా జరిగిపోయింది" అని భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆస్తి కోసం చేసిన హత్య మాత్రం కాదని ఆమె స్పష్టంగా చెబుతున్నారు.
పోలీసులు, ఏప్రిల్ 17 సాయంత్రం వరకు కూడా తన వద్దకు వచ్చి మాట్లాడలేదని ఆమె చెప్పారు. ఆసుపత్రికి వచ్చి రామకృష్ణ మృతదేహాన్ని తీసుకువెళ్లాలని తన బంధువులతో చెప్పారని తెలిపారు. తనను పోలీసులు సంప్రదించలేదని అన్నారు.
ఏప్రిల్ 15న, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంమై సన్నిహితుడైన జమ్మాపురం సర్పంచ్ అమృతరావుతో కలిసి మోత్కూర్, వెలుగొండలకు రామకృష్ణ వెళ్లారని పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 1:55 వరకు భార్గవితో ఫోన్‌లో మాట్లాడిన రామకృష్ణ ఫోన్ ఆ తర్వాత స్విచ్ఛాఫ్ రావడంతో భార్గవికి అనుమానం వచ్చిందని చెప్పారు. బంధువులకు ఫోన్ చేసి తన భర్త ఆచూకీ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించారని వివరించారు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో రామకృష్ణను చంపించడానికి అతని మామ వెంకటేశ్ సుపారీ ఇచ్చారని వెల్లడైందని తెలిపారు.
రామకృష్ణను చంపాలని ఆరు నెలల క్రితమే అనుకున్నప్పపటికీ, తన కూతురు తల్లి కాబోతుండటంతో ఆగానని వెంకటేశ్ చెప్పారని పోలీసులు తెలిపారు.
కూతురు కులాంతర వివాహం చేసుకోవడం నచ్చకే అల్లుడిని వెంకటేశ్ దారుణంగా హత్య చేయించారని రామకృష్ణ బంధువులు ఆరోపిస్తున్నారు.

రామకృష్ణ, భార్గవిల పెళ్లి 2020 ఆగస్టు 16న జరిగింది. అనంతరం వారిద్దరూ భువనగిరిలోని తాతానగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నారు.
రామకృష్ణది పేద కుటుంబమని ఆయన బంధువులు చెప్పారు. ఆయన తన తల్లి అంగన్‌వాడీ స్కూల్‌లో వంట చేస్తారు. తండ్రి చాలా కాలం క్రితమే చనిపోయారు.
కొంత కాలం క్రితం హోంగార్డుగా ఉన్నప్పుడు రామకృష్ణను గుప్తనిధుల కేసులో సస్పెండ్ చేశారని, ఆ తరువాత ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారని చెప్పారు.
రామకృష్ణ హత్య కేసులో వెంకటేశ్ సహా మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లతీఫ్ ముఠాకు చెందిన నలుగురిని ఏప్రిల్ 17న అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో భాగ్యలక్ష్మి , దివ్య అనే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలు రామకృష్ణను హత్య చేసేటప్పుడు లతీఫ్‌కు సహకరించారని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు.
ఏప్రిల్ 17 సాయంత్రం గజ్వేల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఊరిలో రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
తన భర్తపై ఇంత కిరాతకానికి పాల్పడ్డ తన తండ్రిని కఠినంగా శిక్షించాలని భార్గవి కోరుతున్నారు. తన తండ్రికి, లతీఫ్‌లకు కఠిన శిక్ష పడేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. తన అత్త, మూడు నెలల తన కుమార్తె మోక్షశ్రీ భవిష్యత్తు గురించి తనకు ఆందోళనగా ఉందని ఆమె బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘నాపై రాళ్లు విసిరినా, రక్తం కారుతున్నా నా బాధ్యతల నుంచి తప్పుకోను’ - బీబీసీ ఇంటర్వ్యూలో తెలంగాణ గవర్నర్
- పాకిస్తాన్: ప్రభుత్వాన్ని సైన్యం ఎలా గుప్పిట్లో పెట్టుకుంది?
- ఏపీ మంత్రి కాకాణి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి
- ప్రపంచం మొత్తానికి భారత్ తిండి పెట్టగలదా, బైడెన్‌తో మోదీ ఎందుకలా చెప్పారు
- ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















