హనుమాన్ చాలీసా ఎప్పుడు రాశారు? దీని వెనుక చరిత్ర ఏమిటి?

హనుమాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉత్పల్ పాఠక్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం ముదురుతోంది. మసీదుల ఎదుట లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను వినిపిస్తామని నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చెప్పారు.

హనుమాన్ జయంతినాడు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని కూడా రాజ్ ఠాక్రే ఏర్పాటుచేశారు.

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానా కూడా మరో వివాదానికి తెరతీశారు.

ముస్లిం వ్యతిరేక రాజకీయాలకు హనుమాన్ చాలీసాను కొందరు ఉపయోగించుకుంటున్నారనే వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి.

ఇంతకీ దీన్ని ఎప్పుడు రాశారు? దీని వెనుక చరిత్ర ఏమిటి?

తులసీ దాస్

ఫొటో సోర్స్, utpal pathak

ఫొటో క్యాప్షన్, తులసీ దాస్

‘‘అక్బర్ మాటను తోసిపుచ్చిన తులసీదాస్’’

హనుమాన్ చాలీసాను 500 ఏళ్ల క్రితం ప్రముఖ కవుల్లో ఒకరైన తులసీ దాస్ రచించారు. వారణాసిలో ఆయన సంకటమోచన్ మందిర్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం బాధ్యతలను డాక్టర్ విశ్వంభరనాథ్ మిశ్ర పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుత హనుమాన్ చాలీసా వివాదంపై మిశ్ర మాట్లాడారు.

‘‘తులసీ దాస్.. ముస్లింలకు వ్యతిరేకంగా రచనలు చేశారా? హనుమాన్ చాలీసా రాసేటప్పుడు ఆయన మనసులో మెదిలిన ఆలోచనలు ఏమిటి?’’ అనే అంశాలపై మిశ్ర స్పందించారు.

వీడియో క్యాప్షన్, గుడిమల్లం: విశిష్ట లింగాకారంతో పూజలందుకుంటున్న ప్రాచీన ఆలయం

‘‘మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలోనే తులసీ దాస్ కూడా జీవించారు. వీరిద్దరి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్బర్ తన నవరత్నాల్లో చేరమని తులసీ దాస్‌ను కోరారు. కానీ, తులసీ దాస్ దాన్ని తిరస్కరించారు’’ అని మిశ్ర చెప్పారు.

‘‘మొఘల్ పాలనా కాలంలోనే హనుమాన్ చాలీసాను రాశారు. మొఘల్ పాలనా కాలం నాటి పరిస్థితులు మనకు తెలుసు’’అని మిశ్ర వివరించారు.

‘‘తులసీ దాస్‌ను కలిసేందుకు ఒకసారి అక్బర్ కూడా తులసీ ఘాట్‌కు వచ్చినట్లు ఒక పెయింటింగ్‌ ద్వారా తెలుస్తోంది. అక్బర్ తన నవరత్నాల్లో ఒకరిగా తులసీ దాస్‌ను చూడాలని అనుకున్నారు. అయితే, తనను తాను రాముడికి అంకితం చేసుకున్నానని, తాను రాలేనని తులసీ దాస్ వివరించారు. దీనికి అక్బర్ కూడా అంగీకరించారు’’అని మిశ్ర వివరించారు.

వారణాసిలోని తులసీ దాస్ మందిరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారణాసిలోని తులసీ దాస్ మందిరం

తులసీ దాస్ ముస్లింలకు వ్యతిరేకంగా రచనలు చేశారా?

‘‘ప్రస్తుతం హనుమాన్ చాలీసా చుట్టూ చాలా వివాదాలు రాజుకుంటున్నాయి. దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా తులసీ దాస్ రాసినట్లు కొందరు చెబుతున్నారు. కానీ, ఆ మాట నిజం కాదు’’ అని మిశ్ర స్పష్టం చేశారు.

‘‘అసలు హనుమాన్ చాలీసాపై అలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. మొఘల్ పాలనా కాలంలో రామ్‌లీలా లాంటి ఓపెన్ థియేటర్ ప్రదర్శనల కోసం తులసీ దాస్ రచనలు చేశారు. అప్పటి సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేది. అయితే, తులసీ దాస్ వారి ఆధిపత్యాన్ని తిరస్కరించారు. తను కేవలం రాముడికి మాత్రమే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇక్కడ మీకు ముస్లింలపై వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తోంది?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘మనం అందరినీ సంతోషపెట్టలేం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరి అభిప్రాయాలనూ గౌరవించాలి. కానీ, ఇలా హనుమాన్ చాలీసాతో వివాదాలు చేయడం శోచనీయం. వారి ఆలోచనల్లోనే తప్పుంది’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

తులసీ ఘాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తులసీ ఘాట్

హనుమాన్ చాలీసా ఇచ్చే సందేశం ఏమిటి?

‘‘ప్రపంచంలోని జీవ రాశులన్నింటినీ రాముడే సృష్టించాడు. మనుషులకు మాత్రం అదనంగా జ్ఞానం, తెలివిని కూడా ఇచ్చాడు. అయితే, మనుషులు తమ బుర్రలో పుట్టిన ఆలోచనలతో తారతమ్యాలు, భేదాలు సృష్టించుకుంటున్నారు. వీటిని తొలగించాలని దేవుణ్ని కోరేందుకు ఈ చాలీసా ఉంది’’ అని మిశ్ర చెప్పారు.

‘‘మనం శాశ్వతంగా ఉండిపోవడానికి ఈ ప్రపంచంలోకి రాలేదు. మనం సంకుచితంగా ఆలోచించకూడదు’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు

‘‘తులసీ దాస్ చాలా భిన్నమైన వారు. ఆయన విద్యాభ్యాసం వారణాసిలోనే జరిగింది. రాముడి గురించి అధ్యయనం చేసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడే ఉంటూ ఆయన రాముడి కథలను చెప్పేవారు. అలా క్రమంగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది’’ అని మిశ్ర చెప్పారు.

‘‘అయితే, ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు ద్వేషంతో రగిలిపోయేవారు. ఆయన్ను హింసలకు గురిచేయడం కూడా మొదలుపెట్టారు.

బాగా అలసిపోయిన తలసీ దాస్ ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. చివరగా వారణాసి శివార్లలోని అస్సీ ఘాట్ అనే ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ రాముడి కథలు చెప్పడానికి ఆయన నగరానికి వచ్చేవారు’’ అని మిశ్ర వివరించారు.

(ఈ కథనంలోని వ్యక్తుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)