ఎలక్ట్రిక్ బైక్, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీలు పేలకుండా ఉండాలంటే ఇలా చేయండి

మొబైల్ ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రవికుమార్ పాణంగిపల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2022, ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ల్యాప్‌టాప్‌లో మంటలు చెలరేగి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతు ఆమె నిన్న (22.04.2022) చనిపోయారు. మరోవైపు విజయవాడలో తాజాగా ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మరణించారు.

2021 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటుండగా మొబైల్ ఫోన్ పేలి ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

2021 ఆగస్టులో రాజస్థాన్‌లో ఇయర్ ఫోన్ పేలి 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

2021 జులైలో గుజరాత్‌లో చార్జింగ్ పెడుతుండగా మొబైల్ ఫోన్ పేలి 17 ఏళ్ల యువతి చనిపోయింది.

75 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్న భారత్‌లో ఇలా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల్లో బ్యాటరీలు పేలి కొందరు ప్రాణాలు కోల్పోవడం... మరి కొందరు తీవ్ర గాయాల పాలవడంపై చర్చ జరుగుతోంది.

ఇంతకీ ల్యాప్ ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు ఎందుకు పేలిపోతుంటాయి..? వాటిని ఎలా కాపాడుకోవాలి?

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

అన్ని కంపెనీల ఫోన్లూ ఇలానే..

ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదు... దాదాపు అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు, కార్ల విషయంలో ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతునే ఉంది.

ద మొబైల్ ఇండియన్ డాట్‌కామ్ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం 2021 సంవత్సరంలో భారత్‌లో వన్ ప్లస్ నార్డ్ టు, సామ్ సంగ్ గెలాక్సీ ఎ 21, ఒప్పొ ఎ 53, వివో వై 20, షియోమీ రెడ్ మీ నోట్ 9 ప్రో - ప్రో మ్యాక్స్ , రెడ్ మీ 8, పొకొ సీ 3, పొకొ ఎక్స్ 3, పొకొ ఎం 3 ఇలా వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు వివిధ సందర్భాల్లో పేలిపోవడం లేదా కాలిపోవడం జరిగింది.

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్‌లు ఎందుకు పేలుతాయి?

ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం.

  • మొబైల్ లేదా ల్యాప్ ట్యాప్ అసెంబుల్ చేసే సమయంలోనే బ్యాటరీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా తర్వాత మనం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
  • మొబైల్ ఫోన్, ల్యాప్‌ టాప్, ఇయర్ ఫోన్ ఇలా వేటిలోనైనా ఇప్పుడు ఉపయోగిస్తున్నది డ్రై లిథియం అయాన్ బ్యాటరీలనే. సాధారణంగా ఫోన్లు కింద పడినప్పుడు ముందుగా డ్యామేజ్ అయ్యేది బ్యాటరీనే. నిజానికి చూడ్డానికి మనకు ఆ డ్యామేజీ వెంటనే కనిపించకపోయినప్పటికీ బ్యాటరీలో ఉండే సెల్స్ మధ్య సున్నితమైన పొరలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఆపై బ్యాటరీ ఉబ్బిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా ప్రమాదాలకు గురి కావచ్చు.
  • ఒరిజినల్ బ్యాటరీలు, ఒరిజినల్ చార్జర్లకు బదులు మార్కెట్లో దొరికే చవకైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం వల్ల కూడా బ్యాటరీలు దెబ్బతిని పేలే ప్రమాదం ఉంది.
  • 2016లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 వరుసగా అగ్ని ప్రమాదాలకు గురైంది. అనంతరం జరిగిన విచారణలో బ్యాటరీ నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదాలకు కారణమని కంపెనీ ప్రకటించింది.
  • బాగా వేడెక్కడం వల్ల ల్యాప్ ట్యాప్ లేదా మొబైల్ బ్యాటరీలు థర్మల్ రన్ అవేకి గురి కావచ్చు. అంటే బ్యాటరీని అవసరానికి మించి చార్జ్ చేసినప్పుడు అందులోకి ప్రవహించే కరెంట్ అధిక ఉష్ణోగ్రతను పుట్టిస్తుంది. ఆ ఉష్ణోగ్రతలు బ్యాటరీ కెపాసిటీని మించిపోయినప్పుడు పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా నాణ్యమైన బ్యాటరీలలో ఈ ప్రమాదం కాస్త తక్కువ.
  • త్వరగా చార్జింగ్ అవ్వాలన్న ఆతృతతో మీరు వాడుతున్న ఫోన్ స్థాయికి మించిన చార్జర్లతో చార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్లోని ఇంటర్నల్ కాంపోనెంట్స్ దెబ్బ తింటాయి. ఫలితంగా మీ ఫోన్ పేలొచ్చు.
వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

ల్యాప్ట్యాప్ - మొబైల్ ఫోన్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

  • కంపెనీ సూచించిన ఒరిజినల్ చార్జర్లను, బ్యాటరీలను మాత్రమే వాడండి. తక్కువ ధరల్లో లభిస్తున్నాయన్న నెపంతో స్థానికంగా పరికరాల జోలికి వెళ్లవద్దు.
  • చార్జింగ్ పెట్టి ల్యాప్‌ట్యాప్‌ ఉపయోగించడం వల్లే తాజాగా కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది కేవలం ల్యాప్‌టాప్‌లకు మాత్రమే కాదు మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కనుక చార్జింగ్‌ పెట్టిన ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దు. అవసరం అనుకుంటే డిస్‌కనెక్ట్ చేసి వాడండి. అదే ల్యాప్‌ట్యాప్ విషయానికి వస్తే చార్జింగ్ పెట్టినప్పుడు కనీసం ఓ టేబుల్‌ పెట్టుకొని ఉపయోగించడం మంచిది.
  • అలాగే ల్యాప్‌ట్యాప్‌ బ్యాటరీలను కనీసం 3 ఏళ్లకు ఒక సారి మార్చాలి.
  • అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ల్యాప్‌ట్యాప్‌లను లేదా ఫోన్లను ఉంచవద్దు. ముఖ్యంగా కారులో ప్రయాణించే సమయాల్లో బూట్ ప్లేస్‌లో ఉంచడం కొంత మందికి అలవాటు. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి.
  • బెడ్స్‌పై ఉంచి ల్యాప్‌టాప్‌ను లేదా ఫోన్‌లను చార్జీంగ్ పెట్టవద్దు. అందువల్ల వల్ల ప్రమాదానికి గురైతే దాని తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది.
  • ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్ చార్జింగ్ పెట్టే సమయంలో అధికంగా వేడెక్కుతూ ఉంటే వెంటనే చార్జింగ్‌ ఆపి కాస్త చల్ల బడిన తర్వాత మళ్లీ పెట్టాలి.
  • ముఖ్యంగా వేసవి కాలంలో మీ ఫోన్‌కు నేరుగా సూర్య రశ్మి తగలకుండా చూసుకోండి. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచండి.
  • మీలో ఎవరికైనా రాత్రంతా ఫోన్, ల్యాప్ ట్యాప్ చార్జింగ్ పెట్టి వదిలేసే అలవాటు ఉంటే తక్షణం దాన్ని మానుకోండి. లేదంటే మీ ఫోన్ స్థాయికి మించి వేడెక్కుతుంది. ఫలితంగా ఫోన్లోని అంతర్గత పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆపై అది అగ్ని ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు.
  • డ్యామేజ్ అయిన ఫోన్లు పేలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వైర్ లైస్ చార్జింగ్ సదుపాయం ఉన్న ఫోన్ల విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండవచ్చు. వైర్ లెస్ చార్జింగ్ కాయిల్స్‌లో అధిక మోతాదులో కరెంట్ ప్రవహిస్తుండటం వల్ల ఎక్కువగా వేడెక్కుతుంది. ఇవి ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో ఉంటాయి. ఒక వేళ మీ ఫోన్‌పై క్రాక్స్ ఉంటే కాయిల్ దెబ్బ తినే అవకాశం ఉంది. అది షార్ట్ సర్క్యూట్‌కి కూడా దారి తీయవచ్చు.
  • ఫోన్ బాగా వేడెక్కినప్పుడు లొకేషన్, బ్లూటూత్ ఆప్షన్లను వెంటనే టర్న్ ఆఫ్ చెయ్యండి. అలాగే స్క్రీన్ బ్రైట్ నెస్‌ను తగ్గించండి. అన్నింటికన్నా ముఖ్యం చాలా అప్లికేషన్లు బ్యాక్ డ్రాప్‌లో పని చేస్తూ ఫోన్ వేడెక్కేందుకు కారణమవుతాయి. బ్యాటరీ కూడా త్వరగా డ్రైన్ అవుతుంటుంది. అటువంటి యాప్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని టర్న్ ఆఫ్ చెయ్యండి.

ఈ కనీస జాగ్రత్తలు పాటిస్తూ మొబైల్, ల్యాప్ ట్యాప్‌లను ఉపయోగిస్తే ప్రమాదలకు వీలైనంత దూరంగా మనం ఉండవచ్చు.

ఎలక్ట్రిక్ బైక్

ఫొటో సోర్స్, ugc

బైక్‌లు ఎందుకు పేలుతున్నాయి?

బైక్‌లలోని లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుంది.

బ్యాటరీని చార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఆవేశపూరిత అయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరొక ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. అయితే, ఈ ఎలక్ట్రోడ్‌ల మధ్య ఉండే ఎలక్ట్రోలైట్ ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. అది కూడా అరుదుగా జరుగుతుంటుంది.

ముఖ్యంగా బ్యాటరీ దెబ్బ తిన్నప్పుడు, విపరీతంగా వేడెక్కినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది.

ఎలక్ట్రిక్ బైక్

ఫొటో సోర్స్, ugc

గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడెప్పుడు జరిగాయి?

టెస్లా కార్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆ బ్రాండ్‌కి చెందిన మోడల్ ఎస్ కారు షాంఘైలో ఓ పార్కింగ్ గ్యారేజీలో ఉండగా ప్రమాదం జరిగింది. తర్వాత ప్రమాదం వెనుక కారణాలను అన్వేషించిన కంపెనీ వాహనం ముందు భాగంలో సింగిల్ బ్యాటరీ మాడ్యూల్ ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించింది.

ఉత్పత్తులను డిజైన్ చెయ్యడంలో తయారీదారులు తగినంత సమయాన్ని తీసుకోవడం లేదని, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షా ప్రమాణాలు నిజ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితులకు తగినట్టు లేవని ఇటీవల ఘటనలపై స్పందిస్తూ ఏథర్ ఎనర్జీ ఫౌండర్ తరుణ్ మెహతా మీడియాతో అన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)