టీఆర్ఎస్ ప్రస్థానం: కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఊపు తెచ్చిన ఆ ఒక్క వ్యూహం..

ఫొటో సోర్స్, KCR FANS/FACEBOOK
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే బొంత పురుగు (గొంగళి పురుగు)ను కూడా ముద్దాడుతాం''.. ఇదీ అప్పటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఫేమస్ డైలాగ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పేందుకు ఆయన ఉపయోగించిన ఉదాహరణ ఇది. తెలంగాణ ఉద్యమంలో సకల జనులూ పాల్గొన్నప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ పాత్ర ప్రత్యేకం.
అది 2001వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజు. ఏప్రిల్ 27. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి మొదలైంది కేసీఆర్ ప్రయాణం. ముందు రోజు రాత్రి సొంతూరు చింతమడక నుంచి బయలుదేరి మరునాడు హైదరాబాద్ వచ్చారు. అసెంబ్లీ ఎదురుగా అమర వీరుల స్తూపం వరకూ వెళ్లారు. అక్కడ నివాళులు అర్పించాక, జలదృశ్యంగా పిలిచే కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గరకు చేరారు కేసీఆర్. ఆ జలదృశ్యమే తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ ప్రకటనకు వేదిక అయింది. ఆ తరువాత కొంత కాలం ఆ పార్టీ కార్యాలయంగా కూడా పనిచేసింది. తరువాత బంజారాహిల్స్ లో తన నివాసంలో పార్టీ పనులు చేసేవారు కేసీఆర్. 2004లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభమైంది. 2006 సొంత పార్టీ ఆఫీసు ప్రారంభించారు.
టీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు..
2001లో పార్టీ పెట్టే నాటికి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికీ, తెలుగుదేశం పార్టీకీ, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారాయన.
అంతకు కొంత కాలం ముందు నుంచే, అంటే సుమారు మార్చి నెల నుంచే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు సన్నిహితులు చెబుతారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావంతులు, కవులు వంటి వారితో ఆయన సమావేశమైనట్టు, అప్పటికే కేసీఆర్ మనసులో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై ఒక అవగాహన ఉన్నట్టు చెబుతారు సన్నిహితులు. 2001 మేలో కరీంనగర్ లో జరిగిన ఒక సమావేశానికి అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ను కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రకటించారు కేసీఆర్. జయశంకర్ తుదిశ్వాస వరకూ తెలంగాణ రాష్ట్ర సమితితోనే కొనసాగారు.
మొట్టమొదట టీఆర్ఎస్ తో పాటూ తొలి అడుగు వేసిన వారిలో ఆలె నరేంద్ర, ప్రొఫెసర్ జయశంకర్, ఇంజినీర్ విద్యాసాగర్, వి ప్రకాశ్, సత్యనారాయణ రెడ్డి, గాదె ఇన్నయ్య.. ఇలా ఎన్నో పేర్లున్నాయి. వారిలో కొందరు చివరి వరకూ టీఆర్ఎస్ తో కలసి నడిచారు. కొందరు విబేధించి విడిపోయారు.

ఉప ఎన్నికలే ఊపిరి
టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలే ఊపిరిగా పనిచేశాయని చెప్పవచ్చు. 2001 సెప్టెంబరులో జరిగిన ఉప ఎన్నికలో సిద్ధిపేట నుంచి కేసీఆర్ గెలవడంతో ఈ పరంపంర మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని తాను అనుకున్నట్టు నడిపించాలని కేసీఆర్ భావించిన ప్రతిసారీ ఆయన వ్యూహం, అస్త్రం రాజీనామాలు, ఉప ఎన్నికలే.
అసెంబ్లీలో, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో పోటీ చేశారు. 26 స్థానాలు గెలిచారు. అప్పటి నుంచీ ఉప ఎన్నికలు జరుగతూనే ఉన్నాయి. 2008లో 16 స్థానాలకు పోటీ చేసి 7 స్థానాలు గెలుకచుకున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో కలసి 45 స్థానాల్లో పోటీ చేసి 10 మాత్రమే గెలుచుకున్నారు. 2010లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకున్నారు. 2011 లో ఒక స్థానం, 2012లో ఐదు స్థానాలు చెలిచారు.
2004 - సోనియా గాంధీ ప్రకటన
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుతో వెళ్లి 26 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు.
రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశం చేర్చారు. యుపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో దీన్ని చేర్చారు.
తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి.
టీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాల్లో గెలిచింది. కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రులు అయ్యారు. తరువాత తెలంగాణ అంశం తేల్చడం లేదు అన్న కారణంతో బయటకు వచ్చారు.
2006 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బారీ మెజార్టీతో గెలిచారు కేసీఆర్. కాంగ్రెస్ వల్లే గెలిచారన్న ఎం సత్యనారాయణ రావు విమర్శను సవాల్ గా తీసుకుని రాజీనామా చేసి కనీవినీ ఎరుగని మెజార్టీతో కరీంనగర్ నుంచి గెలిచారు కేసీఆర్.
ఆ ఎన్నిక ఎంత ప్రభావం చూపిందంటే, రాష్ట్రం విడిపోతుందన్న ఉద్దేశంతో ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది.
2009 - తెలుగుదేశంతో పొత్తు
కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందంటూ కేసీఆర్.. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలో మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 10 చోట్లే గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే తెలుగుదేశం, వామపక్ష పార్టీల మహా కూటమిని కాదని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇస్తూ ఆ కూటమి లూథియానాలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొని, ప్రసంగించారు.
ఆ ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలవుతున్నాయనే ప్రచారం భారీగా జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది.
2009 సెప్టెంబరులో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారు.
అదే ఏడాది అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు.

ఫొటో సోర్స్, facebook/AbdulMuqeetChanda
కేసీఆర్ నిరాహార దీక్ష
2009 నవంర్ 29న సిద్ధిపేట కేంద్రం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు. ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
విద్యార్థులు పెద్ద ఎత్తన రోడ్లపైకి వచ్చారు. ఆరోజ నుంచి తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వ విద్యాలయం నిప్పుల కొలిమిలానే ఉండింది. కేసీఆర్‌ను దీక్ష చేయకుండా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆయన జైల్లో దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ తరలించారు. అక్కడా దీక్ష కొనసాగింది.
సిద్ధిపేటలో హరీశ్ రావు కిరోసిన్ పోసుకున్నారు. ''తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో'' అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ భగ్గుమనడంతో కేంద్రం కదిలింది.
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసింది. అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. తమ విజయంగా పేర్కొన్నారు.
తెల్లారిన తరువాత ఆంధ్రలో సీన్ మారింది. వెంటనే సమైక్యాంధ్ర అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.
తెలంగాణ జేఏసీ ఏర్పాటు
దీంతో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు జానా రెడ్డి ఇంట్లో తెలంగాణ జేఏసీ ఏర్పడింది. కోదండరాం నాయకత్వంలో జేఏసీ పనిచేయగా, అందులో టీఆర్ఎస్ ప్రధాన భాగమైంది. 2010 డిసెంబర్‌లో వరంగల్‌లో టీఆర్‌ఎస్ మహాగర్జన నిర్వహించింది. ఆ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలకు అప్పట్లో అది పరాకాష్ట. దీనికి 30 లక్షల మంది హాజరయ్యారని ఆ పార్టీ నాయకులు అప్పట్లో ప్రకటించారు.
2011 జనవరిలో శ్రీకృష్ణ కమిటి నివేదిక తరవాత ఆందోళన కొనసాగుతూనే వచ్చింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె.. ఒక్కటేమిటి.. అనేక రూపాల్లో తెలంగాణలోని అన్ని వర్గాలూ ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఉద్యమం నిజంగానే ఉవ్వెత్తున ఎగిసింది. అయితే ఆయా పోరాట రూపాలెన్నున్నా, ఆందోళన కార్యక్రమాలు ఎన్ని జరిగినా టీఆర్ఎస్ తన ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచిస్తూనే వెళ్లింది. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘటనలయ్యాయి. చివరగా 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2 ఆవిర్భావ తేదీగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, AICC
తెలంగాణ ఏర్పడ్డాక..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. కేసీఆర్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని సోనియాగాంధీ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పొత్తు ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ ఎన్నికల్లో తన సత్తా చాటింది టీఆర్ఎస్. రాష్ట్రం ఏర్పడక ముందే 2014 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 119లో 63 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
తెలంగాణలో దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంలో కుటుంబ సభ్యులకు అవకాశాలు ఇవ్వడంపైన, బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన కుటుంబమే లాభపడుతోందని రాజకీయంగా విమర్శలు వచ్చాయి.
తరవాత 12 మంది తెలుగుదేశం వారిని కలుపుకుని పార్టీ బలం పెంచుకుంది టీఆర్ఎస్.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు కేసీఆర్. ఈసారి కాంగ్రెస్, టీడీపీ రెండు పక్షాల వారినీ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే 2018 డిసెంబరులో కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించారు కేసీఆర్.
2019 లోక్ సభ ఎన్నికలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. తెలంగాణ వచ్చాక తిరుగలేని ప్రయాణం అనుకున్న టీఆర్ఎస్‌కి స్పీడ్ బ్రేకర్లు వేశాయి. 17 స్థానాల్లో 9 మాత్రమే గెలుచుకుంది ఆ పార్టీ. అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు కీలక స్థానాల్లో గెలిచాయి.

ఫొటో సోర్స్, facebook/trspartyonline
చీలికల పరంపర..
పార్టీ పెట్టినప్పటి నుంచీ తెలంగాణ వచ్చేంత వరకూ పార్టీ నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు బయటకు వెళ్లడం, లోపలికి రావడం జరగుతూనే ఉంది. పార్టీ వ్యవస్థాపక బృందంలో ఒకరైన ఆలె నరేంద్రతో మొదలైందీ పరంపర. 2004లో రాష్ట్ర మంత్రివర్గం నుంచి టిఆర్ఎస్ బయటకు రావాలి అనుకున్నప్పుడు చీలకలు వచ్చాయి. ఆ పార్టీకి చెందిన మంత్రి సంతోష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. శాసన మండలి ఎన్నికల్లో కొందరు టీఆర్ఎస్ వారు స్వతంత్ర అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ వైపు వెళ్లారు. వారిని కేసీఆర్ బహిష్కరించారు. 2009 తర్వాత 10 స్థానాల్లో ఉప ఎన్నికల్లో 7 గెలిచారు. ఆలె నరేంద్ర రియల్ టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఇక విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో కలపి మళ్లీ విడిపోయారు.
దిలీప్ కుమార్, జగ్గారెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే.
ఇవి కూడా చదవండి:
- అరుణ్ లాల్: 66 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్న 38 ఏళ్ల ఈమె ఎవరు?
- యుక్రెయిన్ యుద్ధం: మూడు దేశాల మధ్య ఉన్న ఈ చిన్న గ్రామంలో ఏం జరుగుతోంది?
- తాజ్ మహల్: షాజహాన్ అమర ప్రేమకథలో ట్విస్టు.. ముంతాజ్ మహల్‌తో నిశ్చితార్థం, మరో యువరాణితో పెళ్లి
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















