అఫ్గానిస్తాన్‌: ‘ఒక రొట్టెముక్క అయినా కొనిస్తారా..’ అంటూ ఆశతో రోడ్లపై ఎదురు చూస్తున్న మహిళలు, పిల్లలు

కాబూల్‌లోని ఆస్పత్రిలో క్యాన్సర్ వార్డు వెలుపల గుమిగూడిన జనం
ఫొటో క్యాప్షన్, కాబూల్‌లోని ఆస్పత్రిలో క్యాన్సర్ వార్డు వెలుపల గుమిగూడిన జనం
    • రచయిత, సికందర్ కిర్మాణి
    • హోదా, బీబీసీ న్యూస్, కాబూల్

ఐదేళ్ల ఫజ్లుర్ రెహ్మాన్‌కు మెడలో ట్యూమర్ ఉంది. అది ప్రాణాంతకమైన నాలుగో దశకు చేరుకుంది. ఆ పసిప్రాణాలను మరికొన్నాళ్లు కాపాడటానికి అఫ్గాన్ డాక్టర్లు కీమోథెరపీ అందిస్తున్నారు.

కాబూల్‌లోని జామ్‌హురియత్ ఆస్పత్రిలో రద్దీగా ఉన్న క్యాన్సర్ వార్డులో బెడ్ మీద పడుకుని ఉన్నాడు ఫజ్లుర్. దేశంలో ఇంకా నడుస్తున్న మూడే మూడు క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఇదొకటి. ఈ ఆస్పత్రికి సరైన వసతులు, వనరులు లేవు.

అంతర్జాతీయ సాయం చూపుతున్న ప్రభావాన్ని ఈ ఆస్పత్రిలో చూడొచ్చు. మరింత సాయం ఎందుకు అవసరమో కూడా ఇక్కడ కనిపిస్తుంది.

ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్.. అత్యవసర ఆస్పత్రి సేవలు అందించటానికి రంగంలోకి దిగటంతో ఇక్కడ చికిత్స ఉచితంగా లభిస్తోంది. కానీ రోగులు కొన్ని మందులను సొంతంగా కొనుక్కోవాల్సి వస్తోంది.

తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకోవటంతో మొదలైన ప్రకంపనలతో అఫ్గాన్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. ఫజ్లుర్ రెహ్మాన్ తండ్రి అబ్దుల్ బారి ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు. తన కొడుకుకు చికిత్స కోసం 100 డాలర్లు పోగు చేయటం కూడా చాలా కష్టంగా మారింది.

''ఇక్కడికి రావటానికి చార్జీల కోసం, ఇక్కడ ఉండటానికి, మందులు కొనటానికి.. నాకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గరి నుంచీ నేను అప్పు తీసుకుంటున్నాను'' అని మాతో చెప్పారాయన.

క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు కొనేందుకు ఇక తమ దగ్గర డబ్బులు లేవని మరాజియా చెప్తున్నారు
ఫొటో క్యాప్షన్, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు కొనేందుకు ఇక తమ దగ్గర డబ్బులు లేవని మరాజియా చెప్తున్నారు

అఫ్గానిస్తాన్‌లో ఇంతకుముందు ప్రభుత్వ వ్యయంలో సుమారు 75 శాతం నిధులు విదేశీ గ్రాంట్ల ద్వారా లభించేవి.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ గ్రాంట్లు ఆగిపోయాయి. మానవతా సాయం కొనసాగుతున్నప్పటికీ.. అఫ్గాన్ విదేశీ మారక నిల్వలను దాదాపు 900 కోట్ల డాలర్ల మేర స్తంభింపజేశారు. దీంతో దేశంలో నిధులు, నగదుకు తీవ్ర కొరత తలెత్తింది.

దేశ జనాభాలో మూడో వంతుకన్నా ఎక్కువ మంది ఇప్పుడు కనీస ఆహార అవసరాలను కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ప్రపంచ బ్యాంకు గత వారం ఒక నివేదికలో హెచ్చరించింది.

వీడియో క్యాప్షన్, ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

క్యాన్సర్ వార్డులోని 50 ఏళ్ల మజారియా వంటి పేషెంట్లు కేవలం మందులు కొనుక్కోవటానికి తమదగ్గరున్న ప్రతి దానినీ అమ్ముకుంటున్నారు. గతంలో ఈ మందులు ఉచితంగా లభించేవి.

''మేమేం చేయగలం? మేం కూలిపనిచేసుకునే వాళ్లం. మాకొక ఆవు, ఒక గాడిద ఉండేవి. వాటిని అమ్మేశాం. ఇప్పుడిక మాకేమీ లేవు'' అని చెప్పారు మజారియా.

''నా అన్నదమ్ముల దగ్గర, నా భార్త బంధువుల దగ్గర, మా ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పులు చేశాం'' అని తెలిపారు.

అప్పుడప్పుడు ఆస్పత్రి సిబ్బంది చందాలు వేసుకుని నిరుపేద రోగులకు మందులు కొంటుంటారని క్యాన్సర్ వార్డు ఇన్‌చార్జి డాక్టర్ మానుచెర్ చెప్పారు. ''మా దగ్గర తగినన్ని నిధులు లేవు'' అన్నారాయన.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక తమ ఆస్పత్రి బడ్జెట్ కుప్పకూలిందని డాక్టర్ మనుచెర్ చెప్పారు
ఫొటో క్యాప్షన్, తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక తమ ఆస్పత్రి బడ్జెట్ కుప్పకూలిందని డాక్టర్ మనుచెర్ చెప్పారు

నిజానికి వారి బడ్జెట్ శూన్యం. రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడి సిబ్బందికి జీతాలు చెల్లించటంతో పాటు కొన్ని మందులకు నిధులు అందిస్తుండటం వల్లే ఈ డిపార్ట్‌మెంట్ ఇంకా నడుస్తోంది.

తాలిబాన్లు అధికారం చేపట్టటానికి ముందు గత ఏడాది ఈ క్యాన్సర్ వార్డుకు ప్రజారోగ్య మంత్రిత్వశాఖ నుంచి 10 లక్షల డాలర్ల బడ్జెట్ లభించింది.

అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత మానవతా సంక్షోభాన్ని పరిష్కరించటానికి 400 కోట్ల డాలర్లకు పైగా నిధులు అవసరమని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

గత నెలలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో 440 కోట్ల డాలర్ల కోసం పిలుపునివ్వగా.. సుమారు 240 కోట్ల డాలర్ల మేర నిధులు అందించటానికి హామీలు లభించాయి.

తీవ్ర పోషకాహర లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నాయి. ఆదాయం లేక కష్టాలుపడుతున్న కుటుంబాలు మామూలుకన్నా ఇంకా తక్కువ వయసులోనే కూతుర్లకు పెళ్లిళ్లు చేసి పంపించివేయటం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రాణాలు కాపాడటానికి అత్యవసర సాయం అవసరం.

ఈ తక్షణ అవసరాలను తీర్చటమే కాకుండా.. అఫ్గానిస్తాన్‌కు మరింత సుస్థిరతమైన భవిష్యత్తును నిర్మించేందుకు కూడా సాయం చేయాల్సిన అవసరాన్ని సహాయ సంస్థలు, దౌత్యవేత్తలు గుర్తిస్తున్నారు.

అఫ్గానిస్తాన్ బాలికలు
ఫొటో క్యాప్షన్, దేశంలోని బాలికల పాఠశాలలన్నీ మూసివేయనున్నట్లు తాలిబాన్లు గత వారం ప్రకటించారు

అయితే.. తాలిబాన్లు మరింత మూఢంగా మారుతుండటంతో.. అభివృద్ధి నిధులను పునరుద్ధరించటం, స్తంభింపజేసిన అఫ్గాన్ విదేశీ మారకం నిల్వలను విడుదల చేయటం అనే అంశాలపై అంతర్జాతీయ సమాజం ఇంకా తర్జనభర్జనలు పడుతూనే ఉంది.

దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో టీనేజి బాలికలు స్కూళ్లకు తిరిగి వెళ్లటానికి అనుమతించరాదన్న తాలిబాన్ల తాజా నిర్ణయం పట్ల పెల్లుబుకుతున్న ఆగ్రహం.. ఎంతో అవసరమైన నిధులు అందించటానికి దాతలు సంశయించేలా చేస్తుందనే భయం వ్యక్తమవుతోంది.

ఈ పరిస్థితుల్లో అత్యధికంగా కష్టాలపాలవుతున్నది అత్యంత బలహీనులేనన్నది వాస్తవం.

కాబూల్ తూర్పు శివార్లలో నిర్వాసిత కుటుంబాలకు ఏర్పాటు చేసిన ఓ శిబిరాన్ని మేం సందర్శించాం.

వారు పారిపోవటానికి కారణమైన పోరాటం ఇప్పుడు ముగిసిపోయింది. కానీ తాము తిరిగి వెనక్కి వెళ్లి, తమ ఇళ్లను పునర్నిర్మించుకునే స్తోమత లేదని ఇక్కడి జనం చెప్తున్నారు.

పర్వానా (కుడివైపు)
ఫొటో క్యాప్షన్, స్కూలు యూనిఫాం కొనుక్కునే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లలేకపోతున్నానని పర్వానా (కుడివైపు) చెప్పింది

అక్కడ కమ్యూనిటీ నడుపుతున్న క్లాస్‌రూంలో పిల్లలు గుమిగూడారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్తారు. కానీ ఆ స్కూలుకు అవసరమైన యూనిఫాం కొనుక్కోగల స్తోమత తమకు లేదని 12 ఏళ్ల పర్వానా చెప్తోంది. ఆమె ఆ స్కూలుకు చివరిసారి వెళ్లి మూడేళ్లవుతోంది.

''బతుకు మరింత దుర్భరమవుతోంది. మా అమ్మ బట్టలు ఉతుకుతుంది. కానీ మాకు తిండికి సరిపోయేంత ఆదాయం కూడా రావట్లేదు. ఇప్పుడామె జబ్బుపడుతోంది'' అని చెప్పింది పర్వానా.

సాయంత్రం అవుతుండగా.. కాబూల్‌లోని చాలా రొట్టెల దుకాణాల దగ్గర ఎవరైనా కస్టమర్లు తమకూ ఒక రొట్టెముక్క కొనిస్తారేమోననే ఆశతో పేవ్‌మెంట్ల మీద మహిళలు, పిల్లల బృందాలుగా కూర్చుని కనిపించటం ఇప్పుడు సాధారణ దృశ్యమై పోయింది.

కొంతమంది మమ్మల్ని సాయం అందించే కార్యకర్తలను పొరపాటుగా భావించి, విరాళాల పొందే వారి జాబితాలో తమ పేర్లూ చేర్చుతారనే ఆశతో వారి గుర్తింపు కార్డుల కాపీలను మాకు చూపటానికి ప్రయత్నించారు. కానీ మేం వారు అనుకున్న వాళ్లం కాదని తెలిసి వారిలో నిస్పృహ కనిపించింది.

''మాకు సాయం చేయకపోతే ఇక్కడికి ఎందుకొచ్చారు?'' అని ఒకరు ప్రశ్నించారు.

మేం వెనుదిరిగి వస్తుండగా ఒక మహిళ పెద్దగా అరిచారు: ''నా పిల్లలకు కొన్నిసార్లు తిండి దొరుకుతుంది.. కొన్నిసార్లు తినటానికేమీ ఉండదు.''

వీడియో క్యాప్షన్, అఫ్గాన్ విమానాల్లో మహిళా ఎయిర్‌హోస్టెస్ ఇకపై కనిపించరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)