ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శనివారం (ఏప్రిల్ 16న) ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య సమావేశం జరిగింది. గత 10 నెలల్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని కలవడం ఇది రెండోసారి. అంతకు ముందు, గత ఏడాది జులైలో రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలతో ఆయన చర్చలు జరిపారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రశాంత్ కిశోర్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కానీ, ఈసారి సమావేశం భిన్నంగా ఉంది. 2024లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి సోనియా గాంధీకి, ఇతర కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పేర్కొంది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తకు వెల్లడించారు.

రాహుల్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ ప్రకటనలు చేసినప్పుడు..

గతే ఏడాది జులైలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన రెండు సమావేశాల మధ్య, అంటే గత ఏడాది అక్టోబర్‌లో ప్రశాంత్ కిశోర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ నేతలతో చర్చల తర్వాత ‘‘ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని, ఆయన్ను ఓడిస్తారని కాంగ్రెస్ నేతలు భ్రమపడవద్దు. ప్రజలు బీజేపీని తరిమేస్తారని రాహుల్‌ గాంధీకి అనుకుంటున్నారు. కానీ, అది జరగదు'' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

''మీరు మోదీని అర్థం చేసుకోకపోతే, ఆయన బలాన్ని అర్థం చేసుకోలేరు. ఆయన్ను ఓడించడానికి మీరు వ్యూహం రచించలేరు'' అని అన్నారు.

ఆయన అక్కడితో ఆగలేదు. ‘‘ఓడినా, గెలిచినా భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా ఉంటుంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఉన్నట్లే బీజేపీ కూడా ఉంటుంది. ఎక్కడికీ వెళ్లదు. జాతీయ స్థాయిలో 30 శాతం ఓట్లను సాధించిందంటే, అది అంత సులభంగా కనుమరుగైపోదు'' అన్నారు.

ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య జరిగిన తాజా భేటీ, గతంలో ఆయన చేసిన ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని చూడాల్సి ఉంది.

సోనియా, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోనియా, రాహుల్ గాంధీ

ఈ విషయమై కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు హిందూస్థాన్ టైమ్స్ పత్రిక పొలిటికల్ ఎడిటర్ వినోద్ శర్మ, కాంగ్రెస్‌ పై పుస్తకం రాసిన రషీద్ కిద్వాయ్, సీఎం నితీశ్ కుమార్‌తో ఆయన పాలనను నిశితంగా పరిశీలించిన ప్రభాత్ ఖబర్ మాజీ ఎడిటర్ రాజేంద్ర తివారీలతో బీబీసీ మాట్లాడింది.

ముగ్గురు సీనియర్ జర్నలిస్టులకు బీబీసీ రెండు ప్రశ్నలు వేసింది. అందులో మొదటిది...గతేడాది జులైలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే ప్రయత్నం చేసిన ప్రశాంత్‌ కిశోర్, మధ్యలో కాంగ్రెస్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యారు?

వినోద్ శర్మ: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనపడి ఉండవచ్చు. సీట్ల పరంగా బలహీనంగా మారింది. కానీ నేటికీ కాంగ్రెస్ 12 కోట్ల ఓట్లున్న పార్టీ. ఈ విషయం ప్రశాంత్ కిశోర్‌‌కు తెలుసు కాబట్టే, కాంగ్రెస్ మరోసారి నిలదొక్కుకోగలదని నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చల్లో ప్రశాంత్ కిశోర్ పెట్టిన కొన్ని షరతులు ఆ పార్టీకి ఆమోదయోగ్యం కాకపోయి ఉండవచ్చు.

అయితే ఈసారి మాత్రం చర్చలకు ముందు కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి వచ్చినట్లు, గతంలో కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీన్నిబట్టి రానున్న రోజుల్లో ఆయనకు, కాంగ్రెస్‌కు మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందనిపిస్తోంది.

రాజేంద్ర తివారీ: వాస్తవానికి ఆయన తన పొలిటికల్ రోల్ కోసం వెతుకుతున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత జేడీయూలో చేరారు. అయితే ఆ పార్టీలోని కొందరు వ్యక్తులతో ఆయనకు సరిపడలేదు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారు.

వీడియో క్యాప్షన్, పులులకు ప్రాణ సంకటం ఈ మొక్కలు

2017లో ఉత్తర్ ‌ప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ కోసం వ్యూహం రచించినా విజయం సాధించలేదు. దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడు డీఎంకే, ఇంకా ఇతర పార్టీలతో కూడా పనిచేశారు. మమతా బెనర్జీ ద్వారా రాజకీయంగా ఏదో ఒక అవకాశం కోసం ప్రయత్నించినా అక్కడా కుదరలేదు. అందుకే, కాంగ్రెస్ లేకుండా ఏదీ జరగదని నిర్ణయించుకున్నారు.

రషీద్ కిద్వాయ్: ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ చాలా సక్సెస్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ విజయం, వ్యూహకర్తగా ఆయన కెరీర్‌లో రెండో అత్యుత్తమ ఫలితం. 2014లో బీజేపీ విజయంలో పాత్ర ఆయన కెరీర్‌లో మొదటి ఎత్తు. కానీ, ఇప్పుడు ఏం చేయగలరు? ఆయనకున్న ఆప్షన్లు చాలా పరిమితం. పైగా, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

అయితే, ప్రాంతీయ పార్టీలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భాష స్థాయి నుంచి వాటితో సమస్యలు ఉన్నాయి. అంతేగాక, ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల ఆధారితమైనవి. జాతీయస్థాయి పార్టీలకు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నా, ప్రాంతీయ పార్టీల కంటే పనితీరు భిన్నంగా ఉంటుంది. ఆయన ఇంతకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు సహజ ఎంపిక.

ప్రశాంత్ కిశోర్

ఫొటో సోర్స్, TWITTER

రెండో ప్రశ్న: కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ అవసరమా?

వినోద్ శర్మ: ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఒకట్రెండు ఎన్నికల్లో పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటే వారిలో ఉత్సాహం నింపవచ్చు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరితే ఏం జరుగుతుందో మీకు అర్ధమైంది కదా? ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ నిర్లిప్తంగా కనిపించే పార్టీ. నిత్యం ఎన్నికల మోడ్‌లో ఉండే పార్టీని ఆ పార్టీ ఢీకొట్టాలి.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన పార్టీలోని బద్ధకాన్ని వదిలించగలరు. తద్వారా భిన్నమైన వాతావరణాన్ని సృష్టించగలరని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అటువంటి వ్యవస్థను రూపొందించడానికి ప్రశాంత్ కిశోర్ పార్టీకి బ్లూ ప్రింట్ ఇవ్వగలరు.

ఆయన ప్రజల్లోకి వెళ్లే నాయకుడు కాదు. కానీ, పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడం ఆయన ప్రత్యేకత. కాంగ్రెస్‌ను ఈ పని చేయించగలిగితే, బహుశా ఆ తర్వాత పార్టీలో కూడా ఆయనకు స్థానం దక్కే అవకాశం ఉంది.

రాజేంద్ర తివారీ: కాంగ్రెస్‌కు మంచి మేనేజర్ లేడు. కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యతో పాటు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేయగల నాయకుల కొరత కూడా ఉంది. అహ్మద్ పటేల్ మరణానంతరం ఆ పార్టీ మరింత ఇబ్బందులు పడుతోంది. ఆయన స్థానంలో ప్రశాంత్ కిశోర్ పార్టీలోకి వస్తారో లేదో తెలియదుగానీ, వస్తే మాత్రం కాంగ్రెస్ బలోపేతం అవుతుంది.

రషీద్ కిద్వాయ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ చాలా నిరాశాజనకంగా ఉంది. రాహుల్ గాంధీ ఆమోదయోగ్యమైన ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన, కాంగ్రెస్ అధినేతగా, ఇతర పార్టీల నేతలను కలుపుకొనిపోగలరని భావించలేం. ప్రశాంత్ కిశోర్ చాలా ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేశారు. కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష పార్టీలకు మధ్య స్నేహాన్ని పెంచడంలో ప్రశాంత్ కిశోర్ చక్కగా పని చేయగలరు.

జేపీ నడ్డా, మోదీ, రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ప్రయాణం

ప్రశాంత్ కిశోర్ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ, జేడీయూ నేత నితీశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో డీఎంకే నాయకుడు ఎం.కె. స్టాలిన్‌ లకు వృత్తిపరమైన సేవలను అందించారు.

గత బిహార్ ఎన్నికలకు ముందు ఆయన 'బాత్ బిహార్ కీ'ని కూడా ప్రారంభించారు. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, అఖిలేశ్‌లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రయోగం చేసినా అది కూడా సఫలం కాలేదు.

మమతా బెనర్జీ గోవాలో కూడా టీఎంసీని పోటీకి దించారు. కేవలం ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే ఆమె ఇలా చేశారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయోగం కూడా విజయవంతం కాలేదు.

ఈసారి ఆయన కాంగ్రెస్‌తో మాట్లాతుండటం వల్ల అందరి దృష్టి ఆయన భవిష్యత్ పాత్ర పైనే ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య... మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)