కర్ణాటక: హిజాబ్, హలాల్, ఆజాన్ తర్వాత ముస్లిం పండ్ల వ్యాపారులను టార్గెట్ చేసిన హిందూ మత సంస్థ శ్రీరామసేన

మామిడి పండ్లు

ఫొటో సోర్స్, NurPhoto

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకకు చెందిన హిందూ మత సంస్థ 'శ్రీరామసేన' ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

మసీదు లౌడ్ స్పీకర్లలో అజాన్ వినిపించడంపై, హలాల్ మాంసంపై నిషేధం విధించాలని ఇదే సమూహం ఇటీవల డిమాండ్ చేసింది. ఇప్పుడు తాజాగా ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

"మామిడి పండ్ల హోల్‌సేల్‌ మార్కెట్‌లో ముస్లిం వ్యాపారులదే ఆధిపత్యం. హిందూ రైతుల దగ్గర వెంటనే పళ్లు కొనకుండా వెయిట్ చేయిస్తారు. తరువాత, చౌక ధరను నిర్ణయించి రాత్రికి రాత్రే కొనేస్తారు" అని శ్రీరామసేన ఆరోపిస్తోంది.

శ్రీరామసేనకు చెందిన సిద్దలింగస్వామి బీబీసీతో మాట్లాడుతూ, "ఇది కోలార్ జిల్లాలోని (రాష్ట్రంలో అతిపెద్ద మామిడి మార్కెట్‌) మామిడి పండ్ల మార్కెట్‌కే పరిమితం కాదు. రాష్ట్రంలోని కూరగాయల మార్కెట్‌లలో కూడా ఇదే పరిస్థితి. ఉదాహరణకు, అలంద్, బీదర్‌ జిల్లాల్లో 50 శాతం వ్యాపారులు ముస్లింలు, 50 శాతం హిందువులు. ముస్లిం వ్యాపారులు, పేద హిందూ మహిళా అమ్మకపుదారులను మార్కెట్ నుంచి బయటకు నెట్టేస్తామని బెదిరించారు" అని చెప్పారు.

2009 జనవరిలో మంగళూరులోని ఒక పబ్‌లో కుటుంబ సమేతంగా వచ్చిన మహిళలపై దాడి చేయడంతో ఈ శ్రీరామసేన సమూహం వెలుగులోకొచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థ అనేక అంశాలపై నిరసనలు చేస్తూనే ఉంది. వాలెంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకంగా కూడా నిరసనలు చేస్తూ ఉంటుంది.

ఈమధ్య పండ్లు, కూరగాయల మార్కెట్‌లో హిందువుల సంఖ్య పెంచే దిశలో ప్రచారాలను నిర్వహిస్తోంది. అక్కడ ముస్లింల సంఖ్య పెరిగిపోయిందని, హిందువుల సంఖ్య పెరగాలని వాదిస్తోంది.

ముస్లింలు హిజాబ్ గురించి వివాదం తీసుకొచ్చారు కాబట్టే మేం హలాల్ మాంసం గురించి నిరసనలు తెలిపామని శ్రీరామసేన నాయకుడు ప్రమోద్ ముత్తాలిక్ బీబీసీతో అన్నారు.

"వాళ్లు హిజాబ్ వివాదంలో కోర్టుకెక్కారు. తీర్పు వచ్చిన తరువాత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అడుగులు వేశారు. హైకోర్టు తీర్పునే వ్యతిరేకించారు. మేం కేవలం వారి చర్యలనే వ్యతిరేకిస్తున్నాం" అని చెప్పారు.

ప్రమోద్ ముత్తాలిక్

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, ప్రమోద్ ముత్తాలిక్

తాజా వివాదంపై కోలార్ పండ్ల వ్యాపారుల అసహనం

మసీదులలో లౌడ్ స్పీకర్లు పెట్టి అజాను వినిపించడంపై శ్రీరామసేన చాలాకాలంగా పోరాటం చేస్తోందని ముత్తాలిక్ చెప్పారు.

"జిల్లా డిప్యూటీ కమిషనర్‌లకు అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. మసీదులపై చర్యలు తీసుకోవాలని, అజానుపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాం" అని ఆయన చెప్పారు.

ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, డెసిబల్ స్థాయి గురించి హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలుచేయాలని అన్నారు. తమ ఆదేశాలను ఎంతవరకు పాటిస్తున్నారనే దానిపై రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కూడా కోర్టు చెప్పిందని తెలిపారు.

కాగా, తాజాగా ముస్లిం మామిడి పండ్ల వ్యాపారుల గురించి చెలరేగిన వివాదంపై కోలార్ జిల్లా మామిడి గ్రోవర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోలార్ ప్రాంతంలో అన్ని రకాల మామిడి పండ్లను పండిస్తారు. తోటాపరి, మాలిగా, నీలం, కేసర్, మల్గోవా, రాస్పురి, సిందూరి, బాదామి, అల్ఫోన్సో మొదలైనవి పండిస్తారు. ఇక్కడి నుంచి రైలులోని ప్రత్యేక బోగీల ద్వారా ఈ మామిడి పండ్లు దిల్లీ సహ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటాయి.

ముస్లిం వ్యాపారులు ఎక్కువగా ఉంటే నష్టమేమిటని మామిడి గ్రోవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలత్తూరు చినప్ప రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

"ఈ ప్రాంతంలో ముస్లిం వ్యాపారులు ఎక్కువగా ఉంటే ఏమి? ఇది వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న వ్యాపారం. అందుకే వాళ్ల సంఖ్య ఎక్కువ. దీనివాల్ల ఎవరికి ఏం నష్టం? మీరూ రండి, వ్యాపారం చేసుకోండి. ఎవరు వద్దన్నారు? ముస్లింలెవరైనా మిమ్మల్ని అడ్డుకున్నారా? కోలార్ జిల్లాలో మేమంతా ఒకటే. ముస్లిం, హిందూ వ్యాపారులు అన్నదమ్ములా కలిసిమెలిసి వ్యాపారం చేసుకుంటారు. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. మేం కలిసే వ్యాపారాలు చేసుకుంటాం" అని చినప్ప రెడ్డి బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

'మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు'

"మా రైతులకు ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య. వ్యాపారులకు లాభాలు ఉంటాయి, అది నిజమే. అయితే, వాళ్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఎవరైనా కావొచ్చు. హిందూ యువకులు వచ్చి వ్యాపారం చేసుకోండి. మా రైతులకు మంచి ధర ఇవ్వండి. మార్కెట్‌లో పోటీని సృష్టించండి. మాకేం అభ్యంతరం లేదు. వీళ్లు ఎప్పుడైనా రైతుల గురించి ఏవైనా ఆందోళనలు చేశారా? ఎవరి పట్లా ఎలాంటి వివక్షా చూపాల్సిన అవసరం లేదు. మార్కెట్ అందరికీ తెరిచే ఉంటుంది. అందరికీ వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. రైతు అయినా, హిందూ యువకుడైనా లేదా ఇంకెవరైనా సరే" అని రెడ్డి అన్నారు.

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఏటా ఎనిమిది నుంచి పది వేల టన్నుల మామిడి పండుతుంది.

"ఇక్కడ ఉన్న వ్యాపారుల్లో సుమారు 60 శాతం ముస్లింలు, 40 శాతం హిందువులు ఉన్నారు. మా మధ్య ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేవు. ప్రతిదాన్ని మత కోణం నుంచి చూసేవారు రెండు వర్గాలలోనూ ఉంటారు. కానీ మా మధ్య అలాంటి విభేదాలేం లేవు. మేమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నాం" అని మామిడి పండ్ల వ్యాపారి ముస్తఫా షరీఫ్ అన్నారు.

మామిడి పండ్ల సీజను రాగానే వ్యాపారులు తోటలకు వెళ్లి రైతులకు 50 నుంచి 100 శాతం అడ్వాన్స్ ఇస్తారు. పంట కోతకు వచ్చాక మొత్తం పండ్లను రైతులు వ్యాపారులకు అప్పగిస్తారని షరీఫ్ చెప్పారు.

హలాల్

ఫొటో సోర్స్, PA Media

హలాల్ మాంసానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం విఫలం

ఇదిలా ఉండగా, హలాల్ మాంసం కొనవద్దని శ్రీరామసేన ఇచ్చిన పిలుపును మెజారిటీ హిందువులు పట్టించుకోలేదు. మునుపటిలాగే మాంసం దుకాణాల ముందు క్యూలు కట్టారు.

కర్ణాటకలో ఉగాదికి ముందు రోజు మాంసం తిని సంబారలు చేసుకోవడం ఆనవాయితీ. ఆరోజు మాంసం దుకాణాల ముందు ప్రజలు క్యూలు కట్టారు.

హలాల్ మాంసం దుకాణం బయట క్యూలో నిల్చున్న ఒక వ్యక్తితో బీబీసీ మాట్లాడింది. ఆ వ్యక్తి తన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

"ఏం ఎప్పుడూ ఈ దుకాణం నుంచే మాంసం కొనుక్కుంటాం. అది హలాలా కాదా అని చూడం. అమ్మేవారి మతమేమిటో కూడా మేమెప్పుడూ అడగలేదు. మాంసం తాజాగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఈ దుకాణంలో ఎప్పుడూ తాజా మాంసం దొరుకుతుంది" అని ఆ వ్యక్తి చెప్పారు.

హలాల్ మాంసానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం విఫలం కావడంపై ముత్తాలిక్ స్పందిస్తూ, "కనీసం మేం ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాం. 100 శాతం విజయం సాధిస్తామని ఆశించలేదు. హలాల్ మాంసం కోసం అల్లా పేరుతో జంతువులను వధిస్తారు. అలాంటి మాంసం హిందువులు తినకూడదనే అవగాహన కలిగించాలనుకున్నాం" అని అన్నారు.

హలాల్

ఫొటో సోర్స్, Getty Images

అజాన్ విషయమేంటి?

సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, రాజకీయ వర్గాల్లో, ముస్లింలలో ఇది చర్చనీయాంశమైంది.

మసీదు నుంచి వినిపించే అజాను శబ్దం 60 డెసిబుల్స్‌కు మించకూడదని కోర్టు చెప్పింది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కోర్టు నిషేధం విధించింది.

ఫిబ్రవరిలో బెంగుళూరు పోలీసులు 310 సంస్థలకు కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. వీటిలో 125 మసీదులు, 83 దేవాలయాలు, 22 చర్చిలు, 59 పబ్బులు, బార్‌లు ఉన్నాయి. 12 పరిశ్రమలకు కూడా నోటీసులు ఇచ్చారు.

"ముస్లింలను వేరు చేయడానికి చేపడుతున్న చర్యలను అడ్డుకోవాలంటే కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించడం అవసరం" అని రాజకీయ విశ్లేషకుడు, మైసూర్ విశ్వవిద్యాలయంఅఒ డీన్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ముసాఫిర్ అసదీ అన్నారు.

విద్యావంతులైన ముస్లిం వర్గాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది.

"మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాను వినిపించడం అవసరామా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గరా మొబైల్ ఫోను ఉన్నప్పుడు. అజాను ఉద్దేశమేమిటంటే, ప్రార్థనకు టైం అయిందని ముస్లింలకు గుర్తుచేయడమే" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ముస్లిం అధికారి అన్నారు.

"లౌడ్ స్పీకర్లో అజాను వినిపించడం అంటే ఇతరులను వేధించే హక్కు మనకుందని కాదు. దీని గురించి మా ప్రజలు ఆలోచించాలి" అని ఒక రిటైర్డ్ ముస్లిం టీచర్ అన్నారు.

మసీదుకొచ్చి ప్రార్థనలు చేసేవారందరికీ మొబైల్‌లో రిమైండర్ పంపించవచ్చని, అజాను మసీదు ప్రాంగణంలో మాత్రమే వినబడేలా పెట్టవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి.

मस्जिद के बाहर लगे लाउडस्पीकर

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ ప్రభావం ఉంటుందా?

ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ విశ్లేషకులు మరో కోణం నుంచి చూస్తున్నారు.

"ఇక్కడ ఛాందసవాద శక్తులే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్నది స్పష్టం. రోజుకో కొత్త ఫత్వా జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై తన బడ్జెట్ ప్రసంగంలో పట్టు పరిశ్రమలో పనిచేసేవారికి పదివేల రూపాయల సబ్సిడీని ప్రకటించడం మీరు గమనించి ఉంటారు. ఈ పరిశ్రమలో అధికులు ముస్లింలే. కానీ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ముస్లిం అన్న మాట వాడలేదు. మరో ముఖ్యమంత్రి అయితే ఇలా చేస్తారా? ఆయన చాలా భయపడుతున్నారు" అని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర రేష్మే అన్నారు.

అయితే, ఈ ప్రచారాలేవీ కర్ణాటకను హిందూ రాష్ట్రంగా మార్చలేవని ప్రొఫెసర్ ముసాఫిర్ అసదీ అభిప్రాయపడ్డారు.

"కర్ణాటకలో ఇప్పటకీ కులా విభజనదే ఆధిపత్యం. మొత్తం రాష్ట్రాన్ని హిందుత్వ కిందకు తీసుకురావడం అంత సులువు కాదు. ఇక్కడ వివిధ కులాలకు వివిధ సామాజిక, రాజకీయ అస్తిత్వాలున్నాయి. 80 vs 20 లాంటి బైనరీ విభజన (ఉత్తర్‌ప్రదేశ్ లాగ) ఇక్కడ తీసుకురావడం అంత సులభం కాదు. స్థానికంగా హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు మతాల మధ్య గొడవలు జరిగిన చరిత్ర లేదు. ముస్లిం పండ్ల వ్యాపారులకు తొలగించడం, హలాల్ మాంసాన్ని పక్కకుబెట్టి, మార్కెట్ మొత్తం జట్కా మాంసం నింపేయడం సులభం కాదు" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)