ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయా, ఇండోనేసియా నిర్ణయంతో ఎలాంటి ప్రభావం పడనుంది

భారత్‌లో వంటనూనె ధరలపై ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

వంట కోసం ఉపయోగించే పామోలిన్ నూనె (పామాయిల్)తో పాటు దాని ముడి ఉత్పత్తుల ఎగుమతిని ఏప్రిల్ 28 నుంచి నిషేధిస్తున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ చెప్పారు.

ఈ సమయంలో దేశంలో పామాయిల్ ఉత్పత్తిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. దేశంలో చౌకగా, సమృద్ధిగా పామాయిల్ సరఫరా ఉన్నట్లు నిర్ధరించిన తర్వాతే నిషేధం ఎత్తివేతను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

దేశంలో ఆహారపదార్థాల లభ్యతను నిర్ధరించడమే తన ఉద్దేశమని శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అధ్యక్షుడు జోకో స్పష్టం చేశారు. తదుపరి నిర్ణయం తీసుకునేవరకు పామాయిల్ ఎగుమతిపై నిషేధం అమల్లో ఉంటుందని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇండోనేసియాలో పెద్ద ఎత్తున పామ్ చెట్లను సాగు చేస్తారు. వీటి పండ్ల నుంచే పామాయిల్‌ను తయారు చేస్తారు. వంటనూనెతో పాటు డిటర్జంట్, షాంపూ, టూత్‌పేస్ట్, చాక్లెట్, లిప్‌స్టిక్‌ల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జీవ ఇంధనంలో కూడా దీన్ని వాడతారు.

పామాయిల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండోనేసియా అతిపెద్ద ఎగుమతిదారు. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పామాయిల్ కొరత ఏర్పడింది.

నాస్‌డాక్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఏడాది జనవరి చివర్లో ఇండోనేసియా, పామాయిల్ ఎగుమతులను పరిమితం చేసింది. మార్చిలో దీనిపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. కానీ, అప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి.

వంటనూనె

ఫొటో సోర్స్, Getty Images

రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతోన్న ద్రవ్యోల్బణం కారణంగా ఆహారకొరతను నివారించడానికి తమ పంటలను కాపాడుకోవడానికి చాలా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలుపుతోంది. ఇండోనేసియా తాజా నిర్ణయాన్ని కూడా ఈ కోవకు చెందినట్లుగానే భావిస్తున్నారు.

ఇండోనేసియా నిర్ణయం కారణంగా ఆందోళనలు పెరిగినట్లు ఈ వారంలోనే న్యూస్ ఏషియా చానెల్ ఒక వార్తను ప్రసారం చేసింది. అదే సయమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో సోయాబీన్ ధరలు కూడా పెరిగాయి.

ప్రపంచంలోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ (పొద్దుతిరుగుడు నూనె)ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం యుక్రెయిన్. యుద్ధం కారణంగా యుక్రెయిన్ ఎగుమతులు ప్రభావితం అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.

నల్ల సముద్రం ద్వారానే ప్రపంచంలో 76 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యం జరుగుతుంది. అయితే, యుద్ధం కారణంగా ఈ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ప్రజలు సోయాబీన్, పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

వంటల్లో పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ ఆయిల్‌ను చూస్తున్నారు.

కొన్ని వారాల క్రితమే, ప్రపంచంలోనే అతిపెద్ద వెజిటబుల్ ఆయిల్ ఎగుమతిదారు అర్జెంటీనా... సోయాబీన్ ఆయిల్ ఎగుమతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో పాటు 2021-22లో పండిన పంటల ఎగుమతులపై కూడా నిషేధం విధించింది.

పామాయిల్

ఫొటో సోర్స్, Getty Images

వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఈ ఏడాది మార్చిలో ప్రచురించిన నివేదిక ప్రకారం, సోయాబీన్ ఆయిల్‌ ఎగుమతులపై అర్జెంటీనా 31 శాతం పన్నును విధించింది. ఈ ఏడాది (2021-22) కరవు పరిస్థితుల్లోనూ అర్జెంటీనా 4 కోట్ల టన్నుల సోయాబీన్‌ను ఉత్పత్తి చేసింది.

అర్జెంటీనా ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి సరఫరాదారులు, ఎగుమతిదారులు మాట్లాడుతూ ఇది దేశానికి మంచిది కాదు అని అన్నారు. ఎగుమతులపై నిషేధం విధిస్తే దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతుందని, విదేశీమారక ద్రవ్యం తగ్గిపోతుందని వారు భావించారు. వంటనూనెలను దిగుమతి చేసుకునే దేశాలు అర్జెంటీనాకు ప్రత్యామ్నాయంగా అమెరికా, బ్రెజిల్ వైపు చూస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోన్న దృష్ట్యా, అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచాలని దేశాలకు ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. దీనిద్వారా యుద్ధం ప్రభావాన్ని వాణిజ్యంపై పడకుండా చూసుకోవచ్చని తెలిపింది.

కరోనా కారణంగా ఇప్పటికే సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న దేశాలపై రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో పాటు అర్జెంటీనా, ఇండోనేసియా దేశాల నిర్ణయాలు చాలా ప్రభావం చూపవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో ఎడిబుల్ ఆయిల్ ధరల పెరుగుదలకు దారితీయవచ్చు.

ఈ ఏడాది జనవరిలో దేశంలో పామాయిల్ అమ్మకాలపై ఇండోనేసియా ఆంక్షలు విధించింది. దేశంలో ముడి పామాయిల్‌ను ఒక నిర్దిష్ట పరిమాణంలో, కిలోకు గరిష్టంగా 9300 ఇండోనేసియా రూపాయలకు విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది.

నిక్కీ ఏషియా ప్రకారం, దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరల పెరుగుదల మొదలైంది. గత ఏడాదితో పోలిస్తే ధరలు 40 శాతం వరకు పెరిగాయి. దీని తర్వాత వాణిజ్య మంత్రి మొమమ్మద్ లుఫ్తీ... ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిదారులు అందరూ తమ ఎగుమతుల్లో 20 శాతం దేశంలోనే విక్రయించడాన్ని తప్పనిసరి చేశారు.

పామాయిల్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన నివేదిక ప్రకారం, భారత్ ప్రతీ ఏడాది 1.3 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంది. అందులో 63 శాతం పామాయిల్ ఉంటుంది. ఇందులో అధికభాగం ఇండోనేసియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. మలేసియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి కూడా కొంతస్థాయిలో పామాయిల్‌ను కొనుగోలు చేస్తుంది.

బీఎల్ ఆగ్రో అనేది మలేసియా, ఇండోనేసియా నుంచి భారత్‌లోకి పామాయిల్‌ను దిగుమతి చేసుకునే కంపెనీ. కంపెనీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ఖండేల్‌వాల్, బీబీసీతో మాట్లాడారు. ''భారత్‌లో వినియోగించే మొత్తం ఆయిల్‌లో 65 శాతం కేంద్రం దిగుమతి చేసుకుంటోంది. కేవలం 35 శాతం మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుంది. దిగుమతి చేసుకునే 65 శాతంలో కూడా 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే దీన్ని మిగిలిన నూనెలలో కలుపుతారు. పామాయిల్ దిగుమతులపైనే కేంద్రం ప్రతీ ఏటా రూ. 50,000 కోట్లు ఖర్చు చేస్తోంది'' అని అన్నారు.

ఇండోనేసియా తీసుకున్న నిర్ణయం ఇతర దేశాలను ప్రభావితం చేయవచ్చని, కానీ భారత్‌ను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బిజినెస్ స్టాండర్డ్‌తో సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ డైరెక్టర్ జనరల్ బీవీ మెహతా అన్నారు.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దౌత్యపరమార్గాలను యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, వేరు శెనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఏ నూనె ఆరోగ్యానికి మంచిది

రాబోయే క్లిష్టసమయాలను ఎదుర్కోవడానికి భారత వినియోగదారులు సన్నద్ధం కావాలని 'ద హిందు బిజినెస్‌లైన్' నివేదిక పేర్కొంది.

భారత మార్కెట్ ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని ఆ నివేదికలో చెప్పారు. ఇండోనేసియా నిర్ణయంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు అక్కడ తగ్గుతాయి. కానీ, భారత్‌లో మాత్రం ఆకాశాన్ని తాకుతాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, భారత్‌లోని వర్తకులు టన్ను ఎడిబుల్ ఆయిల్‌కు అదనంగా రూ. 3000 నుంచి రూ. 5000 వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. సోమవారం వాణిజ్య మార్కెట్లు తెరుచుకున్న తర్వాతే దీని ప్రభావం గురించి ఒక అవగాహన వస్తుందని ఒక నిపుణుడిని ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది.

వీడియో క్యాప్షన్, వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)