ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు: రెండోసారి గెలిచిన మేక్రాన్.. చరిత్రాత్మక విజయమే కానీ దేశాన్ని రెండుగా చీల్చేశారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హఫ్ స్కొఫీల్డ్
- హోదా, బీబీసీ న్యూస్, పారిస్
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి లీ పెన్‌పై సాధించిన ఈ విజయంతో మేక్రాన్ మరో అయిదేళ్ల పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
58.55 శాతం ఓట్లతో మేక్రాన్ విజయం సాధించగా ఓటమి పాలైన మరీన్ లీ పెన్‌కు 41.45 శాతం ఓట్లు వచ్చాయి.
అయితే, రైట్ వింగ్ అభ్యర్థులలో మునుపెవ్వరూ సాధించనన్ని ఓట్లు లీ పెన్ సాధించారు.
'ఫిఫ్త్ రిపబ్లిక్'గా పిలిచే ఫ్రాన్స్ ప్రస్తుత గణతంత్ర పాలక విధానంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడే రెండోసారి ఎన్నిక కావడం ఇదే ప్రథమం.
ఇంతకుముందు 1988లో ఫ్రాంకోసిస్ మిట్టరాండ్, 2002లో జాక్వెస్ చిరాక్ కూడా అధ్యక్ష స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ ఎన్నికలు జరిగే సమయంలో వారు విపక్షంలో ఉన్నారు.
ఈ రెండు సందర్భాలలోనూ మధ్యంతర ఎన్నికల కారణంగా వాస్తవ ప్రభుత్వం అధ్యక్షుల రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఉంది.
అధ్యక్ష కార్యాలయంలో ఉన్నప్పటికీ మిట్టరాండ్, చిరాక్‌లు అప్పటికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితినే వారు ఎన్నికలలో గెలుపు కోసం ఉపయోగించుకున్నారు.
ఇక 1965లో అధ్యక్ష పీఠమెక్కిన చార్లెస్ గాలె విషయానికొస్తే ఆయన్ను ప్రజలు ఎన్నుకోలేదు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆధునిక ఫ్రాన్స్‌లో పూర్తికాలం పదవిలో ఉండి స్వదేశీ, విదేశీ విధానాలన్నీ అనుకున్నట్లుగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని మరోసారి గెలుచుకున్న అధ్యక్షుడు మేక్రాన్.
అయితే, ఫ్రాన్స్ ప్రజలు, ప్రభుత్వం మధ్య దీర్ఘకాలిక సంబంధాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇదేమీ చెప్పుకోదగ్గ ఘనత కాదు.
కాగా, మేక్రాన్ విజయం వెనుక అనేక అంశాలు చర్చలో ఉన్నాయి.
సోషల్ మీడియాలో కనిపించే రూపం కాకుండా దాని వెనుక వేరే భావనలున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. అహంకారపూరితంగా ఉండే పారిస్ సంపన్నులు, ఆగ్రహంతో రగిలిపోయే ప్రాంతీయ సమూహాలతో పాటు మేక్రాన్ ఏమీ చెడ్డ అధ్యక్షుడు కాదని గట్టిగా నమ్మే కోట్ల మంది మధ్యతరగతి ఫ్రెంచ్ ప్రజలు ఈ ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు.
ఫ్రాన్స్‌లో ఇకపై నిరుద్యోగం అనేది రాజకీయ సమస్య కాదన్నది వీరందరి మాట. ఈ విషయంలో ఈ వర్గాల నుంచి మేక్రాన్ అభినందనలు అందుకున్నారు. అంతేకాదు, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ మేక్రాన్ సమర్థంగా వ్యవహరించారన్నది వీరి అభిప్రాయం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించడమూ సరైన చర్యేనని, అది తప్పనిసరి అని వీరంతా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక అంతర్జాతీయ వేదికలపైగా స్థాయికి మించి పట్టు సాధించే నాయకుడిగా మేక్రాన్‌ను అభివర్ణిస్తున్నారు వీరంతా.
పుతిన్ వంటి నేతలతో ఉన్నదున్నట్లుగా మాట్లాడే స్థాయి నాయకుడు ఎలిసీ(ఫ్రాన్స్ అధ్యక్ష భవనం)లో ఉండడం గొప్ప విషయమని, నిష్ఫలమని తెలిసినా పుతిన్‌కు చెప్పాల్సింది సూటిగా చెప్పిన నేత మేక్రాన్ అని ఈ వర్గాలు సంతోషిస్తున్నాయి.
ఇక ప్రాంతీయ రాజకీయాలకు వచ్చేసరికి మేక్రాన్ నాయకత్వంలోని ఫ్రాన్స్ యూరప్‌ను నడిపించగలదనీ అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
ఈ విషయంలో మేక్రాన్ ప్రత్యర్థి లీ పెన్ తేలిపోతారు.
మేక్రాన్ విధానాలు, అంతర్జాతీయ వ్యవహారాలలో ఆయన తీరును ప్రశంసిస్తున్న వీరంతా విడిగా మేక్రాన్‌ను ఇష్టపడకపోవచ్చు. ఆయన పూర్తిగా భిన్నమైన నేత అయినప్పటికీ ప్రజల నుంచి గౌరవం సంపాదించుకున్నారు.
మేక్రాన్‌లోని రెండో కోణం మాత్రం సమస్యాత్మకమైనది. ఈ కోణం విషయంలోనే అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
అయిదేళ్ల కిందట ఆధునిక రాజకీయ స్థితితో మేక్రాన్ తెలివిగా రాజకీయ జూదమాడారు.
ఫిఫ్త్ రిపబ్లిక్‌లోని పరోక్ష అధికారాలను అమలు చేస్తూ అధ్యక్ష కేంద్రకంగా బలమైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. దీని ద్వారా ఆయన సంప్రదాయ, సామాజిక ప్రజాస్వామ్యవాదుల ప్రాబల్యానికి అడ్డుకట్ట వేశారు.
దీంతో విపక్షాలు అటు పూర్తిగా లెఫ్ట్ కానీ, రైట్ వింగ్ కానీ అన్నట్లుగా మిగిలిపోయాయి. మేక్రాన్ అధికారాలకు వారు ఏమాత్రం ముప్పుగా పరిణమించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికలలో ప్రస్ఫుటమైన ఫలితాలను చూస్తే మేక్రాన్‌కు ఆమోదం కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ ఎన్నికలు మరో అంశాన్నీ ప్రస్ఫుటించాయి. ఫ్రాన్స్‌లో మరింత మంది ప్రజలు ఇప్పుడు అతివాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
మేక్రాన్ విప్లవం విజయవంతం కావడంతో ఆయన్ను వ్యతిరేకించి ముందుకెళ్లడానికి వారికి మార్గం లేకుండా పోయింది.
వామపక్ష అభ్యర్థి జీన్ లూస్ మెలెంచాన్‌ను బలపరిచిన ఇలాంటి లక్షలాది మంది ఓటర్లు ఇప్పుడు అధ్యక్షుడిగా గెలిచిన మేక్రాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.
జూన్‌లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో తమ సత్తా నిరూపించుకుని మేక్రాన్‌కు బదులు తీర్చుకోవాలని వారంతా భావిస్తున్నారు.
ఇది అనుకున్నట్లుగా జరగకపోతే ఆ తరువాత సెప్టెంబరులో వీధుల్లోకి వచ్చి మేక్రాన్ వ్యతిరేక ప్రదర్శనలకు దిగాలని అనుకుంటున్నారు.
అప్పటికి కనుక మేక్రాన్ మరో విడత సంస్కరణలకు తెర తీస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కొత్త తరహా పాలనతో ఈ రెండో టర్మ్‌ను మేక్రాన్ ప్రారంభిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. నయం చేయాల్సిన గాయాలున్నాయని ఆయనకు తెలుసు కాబట్టి సమస్యలను వింటూ పాలన సాగించే అవకాశం ఉంది.
కానీ, గతంలోనూ ఇలాగే చెప్పిన మేక్రాన్‌ను ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నదే ప్రశ్న.
''ఇంతకు ముందు ఎన్నికలలో ఎవరు గెలిచినా మొత్తం ఫ్రాన్స్‌కు అధ్యక్షుడిగా వారిని ప్రజలు గుర్తించేవారు. కానీ, ఈసారి అలా ఉంటుందో లేదో నేను చెప్పలేను'' అన్నారు రాజకీయ విశ్లేషకులు నటాషా పొలోనీ.
ఇవి కూడా చదవండి:
- ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయా
- ‘ఈ భూమిపై అత్యంత అద్భుతమైన సంస్కృతి’ భారత్‌లో ఉన్నా.. అది భారతీయులందరికీ ఎందుకు తెలియట్లేదు?
- భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి పెళ్లి చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే
- భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ముగ్గురు బ్రిటిష్ మహిళల కథ
- టిప్పు సుల్తాన్: ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకుల విజయాన్ని వర్ణించే పెయింటింగ్ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













