అగ్రవర్ణ ప్రజల కంటే ఆదివాసీలు, దళితులు ముందే మరణిస్తున్నారా

దళితులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో జన్మించే నవజాత శిశువులు 69 ఏళ్ల వరకు జీవించే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ఇది ప్రపంచ సగటు కంటే కేవలం మూడేళ్లు తక్కువ.

అయితే, సగటున ఒక వ్యక్తి జీవిత కాలం విషయంలో భారత్‌లోని భిన్న వర్గాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

భారత్‌లోని అగ్రవర్ణ హిందువులతో పోల్చినప్పుడు ఆదివాసీలు, దళితులు, ముస్లింలు త్వరగా మరణించే అవకాశముందని సంగీత వ్యాస్, పాయల్ హథి, ఆశిష్ గుప్తా తమ తాజా పరిశోధన పత్రంలో వెల్లడించారు.

తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 2 కోట్ల మందికిపైగా ప్రజల ఆరోగ్య సర్వే సమాచారాన్ని వీరు విశ్లేషించారు.

దీంతో అగ్రవర్ణ హిందువులతో పోల్చినప్పుడు సగటున ఆదివాసీలు నాలుగేళ్లు, దళితులు మూడేళ్లు తక్కువ కాలం జీవిస్తున్నట్లు వీరు గుర్తించారు. మరోవైపు ముస్లింలు ఒక ఏడాది కాలం తక్కువగా జీవిస్తున్నట్లు వెల్లడైంది.

ముస్లింలు

ఫొటో సోర్స్, AFP

ఈ పరిశోధనలో స్త్రీ, పురుషుల వారీగా కూడా సమాచారాన్ని విశ్లేషించారు.

ఆదివాసీల్లో మహిళలు సగటున 62.8 ఏళ్లు జీవిస్తుంటే, దళిత మహిళలు 63.3 ఏళ్లు జీవిస్తున్నారు. ముస్లిం మహిళల సగటు జీవిత కాలం 65.7 ఏళ్లుగా ఉంది. అగ్రవర్ణ హిందూ మహిళల విషయంలో ఇది 66.5ఏళ్లు.

పురుషుల విషయానికి వస్తే, ఆదివాసీ పురుషులు సగటున 60 ఏళ్లు జీవిస్తుంటే, దళితులు 61.3 ఏళ్లు, ముస్లింలు 63.8ఏళ్లు జీవిస్తున్నారు. అగ్రవర్ణ హిందూ పురుషులు సగటున 64.9 ఏళ్లు జీవిస్తున్నారు.

అమెరికాలోని నల్ల జాతీయులు, శ్వేతజాతీయుల మధ్య కూడా సగటు జీవిత కాలంలో ఇలాంటి వ్యత్యాసాలే కనిపిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. మరోవైపు భారత్‌లో సగటు జీవిత కాలం అమెరికాతో పోల్చినప్పుడు ఐదింట నాలుగు వంతులే.

వైద్య రంగంలో కొత్త చికిత్సా విధానాలు, మెరుగైన ప్రజా ఆరోగ్య విధానాలతో భారత్‌లో సగటు జీవిత కాలంలో పెరుగుతోంది. అర శతాబ్దం క్రితం భారత్‌లో జన్మించిన వ్యక్తి 50 ఏళ్లు జీవించడమే గగనమయ్యేది. కానీ, ఇప్పుడు వారి జీవిత కాలం దాదాపు 20ఏళ్లు పెరిగింది.

దళితులు

ఫొటో సోర్స్, Getty Images

అన్ని వర్గాల్లోనూ సగటు జీవిత కాలం పెరిగినప్పటికీ, ఈ వర్గాల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉందని ఆశిష్ గుప్తా, నిఖిల్ సుదర్శనన్ చేపట్టిన మరో అధ్యయనం వెల్లడించింది.

కొన్ని కేసుల్లో ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దళిత పురుషులు, అగ్రవర్ణాల హిందూ పురుషుల మధ్య 1990 నుంచి 2010 మధ్య ఈ వ్యత్యాసం బాగా పెరిగింది. 1997 నుంచి 2000 మధ్య అగ్రవర్ణ హిందూ పురుషులు, ముస్లింల వ్యత్యాసం కాస్త తక్కువగా ఉండేది, అయితే, గత 20ఏళ్లుగా ఈ తేడా బాగా పెరిగింది.

భారత్‌లో 12 కోట్ల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది మారుమూల ప్రాంతాల్లో పేదరికంలో బతుకుతున్నారు. 23 కోట్ల మంది దళితులు కొంతవరకు రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించినప్పటికీ, ఇప్పటికీ వీరు వివక్షను ఎదుర్కొంటున్నారు.

భారత్‌లో ముస్లింల జనాభా కూడా 20 కోట్ల వరకూ ఉంటుంది. అయితే, వీరిని కూడా అణగారిన సామాజికవర్గంగానే చెప్పుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవచ్చా?

ఈ వ్యత్యాసం ఎందుకు?

ప్రజలు జీవించే పరిసరాలు, సంపద, వాతావరణం తదితర అంశాలు ఈ వ్యత్యాసానికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు సంపన్న వర్గాలైన అగ్రవర్ణాల హిందువులతో పోల్చినప్పుడు ఆదివాసీలు, దళితుల జీవిత కాలం కాస్త తక్కువగా ఉంది.

వివక్ష, సగటు జీవిత కాలంపై ప్రభావం మధ్య సంబంధాన్ని స్పష్టంగా గుర్తించేందుకు లోతైన అధ్యయనం అవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఆదివాసీలు, దళితులతో పోల్చినప్పుడు ముస్లింలు కాస్త ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారో పరిశోధకులు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన, మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు, ఆల్కహాల్ వినియోగం, ఆత్మహత్యలు తదితర అంశాలు ఇక్కడ ప్రభావం చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

మరోవైపు అణగారిన వర్గాలు స్కూళ్లతోపాటు ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా వివక్షను ఎదుర్కొంటున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. వీటి వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ వివక్షతో ఒత్తిడి పెరుగుతోంది, దీర్ఘకాలంలో వ్యాధులకు ఇది కారణం అవుతోంది. ఈ వర్గాలకు ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య కూడా సరిగా అందడం లేదు.

పారిశుద్ధ్య కార్మికులు లాంటి అణగారిన వర్గాలకు వృత్తి పరంగా కూడా మరణ ముప్పు ఎక్కువగా ఉంటోంది. వీరు ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోంది. వీరి ఆర్థిక పరిస్థితే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదని వివరిస్తున్నారు.

వీరి మరణాలకు గల కారణాలు, ఆరోగ్యంపై వివక్ష చూపిస్తున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు లోతైన అధ్యయనం అవసరం. ఇక్కడ ఆరోగ్య రికార్డుల నమోదు కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇక్కడ ఏటా ఒక కోటి మరణాలు సంభవిస్తుంటే, 70 లక్షల మందికి మరణానికి సంబంధించిన కారణాలపై వైద్యుల ధ్రువపత్రం కూడా అందడం లేదు. 30 లక్షల మరణాలు అయితే, రిజిస్టర్ కూడా కావడం లేదు.

ఆరోగ్య వ్యవస్థల్లో వివక్షకు ప్రభుత్వాలు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. అణగారిన వర్గాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)