భారత్‌లో మహిళలు మద్యానికి బానిస అవుతున్నారా? ఈ వ్యసనం నుంచి బయటపడటం ఎలా?

మద్యం సేవిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

ప్రేరణకు (పేరు మార్చాం) 16ఏళ్ల లోపే మద్యం, మాదక ద్రవ్యాలు అలవాటయ్యాయి. ఒక సారి స్కూలుకు స్పృహ లేని స్థితిలో వెళ్లడంతో ఆమెను ఇంటికి పంపించారు.

ఆమె స్పృహలో లేనప్పుడు లైంగిక వేధింపులకు కూడా గురయింది. తల్లితండ్రులు చికిత్స ఇప్పించేందుకు ఆమెను చాలా పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళ్లారు. అక్కడామె 3 నుంచి 6 నెలల వరకు ఉండేవారు.

కానీ, అక్కడ నుంచి వచ్చిన మరో రెండు నెలల్లోనే తిరిగి మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతూ ఉండేవారు.

ఒకసారి తల్లితండ్రులతో దూకుడుగా ప్రవర్తించి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయారు.

ప్రేరణకు చాలా పునరావాస కేంద్రాల్లో చికిత్స అందించిన తర్వాత ఆమె తల్లితండ్రులు బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్)లోని అడిక్షన్ మెడిసిన్ ఫర్ విమెన్ కేంద్రానికి తీసుకొచ్చారు.

ఇది అంత సులభం కాలేదు. చికిత్స చేయించిన ప్రతి సారి ఆమె కోలుకున్నట్లే ఉండేది. కానీ, తిరిగి వ్యసనానికి లోనయ్యేది.

ఆమె సాధారణ స్థితికి చేరడం ఒక్క సారిగా జరగలేదు. ఐదేళ్ల పాటు సాధారణ చికిత్స, మానసిక నిపుణులతో సంప్రదింపుల తర్వాత ఆమె చదువు పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు.

వీడియో క్యాప్షన్, మందు తాగితే డీఎన్ఏ పాడవుతుందా?

ఆ తర్వాత ఆమెపై చదువుల కోసం యూకే వెళ్లారు. ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగానికి చేరారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉన్నఆమె తండ్రి సొంత కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడూ మద్యం సేవిస్తూ ఉంటారు. కానీ, గతంలోలా దానికి బానిస కాదు.

కానీ, ఈ మద్యం సేవించడం ఉన్నత వర్గాలకు చెందిన వారికో, మహిళలకు మాత్రమో పరిమితం కాదు.

సంగీత (పేరు మార్చాం) కు 12ఏళ్ళు ఉండగా పెళ్లి అయింది. ఆమె భర్త చేతిలో విపరీతమైన మానసిక, శారీరక వేధింపులకు గురయ్యేది.

ఆమె భర్త ఆమెకు మద్యాన్ని కూడా అలవాటు చేశారు. ఆయన కుటుంబానికి మద్యం సేవించే అలవాటు ఉంది. భర్తకు కంపెనీ ఇచ్చేందుకు మద్యం సేవించడం మొదలుపెట్టింది. కానీ, భర్త నుంచి ఎదురయ్యే వేధింపులను ఎదుర్కోవడానికి మద్యం మాత్రమే మార్గం అని భావించి మద్యానికి పూర్తిగా బానిస అయింది.

ఇంతలో ఆమె భర్త మద్యం అలవాటును మానుకున్నారు. ఆమెను తాగుబోతు అనడం మొదలుపెట్టి తాగడం మానమని ఒత్తిడి చేశారు. మద్యం సేవించడం ఆపగానే ఆమెకు వణుకు, మూర్ఛ రావడం మొదలయింది.

ఈ కేసును చూసిన డాక్టర్లు రోగి వివరాలు బయటపెట్టకుండా కేసు వివరాలు వెల్లడించారు.

మద్యం సేవిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, మద్యానికి బానిసైన మహిళలకు కూడా చికిత్స అందించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

భారతదేశంలో మహిళలు మద్యం సేవించడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటే అయినప్పటికీ అమ్మాయిలు మద్యం సేవించడాన్ని తప్పుగానే చూస్తారు.

"భారతదేశంలో మహిళలు మద్యం సేవించడాన్ని ఘోరమైన తప్పుగా చూస్తారు. ఇలాంటి భావన ఉండటంతో సంగీత లాంటి వారు చికిత్స తీసుకోవడానికి గాని, సహాయం ఆశించడానికి గాని సంశయిస్తారు. దీంతో, పరిస్థితి విషమించిన తర్వాత డాక్టర్ల దగ్గరకు చికిత్స కోసం వస్తారు" అని నిమ్హాన్స్‌లో సెంటర్ ఫర్ అడిక్షన్ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ వివేక్ బెనెగల్ చెప్పారు.

మద్యం సేవిస్తున్న మహిళలు

ఫొటో సోర్స్, MONKEYBUSINESSIMAGES

భారతదేశంలో మహిళల మద్యం అలవాట్లు

భారతదేశంలో పురుషులతో పోలిస్తే, మద్యాన్ని సేవించే మహిళలు పశ్చిమ దేశాల కంటే తక్కువగా ఉంటారు.

భారతదేశంలో సుమారు 30 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తారు. మద్యం సేవించే మహిళల సంఖ్య 5% కంటే తక్కువగానే ఉంటుంది. ఇది కూడా ప్రధానంగా మధ్య తరగతి లేదా ఎగువ తరగతి వారిలో ఉంటుంది.

కానీ, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కంటే మద్యం సేవించే మహిళలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ జనాభాలో 70% పురుషులు మద్యం సేవిస్తే, 10-11% మంది మహిళలు మాత్రమే మద్యం సేవిస్తారు.

కానీ, ఇక్కడ సమస్య మద్యం సేవించే వారి సంఖ్యతో కాదు. మహిళలు మద్యం సేవించే విధానం, దాని వల్ల వారి ఆరోగ్యం మీద పడే ప్రభావం కూడా ఆందోళన కలిగించే విషయాలని డీఅడిక్షన్ నిపుణులు చెబుతున్నారు. .

భారతదేశంలో మహిళలకున్న మద్యం అలవాట్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జెండర్, ఆల్కహాల్ అండ్ కల్చర్ గురించి 2016లో అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో నిమ్హాన్స్ కూడా పాల్గొంది.

ఈ అధ్యయనం మహిళలు మద్యం సేవించడంలో రెండు విధాలైన తీరుతెన్నులను తెలియచేసింది.

వీడియో క్యాప్షన్, మద్యం తాగితే సంతాన సామర్థ్యం తగ్గుతుందా?

పురుషులతో సమానంగా మహిళలు కూడా తాగడం ఒక అంశం.

"పురుషుల తరహాలో మహిళలు కూడా ఐదు రకాల మద్యాన్ని సేవిస్తున్నారని చెప్పడం కొత్తగా ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. అక్కడ మహిళలు ఘాటైన మద్యం ఎక్కువగా తీసుకోరు. తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే వోడ్కా, జిన్, వైన్, బీర్ లాంటివి తీసుకుంటూ ఉంటారు" అని ప్రొఫెసర్ బెనెగల్ చెప్పారు.

పశ్చిమ దేశాల్లో ఆహారంతో పాటుగా మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. భారతదేశంలో తిండి తినడానికి ముందు మద్యం సేవిస్తారు. ఇక్కడ ముఖ్యంగా మత్తు కోసం మద్యం సేవిస్తూ ఉంటారు.

నగర ప్రాంతాల్లో మహిళలు పూర్తిగా మత్తు ఎక్కేవరకూ మద్యం సేవిస్తూ ఉంటారని ఈ అధ్యయనం తెలిపింది.

"పురుషులు సంతోషంగా ఉండేందుకు మద్యం సేవిస్తుంటే, మహిళలు మాత్రం వారికొచ్చే ప్రతికూల ఆలోచనలకు స్వీయ చికిత్సగా మద్యం సేవిస్తూ ఉంటారు" అని ఈ అధ్యయనం తెలిపింది.

"ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మద్యానికి బానిసవ్వడం సరైన పద్ధతి కాదు" అని ప్రొఫెసర్ బెనెగల్ అన్నారు.

కానీ, మద్యం సేవించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

మద్యం సేవిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఆల్కహాల్‌తో అనారోగ్య సమస్యలు

మద్యం సేవించే వారికి శారీరక, మానసిక సమస్యలతో పాటు సామాజిక ఆర్ధిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముంది.

"పురుషులతో పోలిస్తే మహిళల శారీరక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. పురుషుల కంటే మహిళల శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. స్త్రీ హార్మోన్లు ఆల్కహాల్‌ను గ్రహించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది" అని బెనెగల్ చెప్పారు.

"ముఖ్యంలో స్త్రీలలో ఉండే హార్మోన్లు ఆల్కహాల్‌ను శరీరంలో త్వరగా గ్రహించవు. దీంతో మెటాబాలిజమ్ తగ్గిపోతుంది. ఇవి మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి"

మానసిక సమస్యలు తలెత్తినప్పుడు, పురుషుల నుంచి కూడా సామాజికంగా ఆమెకు సహకారం లభించదు.

"అమ్మాయిలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం లాంటివి చేస్తారు. ఇతరుల చేతిలో మోసాలకు గురవుతూ ఉంటారు. దేశంలోని సాంఘిక ఆర్ధిక రాజకీయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు ఈ పరిస్థితి నుంచి బయటపడటం మరింత కష్టమవుతుంది. కానీ, వారికి కూడా సరైన పరిస్థితులను కల్పించగల్గితే, చికిత్స సులభమవుతుంది" అని ప్రొఫెసర్ బెనెగల్ చెప్పారు.

మద్యం సేవిస్తున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

మద్యం సేవించే వారంతా బానిస అవుతారా?

అవ్వరు. మద్యం సేవించే వారంతా దానికి బానిస అవ్వరు. మద్యం సేవించే 30% మంది పురుషుల్లో 5% నుంచి 10% మంది మాత్రమే వ్యసనానికి లోనవుతారు. మహిళల్లో వ్యసనానికి గురయ్యేవారు 5% కంటే తక్కువగా ఉంటారు.

వ్యసనం బారిన పడేందుకు వ్యక్తుల స్వభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తమ స్వభావం, మూడ్‌ని నియంత్రణలో ఉంచుకోలేని వారితో సమస్య ఉంటుంది. ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం, ప్రతి దానికి స్పందించడం చేసేవారు కూడా త్వరగా కోలుకోలేరు.

చిన్న వయసులోనే మద్యం సేవించడానికి అలవాటు పడినవారు వ్యసనానికి లోనయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిస్‌ఆర్డర్ (ఏడిహెచ్‌డి), కండక్ట్ డిస్‌ఆర్డర్ ఉన్న వారు కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉంటారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్వీయ చికిత్స కోసం తీసుకోవడం మొదలుపెట్టి నెమ్మదిగా వ్యసనానికి లోనవుతారు.

వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా మెదడులో మార్పులు కలిగి వ్యసనానికి లోనయ్యే స్థితికి దారి తీస్తాయి.

"చికిత్స తీసుకున్న తర్వాత కూడా తిరిగి అలవాటు పడతారు. ఇది అపెండిసైటిస్ ను తొలగించడమో లేదా విరిగిన ఎముకలను సరిచేయడమో కాదు" అని బెనెగల్ అన్నారు.

"కానీ, వీటికి కూడా చికిత్స చేయవచ్చు" అని చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఆల్కహాల్ సేవించడం ఒక సమస్యా?

కాదనే అంటారు ప్రొఫెసర్ బెనెగల్.

"తప్పు చేసేది ఆల్కహాల్ కాదు. కొంత మంది ఆల్కహాల్‌ను కోలుకునేందుకు ఒక వ్యూహంగా చూస్తారు.

"ఆల్కహాల్‌ను జీవితం నుంచి తప్పించేయడం వల్ల వారి సమస్య పరిష్కారమవ్వదు. వారిని నియంత్రణలో ఉంచుకోలేకపోవడం, ప్రతిస్పందించడం, ఆలోచనలను గుర్తించలేకపోవడమే వారికున్న ప్రధాన సమస్య. వీటిని పరిష్కరించేంత వరకూ వారు తిరిగి మద్యానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూనే ఉంటారు" అని ప్రొఫెసర్ బెనెగల్ చెప్పారు.

"ఆల్కహాల్‌ను దూరం చేసి, లేదా పునరావాస కేంద్రాల్లో చికిత్స చేయించి మద్యం వ్యసనాన్ని మాన్పించలేరు. దీని వల్ల వారు జీవితాంతం వ్యసనం నుంచి బయటపడలేరు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)