తెలంగాణలో ఎవరి రాజకీయ పాదయాత్ర గమ్యం చేరనుంది

బండి సంజయ్

ఫొటో సోర్స్, BJP

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేసవి కాలంలో ఎండలే కాదు, పొలిటికల్ పాదయాత్రలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి . తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పాలకపక్ష నాయకులు చెబుతుంటే, ఎప్పుడైనా ఎలక్షన్లు రావచ్చు సిద్ధంగా ఉండండి అంటూ వివిధ పార్టీల ముఖ్య నేతలు పాదయాత్రలతో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం ఏకంగా ఐదు రాజకీయ యాత్రలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు పాదయాత్రలు.

పాదయాత్ర అంటే మాములు విషయమేం కాదు. భారీ ఎత్తున ప్లానింగ్, రూ. లక్షల్లో ఖర్చు, అవసరమైనప్పుడు జనసమీకరణ, ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి.

ప్రస్తుతం ఏయే నాయకులు పాదయాత్రలు చేస్తున్నారో తెలుసుకుందాం.

బండి సంజయ్

ఫొటో సోర్స్, facebook/bandisanjaykumar

బండి సంజయ్ (బీజేపీ) ప్రజాసంగ్రామ యాత్ర

టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిని తానే అని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది బీజేపీ. అందులో భాగంగా చేపట్టిందే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర. బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున మొదలుపెట్టిన ఈ యాత్ర అలంపూర్‌ జోగులాంబ జిల్లా నుంచి మొదలైంది.

380 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర 10 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కొనసాగబోతోందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రెండో విడతగా మొదలైన ఈ యాత్ర సుమారు నెల రోజులు కొనసాగబోతోందని, 370 కిలోమీటర్లు , 5 జిల్లాలోని 112 గ్రామాలలో జరుగుతుందని పార్టీ చెబుతోంది.

మిగతా విడతల గురించి ఇంకా పార్టీ నుంచి స్పష్టత రాలేదు. ఎన్నికల వరకు అన్ని నియోజకవర్గాలు, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తామని మాత్రం నేతలు చెబుతున్నారు

అయితే, మిగతా పార్టీల పాదయాత్ర కంటే తమ పాదయాత్ర భిన్నంగా ఉండాలనేది బీజేపీ ఉద్దేశం. రచ్చబండ కార్యక్రమం కూడా ఈ పాదయాత్రలో భాగం. కేంద్ర , రాష్ట్ర రాజకీయాలతోపాటు.. స్థానిక సమస్యలను ప్రస్తావించడం ద్వారా కూడా పార్టీని ప్రజలకు చేరువ చేయాలనేది ప్రణాళిక.

మే 13న మహేశ్వరంలో యాత్ర ముగుస్తుందని, ఆ రోజు జరగబోయే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి .

బండి సంజయ్ కుమార్ మొదలుపెట్టిన మొదటి దశ పాదయాత్ర 2021 ఆగస్ట్‌లో చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి గుడి నుంచి మొదలైంది. అప్పట్లో ఈ యాత్ర కోసం ఆయన షూ కొనడానికి వెళ్లిన వీడియో బాగా వైరల్ అయ్యింది కూడా.

భట్టి విక్రమార్క

ఫొటో సోర్స్, TPCC

భట్టి విక్రమార్క(కాంగ్రెస్).. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

ఇంటి పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత భట్టి విక్రమార్క ' పీపుల్స్ మార్చ్' పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు.

ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం మధిరలోని యాదవెల్లి గ్రామం నుంచి ఫిబ్రవరి 27న ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

తొలుత 32 రోజులలో తన నియోజకవర్గం మధిరలోని 135 గ్రామాలలో 506 కిలోమీటర్లలో పర్యటించి దానిని వేరే జిల్లాలకీ, రాష్ట్రమంతటా విస్తరించాలన్నది భట్టి విక్రమార్క ప్లాన్. అయితే మిగతా విడతల యాత్రలు తీరు ఎలా ఉండబోతోందన్నది పార్టీ నేతలు ఇంకా వెల్లడించలేదు. ఎన్నికల వరకు కొనసాగుతుందని మాత్రం చెబుతున్నారు.

షర్మిల

ఫొటో సోర్స్, @realyssharmila

షర్మిల(వైఎస్ఆర్‌టీపీ) -ప్రజాప్రస్థానం

"తెలంగాణలో వైఎస్‌ఆర్ పరిపాలన మళ్లీ రావాలన్న ఆలోచనతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది " అని షర్మిల తరచూ చెబుతుంటారు.

షర్మిల కూడా ప్రజా ప్రస్థానం పాదయాత్రపైనే దృష్టి పెట్టారు.

2021 అక్టోబర్ 21న ఆమె చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి లాగే తానూ కూడా సెంటిమెంట్‌గా భావించి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

21 రోజుల తరువాత ఎన్నికల నిబంధనలు, కోవిడ్ రావడంతో బ్రేక్ పడగా, మార్చి 18 నుంచి ఈ యాత్రను మళ్లీ మొదలుపెట్టారు.

చేవెళ్ల నుంచి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు, ముఖ్య ప్రాంతాల్ని చుట్టేలా పాదయాత్ర ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 4,000 కిలోమీటర్ల పాదయాత్ర లో 90 నియోజక వర్గాలలో ఈ పాద యాత్ర కొనసాగుతుంది.

వీడియో క్యాప్షన్, పులులకు ప్రాణ సంకటం ఈ మొక్కలు

ఏప్రిల్ 22న ఆమె పాదయాత్ర 63వ రోజుకు చేరింది. ప్రస్తుతం షర్మిల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 820 కిలోమీటర్లు నడిచారు.

అయితే పాదయాత్ర ఆమెకు కొత్త కాదు. తండ్రి పాదయాత్రను చూసిన ఆమె, అన్న వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఇడుపులపాయ నుంచి 18 అక్టోబర్ 2012న పాదయాత్ర మొదలుపెట్టి, 4 ఆగస్ట్ 2013 వరకు కొనసాగించి ఇచ్చాపురంలో ముగించారు.

మూడు వేల కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర తన సోదరుడు జగన్ రాజకీయ భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషించింది.

ఇందిరా శోభన్ గౌడ్

ఫొటో సోర్స్, AAP

ఇందిరా శోభన్ గౌడ్(ఆమ్ ఆద్మీ పార్టీ) - మహా పాదయాత్ర

దిల్లీ, పంజాబ్‌లలో విజయాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో దక్షిణాదిలోని తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకం తమను ఆదరిస్తారనే ఆశాభావంతో తొలిసారి హైదరాబాద్‌లో ఆప్ పాదయాత్ర మొదలు పెట్టింది.

ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్మన్ ఇందిరా శోభన్ నేతృత్వంలో ఈ పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రను మిగతా జిల్లాలకు విస్తరిస్తామని ఇందిరా శోభన్ చెప్పారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోనే యాత్ర కొనసాగుతోంది.

ఎన్ని కిలోమీటర్లు, ఎన్నిరోజులు ఈ యాత్ర కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేమని ఇందిరా శోభన్ అన్నారు. ప్రస్తుతం ముషీరాబాద్‌లో ముగిసిన యాత్ర, ఎల్బీ నగర్ లో ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.

ప్రవీణ్ కుమార్

ఫొటో సోర్స్, BSP

ప్రవీణ్ కుమార్(బీఎస్‌పీ) -బహుజన రాజ్యాధికార యాత్ర

బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరిన తరువాత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కూడా మార్చ్ 6న "బహుజన రాజ్యాధికార యాత్ర" మొదలుపెట్టారు.

దళితుల హక్కుల కోసం పోరాడే పార్టీగా ఆయన పార్టీకి ముద్ర ఉంది. అయితే బడుగు బలహీన వర్గాలకే కాదు, సమాజం లో ఒక మంచి మార్పు కోసం తానూ కృషి చేస్తానని పార్టీలో చేరిన కొత్తలో ప్రవీణ్ కుమార్ బీబీసీతో అన్నారు .

జనగామ జిల్లాలోని ఖిలశాపూర్ గ్రామం నుంచి మొదలైన ఈ యాత్ర 300 రోజులు కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రవీణ్ కుమార్ పాదయాత్రగా కాకుండా, ఈ యాత్రలో ప్రజలని కలుసుకుంటున్నారు .

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, WIKIPEDIA

పాదయాత్రలు అంత సులభమా?

నేతలు కిలోమీటర్ల మేర నడవాలి. దానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి.

అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి, విజయమ్మకి ఒక వ్యాన్ ఉండేది. అందులోనే వారు రాత్రి బస చేసేవారు. ప్రజలను సమీకరించాల్సిన అవసరం అంతగా లేకపోయింది. అయితే ఇప్పుడు ప్రజలు కూడా పాదయాత్రలు అంటే సొంతoగా నాయకుల దగ్గరకు వెళ్లే పరిస్థితి కనపడట్లేదని అంటున్నారు.

నేటి పాదయాత్రలలో 200 నుంచి 300 మంది పార్టీ నేతల విధేయులే నేతతో కలిసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు.

"కనీసం 100 మంది ఎప్పుడు ఆ నేతతో కనిపించేలా పోగు చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ఒక నేత చేస్తున్న పాదయాత్రకు సెక్యూరిటీ గార్డులతో కలిపి సుమారు 150 మంది వరకు ఉన్నారు. వారందరికీ భోజన ఖర్చులు, విశ్రాంతికి ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు ఖర్చుతో కూడుకున్న పని'' అని సీనియర్ పాత్రికేయులు యుగంధర్ రెడ్డి బీబీసీ తో చెప్పారు.

''వైద్య సిబ్బంది ఖర్చులతోపాటు , పాదయాత్రలో నేతలను కలవడానికి వచ్చే ప్రజలకు కూడా బిర్యానీ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు ఇవ్వడమే కాకుండా, వారికి రోజు కూలి మాదిరిగా మగవారికి రూ.500, ఆడవాళ్లకు కనీసం రూ.300 ఇవ్వాలి'' యుగంధర్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, చైనా: కఠిన లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరంలో ఏం జరుగుతోంది?

''మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ప్రశాంత్ కిశోర్ లాంటి వారు ఇచ్చే సలహా మేరకు ఈ నేతలు కనీసం 500 నుంచి 600 మందితో సెల్ఫీ దిగాలి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలోకి వెళ్లి, ప్రచారాస్త్రాలుగా పనిచేస్తాయి'' అని అన్నారాయన.

పాదయాత్రకు ఎంచుకునే మార్గాలు కూడా పక్కా ప్రణాళికతో ఉండాలని, ఉదయం వెళ్లే ఊర్లు, సాయంత్రం చేరుకునే ఊర్లలో ఏదో ఒక విశేషం ఉండేటట్టుగా చూసుకోవడం నేతలకు, నిర్వాహకులకు చాలా ముఖ్యమని యుగంధర్ రెడ్డి అన్నారు.

''పాదయాత్రలో తారు రోడ్ లేకుండా కొందరు నేతలు జాగ్రత్త పడతారు. మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండేందుకు అవసరమైతే తారురోడ్డు మీద మట్టి పోయించి నడిచే నేతలు కూడా ఉన్నారు'' అని యుగంధర్ రెడ్డి అన్నారు.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK

'పాదయాత్రకి ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు ...'

వై.ఎస్.రాజశేఖరరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలకు ఉన్న గౌరవం ఇప్పుడు లేదని సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్ అభిప్రాయపడ్డారు.

"పాదయాత్ర అంటే అధికారం కోసం అన్నది ఎవరికైనా స్పష్టంగా తెలిసిందే. కానీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనంలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు నేతలు అధికార పార్టీని విమర్శించడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ప్రజలకు అర్ధమవుతోంది. అందుకే పాదయాత్రలకు ఇంతకు ముందున్న క్రేజ్ ఇప్పుడు లేదు'' అని సురేశ్ అన్నారు.

చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, TELUGUDESAM.ORG

దేశంలో పాదయాత్రలకు చరిత్ర

1930లో మహాత్మ గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలోని పాదయాత్రతో భారత్ దేశంలో ఈ పాదయాత్ర చరిత్ర మొదలైందని చెప్పాలి. వినోబా భావే తెలంగాణ గడ్డ మీద 1951లో భూదాన్ ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఆ ప్రభావం 2009 ఎన్నికలలో కూడా కనిపించింది.

ఆ తరువాత 2012 లో చంద్రబాబు నాయడు చేపట్టిన పాదయాత్ర 2014లో ఆయన విజయానికి ప్రధాన కారణమైంది. తండ్రి బాటలోనే పాదయాత్రని నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకో కలిగారు .

ఒకప్పటి టెస్టెడ్ ఫార్ములా అయిన పాదయాత్రని, తెలంగాణలోని ప్రతిపక్షాలు ఇప్పుడు వాడుతున్నాయి.

వందల వేల కిలోమీటర్ల నడుచుకుంటూ పోవడం, ఊర్లల్లో జనంతో మాట్లాడుతూ ప్రజానాడి తెలుసుకొని వారి సమస్యలను అజెండాగా చేసుకొని, ఎన్నికల మేనిఫెస్టోగా మలచుకోవడం ఒక ట్రెండ్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)