భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి వివాహం చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే

హత్యాకాండ జరిగిన 14 ఏళ్ల తర్వాత ఆల్ఫ్రెడ్, యాంకురిజే వివాహం జరిగింది
ఫొటో క్యాప్షన్, హత్యాకాండ జరిగిన 14 ఏళ్ల తర్వాత ఆల్ఫ్రెడ్, యాంకురిజే వివాహం జరిగింది
    • రచయిత, బుసియానా
    • హోదా, బీబీసీ న్యూస్, కిగాలీ

బాధ నుంచి బయటపడాలంటే ప్రేమించాలి. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ మహిళ.. 28 ఏళ్ల కిందట తన భర్తను చంపిన వ్యక్తిని క్షమించడమే కాకుండా... ఆ వ్యక్తి కుమార్తెను తన కోడలిగా అంగీకరించారు.

1994లో రువాండాలో జరిగిన సామూహిక హత్యాకాండతో చీలిక ఏర్పడిన సమాజంలో సయోధ్య కుదర్చడానికి క్యాథలిక్ చర్చి చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా బెర్నడిటే ముకాకబెరా తన కథను చెబుతున్నారు.

ఆనాటి హత్యాకాండలో 100 రోజుల్లో 8 లక్షల మంది ప్రజలను చంపివేశారు.

''గతంలో జరిగిన దానితో మా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. వారు ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఏదీ ఆపకూడదు'' అని బీబీసీతో బెర్నడిటే చెప్పారు.

1994 ఏప్రిల్ 6న హుటూ వర్గానికి చెందిన రువాండా అధ్యక్షుని విమానం కూల్చివేత ఘటన నేపథ్యంలో టుట్సీ కమ్యూనిటీ లక్ష్యంగా దాడులు జరిగాయి. బెర్నడిటే, ఆమె భర్త కబేరా వేడాస్టే కూడా ఈ తెగకు చెందినవారే.

విమానం కూలిన కొన్ని గంటల్లోనే వేలాదిమంది హుటూ వర్గీయులు, దేశంలోని టుట్సీ ప్రజలపై దాడులను ప్రారంభించారు.

వీరిలో ఒకరు గ్రేటియన్ న్యామినాని. ఈయన కుటుంబం, బెర్నెడిటే కుటుంబానికి పొరుగునే నివసించేది. పశ్చిమ రువాండాలోని ముషాకాలో నివసించే ఈ రెండూ రైతు కుటుంబాలే.

ఈ ఊచకోత తర్వాత టుట్సీ తిరుగుబాటు బృందం అధికారంలోకి వచ్చింది. ఈ హత్యలతో సంబంధం ఉందని ఆరోపణలు ఉన్న వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.

హత్యాకాండ అనుమానితులను విచారించడానికి 'గకాకా' అనే కోర్టులను ఏర్పాటు చేశారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హత్యాకాండ అనుమానితులను విచారించడానికి ‘గకాకా’ అనే కోర్టులను ఏర్పాటు చేశారు

ఇందులో భాగంగా గ్రేటియన్‌ను కూడా నిర్బంధించారు. ఆయనను 'గకాకా' అని పిలిచే కమ్యూనిటీ కోర్టు విచారించింది. సామూహిక హత్యాకాండ అనుమానితులను విచారించడానికి ఈ తరహా కోర్టులను ఏర్పాటు చేశారు.

వారంవారం జరిగే ఈ విచారణలో నిందితులతో మాట్లాడే అవకాశం కమ్యూనిటీలకు లభిస్తుంది. విచారణ సందర్భంగా, ఘటన సమయంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే అంశంలో ఇరువైపుల వారు తమ వాదనలను, సాక్ష్యాలను అందిస్తారు.

2004లో విచారణ సందర్భంగా గ్రేటియన్, బెర్నెడిటేతో ఆమె భర్తను ఎలా చంపాడో చెప్పి క్షమించమని అడిగారు. ఆమె కూడా ఆయనను క్షమించాలని నిర్ణయించుకున్నారు.

అంటే, ఆయన 19 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ, దానికి బదులుగా రెండేళ్ల పాటు కమ్యూనిటీ సర్వీసు శిక్షను విధించారు.

కోడలు యాంకురిజే (ఎడమ)తో బెర్నడిటే
ఫొటో క్యాప్షన్, కోడలు యాంకురిజే (ఎడమ)తో బెర్నడిటే

'నేను సహాయపడాలి అనుకున్నా'

బహిరంగ క్షమాపణలు చెప్పే కంటే ముందు గ్రేటియన్, 10 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయనను క్షమించాలంటూ బెర్నెడిటేతో పాటు ఆమె కుమారుడు ఆల్ఫ్రెడ్‌ను గ్రేటియన్ కుటుంబ సభ్యులు కోరారు. తండ్రి చనిపోయినప్పుడు ఆల్ఫ్రెడ్ వయస్సు 14 సంవత్సరాలు.

మారణహోమం జరిగిన సమయంలో గ్రేటియన్ కుమార్తె యాంకురిజే డొనాటా వయస్సు తొమ్మిదేళ్లు. ఆమె, బెర్నాడెట్ ఇంటికి వెళ్లి చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం ప్రారంభించారు.

''ఆల్ఫ్రెడ్ తల్లికి ఇంటి పనుల్లో పొలం పనుల్లో సహాయం చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఆమెకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఆమె భర్త హత్యకు కారణం నా తండ్రి అనే సంగతి నాకు తెలుసు'' అని బీబీసీతో డొనాటా చెప్పారు.

''తన తల్లికి సహాయ పడుతుండటం చూసి ఆల్ఫ్రెడ్ నన్ను ప్రేమించి ఉంటారు'' అని ఆమె అన్నారు.

డొనాటా చూపించే ప్రేమతో బెర్నాడిటే కదిలిపోయారు. ''నా భర్తను తన తండ్రి చంపాడని ఆమెకు తెలుసు. నాకు సహాయంగా ఎవరూ లేరని కూడా ఆమెకు తెలుసు. అప్పుడు నా కుమారుడు బోర్డింగ్ స్కూల్‌లో చదువుకునేవాడు. ఆమె మంచి మనస్సు, ప్రవర్తన నాకు నచ్చింది. అందుకే, తనతో నా కుమారుడి వివాహానికి నేను అడ్డుచెప్పలేదు'' అని బెర్నడిటే వివరించారు.

కానీ, గ్రేటియన్‌ తొలుత ఈ వివాహ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఈ సంబంధంపై సందేహాన్ని వ్యక్తం చేశారు.

''తాను ఎంతో బాధపెట్టిన ఒక కుటుంబం, తన కుమార్తెను ఎందుకు కోడలిగా చేసుకోవాలి అనుకుంటుంది అని ఆయన ఎప్పుడూ అనేవారు'' అని డొనాటా చెప్పారు.

చివరకు బెర్నడిటే, తనకు యాంకురిజే పట్ల ఎలాంటి ద్వేషం, కోపం లేదని స్పష్టంగా చెప్పడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. వారిద్దరిని ఆశీర్వదించారు.

''తన తండ్రి చేసిన పనికి నా కోడలిపై నాకు ఎలాంటి కోపం లేదు. అందరికన్నా ఎక్కువగా తనే నన్ను బాగా అర్థం చేసుకుంది. తను ఒక మంచి కోడలు కాగలదు అని నాకు అనిపించింది. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని నా కుమారుడిని ఒప్పించాను'' అని బెర్నడిటే వివరించారు.

2008లో స్థానిక క్యాథలిక్ చర్చిలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఇక్కడే గ్రేటియన్ కూడా తాను చేసిన తప్పుకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అంతకుముందే రెండేళ్ల కమ్యూనిటీ సర్వీసు శిక్షను పూర్తి చేశారు.

బెర్నడిటే, ఆల్ఫ్రెడ్, యాంకురిజే, గ్రేటియన్ (వరుసగా ఎడమ నుంచి కుడికి)
ఫొటో క్యాప్షన్, బెర్నడిటే, ఆల్ఫ్రెడ్, యాంకురిజే, గ్రేటియన్ (వరుసగా ఎడమ నుంచి కుడికి)

సయోధ్య కోసం...

ఆ ప్రాంతంలోని కమ్యూనిటీల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడానికి ఈ క్యాథలిక్ చర్చి ప్రధానంగా ప్రయత్నిస్తోంది.

సయోధ్య కుదిర్చేందుకు తాము ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు ఆమోదించారని చర్చి ఫాదర్ ఎన్‌గోబోకా థియోజిని చెప్పారు.

''సామూహిక హత్యాకాండ నేరాల్లో నిందితులకు, బాధిత కుటుంబాలతో సయోధ్య కుదుర్చుకునే వరకు మతపర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదు'' అని పాదర్ వివరించారు.

నిందితులకు, బాధితులకు మధ్య తుది రాజీ ప్రక్రియ అందరి సమక్షంలో జరుగుతుంది. ''బాధితులు తమ చేతులను నిందితుడి వైపుకు చాపుతారు. ఇది, వారిని క్షమిస్తున్నట్లు చెప్పడానికి ఒక సూచిక'' అని ఫాదర్ చెప్పారు.

ఈ హత్యాకాండ జరిగి 28 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మషాకాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొన్నారు. కలిసి జీవించే మార్గాలను తెలుసుకోవడానికి వారంతా అక్కడికి చేరుకున్నారు. గ్రేటియన్ మరణించిన కొన్ని రోజులకే ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలోనే తన భర్తను చంపిన వ్యక్తి కూతురితో, తన కుమారుని వివాహం గురించి బెర్నడిటే మాట్లాడారు.

''నా కోడలు అంటే నాకు చాలా ఇష్టం. నా భర్త చనిపోయాక ఆమె నాకు సహాయంగా లేకపోయుంటే నేనెలా ఉండేదాన్నో నాకు తెలియదు'' అని ఆమె అన్నారు.

ఆల్ఫ్రెడ్, యాంకురిజేల ప్రేమకథ చాలా మందిని క్షమాపణ కోరడానికి ప్రోత్సహించిందని ఆమె చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)