అల్ ఖైదా చీఫ్ అల్-జవహిరి: 'అల్లా-హు అక్బర్' అని నినదించిన కర్ణాటక ముస్లిం యువతిపై ప్రశంసలు

ఫొటో సోర్స్, AL-QAEDA
తీవ్రవాద సంస్థ అల్ ఖైదా తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ సంస్థ అధినేత అయ్‌మాన్ అల్-జవహిరి బతికే ఉన్నట్లు ఆ వీడియోలో తెలుస్తోంది.
2011 మే 2న అమెరికా బలగాల చేతిలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హతమైన తరువాత, అయ్‌మాన్ అల్-జవహిరిని అల్ ఖైదా చీఫ్‌గా నియమించారు.
డాక్టర్ అయ్‌మాన్ అల్-జవహిరి చాలా సంవత్సరాల పాటు ఒసామా బిన్ లాడెన్‌కు డిప్యూటీగా పనిచేశారు. 9/11 దాడుల వెనుక బ్రెయిన్ అల్-జవహిరిదేనని భావిస్తారు.
తాజాగా అల్ ఖైదా విడుదల చేసిన వీడియోలో, కర్ణాటకకు చెందిన ముస్కాన్ ఖాన్ అనే విద్యార్థిపై అల్ జవహిరి ప్రశంసలు కురిపించారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం తరువాత ముస్కాన్ ఖాన్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, VIRAL VIDEO
ముస్కాన్ ఖాన్‌పై ప్రశంసలు
2020 చివరలో అయ్‌మాన్ అల్-జవహిరి బాగా జబ్బుపడ్డట్టు, మరణించినట్టు వార్తలు వచ్చాయి.
తాజా వీడియోను అల్ ఖైదా ఏప్రిల్ 5న విడుదల చేసింది. కర్ణాటకలో ఫిబ్రవరి 8న జరిగిన ఒక సంఘటన గురించి అయ్‌మాన్ అల్-జవహిరి ఈ వీడియోలో మాట్లాడారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదిరిన సందర్భంలో ముస్కాన్ ఖాన్ అనే విద్యార్థిని హిందూ కార్యకర్తల ముందు 'అల్లా-హు అక్బర్' అని అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అల్ ఖైదా విడుదల చేసిన ఈ వీడియోలో 'ఇండియాస్ నోబెల్ వుమెన్' అని ఆంగ్లంలో రాసి ఉంది. ముస్కాన్ ఖాన్ ఆత్మవిశ్వాసాన్ని అయ్‌మాన్ అల్-జవహిరి కొనియాడారు.
దాదాపు 8.45 నిముషాలున్న ఈ వీడియోలో అల్-జవహిరి మంచి ఆరోగ్యంతో కనిపిస్తున్నారు.
ఇందులో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ గతంలో ఆయన వీడియోలలో కనిపించినదానికన్నా భిన్నంగా ఉంది. కాబట్టి ఇది ఇటీవల షూట్ చేసినదేనని, పాత వీడియో కాదని తెలుస్తోంది.
అల్ ఖైదాకు చెందిన అల్-షబాబ్ మీడియా సెల్ ద్వారా దీన్ని రిలీజ్ చేశారు. టెలిగ్రామ్, రాకెట్ చాట్ అకౌంట్లలో షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్కాన్ ఖాన్ ఎవరు?
ముస్కాన్ ఖాన్ కర్ణాటకలో మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు.
హిజాబ్ వివాదం సందర్భంగా ముస్కాన్ ఖాన్ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆమె హిజాబ్ ధరించి తన క్లాస్ వైపు వెళ్తుండగా కాషాయ కండువాలు ధరించిన కొందరు యువకులు 'జై శ్రీరాం' నినాదాలు చేస్తూ ఆమె వైపు రావడం, ఆ తరువాత ఆమె రెండు చేతులు పైకెత్తి 'అల్లా-హు-అక్బర్' అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
''నేను 'అల్లా-హు-అక్బర్' అని అన్నాను. ఎందుకంటే నేను చాలా భయపడ్డాను. నాకు భయం వేసినప్పుడు అల్లా పేరు తలుచుకుంటాను'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆరోజు ఏం జరిగిందో బీబీసీకి వివరించారు ముస్కాన్ ఖాన్.
"నాకేం తెలియదు. నేను రోజూ కాలేజీకి వెళ్తాను. ఆ రోజు కూడా వెళ్లాను. నేను బురఖాలో కాలేజీ లోపలికి వెళ్లకూడదని బయటి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు నాతో చెప్పారు. కాలేజీ లోపలికి వెళ్లాలంటే బురఖా, హిజాబ్ తీసేయాలని అన్నారు. బురఖా ఉంచుకోవాలనుకుంటే ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు.
కానీ నేను లోపలికి వెళ్లాను. నేను మౌనంగా క్లాసుకు వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ అక్కడ చాలా మంది 'జైశ్రీరాం' నినాదాలు చేస్తున్నారు.
నేను క్లాసుకు వెళ్దామనే అనుకున్నాను. కానీ ఆ అబ్బాయిలు నాపై దాడి చేసే మాదిరిగా నా వెనకే వచ్చారు. వాళ్లు 40 మంది ఉన్నారు. నేను ఒక్కదాన్నే. వాళ్లలో మానవత్వం కనిపించలేదు. అకస్మాత్తుగా ఒకరు నా ముందుకొచ్చి నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కొందరు కాషాయ కండువాలు వేసుకుని ఉన్నారు.
వాళ్లు నా ముందుకొచ్చి 'జై శ్రీరాం', 'వెనక్కి వెళ్లు', 'బురఖా తీసేయ్' వంటి నినాదాలు చేశారు.
నేను ఇంటర్‌లో జాయిన్ అయినప్పటి నుంచి బురఖా వేసుకుంటున్నా. కాలేజీలో ఎలాంటి సమస్య లేదు. ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. హిజాబ్ వేసుకుని క్లాసుకు వెళ్తాం. క్లాసులో మేం బురఖా వేసుకోం. మేం హిజాబ్ మాత్రమే వేసుకుంటాం.
కానీ వాళ్లు నన్ను కాలేజీ ఆవరణలో కూడా అడుగుపెట్టనివ్వలేదు. వారిలో చాలా మంది బయటి వాళ్లు ఉన్నారు. వారిలో కొందరు కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది బయటి నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.
హిజాబ్ ధరించొచ్చని స్వయంగా మా కాలేజీ ప్రిన్సిపాలే చెప్పారు. బయటి వ్యక్తులు వచ్చి దీన్నొక వివాదంగా మారుస్తున్నారు. ఇదివరకు మీరు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలాగే రండని స్వయంగా ప్రిన్సిపాలే మాతో చెప్పారు. కాలేజీలో ఎలాంటి సమస్య లేదు. వాళ్లే ఇక్కడికొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు.
నా విజ్ఞప్తి ఒక్కటే. నేను ఇక్కడ ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టడం లేదు. నా చదువు, నా హక్కుల కోసం నేను నినదించాను. మాకు చదువు కావాలి. మా ప్రిన్సిపాల్, టీచర్లు మాకు అండగా ఉన్నారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ వివాదం సృష్టిస్తున్నారు" అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన 79 ఏళ్ల పుష్ప ముంజియాల్ ఎవరు?
- వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?
- పాకిస్తాన్లో దేశద్రోహం అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?
- డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, ఈ నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















