భూత్ మేళా: అక్కడ దెయ్యాన్ని పావురంలో పెట్టి బయటకు వెళ్లగొడతారట

పట్టిన దెయ్యానికి వదిలించుకునేందుకు భూత్ మేళాకు వస్తున్నామని ఇక్కడికి వచ్చేవారు చెబుతుంటారు

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, పట్టిన దెయ్యానికి వదిలించుకునేందుకు భూత్ మేళాకు వస్తున్నామని ఇక్కడికి వచ్చేవారు చెబుతుంటారు
    • రచయిత, ఆనంద్ దత్
    • హోదా, బీబీసీ కోసం

అది ఝార్ఖండ్‌ లోని పాలము జిల్లా. మిట్ట మధ్యాహ్నం. ఎండ మండి పోతోంది. అక్కడ పిడకలతో వేసిన మంట ఎర్రగా మండుతోంది. అప్పుడే ఎవరో ఆ మంట మీద కొబ్బరికాయ, బియ్యం వేశారు.

మరోవైపు ఒకరు అక్కడున్న ఒక నల్ల మేకకు ఎర్రటి బొట్టు పెడుతున్నారు. ఓ మహిళ శరీరానికి దారం చుడుతున్నారు. అదే సమయంలో, ఒక మాంత్రికుడు మంత్రాలు పఠిస్తూ అన్నంలో మాంసం కలుపుతున్నారు. అక్కడ కూర్చున్న స్త్రీలు కొందరు కోడిపిల్లలను పట్టుకుని తమ వంతు కోసం వేచి ఉన్నారు.

అక్కడికి వచ్చిన వ్యక్తులు చాలామంది తమ శరీరంలోకి దెయ్యం ప్రవేశించినట్లు నమ్ముతున్నారు. చికిత్స కోసం వారంతా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ 'భూత్ మేళా' జరుగుతోంది.

ఈ జాతర ఝార్ఖండ్ రాష్ట్ర పోలీసు అధికారుల కళ్ల ముందే జరుగుతుంటుంది. ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం, గత ఏడేళ్లలో దెయ్యాలు పట్టడానికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 231 మంది మరణించారు. వీరిలో ఎక్కువమంది మహిళలే.

ఒక వ్యక్తికి దెయ్యం పట్టడానికి కారణమెవరో ఇక్కడి తాంత్రికులు చెబుతుంటారు

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, ఒక వ్యక్తికి దెయ్యం పట్టడానికి కారణమెవరో ఇక్కడి తాంత్రికులు చెబుతుంటారు

ఈ భూత్ మేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఈ జాతర గత కొన్ని దశాబ్దాలుగా చైతీ నవరాత్రుల సమయంలో జరుగుతోంది. రాంచీ జిల్లా కేంద్రానికి 252 కి.మీ దూరంలోని పాలము జిల్లా హైదర్‌నగర్‌ కు ప్రతిరోజు వేలసంఖ్యలో ప్రజలు వస్తూ పోతూ ఉండేవారు.

ఈ కార్యక్రమంలో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు పోలీసులు కూడా మోహరిస్తుంటారు.

ఇక్కడ ఇలాంటి మేళా జరుగుతుందని తాను మొదటిసారి విన్నానని పాలము డివిజనల్ కమీషనర్ జటాశంకర్ చౌధరి అన్నారు.

మరోవైపు, 21వ శతాబ్దంలో ఇలాంటి కార్యక్రమం జరగకూడదని రాంచీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైకియాట్రీ అండ్ అలైడ్ సైన్స్ (రిన్‌పాస్) డైరెక్టర్ డాక్టర్ సుభాష్ సోరెన్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, రామభక్తుడైన రావిపూడి హేతువాది

ఈ మేళాలో భూత వైద్యుని ముందు ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె మెడ వణికి పోతోంది. ఓజా(తాంత్రికుడు) వచ్చి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి పేరు అడిగితే ఆయన చెప్పలేదు.

తన పేరు పాండేజీ అని మాత్రమే చెప్పారు. యూపీలోని బనారస్ నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ మహిళకు దెయ్యం పూనిందని ఆయన అన్నారు. అందుకే ఆమె అలా ఊగిపోతోంది చెప్పుకొచ్చారు.

అయితే ఈ మహిళను దెయ్యం పూనిందని మీకెలా తెలుసు? అని అడిగితే ''భగవతీ మాత కృప వల్ల మాకు తెలుస్తుంది. ఆమె లేచి నిలబడి అక్కడ దెయ్యం ఉంది అని చెబుతుంది. దెయ్యం ఉందన్న విషయం ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. బయట ఎవరికీ తెలియదు'' అని ఆయన అన్నారు.

క్షుద్రపూజలు చేయించారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై దాడులు జరుగుతుంటాయి

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, క్షుద్రపూజలు చేయించారన్న అనుమానం ఉన్న వ్యక్తులపై దాడులు జరుగుతుంటాయి

'పావురంలోకి దెయ్యం'

అదే సమయంలో, బిహార్‌లోని రోహతాస్ నుండి వచ్చిన మరో భూతవైద్యుడు సంజయ్ భగత్ చుట్టూ మహిళలు, పిల్లలు, పురుషులు గుమిగూడారు. ఎరుపు రంగు దుస్తులు ధరించి, కళ్లకు కాటుక పెట్టుకున్న ఆయన, నిరంతరం డ్యాన్స్ చేస్తున్నాడు.

కొద్దిసేపటికి ఆయన సహచరుడు రెండు పావురాలను తన చేతిలో పట్టుకుని తీసుకొచ్చారు. కొన్ని మంత్రాలు చదివి పావురం శరీరంలో మూడు నాలుగు చోట్ల గోళ్లతో పొడిచారు. ఆ తర్వాత దాన్ని ఎగరేశారు. దెయ్యం పావురంలోకి చేరుకుని ఎగిరిపోయిందని ప్రకటించారు.

అయితే, ఆ పావురం ఎక్కువ దూరం ఎగరలేక పోయింది. కేవలం ఐదు మీటర్ల దూరం వరకు వెళ్లి పడిపోయింది. పక్కనే నిల్చున్న వ్యక్తి దాన్ని పట్టుకుని టవల్‌లో చుట్టుకుని ముందుకు కదిలారు. ఆయన జేబులో మందు సీసా ఉంది.

''గత 32 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. పావురాన్ని తీసుకొచ్చిన భక్తుడిలో దెయ్యం ప్రవేశించింది. పావురం ద్వారా దాన్ని బయటకు పంపిస్తాం. అప్పుడు దెయ్యం పూనిన వ్యక్తి బాగు పడతాడు. ఇలాంటివన్నీ మందుల ద్వారా నయం కావు'' అని సంజయ్ చెప్పారు.

మరోవైపు, ససారంకు చెందిన సంజయ్ సహాయకుడు మంటూ చంద్రవంశీ ఈ వాదనను మరికొంత ముందుకు తీసుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, ‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, చనిపోతే పూడ్చకూడదు’

''చాలా మంది ఆయన దగ్గరకి వస్తుంటారు. కొందరు మనసు చెడిపోతుంది. చికిత్సలు చేయించి చేయించి అలసిపోతారు. కానీ, తంత్రం అలా కాదు. సైన్స్ ప్రకారం చూస్తే ఇది తప్పు అనిపిస్తుంది. కానీ, వేదాలలో కూడా దెయ్యాలు, భూతాల గురించి ఉంటుంది'' అన్నారు.

మీరు వేదాలు చదివారా? అని అడిగితే, ''సరే, ఇంకా వేరే ప్రశ్న అడుగు'' అన్నారు. సైన్స్, ప్రభుత్వం దెయ్యాలు, ఆత్మలను నమ్మకపోతే దీనిని ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు మంటూ చంద్రవంశీ.

అక్కడ మంటూ చంద్రవంశీ కాకుండా సంజయ్ సహాయకులు చాలా మంది కనిపించారు. భూతవైద్యం చేసేందుకు వచ్చిన వారి నుంచి వారి సమస్యను బట్టి రూ.10-15 వేల వరకు చేస్తున్నారు.

తక్కువ ఫీజు తీసుకుంటున్నందుకు సంజయ్ తన సహాయకులను తిడుతున్నారు కూడా. ఆలయ ప్రాంగణం వెలుపల వారు డబ్బు లెక్కిస్తున్నారు. అయితే, ట్రీట్‌మెంట్‌కు రేటు ఎంత అని అడిగితే, భక్తులు తమకు తోచినంత ఇస్తారని అక్కడున్న మాంత్రికులు చెప్పారు.

ఆలయ ప్రాంగణంలో సమాధి కూడా ఉంది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఆషిక్ అలీ మాట్లాడుతూ, దెయ్యాన్ని తరిమికొట్టడానికి అన్ని మతాల వారు మజార్ వద్దకు వస్తారని చెప్పారు. ఫాతిహా చదవడం ద్వారా సైతాన్ పారిపోతుందని ఆయన వెల్లడించారు.

క్షుద్రపూజలు చేయించారని ఆరోపణలు, దాడులు ఎదుర్కొనేవారిలో ఎక్కువమంది మహిళలే

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, క్షుద్రపూజలు చేయించారని ఆరోపణలు, దాడులు ఎదుర్కొనేవారిలో ఎక్కువమంది మహిళలే

ఎందుకు ఈ మూఢనమ్మకాలు?

యూపీలోని సోన్‌భద్ర జిల్లా దుధి గ్రామం నుంచి వచ్చిన రోషన్ కుమార్ ''నేను బాగా చదివేవాడిని. ఒక్కసారిగా నా బుద్ధి గతి తప్పింది. నేను పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెట్టాను. మా అత్త నా మీదకు దెయ్యం వదిలింది'' అన్నారు.

రోషన్ తన గ్రామానికి చెందిన ఓజా మాంగ్రీ దేవి అనే మహిళతో కలిసి ఇక్కడికి వచ్చారు. మాంగ్రీ దేవి ఆయనకు చికిత్స చేశారు. సన్నగా ఉండే రోషన్, భావ్ రావ్ దేవరస్ ప్రభుత్వ పీజీ కళాశాలలో డిగ్రీ పాసయ్యారు.

బిహార్ లోని డెహ్రీ జిల్లా నుండి వచ్చిన రాజకుమారి దేవి "సరే, ప్రభుత్వం దీన్ని నిషేధిస్తుంది. మరి మాకు చికిత్స చేయిస్తుందా? మా బాగోగులు చూడటానికి మా ఇళ్లకు వస్తారా? మేము చనిపోతే ప్రభుత్వం చూడటానికి వస్తుందా? మేము ఆసుపత్రికి కూడా వెళ్తాం, అక్కడ బాగుపడకపోతే తాంత్రికుడి వద్దకు వెళ్తాం'' అన్నారు.

మూఢనమ్మకాల స్థాయి ఎంత లోతుగా ఉందంటే రాజకుమారీ దేవి తాను దెయ్యాన్ని చూశానని చెప్పారు.

బిహార్‌లోని ససారాం కు చెందిన చంద్ర విశ్వకర్మకు తన అనుభవం చెప్పారు.

"ఒకరోజు అకస్మాత్తుగా నా చేతికి కరెంటు వంటి షాక్ తగిలింది. తిమ్మిరితో చెయ్యి బరువెక్కింది. ఏడేళ్లు చికిత్స చేసినప్పటికీ అది బాగుపడలేదు. కానీ ఒక తాంత్రికురాలు నాకోసం పూజలు చేశారు. నాకు ఇప్పుడు నయమైంది. అన్ని చికిత్సలు మందుల ద్వారానే జరుగుతాయంటే నేను నమ్మను. దెయ్యాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను'' అని చెప్పారు విశ్వకర్మ.

ఝార్ఖండ్‌ లో గత 32 ఏళ్లుగా తంత్రాల పేరుతో జరిగే హత్యలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆషా సంస్థ అధినేత అజయ్ జైస్వాల్‌ మరో కోణం వివరించారు.

"రోగులు భూతవైద్యుల వద్దకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చికిత్స జరగదు. 10 రోజుల తర్వాత రమ్మంటారు. ఆ సమయంలో తాంత్రికుడి సహచరులు ఆ రోగి గ్రామానికి వెళ్లి, ఆ కుటుంబం వారు ఎవరు తమ మీదకు దెయ్యాన్ని వదిలారని అనుమానిస్తున్నారో వారి పేరు తెలుసుకుంటారు. పది రోజుల తర్వాత రోగి మళ్లీ తాంత్రికుడి దగ్గరకు వస్తాడు. తన శిష్యులు చేరవేసిన సమాచారాన్ని తాంత్రికుడు రోగి కుటుంబ సభ్యులకు చెబుతాడు. ఇవి విన్న రోగి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. ఆయన్ను గాఢంగా నమ్మడం మొదలుపెడతారు'' అని ఆయన వివరించారు.

ఇలాంటి మేళాలపై ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, ఇలాంటి మేళాలపై ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు

ఈ జాతర ఎందుకు నిషేధించడం లేదు?

''ఈ భూత్ మేళాను నేను ఇంత వరకు చూడలేదు. ఈ మధ్యే దాని గురించి విన్నాను. చాలా సంవత్సరాలుగా జరుగుతోందని తెలిసింది. ఇది ఒక మూఢనమ్మకం. అధికారులు దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. కేవలం ఝార్ఖండ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా ప్రచారం నిర్వహించాలి'' అని పాలము డివిజనల్ కమిషనర్ జటాశంకర్ చౌధరి అన్నారు.

''భద్రత విషయానికి వస్తే ఇది అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని నేను అనుకోను. అక్కడికి చేరుకునే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు బలగాలను మోహరిస్తారు'' అని ఆయన అన్నారు.

ప్రజల విద్యాస్థాయి పెరిగేకొద్దీ, ఈ జాతరకు వచ్చేవారు తగ్గుతారని జటాశంకర్ చౌధరి అన్నారు.

ఝార్ఖండ్‌తో పాటు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ దెయ్యాల జాతరకు వస్తుంటారని మేళా మేనేజ్‌మెంట్ కమిటీ సెక్రటరీ రామాశ్రయ్ సింగ్ చెబుతున్నారు.

''మందులతోపాటు పూజలు కూడా ఒక్కోసారి పని చేస్తాయి. మందులతో జబ్బు నయం కానప్పుడు ఇక్కడి రావడంలో తప్పేముంది'' అని రామాశ్రయ్ సింగ్ ప్రశ్నించారు.

అయితే, ఈ మేళాను మూసేయడానికి అధికారుల నుంచి గానీ, సమాజం నుంచి గానీ ఎలాంటి ప్రయత్నం జరగలేదని స్థానిక జర్నలిస్టు జితేంద్ర రావత్ అన్నారు. ఒక వేళ అలాంటి ప్రయత్నం జరిగినా ఓఝాలు, వారి సహచరులు, మేనేజ్ మెంట్ కమిటీల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని రావత్ అన్నారు.

ఈ మేళాలో ఉండే తాంత్రికులు రోగుల జబ్బులకు ఫలాన వ్యక్తి చేసిన తాంత్రిక పూజలే కారణమని చెబుతారు. గ్రామాలలో చాలామంది ఇది నిజమేననుకుని ఆ వ్యక్తులపై మూక దాడుల తరహాలో దాడులు చేయడం, మూత్రం తాగించడం, మంత్రాలు చదవడానికి వీలు లేకుండా పళ్లు ఊడగొట్టడం లాంటి దాడులు చేస్తారు.

మంత్రగత్తెలన్న నెపంతో దాడులకు గురయ్యేవారిలో 90 శాతం మంది మహిళలే

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, మంత్రగత్తెలన్న నెపంతో దాడులకు గురయ్యేవారిలో 90 శాతం మంది మహిళలే

ఇలాంటి కేసుల్లో ఎక్కువమంది బాధితులు మహిళలే కనిపిస్తున్నారని ఝార్ఖండ్ లో ఈ సమస్యపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఝార్ఖండ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, 2015 నుండి 2022 వరకు, రాష్ట్రంలో మంత్రగత్తెలన్న అనుమానంతో మొత్తం 231 మంది హత్యకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. అదే సమయంలో 2015 నుండి 2020 మధ్య కాలంలో 4,560 దాడుల కేసులు నమోదయ్యాయి.

గత 26 ఏళ్లలో ఒక్క ఝార్ఖండ్‌లోనే దాదాపు 1,800 మంది మహిళలను మంత్రగత్తెలన్న అనుమానంతో చంపేశారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అజయ్ కుమార్ జైస్వాల్ అన్నారు.

2018లో ఆశా సంస్థ తరపున 8 జిల్లాల్లోని 332 గ్రామాల్లో సర్వే నిర్వహించగా..258 మంది మహిళలను మంత్రగత్తెలుగా ప్రజలు అనుమానించారని జైస్వాల్ వెల్లడించారు.

2020లో మంత్రగత్తెల అనుమానంతో జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు, ఈ సంస్థ కీలక సభ్యురాలు చుత్నీ దేవికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది.

మందులతో కాక మంత్రాలతోనూ రోగాలు నయమవుతాయని ఈ ప్రాంతంలో చాలామంది భావిస్తున్నారు

ఫొటో సోర్స్, VIKASH ARYAN

ఫొటో క్యాప్షన్, మందులతో కాక మంత్రాలతోనూ రోగాలు నయమవుతాయని ఈ ప్రాంతంలో చాలామంది భావిస్తున్నారు

వీరంతా మానసిక రోగులు కాదా?

మానసిక వ్యాధి చికిత్స కోసం ఝర్ఖండ్‌లో రెండు ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి రిన్‌పాస్, మరొకటి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ ( సీఐపీ).

" ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం అక్కడికి ఒక బృందాన్ని పంపి అధ్యయనం చేయాలి. ఇది నిజంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యా లేదా కేవలం మూఢనమ్మకాల విషయమా అన్నది తెలుసుకోవాలి'' అని రిన్‌పాస్ డైరెక్టర్ సుభాష్ సోరెన్ బీబీసీతో అన్నారు.

"రిన్‌పాస్‌లో కోవిడ్‌కు ముందు, ప్రతి సంవత్సరం 350-400 మంది రోగులు చికిత్స కోసం వచ్చేవారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత, రోగుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఝార్ఖండ్‌తో పాటు, బిహార్, పశ్చిమ బెంగాల్ నుండి కూడా రోగులు వస్తున్నారు" అని సోరెన్ వెల్లడించారు.

మానసిక ఆరోగ్యంపై పనిచేస్తున్న మరివాలా హెల్త్ ఇనిషియేటివ్ అనే సంస్థ అడ్వైజరీ మేనేజర్ భవేశ్ ఝా అభిప్రాయం ప్రకారం "భారత ప్రభుత్వం మొత్తం దేశానికి 2020-21 సంవత్సరంలో మానసిక ఆరోగ్యం కోసం రూ. 40 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో అంచనా వేయవచ్చు'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, రాత్రి అయితే చాలు ఆ ఊళ్లో ఇళ్లకు తాళాలు పడిపోతున్నాయి. భయంతో ఊరంతా వణికిపోతోంది.

"గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ఆరోగ్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. దీని కారణంగా ప్రజలు చికిత్స కోసం భూతవైద్యుల వద్దకు వెళుతుంటారు" అని భవేశ్ ఝా అన్నారు.

రాత్రి ఎనిమిది గంటలైంది. పొలంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ టెంట్లలో జనాలు గుమిగూడారు. ప్రతి తాంత్రికుడికి తన సొంత టెంట్ ఉంటుంది.

ఈ తాంత్రికుల ద్వారా వైద్యం చేయించుకున్న వారు ఇటుకలతో పొయ్యి కట్టి ఆహారం వండుతుండగా, మరికొందరు ఆరు బయట నిద్రిస్తున్నారు. ఉదయం వారు తమ ఇళ్లకు వెళతారు. తాంత్రికుల శిష్యులు మళ్లీ కొత్త రోగి కోసం వెతకడం ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)