Murder: ఆమె మృతదేహం పక్కనే ఉన్నా రెండు వారాలపాటు పోలీసులకు ఎందుకు కనిపించలేదు?

ఫొటో సోర్స్, Redes Sociales
- రచయిత, మార్కోస్ గోంజాల్వేజ్ డియాజ్
- హోదా, బీబీసీ ముండో
దాదాపు రెండు వారాలుగా మెక్సికోలో కనపడకుండా పోయిన 18ఏళ్ల డెబానీ ఎస్కోబార్ మృతదేహం లభించినట్లు ఆమె కుటుంబం ధ్రువీకరించింది.
న్యూవో లియోన్ స్టేట్‌లో అదృశ్యం కావడానికి ముందు ఆమె వేసుకున్న బట్టల ఆధారంగా ఆ మృతదేహం ఆమెదేనని ధ్రువీకరించారు. అయితే, ఆమె గుర్తింపును ధ్రువీకరించే డీఎన్‌ఏ పరీక్షల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
‘‘ఆమె మృతికి గల కారణాలు తెలుసుకోవడంలో ఈ పరీక్షలు తోడ్పడతాయి. అయితే, తలకు బలంగా గాయం కావడం వల్లే ఆమె మరణించి ఉండొచ్చని ప్రాథమిక పరీక్షల్లో తేలింది’’అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
అయితే, ఆమె మృతి చుట్టూ ఇప్పటికీ ఎన్నో సందేహాలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి (తెల్లవారితే 9) ఆమె కనిపించకుండా పోయారు. అప్పటినుంచి ఈ కేసుపై మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి.
‘‘ఈ కేసులో నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు’’అని రాష్ట్ర గవర్నర్ శామ్యూల్ గార్సియా అన్నారు. కేసు విచారణ త్వరగా చేపట్టాలని దర్యాప్తు అధికారులకు తాను సూచించినట్లు ఆయన చెప్పారు.
వీలైనంత త్వరగా కేసు విచారణ చేపట్టాలని తాను కూడా అధికారులకు సూచించినట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రేజ్ మాన్యూల్ లోపేజ్ వ్యాఖ్యానించారు.
‘‘ఈ కేసులో చాలా సందేహాలు, ప్రశ్నలు, దోషాలు కనిపిస్తున్నాయి’’అని యునైటెడ్ ఫోర్సెస్ ఫర్ అవర్ డిసప్పియర్డ్ ఇన్ న్యూవో లియోన్ సంస్థ వ్యవస్థాపకురాలు లెటీసియా హిడాల్గో వ్యాఖ్యానించారు.
ఈ కేసును వెంటాడుతున్న కొన్ని ప్రశ్నలు, సందేహాలను ఇప్పుడు చూద్దాం..

ఫొటో సోర్స్, Reuters
1. ఆమె అదృశ్యం కావడానికి కొన్ని మీటర్ల దూరంలోనే మృతదేహం ఉన్నా అధికారులకు ఎందుకు కనిపించలేదు?
మోంటెరీ-న్యూవో లరేడో హైవేపై డెబానీ అదృశ్యం అయ్యారు. అయితే, ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆమె మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ మార్గాన్ని హైవే ఆఫ్ టెర్రర్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కిడ్నాప్‌లు, హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
రోడ్డుకు అనుకున్న ఉన్న ఓ హోటల్ నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ప్రాంతానికి 110 మీటర్ల దూరంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఎదుట డెబానీ చివరిసారిగా కనిపించారు. సీసీటీవీ కెమెరాల్లో ఆమె అక్కడ నిలబడ్డ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఆమె ఫోన్ సిగ్నల్స్ కూడా చివరిసారి అక్కడే కనిపించాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పోలీసులు గాలించారు. ఈ హోటల్ ప్రాంగణాన్ని నాలుగుసార్లు అధికారులు జల్లెడపట్టారు. కానీ, వారికి ఎలాంటి మృతదేహమూ కనిపించలేదు.
అయితే, దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గురువారం పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో మరోసారి గాలించడంతో ట్యాంక్‌లో ఆమె మృతదేహం కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
‘‘ఇది చాలా దారుణం. పక్కనే ఆమె మృతదేహమున్నా అధికారులు కనిపెట్టలేకపోయారు. వారికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఎన్నిసార్లు వారు అక్కడకు వెళ్లారు’’అని డెబానీ తండ్రి మారియో ఎస్కోబార్ ప్రశ్నించారు.
‘‘మా అమ్మాయిని హత్య చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే. నేను న్యాయం జరిగే వరకూ పోరాడతాను’’అని ఆయన అన్నారు.
ఆమె మృతదేహం కనిపించిన చోట తాము ఇదివరకు గాలింపు చేపట్టామని అధికారులు శుక్రవారం చెప్పారు.
‘‘మాతోపాటు డెబానీ కుటుంబం కూడా ఉంది. కానీ, మాకు ఎలాంటి జాడలూ కనిపించలేదు’’అని వారు వివరించారు.
‘‘గాలింపు చర్యల్లో ఎక్కడో తప్పు జరిగింది’’అని న్యూవో లియోన్ సెక్యూరిటీ సెక్రటరీ ఆల్డో ఫాసి చెప్పారు. ఇదివరకు గాలింపు చర్యలు చేపట్టిన బృందంలో తమ బృందంలేదని ఆయన అన్నారు.
‘‘అసలు ఎలా గాలింపు చర్యలు ఎలా చేపడుతున్నారు. హోటల్ సిబ్బంది చెబితే గానీ, వారికి అక్కడ మృతదేహం కనిపించలేదు. ఇది వారి అసమర్థతకు నిదర్శనం’’అని లెటీసియా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
2. మృతదేహాన్ని తర్వాత అక్కడ పడేసారా?
మొదటి నుంచి మృతదేహం అక్కడే ఉండుంటే అధికారులకు ఎందుకు కనిపించలేదని డెబానీ తండ్రి ప్రశ్నిస్తున్నారు.
‘‘నాలుగుసార్లు వారు అక్కడికి వెళ్లారు. ఐదోసారి మాత్రమే వారికి అక్కడ మృతదేహం ఎలా కనిపించింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘మొదట ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృదేహాన్ని అక్కడ పడేశారు. ఇది హత్యే”అని ఆయన అన్నారు.
మరోవైపు గాలింపు చర్యల్లో పాల్గొన్న బుస్కాడోరాస్ డే న్యూవో లియోన్ సంస్థ అధికార ప్రతినిధి లూసియా క్యాస్టెలానోస్ కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
‘‘మేం చాలాసార్లు అక్కడకు వెళ్లాం. దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పాటు అక్కడ గాలించాం. కానీ, మాకు ఏమీ కనిపించలేదు. అక్కడ ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉన్నాయి. అందుకే మృతదేహం పాడై ఉండొచ్చు’’అని ఆమె అన్నారు.
‘‘ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న వారి సంఖ్య కూడా ఎక్కువే. దాదాపు రెండు వారాలపాటు వారు శునకాల సాయంతో ఆ చుట్టుపక్కల వెతికారు. కానీ, ఏమీ కనిపించలేదు’’అని హిడాల్గో చెప్పారు.
అయితే, డెబానీ గోడ ఎక్కి అవతలి వైపు దూకేందుకు ప్రయత్నించారని, ఆ క్రమంలోనే ఆమె నీళ్ల ట్యాంకులో పడిపోయారని కొన్ని వార్తలు వచ్చాయి.
అయితే, అంత ఎత్తు గోడను డెబానీ ఎక్కలేదని ఆమె తండ్రి అన్నారు. అది పూర్తిగా అబద్ధమని చెప్పారు.

ఫొటో సోర్స్, Redes sociales
3. ట్యాక్సీ డ్రైవర్ ఆమెను మధ్యలో ఎందుకు దించేశాడు?
అసలు అంత రాత్రి డెబానీని ట్యాక్సీ డ్రైవర్ మధ్యలోనే ఎందుకు రోడ్డుపై దించేశాడని కూడా ప్రశ్నలు, సందేహాలు వస్తున్నాయి.
ఆ రోజు రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి డెబానీ పార్టీకి వెళ్లారు.
‘‘ట్యాక్సీ యాప్స్ కోసం పనిచేసే ఓ డ్రైవర్ ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమె స్నేహితులు వారి ఇళ్లకు వెళ్లిపోయారు’’అని డెబానీ తల్లిదండ్రులు చెప్పారు.
ఆమె చివరి ఫోటో నిజమైనదేనని ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. ఆ ఫోటోను ట్యాక్సీ డ్రైవర్ తీసి, ఆమె స్నేహితులకు పంపించారు.
అసలు ట్యాక్సీ డ్రైవర్ ఎందుకు ఆ ఫోటో తీశారనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఆమె క్షేమంగా ఉన్నారని చెప్పేందుకే డ్రైవర్ ఆ ఫోటో తీసి ఉండొచ్చని డెబానీ తండ్రి వివరించారు.
అయితే, ఇదివరకు ఆమె ఆ ట్యాక్సీలో ఎక్కలేదు. మరోవైపు తెల్లవారుజామున 4.25 గంటలకు ఆమెను రోడ్డుపై ట్యాక్సీ డ్రైవర్ ఎందుకు దించేశాడు? అనే సందేహాలు వస్తున్నాయి.
అయితే, డెబానీ శరీరాన్ని ఆ డ్రైవర్ అసభ్యంగా తాకుతున్న ఓ వీడియోను తాను చూసినట్లు శుక్రవారం ఆమె తండ్రి వెల్లడించారు. బహుశా అందుకే ఆమె ట్యాక్సీ దిగిపోయి ఉండొచ్చని ఆయన అన్నారు.
ట్యాక్సీ డ్రైవర్‌ను ఇప్పటికే ప్రశ్నించామని అధికారులు తెలిపారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని వివరించారు.

ఫొటో సోర్స్, Redes sociales
ట్యాన్స్‌పోర్ట్ కార్యాలయం ఎదుట చివరిసారిగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల్లో డెబానీ ఎవరితోనే ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. అయితే, ఆ ఫోన్ కలవలేదు.
మరోవైపు తన కుమార్తెను ఒంటరిగా వదిలి వెళ్లిపోవడంపై ఆమె స్నేహితులను కూడా డెబానీ తండ్రి తప్పుపట్టారు.
‘‘స్నేహితులను తప్పుపట్టడం సరికాదు. అలా జరుగుతుందని వారు ఊహించి ఉండరు’’అని హిడాల్గో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉంటే ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి
- ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే
- హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’
- ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














