స్వలింగ సంపర్కులను ఖైదు చేసేందుకే కట్టిన కూమా జైలు... అది దాచిన చీకటి రహస్యాలు

ఫొటో సోర్స్, The Greatest Menace
- రచయిత, గేరీ నన్
- హోదా, బీబీసీ సిడ్నీ
కూమా జైలు ఒక చీకటి రహస్యాన్ని తనలోనే దాచి పెట్టుకుంది.
స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించి, ఆ నేరాలను చేసేవారిని నిర్బంధించేందుకు 1957లో ఈ జైలును తిరిగి తెరిచారు. స్వలింగ సంపర్కాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ జైలును ఒక మానవ ప్రయోగశాలగా ఉపయోగించారని కూడా చెబుతారు.
ప్రపంచంలో స్వలింగ సంపర్కుల కోసం ఆస్ట్రేలియాలోని ఒక చిన్న పట్టణంలో ఏర్పాటు చేసిన ఒకే ఒక్క జైలు కూమా జైలు అని చెబుతారు. ఈ జైలులో స్వలింగ సంపర్క ఖైదీలను వేరుగా ఎందుకుంచారో ఇప్పటికీ తెలియదని కొంత మంది జైలు సిబ్బంది చెబుతారు.
ఈ జైలులో లెస్ స్ట్రెలెకీ 1979లో కస్టోడియల్ సర్వీసెస్ ఆఫిసర్‌గా చేరారు. ఆ తర్వాత కూమాలో కరెక్టివ్ సర్వీసెస్ మ్యూజియం ప్రారంభించారు. అక్కడకు ఖైదీలను భద్రత కోసమే పంపేవారని ఆయన భావించేవారు.
"కూమా చాలా సురక్షితమైన వ్యవస్థ. మేము స్వలింగ సంపర్క ఖైదీలకు ఎన్/ఏ 'నాన్ అసోసియేషన్ విత్ మెయిన్ స్ట్రీమ్ ప్రిజన్స్' (ప్రధాన జైళ్లతో సంబంధం లేని వారు) అని ఎర్రని స్టాంప్ వేసేవాళ్ళం అని బీబీసీకి చెప్పారు. సిడ్నీలో ఉన్న పెద్ద పెద్ద జైళ్లలో వారు హింసకు గురయ్యే ముప్పు ఎక్కువగా ఉండేది" అని చెప్పారు.
కానీ, ఈ జైలు అసలు లక్ష్యం వేరే ఉందని మరొక మాజీ ఉద్యోగి క్లిఫ్ న్యూ అన్నారు.
"ఈ జైలును 1957లో పునః ప్రారంభించిన తర్వాత అక్కడికి మానసిక నిపుణులు, వైద్యులు తరచుగా రావడం మొదలుపెట్టడం అన్నిటి కంటే పెద్ద సమస్యగా ఉండేది" అని అన్నారు.
ఇవన్నీ ఖైదీలను మార్చేందుకు చేసే ప్రయత్నాలుగా ఆయన భావిస్తారు. "వారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నించేవారు. వాళ్ళని మార్చేయగలమనే నమ్మకం వారికుండేది."
"ఇక్కడ ఖైదీలు సింగిల్ సెల్స్‌లో ఉండేవారు. ఇద్దరిని ఒకే జైలు గదిలో పెట్టే వీలుండేది కాదు. వారిని కాపలా కాయడమే మాకు పెద్ద సమస్యగా ఉండేది" అని న్యూ చెప్పారు. ఇప్పుడాయన వయసు 94 సంవత్సరాలు.

ఫొటో సోర్స్, Thomas McCoy
ఈ జైలును న్యూ సౌత్ వేల్స్ జస్టిస్ మంత్రి రెగ్ డౌనింగ్ ఏర్పాటు చేసినట్లు చారిత్రక పత్రాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ఆయన పెట్ ప్రాజెక్ట్ గా చెప్పుకుని గర్వపడేవారని 1957లో సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. స్వలింగ సంపర్కులను ప్రధాన జైళ్ల నుంచి వేరు చేసి ఉంచే జైళ్లు యూరప్, అమెరికాలలో ఎక్కడా లేవని కూడా ఆయన చెప్పారు.
ప్రపంచంలోనే ఖైదీలకు శిక్ష విధించే ఒకే ఒక్క సంస్థ కూమా జైలు అని 1958లో డౌనింగ్ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది.
దీనిని స్వలింగ సంపర్క సంబంధిత నేరాలు చేసినవారికి మాత్రమే వినియోగిస్తాం అని ప్రకటించారు.
స్వలింగ సంపర్కులుగా ఉన్నందుకు, సంబంధిత పనులు చేసిన వారిని కూమా జైలులో బంధించేవారు. 1984 వరకు ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించేవారు.
1955లో కొత్తగా విధించిన కఠినమైన చట్టాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొన్నాయి. ఈ నేరాన్ని రూపుమాపేందుకు చట్టాలు అవసరమని అధికారులు భావించేవారు. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసుల పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండేది.
"ఈ చట్టం ద్వారాఒక పురుషుడు మరొక పురుషునితో మాట్లాడుతున్నట్లు కనిపించినా కూడా బంధించే అవకాశాన్ని కల్పించారు" అని చరిత్రకారులు గ్యారీ వోధర్ స్పూన్ బీబీసీకి చెప్పారు. చట్టంలో తీసుకొచ్చిన ఈ మార్పులు స్వలింగ సంపర్కుల స్వేచ్చ పై విస్తృతంగా దాడి చేసేవిగా తయారయ్యాయి.
అసహజ లైంగిక సంబంధాలకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించేవారు. అందుకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష ఉండేది. ఇందుకు వ్యక్తుల పరస్పర అంగీకారం ఉన్నా లేకపోయినా కూడా ఒకటే శిక్షను విధించేవారు.

ఫొటో సోర్స్, State Library of NSW
అయితే, ఈ జైళ్లలో ఉండే పురుషులు స్వలింగ సంపర్కానికి పాల్పడే విధంగా పోలీసులు ప్రేరేపించేవారని వోథర్ స్పూన్ పాడ్ కాస్ట్ కోసం సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి.
"ఆకర్షణీయంగా కనిపించే పోలీసులను పంపించి స్వలింగ సంపర్కులను పబ్లిక్ టాయ్ లెట్లలో సెక్స్ చేసేందుకు రెచ్చగొట్టేవారు" అని వోథర్‌స్పూన్ చెప్పారు.
స్వలింగ సంపర్కులుగా మారేందుకు కారణాలు, దానికి చేయాల్సిన చికిత్స గురించి తెలుసుకునేందుకు ఇంక్వైరీ కమిటీని నియమిస్తున్నట్లు 1958లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. వైద్య, మానసిక, పెనాలజీ నిపుణులు, సామాజిక కార్యకర్తలను ఈ కమిటీలో భాగం చేసినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
అందులో ఇద్దరు మతాధికారులు, ఇద్దరు పీనల్ సిబ్బంది, సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు అధ్యాపకులను నియమించింది.
కూమా జైలును స్వలింగ సంపర్క నేరస్థులను బంధించేందుకు ఏర్పాటు చేసిన జైలుగా పేర్కొంది. ఈ కమిటీ విచారణకు జైలు అవకాశం కల్పించాలని కోరింది.
ఈ సమస్యకు శాస్త్రీయ విశ్లేషణ, అందుకు సాధ్యమయ్యే పరిష్కారం లభించిన తర్వాత ఈ సమస్యను ప్రభుత్వం మరింత దృఢంగా ఎదుర్కొంటుందని డౌనింగ్ చెప్పినట్లు కూడా ఆ ప్రకటనలో ఉంది.
మానసిక నిపుణులు "మీ అమ్మ మీపై చూపించే అధికారం వల్ల అమ్మాయిల పట్ల అయిష్టం పెంచుకున్నారా?" వంటి ప్రశ్నలను అడిగి తల్లులు అతిగా ప్రవర్తించడం వల్లే స్వలింగ సంపర్కానికి కారణమని తేల్చినట్లు పాడ్ కాస్ట్ ప్రొడ్యూసర్ ప్యాట్రిక్ అబౌద్ చెప్పారు.
ఆయన కొన్నేళ్ల పాటు ఈ జైలు గురించి పరిశోధన చేశారు.
"స్వలింగ సంపర్కులను సమాజం నుంచి రూపుమాపేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుసు. ఆ జైలులో ఉన్న స్వలింగ సంపర్కులు తోటి వారితో సంబంధాలను ఏర్పరచుకోవడం కొనసాగింది. జైలులో ఉన్న తమ సహచరులను కలుసుకునేందుకు ఒక్కొక్కసారి నేరాలు చేసి జైలుకు తిరిగి వెళ్లిన వారు కూడా ఉన్నారు.
అయితే, దీనికి సంబంధించిన పూర్తి నివేదిక బయటపడలేదు. "ఇది తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం" అని ప్యాట్రిక్ అన్నారు.
వోథర్‌స్పూన్ ప్యాట్రిక్ వాదనతో అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కూమాకు స్వలింగ సంపర్కులను ఎప్పటి నుంచి పంపించడం మానేశారో స్పష్టంగా తెలియదు.
"దీనికి సంబంధించిన ఆర్క్ హైవ్స్ ను తొలగించడం లేదా ధ్వంసం చేయడం గాని జరిగింది" అని వోథర్ స్పూన్ చెప్పారు.
ఇవి చారిత్రకమైనవనే నెపంతో ఈ ఆరోపణల పై ఆస్ట్రేలియా కరెక్టివ్ సర్వీసెస్, ఎన్‌ఎస్‌డబ్ల్యూ కమ్మూనిటీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పేందుకు అంగీకరించలేదు.
1980ల ప్రారంభం వరకూ స్వలింగ సంపర్క ఖైదీలను ఈ జైలుకు పంపిస్తూ ఉండేవారని అబౌద్ అంటారు.
వీరి పట్ల అవలంబించిన విధానం 1982లో కూడా అమలులో ఉన్నట్లు కరెక్టివ్ సర్వీసెస్ మంత్రి చేసిన ప్రకటనను ఇందుకు ఆధారంగా చెప్పారు.
"లైంగిక నేరాలకు పాల్పడిన వారిని కూడా కూమా జైలుకు పంపించేవారు. ఇది స్వలింగ సంపర్కులను మరింత న్యూనతకు గురయ్యేలా చేసింది" అని అబౌద్ చెప్పారు.
ఇటీవల ఆస్ట్రేలియా పార్లమెంటులో మతపరమైన వివక్షకు సంబంధించిన బిల్లు పై చోటు చేసుకున్న చర్చ వివిధ లైంగిక ఆసక్తులు ఉన్న వారి పట్ల వివక్ష చూపించే వారిని బెదిరిస్తోంది. ఈ చట్టం ఇంత తాజా చరిత్ర ఉన్న ఈ అంశం పై కూడా ఒక సున్నితమైన హెచ్చరిక చేస్తోంది.
"మనం తిరోగమన దిశలో నడవకుండా ఉండాలంటే అంతులేని పర్యవేక్షణ అవసరం" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గాంధీకి విపరీతమైన లైంగిక వాంఛలుండేవా? భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఈ బ్రిటిష్ మహిళలు ఏం చెప్పారు
- టైటానిక్: ‘దేవుడు కూడా ముంచేయలేడు’ అనుకున్న నౌక మునిగిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటంటే
- హోటల్ నీళ్ల ట్యాంకులో అమ్మాయి మృతదేహం.. పడిపోయిందా లేక చంపేసి పడేశారా?
- జమ్ములోని ఈ గ్రామం ప్రత్యేకత ఏంటి? మోదీ ఇక్కడికే ఎందుకు వెళ్తున్నారు?
- చైనా చివరి చక్రవర్తి తోటమాలిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













